శ్రీరామపట్టాభిషేకం మహావైభవంగా జరిగిన తరువాత, కొంతకాలానికి అష్టావక్రమహర్షి సీతారాములను చూసేందుకు అయోధ్యకు విచ్చేశాడు. సీతారాముల హార్దికమైన స్వాగతసత్కారాలను అందుకున్నాడు. తనకు నమస్కరించిన సీతమ్మను దీవించాడు.
"వీరప్రసవా భూయాః"
(వీరులను కనుదానివి కావలసినది)
ఆ దీవెన శ్రీరామునికి ఎంతగానో నచ్చింది.
భగవన్, అనుగృహీతాః స్మః।
{మహాత్మా, మేము (అంటే మా వంశస్థులము) అనుగ్రహింపబడ్డాము.}
లౌకికానాం హి సాధూనామ్
అర్థం వాగనువర్తతే।
ఋషీణాం పునరాద్యానాం
వాచమర్థోఽనుధావతి।।
(లౌకికులు కార్యశూరులైన సత్పురుషులు తాము ఒక ఘనకార్యాన్ని చేసిన తరువాతనే అలా చేశామని అంటారు. కాని, ఆద్యులైన ఋషులు ఒక మాటను పలికితే, ఆ మాట యథాతథంగా వెనువెంటనే జరిగిపోతుంది)
అంటూ శ్రీరాముడు ఎంతగానో సంబరపడిపోయాడు.
ఇది భవభూతిమహాకవి తన ఉత్తరరామచరితంలో దర్శించి చెప్పిన ముచ్చట.
అమోఘమైన ఆ ఋషివాక్కు కాలాంతరంలో ఫలించింది. ఒకరిని కాదు, ఇద్దరు మహావీరులను కని సీతమ్మవారు వీరమాతగా ప్రఖ్యాతిగాంచింది.
ఈ దీవెన నేడు ప్రతిభారతీయస్త్రీ పొందాలి.
దీర్ఘసుమంగళీ భవ,
సౌభాగ్యవతీ భవ
అనే దీవెనల తరువాత, అష్టావక్రమహర్షి సీతమ్మకు ఇచ్చిన ఈ దీవెనను ఈనాటి పెద్దలు కూడా తమ కుమార్తెలకు, తమ కోడండ్లకు, ఇంకా తమ ఆశీర్వాదం కోరే నవవధువులకు అవశ్యకర్తవ్యంగా ఇవ్వవలసిన తరుణం ఆసన్నమైంది. కారణాలు అందరికీ తెలిసినవే,
శ్రీరాముని పవిత్రపూజాక్షతలు నేడు భారతదేశమంతటా ఇంటింటికి చేరుతున్నట్లుగానే, సీతమ్మకు అందిన దీవెన మన ఇంట వెలసిన, మన ఇంటికి తరలి వచ్చిన లక్ష్మీస్వరూపిణులందరికీ తప్పక అందాలి.
No comments:
Post a Comment