ఆద్యాత్మిక సాధన అంటే మనని మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే అంతరంగ సాధన యే ఆధ్యాత్మిక సాధన...!!
దీనికి మన బాహ్య పరిస్థితులతో, మన భౌతిక స్థితితో సంబందం లేదు...
మన మతము, కులం, లింగం (ఆడా, మగ), వయస్సు వీటితో సంబంధం లేదు...
కేవలం అంతరంగ మార్పు కావాలి అన్న పట్టుదల ఒకటి ఉంటే చాలు వారు ఈ సాధనకు అర్హులు...
దీనికి బాహ్య గురువు ఉండడు, బయట నుంచి ఎవ్వరు మనని నియంత్రిచరు, అస్సలు ఈ సాధన చేస్తున్నామని ఎవ్వరికి తెలియదు...
కానీ సాధనా పరిమళాలు అందరిని ఆకర్షింపచేసి, వారిని కూడా ఈ సాధనకు ప్రేరణ చేస్తాయి...
కాబట్టి ఈ సాధనకు ఏటువంటి ప్రచారా ఆర్భాటాలు లేవు...
ఆధ్యాత్మిక సాధనకు కావాల్సిన కొన్ని లక్షణాలు...!!
1) స్వప్రయత్నం
2) స్వయం క్రమశిక్షణ
3) స్వ అధ్యయనం
4) స్వ పరీశీలన
5) స్వ లక్ష్య నిర్ణయం
6) సమయ పాలన
7) పోల్చుకోక పోవడం
8) అనాసక్తి
9) మౌనం
10) ఎల్లలు లేని ప్రేమ
11) ఎవరినైనా మనస్ఫూర్తిగా క్షమించడం
12) అన్ని వాస్తవాలని యధాతధంగా స్వీకరీంచడం
13) కర్మని బట్టి సర్వం జరుగుతాయి కాబట్టి "చేసుకున్నవాడికి చేసుకున్నంత" అని గ్రహించడం
14) మన వాస్తవానికి మనమే సృష్టి కర్త అని గ్రహించి కావాల్సిన వాస్తవాలను సృష్టించుకోవడం
15) నిత్యము, సత్యము, శాశ్వతం వీటిని గురించి విచారణ, విశ్లేషణ చేయడం
16) మార్పు సహజం అని గుర్తించి దానిని ఆహ్వానించడం
17) అహంకారము ను పూర్తిగా తొలగించడం
18) మమకారం ని ఆదిలోనే తుంచడం
19) తాను అందరికంటే అధికుడను అన్న భావం రానివ్వకుండా జగ్రత్తగా ఉండడం
20) సదా ఎరుకలో ఉండడం
21) భౌతిక, ఆద్యాత్మిక, మతముల పై పూర్తి అవహాగన కలిగి ఒక దానితో ఇంకొకటి కలిపి కలగాపులగం చేయకపోవడం
22) అలవాట్లు, వ్యాసనాలు, సంప్రదాయాలు, సంస్కారాలు, వాసనలు వీటి గురించి పూర్తి అవహాగన కలిగి సరియైనవి ఎన్నిక చేసుకోవడం
23) అంతరంగ శుద్ధి కలిగి ఉండడం, దాని కోసం సాధన చేయడం
24) అహం నాస్తి, ఇదం నమమ అన్న భావాలని అవహాగన చేసుకొని జీవించడం
25) మనచే ఆచరింప బడ్డ సర్వ కర్మ పలితాలు పరమాత్మకు ప్రతి నిత్యం ప్రయత్నపూర్వకంగా సమర్పణ చేయడం
26) దేని చేత బందింపబడక నిత్య ముక్త స్థితిలో ఉండడం...
మనసు - బుద్ధి
మనసు బుద్ధి నియంత్రణలో ఉంటే అది మంచి సేవకురాలు, మనసే బుద్ధిని నియంత్రిస్తే అది ఒక నియంత.
అది పాదరసం లాగా చురుకైనది.
చేతికి దొరికినట్లే ఉంటుంది, కానీ తేలికగా జారిపోతుంది.. ఆదిత్యయోగీ..
భవబంధాలకు మోక్షానికి, రాగానికిద్వేషానికి, భయానికి ధైర్యానికి, సంకల్ప వికల్పాలకు, శాంతికి అశాంతికి.... అన్నింటికీ మూలం మనసు ...
మనసును నియంత్రిస్తే ప్రశాంతత, శాంతిసౌఖ్యాలు లభిస్తాయి. నిజానికి అది అంత తేలిక కాదు. గట్టిగా ప్రయత్నిస్తే కష్టమూ కాదు.
మచ్చికైన జవనాశ్వం రౌతు అధీనంలో ఉన్నట్లు బుద్ది అదుపులో మనసు ఉండాలి, రౌతు కోరిన చోటుకు గుర్రం వెళ్ళాలి కాని, అది తీసుకుపోయిన చోటికి రౌతు వెళ్ళడం కాదు.
మాలిమి చేసుకున్న మనసు మాత్రమే బుద్ధి అధీనంలో నడుచుకుంటుంది.
మనసు మాయాజాలం మాటలకు అందనిది, మయుడి సభను మరపించే భ్రమల సౌధాన్ని కల్పిస్తుంది.
తనది కానిదాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైనదాన్ని శాశ్వతమన్నట్లుగా భ్రమిం పజేస్తుంది, మరులు గొల్పుతుంది, మురిపిస్తుంది, మరిపిస్తుంది.
బుద్ధి ఉపయోగించి గాని ఆ మాయ నుంచి బయటపడలేము.
రాగద్వేషాలతో నిండిన మనసు ఉన్నది ఉన్నట్లుగా చూడనివ్వదు.
అది ప్రసరింపజేసే రంగు రంగుల కాంతిలో గాజుముక్క కూడా వజ్రంలాగా కనిపిస్తుంది.
బుద్ధి అనే సూర్యకాంతిలో గాని వజ్రానికి గాజుముక్కకు తేడా తెలియదు.
మనసు నిజ జీవితానికి భిన్నమైన గొప్ప ప్రపంచాన్ని సృష్టిస్తుంది.
అది విశ్వామిత్రుడి త్రిశంకు స్వర్గం కన్న మిన్నయైనది.
ఆ కాల్పనిక జగత్తులో మునిగితేలేవారు నిజ జీవితాన్ని దుర్భ చేసుకుంటారు.
కొంతమంది పలాయన వాదాన్ని చిత్తగిస్తారు.
కొందరు మద్యపానాన్ని ఆశ్రయిస్తారు.
కొందరు తమ బాధ్యతను కర్తవ్యాన్ని భగవంతుడిపై నెట్టేస్తారు.
అటువంటి వారికి | మద్యపానమైనా భగవంతుడి ప్రార్థనలైనా పెద్ద భేదం ఉండదు.
ఎన్ని చూసినా, ఉపనిషత్తులు చదివినా, భగవద్గీతను కంఠస్థం చేసినా వాటి సారాన్ని నిజ జీవితంలో అన్వయించుకొని ఆచరించగలగాలి, అప్పుడే వాటికి సార్ధకత.
మనిషి బలం, బలహీనత... రెండూ మనసే.
మనిషిని దైవత్వానికి చేరువ చేసేది మనసే.
రాక్షసుడిగా దిగజార్చేది మనసే.
బలహీనమైన మనసు ప్రతి అల్ప విషయానికీ ఉద్విగ్న భరితమవుతుంది.
ప్రశంసిస్తే ఆకాశంలో విహరిస్తుంది.
విమర్శిస్తే పాతాళానికి కుంగిపోతుంది.
తాళం చెవి ఎడమవైపు తిప్పితే గడియ పడుతుంది, కుడిపక్కకు తిప్పితే గడియ తెరుచుకుంటుంది.
మనసూ ఎటు తిప్పితే అటు తిరుగుతుంది.ఆదిత్యయోగీ..
భౌతిక సుఖాలకు వ్యతిరేకంగా తిప్పితే ఆధ్యాత్మికత వైపు తిరుగుతుంది.
మనసులోని వ్యతిరేక భావనలను తొలగించి సానుకూలమైన ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపితే శారీరక రుగ్మతలూ దగ్గరకు రావు.
నేటి శాస్త్రవేత్తలు కూడా చాలా రోగాలకు కారణం మనసే అని, మనసు హాయిగా ఉంచుకున్నవారికి రోగాలు దరిచేరవని ధ్రువీకరిస్తున్నారు.
ధర్మబద్ధమైన కర్మలను నిష్కామంగా ఆచరిస్తూ బుద్ధికి మనసును అప్పజెప్పి జీవనయానాన్ని కొనసాగించాలి, ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటూ మనసులో చెలరేగే ఆలోచనలు ప్రలోభాలు సంఘటనలను అవగాహన చేసుకుని, విచక్షణతో వాటి ప్రభావాన్ని కొద్దికొద్దిగా తగ్గించు కోవాలి.
అప్పుడు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దారి తప్పకుండా ఉంటాయి...
మానవ జన్మ ఎందుకు???
మంత్రానికి పనికిరాని అక్షరమే ఉండదు.
ఏ ఏ అక్షరాన్ని ఏవిధంగా ఉచ్చరించాలో, ఏ స్థలంలో ఉపయోగించాలో, ఆవిధంగా ఉపయోగించి, దాన్ని మంత్రంగా ప్రయోగించడం అనేది మంత్రశాస్త్ర పరిభాష తెలిసినవారికి మాత్రమే సాధ్యమౌతుంది.
మందుకు పనికిరాని మూలికలనేవి ఉండవు.
మూల మంటే వేరు, ఔషధమంటే మందు.
ఏయే చెట్టు వేర్లు, మూలికలు ఉపయోగిస్తే, ఏ రోగానికి మందుగా ఉపయోగించవచ్చు, అనేది ఆయుర్వేద వైద్య రంగంలో నిష్ణాతులైన వారికి మాత్రమే తెలిసిన మర్మం...
అయోగ్యులంటే అప్రయోజకులు.
దేనికీ పనికిరాని వారు, అసలీ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు.
భగవంతుని సృష్టిలో దేని ప్రయోజనం దానికి ఉంటుంది..
పిపీలికాది పర్యంతం... అంటే చీమ మొదలుకొని ప్రతి ప్రాణి ఏదో ఒక ప్రయోజనం తోనే సృష్టించబడింది.
భగవంతుడి మాయ మనకు అవగాహన కావడమనేది చాల కష్టం.
సృష్టిలో పనికిరాని మనిషి ఉన్నాడా అంటే ఉండడు, అందరూ ఏదో ఒక విధంగా పనికివస్తారు.
యోజగః తత్ర దుర్లభః...!!
యోజగః = చక్కగా ఆలోచించ గలిగినవాడు, దుర్లభః = అరుదు.
అంటే దేనిని ఏ విధంగా ఉపయోగిస్తే అది ప్రయోజనకారిగా ఉంటుందని, చక్కగా యోచించి, ప్రయత్నం చేసి, ఆచరించ గలిగె వారే ఈ సృష్టిలో చాలా అరుదని దీని అర్థం.
“జీవులేనుబది నాల్గు లక్షల చావు పుట్టుక లిక్కడా
ఎవరు చేసిన కర్మము వారనుభవించే దక్కడా”
అని చాటుతుందొక తత్త్వగేయం.
ఈ సృష్టిలో జీవరాశులు 84 లక్షల రకాలు.
ఇన్ని ప్రాణుల లోను మానవుడనే ప్రాణి ఉన్నతమైన వాడు, విశిష్టమైన వాడు...
కారణం, కన్ను, ముక్కు, చెవి వంటి పంచేంద్రియములతో పాటు, జ్ఞానమనే ఆరవ ఇంద్రియంద్రియములతో విశిష్టమైంది.
ఇతర ప్రాణుల నుండి మనిషిని వేరుచేసేది విచక్షణాజ్ఞానం.
ఏది మంచి, ఏది చెడదు, ఏది పాపం, ఏది పుణ్యం.
ఏది అక్రమం, ఏది సక్రమం, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం అనే విచక్షణాజ్ఞానం కలవాడు మానవుడు.
ఏది ధర్మం..? ఏది అధర్మం..? అని మనం ప్రశ్నించు కొంటే మహాభారతంలో దీనికి సరైన సమాధానం లభిస్తుంది.
“ఒరు లేయవి యొనరించిన
నరవర! యప్రియము తన మనంబునకగు
నొరులకు నవి సేయకునికయ
పరాయణము ధర్మపథముల కెల్లన్”
ఇతరులు, ఎదుటి వారు ఏ పనిని చేసిన యెడల నీ మనస్సుకు అప్రియము, అంతే కష్టం కలుగునో, ఆ పనిని నీవు ఇతరుల యెడ చేయవలదు.
అంతే ఇతులకు కష్టం కలిగించే ఏ పనీ నీవు చేయవద్దు.
ఇదే అన్ని ధర్మాల కంటే పరమధర్మము.
నీ కర్తవ్యమును నీవు నిర్వర్తిస్తూ, అందరికి ప్రయోజనకరమైన పనులు, నిస్వార్థమైన సేవలు చేస్తూ జీవించిన యెడల మానవజన్మ సార్థకమగును...
భగవంతుని అనుగ్రహం పొందాలంటే - ఏమి చెయ్యాలి???
వేదాంతార్దతతదాభాసక్ క్షీరనీర వివేకినం |
నమామి భగవత్పాదం పరహంస దురంధరం ||. ఆదిత్యయోగీ..
మనయొక్క సనాతన ధర్మములో భగవధారధనకి అపారమైన ప్రాధాన్యం ఉన్నది. భగవధారధన ద్వారా మనకు సకల విధములైనటువంటి శ్రేయస్సులు లభిస్తాయి.
మనం ఎప్పుడైనా ఏదైనా కార్యం చేసేటప్పుడు అది సఫలం అవ్వాలనంటే మన యొక్క ప్రయత్నం ఎంతగానో ఆవశ్యకం, అదేరకంగా భగవదనుగ్రహం కూడా అంతే ఆవశ్యకం.
భగవదనుగ్రహం కనుక లేకపోతే మన ప్రయత్నం ప్రయత్నంగానే మిగిలిపోతుంది, అది సఫలం అవ్వదు. మన ప్రయత్నం ప్రయత్నంగానే మిగిలిపోకుండా మనకి ఫలాన్ని ఇవ్వాలి అంటే దానికి భగవదనుగ్రహం ఎంతో ఆవశ్యకం.
కాబట్టి ప్రతియొక్క మనిషి తమ జీవితంలో కొంత సమయాన్నైనా భగవదారాధన కోసం కేటాయించాలి, తద్వారా భగవదనుగ్రహానికి పాత్రులం కావాలి.
జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యులవారు ప్రతియొక్కరూ విశేషంగా భగవంతుని విషయంలో భక్తిగా ఉంటూ భగవదారాధన చెయ్యాలి అనే విషయాన్ని ఉపదేశించారు.
దానికొఱకు వారు భజగోవిందం మొదలుకుని అనేక స్తోత్రాలు రచన చేశారు.
ఈరకంగా వారు అక్కడక్కడ ప్రసంగవశాత్తు అనేక ప్రదేశాల్లో భగవద్భక్తి యొక్క ప్రాధాన్యాన్ని వారు వివరించారు.
ముఖ్యంగా భగవద్గీతలో ...
సమోఽహం సర్వభూతేషు న మే ద్వేష్యోఽస్తి న ప్రియః |
యే భజంతి తు మాం భక్త్యామయి తే తేషు చాప్యహమ్ || (భ.గీ:9-29)
అనేటటువంటి శ్లోకం యొక్క భాష్యంలో శంకరాచార్యులవారు భగవంతుడి యొక్క స్వభావాన్ని ఒక అద్బుతమైనటువంటి ఉదహరణతో వివరించారు.
ఈ శ్లోకానికి అర్ధమేమిటి అనగా ఇక్కడ భగవంతుడు చెప్తూ ఉన్నాడు నేను అందరికీ అనుగ్రహం చేస్తాను అందరూ నాకు సమానమే.
ఒకడిని చూస్తే నాకు పడదు ఇంకొకడంటే నాకు చాలా ఇష్టం అనే బేధం నావద్ద లేదు. నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరికీ నేను ఒకేరకమైన అనుగ్రహం కలుగచేస్తాను. ఒకసారి నన్ను ఆశ్రయించిన తరువాత వాడు ధనవంతు, పేదవాడు, మహారాజు, సామాన్యుడు, చదువుకున్నవారు, పామరుడు అనేటటువంటి బేధాన్ని నేను చూడను, నన్ను ఆశ్రయించిన వారు ఎవరైనా సరే అందరికీ అనుగ్రహం చేస్తాను అని ఈ శ్లోకం యొక్క అర్ధం.
ఇది భగవంతుడి యొక్క ప్రతిజ్ఞ. కాబట్టి మనం భగవదనుగ్రహం పొందాలంటే భగవంతుడిని ఆశ్రయించాలి.
భగవంతుడు అందరికీ అనుగ్రహం చేస్తాను నాకందరూ సమానమే అన్నారు కాబట్టి నేనేమి చేయకుండా ఉంటాను భగవంతుడు వచ్చి నాకు అనుగ్రహం చేయాలి అని అనటానికి వీల్లేదు.
భగవానుడు అందరూ నాకు సమానమే అన్నాడు దాని అర్ధమేమిటి అంటే "ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారందరూ నాకు సమానము" అని ఆ మాట యొక్క అర్ధం.
కాబట్టి మనం విశేషంగా భగవంతుడిని ఆశ్రయించి ఆరాధించాలి, ఆశ్రయిస్తే భగవంతుడు తప్పకుండా అనుగ్రహం కలుగచేస్తాడు. భగవంతుడిని ఆశ్రయించటానికి అనేక మార్గాలు మన శాస్త్రములలో వివరించారు.
ఆ మార్గాల్లో ఎదో ఒక మార్గాన్ని అనుసరించి భగవంతుడిని ఆశ్రయించినప్పుడు వారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది అనే విషయంలో సందేహంలేదు.
దీనికే శంకరాచార్యులవారు భాష్యంలో "అగ్నివత్ అహం" అని అన్నారు. అహం అంటే భగవంతుడు.
భగవంతుని స్వభావం ఎలాంటిది అనే విషయంలో అగ్నిని భగవంతుడు అనే ఉదాహరణగా మనం తీసుకోవచ్చు.
ఈ ఉదాహరణకు అర్ధం ఏమనగా లోకంలో అగ్ని ఏమి చేస్తుంది అంటే చలిని పోగొడుతుంది. చలికాలంలో ఎవరైనా సరే నిప్పు ముందు కూర్చుంటే చలిని తగ్గించి మనకు హితాన్ని కలుగచేస్తుంది.
ఇక్కడ అగ్ని యొక్క స్వభావం ఏమిటి అంటే ఎవరైతే అగ్నికి దగ్గరగా వెళ్లి ఆశ్రయిస్తారో వారందరికీ చలిని తగ్గించి హితాన్ని కలుగచేస్తుంది.
అగ్నిని ఆశ్రయించాక వీడు మహారాజా, డబ్బున్న వాడా, లేని వాడా, పండితుడా, పామరుడా అనే బేధం ఆ అగ్నికి ఉండదు, ఎవరు ఆశ్రయించినా సరే ఆ అగ్ని అందరికీ సమానమైన ప్రయోజనాన్ని కలుగచేస్తుంది.. ఆదిత్యయోగీ..
కానీ మనకు అగ్ని యొక్క ఫలం లభించాలి అంటే మనం అగ్ని దగ్గరకు వెళ్ళాలి, దగ్గరకు వెళ్లకుండా ఉన్నచోటునే ఉంటాను నా చలిని అగ్ని పోగొట్టాలి అంటే అది ఎప్పటికీ జరిగేపని కాదు.
ఇక్కడ అగ్నికి దూరంగా ఉన్నవాడి మీద కోపం, దగ్గరగా ఉన్నవాడి మీద ప్రీతి అని చెప్పటానికి వీలులేదు, ఇద్దరూ అగ్నికి సమానమే కానీ దగ్గరకు వెళ్లి ఆశ్రయించాలి. అప్పుడు మాత్రమే మనల్ని హితముగా చేస్తుంది.
ఇక్కడ రాగద్వేషముల యందు ఎలాంటి స్థానము లేదు, ఇది అగ్ని యొక్క స్వభావం. అదేరకంగా భగవంతుడి స్వభావం ఏమిటంటే ఎవరైతే భగవంతుడిని భక్తితో ఆశ్రయిస్తారో వారి యొక్క దుఃఖాల్ని పోగొట్టి హితమును కలుగచేయటం, అనుగ్రహించటం భగవంతుని స్వభావం.
కాబట్టి ఆశ్రయించవాని మీద ద్వేషము లేదు, ఆశ్రయించినవాని మీద ప్రీతీ లేదు, కానీ ఎవరైతే తనను ఆశ్రయిస్తారో వారికి మాత్రం అనుగ్రహము చేయటం భగవంతుడి కర్తవ్యం, స్వభావం.
ఈ స్వభావాన్ని మనం తెలుసుకుని భగవంతుడిని ఆశ్రయించాలి.
భగవంతుడిని ఆశ్రయించటానికి ఎన్నో విధాలు చెప్పారు. ఉదాహరణకు భగవానుని మూర్తిని పూజ చేయటం, సంప్రదాయానుసారంగా ఉపదేశం పొంది మంత్రాన్ని జపించటం, స్తోత్ర పారాయణ, భగవత్చరిత్రను పఠించటం, నామ సంకీర్తన చేయటం, క్షేత్ర దర్శనాలు చేయటం, భగవంతుడి స్వరూపాన్ని ధ్యానం చేయటం మొదలైనవన్ని కూడా భగవదారాధనలో శాస్త్రంలో చెప్పినటువంటి మార్గాలు.
ఇన్ని మార్గాలు ఎందుకు చెప్పారు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుష్యుల అందరికీ ఓకేరకమైన యోగ్యత సామర్థ్యాలు ఉండవు కాబట్టి జనులందరినీ దృష్టిలో పెట్టుకుని, వారివారి యోగ్యత సామర్ద్యతను బట్టి ఇన్నిరకములైన మార్గాలను శాస్త్రంలో సూచించారు.
అందుకుగాను భగవదనుగ్రహముకు పాత్రులు కావటానికి యోగ్యత అధికారం ప్రతియొక్కరికీ ఉన్నది.
కాబట్టి శాస్త్రంలో సూచించిన మార్గాలలో ఏది మనకు యోగ్యమైనదో పెద్దల ద్వారా తెలుసుకుని భగవంతుడిని సేవించి కృతార్థులు కావాలి.
ఈవిధంగా కృతార్థులు కావాలనేటటువంటి విషయాన్ని ఈ అగ్ని ఉదాహరణ మూలకంగా శంకరాచార్యుల వారు తమ భగవద్గీత భాష్యంలో ఉపదేశం చేశారు.
ఈరకంగా తమయొక్క భాష్యా గ్రంధాలలో మనకు కావలసిన ఎన్నో విషయాలను జనులకు ఉపదేశించిన మహనీయులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు.
పరమోత్కృష్టము, అత్యంత గంభీరమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ఉపదేశం చేశారు, అదేరకంగా ఇలాంటి సామాన్య విషయాలను, సమాజంలో ఇతర వ్యక్తులతో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలాంటి గుణాలను అలవర్చుకోవాలి అనేటటువంటి విషయాలవరకు ఆచార్యుల వారు జనులను ఉద్ధరించుట కొరకు ఉపదేశం చేశారు.
భజగోవిందం, ప్రశ్నోత్తర రత్నమాలిక మొదలైన గ్రంధాలలో సామాన్యమైన నీతి నుండి మొదలుకుని సకలోపనిషత్తుల సారమైనటువంటి అద్వైత సిద్ధాంతం వరకు అనేక విషయాలను తమ గ్రంథాలతో ఉపదేశించిన ఏకైక వ్యక్తి జగద్గురు శ్రీ ఆదిశంకరులు. కాబట్టి వారు చూపించినటువంటి మార్గం వారియొక్క గ్రంథములలో పండితుల మొదలుకుని సామాన్యుల వరకు గ్రాహ్యమైన విషయాలు అనేకం ఉపదేశించారు.
కాబట్టి ఎవరికైనా లోకంలో నాకు మంచి జరగాలి, నేను లౌకికముగా ఆధ్యాత్మికంగా ప్రయోజనము పొందాలి అంటే ఏమి చెయ్యాలి అనే ప్రశ్న మన మనస్సులో ఉద్భవించినప్పుడు దానికి తగ్గ సమాధానం మనకు శంకరాచార్యుల వారి గ్రంథాలలో లభిస్తుంది.
కాబట్టి అందరి యొక్క శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని శ్రేయోమార్గమును ఉపదేశించినటువంటి శంకరాచార్యులవారిని మనం జగద్గురువుగా అన్వర్ధనామాముతో పిలుస్తున్నాం.. ఆదిత్యయోగీ..
కాబట్టి వారియొక్క గ్రంథాల ద్వారా జనులందరూ మార్గదర్శనం పొంది ప్రతియొక్కరూ కృతార్థులుకావాలి..
జ్ఞానానికి అర్హులు ఎవరు???
మానవుడు ఎన్ని మహాపాపములు చేసినప్పటికినీ జ్ఞానం సంపాదిస్తే ఆ పాపాలన్నీ హరించి పోతాయి...
అంటే ముందు పాపాలు చేసి తరువాత వాటిని పోగొట్టుకోమని కాదు...
ముందు జన్మలో కానీ, ఈ జన్మలో కానీ తెలిసీ తెలియకుండా, అజ్ఞానం చేత, ఏమైనా పాపాలు చేసి ఉంటే, గురువు ఉపదేశమువలన అజ్ఞానము నుండి జ్ఞానము లోకి అనగా చీకటిలో నుండి వెలుగులోకి ప్రవేశించి, ఆ జ్ఞానముతో గత జన్మలోవి కానీ ఈ జన్మలోని కానీ చేసిన పాపములను పోగొట్టుకొనే అవకాశము ఉంది.
జ్ఞానము అంతగొప్పది అని... కానీ పాపములు చేయడానికి లైసెన్సు ఇచ్చినట్టు కాదు...
సముద్రం ఎంత విశాలంగా ఉన్నా దానిని దాటడానికి చిన్న పడవ చాలు అంతే కానీ సముద్రం అంత పడవ అక్కరలేదు.
అలాగే మనం చేసిన పాపము ఎంత పెద్దదైనా దానిని ఇసుమంత జ్ఞానముతో ఆ పాపసముద్రాన్ని దాటవచ్చు...
అందుకనే కృష్ణుడు ఈ క్రింది శ్లోకంలో..
అపి చేదసి పాపేభ్య: సర్వేభ్యః పాపకృత్తమ: సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి (గీత - 4.36)
ఈ శ్లోకంలో పరమాత్మ ఒక ఊహాజనితమైన విశ్లేషణ చేస్తున్నాడు...
అర్జునా! ఒక వేళ (Assuming without considing లేక Assuming for a movement) నీవు యుద్ధము చేసి వీళ్లందరినీ చంపి, అంతులేని పాపము మూటగట్టుకొని, తద్వారా జరగబోయే వర్ణసంకరమునకు బాధ్యుడవయి, ఈ లోకంలో ఉన్న పాపాత్ములందరి కంటే ఎక్కువ పాపం చేస్తాను అని నీవు అనుకుంటే కూడా, నీవు పైన చెప్పబడిన జ్ఞానం సంపాదిస్తే, జ్ఞానము అనే తెప్పసాయంతో ఈ పాప సముద్రాన్ని దాటగలవు...
అలాగే నీ పాపము కూడా ఒక్క క్షణంలో పటాపంచలవుతుంది. అని అభయం ఇచ్చాడు.
పై శ్లోకంలో సంతరిష్యసి అనే మాట వాడారు. అంటే పాపము అనే సముద్రమును జ్ఞానము అనే తెప్పతో చక్కగా దాటగలవు అని అర్థం...
కొంతమంది ఒక దురభిప్రాయములో ఉంటారు పాపం చేసిన వాళ్లు వేదములు శాస్త్రములు చదువరాదు, అసలు తాకనేకూడదు.
ఓంకారము పలుకకూడదు, గీతను చదవకూడదు అనే ఆంక్షలు పెడుతుంటారు, అది తప్పు , ఈ శ్లోకం ప్రకారము ఎంత గొప్ప పాపి అయినా జ్ఞానము సంపాదించడానికి అర్హుడు అని ఉంది...
జ్ఞానము రావాలంటే పురాణములు శాస్త్రములు చదవాలి, కాబట్టి పాపులు కూడా అన్నీ చదవవచ్చు, ఏదోషము లేదు...
బాగా ఆరోగ్యంగా ఉన్న వాడికి మందు అక్కరలేదు, రోగికే మందు కావాలి.
అలాగే పాపము చేసిన వాడికే దానిని పోగొట్టుకోవడానికి జ్ఞానం కావాలి, వాడే వేదములు, శాస్త్రములు చదవాలి.
కాబట్టి పాపాత్ములు కానీ పుణ్యాత్ములు కానీ, ఎవరైనా కానీ ఆత్మజ్ఞానము పొందడానికి అర్హులు.....
No comments:
Post a Comment