మోక్షాన్నిచ్చే కార్తీక సోమవారం
కార్తీక మాసం అన్ని రోజులు ప్రత్యేకమైనవే. కార్తీక సోమవారం మరింత విశిష్టత కలిగివుంటుంది.
ఈ మాసంలో సోమవారం రోజున ఉపవాసం ఉండి శివుడిని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాలనుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ రోజున శివాలయాలను దర్శించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది.
ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివుడిని కొలిస్తే సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని శాస్త్ర వచనం.
సోమవారం బ్రహ్మీముహూర్తంలో స్నానమాచరించి పరిశుభ్రమైన బట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి. శివవ్రత నియమాలను పాటించాలి.
ఈ విధంగా చేయడం ద్వారా నిత్య సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం.
ఈ రోజున శివుణ్ణి స్తుతించడం వలన పాపాలనుంచి విముక్తి లభించడంతో పాటు అప్లైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతారు.
ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషమైనా తొలగిపోతుంది. సోమవారం ఉమామ హేశ్వరులను పూజిస్తే దారిద్య్రం, సమస్యలు తొలగిపోతాయి.
పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు సమర్పించుకోవాలి. తరువాత శివాష్టకం చదువుతూ విభూదిని సమర్పించాలి.
పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడంవల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి.
మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. అందువల్ల బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల శుభఫలితాలుకలుగుతాయి.
శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది.
శివపార్వతులను వేకువ జామున పూజించడం వలన ఎక్కువ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ప్రతి రోజు పూజలు ఆచరించని వారు కనీసం సోమవారం రోజు పూజలు చేస్తే పుణ్యం లభిస్తుంది.
ఈ రోజున శివాలయంలో ఉసిరికాయపై వత్తులు ఉంచి దీపం వెలిగించడం శ్రేష్టం.
కార్తిక సోమవారం నాడు పాటించే స్నానం, దానం, దీపారాధన, అర్చన, దైవ దర్శనం అనే పంచకృత్యాలను కార్తిక సోమవార వ్రతంగా ఆచరిస్తారు.
వశిష్ఠ మహర్షి ద్వారా జనక మహారాజు కార్తిక సోమవార వ్రత వైభవాన్ని తెలుసుకుని, ఆచరించి మహాదేవుడి కృపకు పాత్రుడయ్యాడని పురాణాలు వివరిస్తున్నాయి.
ఉపవాస దీక్షతో శుద్దోదకం, గోక్షీరం, పంచామృతాలతో రుద్రాభిషేకం, బిల్వదళాలతో రుద్రార్చన కార్తిక సోమవారంనాడు నిర్వహించాలని రుద్రాక్షోపనిషత్తు చెబుతోంది.
ఉపవాస దీక్షను పాటించలేనివారు సమంత్రక స్నాన జపాదులు చేసినా శివుని అనుగ్రహం పొందవచ్చు.
మనోవికారాలను రూపుమాపుకోవడానికి శివభక్తే అసలైన ఔషధమని శివానందలహరిలో జగద్గురువు ఆదిశంకరులు చెప్పారు.
No comments:
Post a Comment