సంక్రాంతి నాలుగో రోజు ముక్కనుమ అంటారు. కానీ ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలిసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు కానీ, కొంత మంది కనుమ నాడు కాక ఈ రోజే మాంసాహారాన్ని తినటానికి కేటాయిస్తారు. కొత్తగా పెళ్ళయిన ఆడవారు సావిత్రి గౌరీ వ్రతాన్ని మొదలు పెడతారు. పదహారు రోజుల పాటు చేసే ఈ వ్రతాన్ని గ్రామంలో ఉన్న ఆడవారందరూ కలిసి చేసుకుంటారు. మట్టితో చేసిన గౌరీ దేవి బొమ్మని కుమ్మరి ఇంటినుంచి మేళతాళాలతో తెస్తారు. కుమ్మరికి స్వయం పాకం, దక్షిణ ఇచ్చి గౌరవిస్తారు. అన్ని వృత్తుల గౌరవించటం సంక్రాంతి సంప్రదాయాల పరమార్ధం.
సంక్రాంతిలో తొలిరోజైన భోగిన కీడుపండుగగానూ, రెండో రోజైన సంక్రాంతిని పెద్దల పండుగగానూ, మూడోరోజైన కనుమను పశువుల పండుగగానూ చేసుకునే జనం నాలుగో రోజున గ్రామదేవతలను తల్చుకుంటూ మాంసాహారాన్ని వండుకునే సంప్రదాయం కనిపిస్తుంది. అందుకనే ముక్కనుమను ముక్కల పండుగగా కూడా పిల్చుకోవడం రివాజు.
సంక్రాంతిలో మూడోరోజైన కనుమనాడు పొలిమేర దాటకూడదన్న నియమం ఉంది. కాబట్టి ఇంటికి వచ్చిన ఆడపడుచులని సత్కరించుకుని, మనసారా బహుమతులు ఇచ్చుకుని ముక్కనుమనాడు వీడ్కోలు పలుకుతారు. కొంతమంది ముక్కనుమను కూడా పండుగగా భావించి, ముక్కనుమనాడు కూడా బయల్దేరకూడదని చెబుతుంటారు. కానీ ఈ విషయమై శాస్త్రపరంగా ఎలాంటి నియమమూ లేదు.
ముక్కనుమ రోజున కొత్త వధువుల ‘సావిత్రి గౌరీవ్రతం’ అనే వ్రతాన్ని పట్టడం కూడా కనిపిస్తుంది. ఇందుకోసం మట్టి ప్రతిమలను ప్రతిష్టించుకుని, వాటికి తొమ్మిది రోజుల పాటు తొమ్మదిరకాల పిండివంటలు నివేదనం చేస్తారు. చివరికి ఆ బొమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. బోమ్మలతో చేసే వ్రతం కాబట్టి, దీనికి బొమ్మల నోము అని కూడా పిలుచుకోవడం జరుగుతోంది.
కనుమనాడు రథం ముగ్గు వేయడం మనకి తెలిసిందే! కొందరు ముక్కనుమ రోజున కూడా రథం ముగ్గు వేస్తుంటారు. సంకురుమయ్య ఉత్తరాయణం వైపుగా మరలే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనను సాగనంపేందుకు అన్నట్లుగా ఇలా రథం ముగ్గుని వేయడం ఆచారం. ఈ ముగ్గుకి ఉన్న కొసను మాత్రం ఇంటి బయటకు వెళ్లేలా దిద్దుతారు.
కొంతమంది కనుమ రోజు మాంసాహారం తినవచ్చునని అనుకుని వారికి వారే కల్పించుకుని తినేస్తుంటారు. అది ఎంత మాత్రం సరైనది కాదు. మన భారతీయ హిందూ సంస్కృతి చాలా గొప్పనైనది. సంస్కృతి అంటే బాగుచేయునది అని అర్ధం. అనాది నుండి ప్రధానమైనది మతం - హిందూ మతము భాయాం రతా: = భారతా.. అనగా ఆత్మజ్ఞానము నందు ఆసక్తులైనవారు అని భావం.
భారతీయ సంస్కృతి అంటే వైదిక లేక సనాతనమైనదని దానికి సంబంధించినదే వాజ్ఞయం, లలితకళలు, ఆచార వ్యవహారాములు. నియమాలు, కట్టుబాట్లు అనేవి వీటి పరిదిలోకి వస్తాయి. ఈ మకర సంక్రాంతితో సూర్యభగవాణుడు ఉత్తరాయణం వైపు ప్రయణం చేయడాన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. భోగి, సంక్రాంతి, కనుమ అనేవి దైవాన్ని , ప్రకృతిని, పశుపక్షాదులను అంటే మన జీవించడాని సహయపడిన వాటిని గౌరవించి వాటిని పూజించుకునే గొప్పనైన సంస్కృతిని మన పూర్వీకులు మనకు ఆచరించి తెలియజేసారు.
కాలం మారుతున్నకొద్ది మన సనాతన సంస్కృతి సాంప్రదాయలను మరచిపోతున్నాం. ఇది ఎంత వరకు మంచిది ఒకసారి ఆలోచించాలి. కనుమ అంటే పశువులను గౌరవించి పూజించే పండగా అని చెప్పుకుంటాం. అంటే సాటి ప్రాణులను గౌరవించే సంస్కారం మనలో దైవత్వం ఉంటేనే వస్తుంది. అంతలోనే మాంసాహారం తినడంలో ఎంతవరకు న్యాయమో ఆలోచించాల్సి ఉంది.
మన పెద్దలు పూర్వీకులు మన ఆరోగ్య సూత్రలను దృష్టిలో పెట్టుకుని ఆయా పండుగలలో ఆహార నియమాలను పాటించేలా చేశారు. వాటిని పెడచెవిన పెడితే ఎవరికి నష్టమనేది ఆలోచించాలి. నా ఉద్ధేశ్యం మాంసాహారం తినే వారిని వద్దని నేను చెప్పడం లేదు కాని ఈ భోగి, సంక్రాంతి, కనుమ అనే మూడు రోజుల పండగలలో మాంసాహార భక్షణ చేయాలనే నియమం ఎక్కడ లేదు. ఇది కేవలం వ్యక్తిగతంగా కల్పించుకున్నదే!
సంక్రాంతి నాలుగో రోజున తమిళనాట కూడా ఘనంగా జరుపుకొంటారు. వారు ఈ రోజుని కరినాళ్ అని పిలచుకుంటారు. ఈ రోజు చుట్టాలను కలుసుకుంటే మంచిదని చెబుతారు. ఒకరకంగా బంధుత్వాలను కలుపుకునేందుకు, సంబంధీకుల మంచిచెడులను పరామర్శించేందుకు ఈ రోజున ప్రాముఖ్యతని ఇస్తారన్నమాట. అంతేకాదు, ఈ రోజున కుటుంబసమేతంగా వనభోజనాలకు వెళ్లే ఆనవాయితీ కూడా ఉంది.
No comments:
Post a Comment