న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్
నారోగ్య సమముత్సాహం న దేవ: కేశవాత్పర:
కార్తీక మాసం విశిష్టత
స్నాన, దాన,
జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని
చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను
ప్రసాదించే మహిమాన్వితమైన మాసం “కార్తీకమాసం’. చాంద్రమానం ప్రకారం
కార్తీకమాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు
చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి
“కార్తీకమాసం” అని పేరు వచ్చింది.
“న కార్తీక నమో మాసః
న దేవం కేశవాత్పరం!
నచవేద సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్థమమ్”
అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే “కార్తీకమాసానికి సమానమైన మాసము
లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము
లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం.
శివునికి
ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు
నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా
నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ
ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి
యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో
పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల
అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.
హరిహరాదులకు ప్రీతికరం... కార్తీక మాసం
మన భారతీయ సంస్కృతిలో కార్తీకమాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగదినాలే!
అందులోను కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న
వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు,
అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు
జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు.
కాబట్టి ఆ స్వామికి ‘‘ఆశుతోషుడు’’ అనే బిరుదు వచ్చింది.
‘‘హరిః ఓం నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ
త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః''
ప్రతి ఈశ్వరాలయంలో ఆ రుద్ర నమకం మంత్రభాగం
మారుమోగిపోతూ, ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిందువుల గృహాలలో ‘‘ఆదిత్యమంబికా
విష్ణూగణనాథం మహేశ్వరం’’ అనే పంచాయతన దేవతలను విశేషంగా ఆరాధిస్తారు. ఈ
కార్తీకమాస మహత్యం గురించి పూర్వం నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులు
అందరికీ సూతమహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను
వినిపించే సమయంలో, "ఓ సూతముని శ్రేష్ఠా! కలియుగంలో ప్రజలు సంసార
సాగరమునుండి తరింపలేక, అరిషడ్వర్గాలకు దాసులై, సుఖంగా మోక్షమార్గం తెలియక
ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మమేది?
దేవతలు అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవమెవరు? మానవునికి ఆవరించియున్న ఈ
అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం యిచ్చే కార్యమేది? ప్రతిక్షణం మృత్యువు వల్ల
వెంబడించబడే ఈ మానవులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయము చెప్ప''మని
కోరారు.
ఆ ప్రశ్నలను విన్న సూతముని, "ఓ ముని పుంగవులారా! క్షణికమైన సుఖభోగాల కోసం
పరితపించుతూ, మందబుద్ధులు అవుతున్న మానవులకు ‘‘ఈ కార్తీకమాస వ్రతము’’
హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది. దీనిని ఆచరించటం వల్ల సకల పాపాలు
హరింపబడి మరు జన్మలేక పరంధామము పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ
కార్తీకమాస వ్రతమాచరించాలని కోరికను కలుగచేస్తాడు ఆ పరమాత్మ! దుష్టులకు,
దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యేవరకు ఏవగింపు కలిగిస్తాడు.
ఈ మాసంలో
వచ్చే సోమవారాలు చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అత్యంత పుణ్యప్రదమైనవి.
నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజులలో పవిత్రపుణ్య నదీ స్నానం
ఆచరించి, ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకాలు, లక్ష
బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత, విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రతి
నిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్య ఫలం లభిస్తుంది. ఈ
కార్తీకమాసం ముప్పై రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని
చెప్పబడింది.
ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమయం అయ్యాక మూడు
గడియలు (ఒక గంట) ప్రదోషోరజనీముఖమ్. రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం. ఇలా
ప్రతి నిత్ర్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషం
నాలుగు విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. 1. నిత్య ప్రదోషం. 2. పక్ష
ప్రదోషం 3. మాస ప్రదోషం 4. మహాప్రదోషం అని చెప్తారు.
కొందరు
నిష్టాపరులు ఈ కార్తీకమాసమంతా పుణ్యనదీస్నానం ఆచరిస్తూ ప్రతి నిత్యం
హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం. పాలు, పండ్లు
స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు, పూజలు చేసి, నివేదించిన
అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం
ఆచరిస్తారు.ఇక ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏక కాలంలో రెండు రూపాల్ని
ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగంలో పరమేశ్వరరూపంగా
‘‘అర్థనారీశ్వ రుడుగా’’ దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది. ఆ
ప్రదోష సమయాల్లో ఆ తల్లి ‘‘అధ్యక్షురాలు’’గా అధిరోహించియుండగా! పరమేశ్వరుడు
పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ
అక్కడ కొలువుతీరి ఉంటారుట! ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతి
దేవి వీణవాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట. శ్రీ మహాలక్ష్మీ గానం చేస్తూ
ఉంటే! శ్రీ హరి మృదంగం వాయిస్తాడుట. ఇంద్రుడు వేణునాదంతో పులకింపచేస్తూ
ఉంటాడు! అలాంటి ప్రదోష సమయాల్లో దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ
స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారుట.
కాబట్టి ప్రదోష సమయాల్లో శివుని ఆరాధిస్తే! శివుని ఆశీస్సులతోపాటు మిగతా
దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది. ఇంకా మనకు ఆ
అర్థనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే! రెండు ప్రయోజనాలు లభిస్తాయట. కామం!
అంటే కోర్కెలను నియంత్రించే శక్తి మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే
శక్తిని ప్రసా దిస్తాడుట! ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వశుభాలను కలుగచేసి,
సర్వదారిద్య్ర బాధలను తొలగించి సర్వసంపత్తులు అనుగ్రిహస్తుంది అని
చెప్పబడింది.
ఈ కార్తీకమాసంలో అత్యంత విశేషమైనది. ఉత్థానైకాదశి అంటే శ్రీ మహావిష్ణువు
పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధ ఏకాదశినాడు తనయోగనిద్రను
ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశినాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి
మేల్కొన్న రోజుకే ఉత్థాన ఏకాదశి అనే పేరు. ఆ మరుసటి రోజు ద్వాదశినాడు
ముప్పై ముగ్గురు దేవతలలో శ్రీ మహాలక్ష్మీ సమేతుడై తులసీ ధాత్రివనంలో
ఉంటాడని చెప్తారు.
ఈ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అంటారు
అంటే, పూర్వం కృతయుగంలో దేవదానవులు పాలసముద్ర మధనం చేసిన రోజు. కనుక దీనికి
క్షీరాబ్ధి ద్వాదశి అను పేరు వచ్చింది. పాల సముద్రాన్ని చిలికారు కనుక
చిల్కు ద్వాదశి అని కూడా అంటారు. కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల
కోసం తులసీ ధాత్రి (తులసికోట) దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో
తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. ఆ రోజు దేశం నలుమూలలా ఉన్న
ఆలయాలలోని లక్ష్మీనారాయణ మూర్తులను మిరుమిట్లు గొలిపే విద్యుత్
దీపకాంతితో, బాణసంచాలతో సమీప నదీజాలలో తెప్సోత్సవం నిర్వహిస్తూ ఉంటారు.
కార్తీక పూర్ణిమనాడు వరిగడ్డిని వెంటిగా చుట్టి దానిని రెండు స్తంభాలకు
కట్టి ఆ వెంటిని మూడుమార్లు కాగడాలతో వెలిగిస్తూ వాటి క్రింది
పార్వతీపరమేశ్వరుల ప్రతిమలను పల్లకిలో ఉంచి మూడుసార్లు త్రిప్పి జ్వాలాతోరణ
వేడుకను నిర్వహిస్తారు. అలా హరిహరాదులకు ప్రత్యేక ఉత్సవ వేడుకలు
నిర్వహిస్తారు. ఇలా ఈ కార్తీకమాస విశేషాలను కొనియాడి చెప్పడానికి
సహస్రముఖాలు కలిగిన ఆదిశేషుడు, చతుర్ముఖుడైన బ్రహ్మకే సాధ్యం కాదని
చెప్పగా, ఇక మానవ మాత్రులమైన మనమెంత?'' అని సూతమహాముని చెప్పారు.
మన
సంస్కృతిలో ఈ దీపారాధన అనేది ప్రధానాంశం. ఈ దీపదానంలో ఆవునెయ్యి
ఉత్తమోత్తమమైనది. మంచినూనె మధ్యమము, ఇప్పనూనె అధమము, ఇతర నూనెలు అడవిలో
పుట్టిన నూనెలు అధమాతి అధమములు. గేదె నేతితో దీపము, వెలిగిస్తే పూర్వ
పుణ్యము కూడా నశించి పోతుంది. అదే స్వల్పంగా ఆవునేయి కలిపి వెలిగింస్తే
దోషములేదని, అలా ఒకటి మొదలు వేయి వరకు దీపాలు వెలిగించుటం ఎంతో శుభప్రదమని
వాటి సంఖ్యనుబట్టి వివిధ ఫలితాలు అందిస్తుందని, దీపదాన మహాత్యంలో
చెప్పివున్నారు. అలాంటి దీపారాధన పూజామందిరంలో, దేవాలయాలలో గృహప్రాంగణాలలో,
తులసీ బృందావనంలో, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల దగ్గర, పుణ్య
నదీతీరాలలో వెలిగించుటం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి
చెబుతున్నాయి.
ఈ మాసంలో
సోదరి చేతివంట భగనీ హస్తభోజనము చేసి యధాశక్తి వారికి కానుకలు సమర్పించుటంతో
పాటు, సమీప వనంలో బంధువులు, స్నేహితులతో కలిసి ఉసి రిచెట్టును పూజించి,
సాత్విక ఆహారంతో వనభోజనాలు చేస్తూ వుండటం మంచిది. అందువల్ల మన జీవన గమనంలో
మంచి ఆహ్లాదంతో పాటు అన్నదాన ఫలితం కూడా లభిస్తుంది.
అలాంటి మహిమాన్వితమైన ఈ కార్తీకమాసంలో నియమనిష్టలతో హరిహరాదులను అనునిత్యం
ఆరాధిస్తూ ‘‘కార్తీకపురాణ’’ పఠనం చేస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని, ఈ
పవిత్ర పుణ్యదినాలలో అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానము, వస్త్ర, ఫల,
పుష్ప, సువర్ణ దానాలు మొదలైనవి చేయుటం వల్ల ఇహంలో సర్వసుఖాలు అనుభవించుటమే
కాకుండా, జన్మాంతరంలో జన్మరాహిత్యాన్ని పొందగలరని ఈ కార్తీకమాస
వ్రతమహాత్యాన్ని గురించిసూతమహాముని శౌనకాది మునులకు వివరించాడు.
విశిష్టత
ఆయా మాసాలలో
చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి
వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటంవల్ల ఈ మాసానికి
కార్తీకమాసమని పేరు. ఈ మాసంలో కృత్తిక నక్షత్రానికి, దీపారాధనకు,
సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. ఈ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కృత్తికా నక్షత్రం:
కృత్తికానక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో
ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక,
ఉత్తర, ఉత్తరాషాడలలో మొదటిది కృత్తికయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా
నక్షత్రంతోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని
ఆరు ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా ఆరు నక్షత్రాలు. ఈ కృత్తికలు ఒక
విశిష్టత ఉంది. అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే ఆరు ముఖాలు
కలవాడని అర్థం. ఆకాశంలోని ఆరు కృత్తికా నక్షత్రాలు మాతృమూర్తులై పాలు
యివ్వగా కుమారస్వామి ఆరు ముఖాలతో పాలు త్రాగాడు. ఈ విధంగా కృత్తికలచే
పెంచబడటంతో కుమరస్వామికి కార్తీకేయుడని పేరు వచ్చినది. ఈ కారణాల వల్ల
కృత్తికలకు ప్రాముఖ్యం కలిగింది.
కార్తీక దీపాలు:
ఈ మాసంలో
చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన. ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి
పూర్వమే లేచి నదీస్నానం చేసి శుచిగా, పొడిబట్టలు ధరించి దీపారాధన చేయాలి. ఈ
మాసంలోనే జ్వాలా తోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా
దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమానంగా
ఉంటాయి. ప్రతి ఇంటిముంగిట ఈ మాసాంతం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది.
కార్తీకమాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలలో దీపాలు వదలుతారు. ఈ దీపాలు
ఆకాశంలోని చుక్కల్లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నులపండుగను కలుగచేస్తాయి. ఈ
మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు. దీని వల్ల వారికి ఎనలేని
కీర్తిసౌ భాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమునే
చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి.
కార్తీక సోమవారాలు:
ఈ
మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి.
దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం,
చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల మాసంలోని సోమవారాలకు విశిష్టత
కలిగింది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది.
శైవభక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో
శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ మాసకాలంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మ ముహూర్తంలో నదీ
స్నానం చేసి 'హరహరశంభో' అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి ప్రపంచంలో
మునిగిపోతారు. ముఖ్యంగా శైవభక్తులు ఈ మాసమంతా ఉపవాసముండి శివుడిని
పూజిస్తారు. శివ ప్రీతికరమైన సోమవారం రోజు భానోదయం ముందు లేచి
స్నానాదికార్యాక్రమాలు ముగించుకుని, పొడి బట్టలు ధరించి మొదటగా దీపారాధన
చేయాలి. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి.
ఈ విధంగా చేయడం వల్ల నిత్యమూ సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్థిల్లుతారని
ప్రజల నమ్మకం. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన నాటి నుండిగాని, కార్తీక
మాసారంభదినమైన శుద్ధపాడ్యమి మొదలుకొని గాని వ్రతారంభం చేయాలి. అలా
ప్రారంభించే సమయంలో "ఓ కార్తీక దామోదార! నీకు వందనములు. నాచే ఆరంభింపబడే కార్తీక వ్రతాన్ని విఘ్నం లేకుండా చేయు''ము అని తరువాత స్నానం చేయాలి.
ఆ విధంగా
జీవనదికి వెళ్ళి గంగకు, శ్రీ మన్నారాయణునను, భైరవున్ని నమస్కరించి
భైరవాజ్ఞను తలదాల్చి మొలలోతు నీటిలో నిలువబడి మొదట సంకల్పము చెప్పుకొని
సూక్తాలను చదివి, మార్జన మంత్రముతోను, అఘమర్షణ మంత్రముతోను, గంగోదకమును
శిరస్సున జల్లుకొని అఘమర్ష స్నానమా ఆచరించాలి. తరువాత సూర్యుడికి కర్ఘ్య
ప్రదానం చేసి దేవతలకు, ఋషూలకు, పితృదేవతలకు క్రమ ప్రకారంగ తర్పణం వదలాలి.
అప్పుడది సుస్నానం అవుతుంది. స్నానం చేసిన తరువాత నదీతీరము చేరి
మూడుదోసిళ్ళ నీరు గట్టుపైన పోయాలి.
కార్తీకమాసంలో
గంగా, గోదావరి, కావేరీ, తుంగభద్రాది నదులలో స్నానం చేస్తే ఆత్యుత్తమం,
గంగానది కార్తీకమాసంలో నదులన్నిటిలో ద్రవరూప సన్నిహితయై వుంటుంది. శ్రీ
ఆదినారాయణుడు గోష్పాద మాత్ర ప్రదేశంలో జలములో సన్నిహితుడై ఉంటాడని వేదాలు
చెప్పుతున్నాయి కాబట్టి సముద్రకామి అయిన నదీ స్నానం అత్యంత పవిత్రమైనది.
నదీ స్నానానికి ఆవకాశము లభించకపోతే కులువలోగాని, చెరువులోగాని, కూపము
దగ్గరగాని సూర్యోదయము స్నానం చేయాలి. తరువాత మడిబట్టలను ధరించి ముందుగా
భగవంతుని స్మరించు కోవాలి. తరువాత భస్మాన్ని త్రిపుండ్రముగా నుదుట
ధరించాలి. లేక గోపీచందనముపైన నుదుట నూర్ద్వ పుండ్రముగా వుంచుకోవాలి. తరువాత
సంధ్యావందనము, బ్రహ్మ యజ్ఞాన్ని ముగించి, నిత్యాగ్నిహోత్రాన్ని చేసుకొని
దేవతార్చన చేసుకోవాలి. స్నానతీర్థములోనే కార్తీక పురాణ శ్రవణమును చేయాలి.
సూర్యుడు
ఆస్తమించే కాలంలో సాయంసంధ్యను పూర్తి చేసికొని శివాలయముగాని, విష్ణు
ఆలయంలోగాని దీపారాధన చేయాలి. షోడశోపచార పూజావిధానంలో హరిహరులను పూజించి
షడ్రసోపేతమై, భక్ష్యభోజ్యాదులతో కూడిన నైవేద్యము పెట్టాలి. ఈ విధంగా
కార్తీకశుద్ధ ప్రతిపత్తు మొదలు అమావాశ్య తుదివరకు నక్తవ్రతం చేస్తే
కార్తీకమాస వ్రతము పూర్తవుతుంది. మరునాడు శక్తిననుసరించి మృష్టాన్నముతో భూత
తృప్తి కావించాలి. కార్తీక మాసంలో సోమవారం శివప్రీతికై సోమవారవ్రతము
చేసినవారికి కైలాసంలో శివుని సన్నిధానమున నుండుట ప్రాప్తిస్తుంది.
సోమవారవ్రత విధానం ఎలాంటిది అంటే - సోమవారం నదీ స్నానం చేసి సంపూర్ణంగా
ఉపవాసం ఉండి, శివునికి అభిషేకం చేసి రాత్రి మొదటి ఝామున భుజించాలి.
ఆ రోజున
యితరులలాగా పదార్ధం గ్రహింపరాదు. తిలదాన మొనర్చినందువలన పాపములన్నియు
నశించును. ఇంకా ఆత్యంత నిష్ఠతోను, భక్తితోను ఆచరింప అవకాశం ఉన్నవారు ఆ దినం
రాత్రి కూడా నిద్రింపోక పురాణాది పఠనంతో జాగరణ చేసి, మరునాడు శక్తి
కొలదిగా బ్రాహ్మణులకు సంతర్పణను చేసి తరువాత భుజించాలి. ఈ పై రెండూ
చేయలేనివారు సోమవారం రోజు నపరాహ్ణము వరకు వుండి భుజించాలి. యిందులో ఏది
చేయుడానికి శక్తిలేకపోతే నదీస్నానం చేసుకొని భగవంతుని ధ్యానించాలి. సోమవారం
రోజు స్త్రీగాని, పురుషుడుగాని నక్షత్ర దర్శనం అయ్యేవరకు ఉపవాసం చేసి
తరువాత భుజించినవారి పాపాలు అగ్నిలో పడిన దూదివలే నాశనం అవుతుంది. ఆ
రోజునశివుడికి అభిషేకం చేసి, బిల్వదళంబులతో సహస్రనామార్చన చేసి, ఇతరులచే
చేయించిమా, శివపంచాక్షరీ మంత్రాన్ని జపించినా, వారిని శివుడు ఆనుగ్రహించి
సర్వసంపదలను, సమస్త శుభాలను చేకూరుస్తాడు.
కార్తీక
సోమవారాలు లేదా పౌర్ణమినాడుగాని లేక ఇతర దినాల్లో అయినా సాయంసమయాలలో
శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను వుంచి దీపం వెలిగించడం శ్రేష్టం.
ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వులనూనెతో గానీ,
కొబ్బరినూనెతో గానీ, నెయ్యితోగాని, అవిశనూనెతో గానీ, ఇప్పనూనెతో గానీ,
లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపాన్ని వెలిగించాలి. అంతే కాకుండా
కార్తీకమాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీకమాసంలో ముప్పై రోజులలో
దీపం పెట్టలేనివారు శుద్ధద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం
పెట్టాలని శాస్త్ర వచనం. ఈ విధంగా కార్తీకమాసంలో దీపాలను వెలిగించడం,
దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళూ, రప్పలు, వృక్షాలు వంటివి
కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.