‘అనుకోకుండా ఏదైనా పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపంతో దానిని మళ్ళీ చేయనని మనస్ఫూర్తిగా నిశ్చయించుకొంటే ఆ పాపం నుండి విముక్తి పొంది పవిత్రుడవుతాడు’.
మతిమరపువల్ల లేదా పరధ్యానంలో ఉండి చేసినా కూడా పాపం పాపమే. దానిని పోగొట్టుకోవడానికి రెండే మార్గాలు ఉన్నాయని మన సనాతన ధర్మం చెబుతున్నది. మిక్కిలి కోపిష్ఠుడైన కౌశికునికి ధర్మోపదేశం చేసిన ధర్మవ్యాధుడు కూడా అతనికి ఇదే మాటను నొక్కి చెప్పాడు.
”మది మఱపున బాపము దన కొదవుటయును బిదప వగచి యొక సగమును నేనిది సేయనింక ననియెడు మదిఁ బెఱ సగమును నరుఁడు మలుఁగు నఘంబున్”
-మహాభారతం.
తెలియకుండా చేసిన పొరపాటును తలచుకొని బాధ పడటం వల్ల ఆ పాపంలోని సగభాగం తొలగిపోతుంది. అలాంటి తప్పులను ఇక ముందెప్పుడూ చేయనని మనస్సాక్షిగా నిర్ణయించుకొని, ఆ కట్టుబాటును పాటిస్తే మిగతా సగ పాపం తొలగిపోతుంది.’
ఏదైనా పాపం గానీ, నేరం గానీ తెలియకుండానో, అనుకోకుండానో చేయడం మానవ సహజం. ‘తప్పిదం ఏదైనా జరిగినప్పుడు ఆ పొరపాటును తెలుసుకొని, ఇక ముందెప్పుడూ దానిని చేయకూడదని నిర్ణయించుకొని బాధ పడటమే’ పశ్చాత్తాపమని మన సనాతన ధర్మం చెపుతున్నది.
అనుకోకుండా చేసిన పాపానికి పరిహారంగా చేసే ప్రయత్నాన్నే ‘ప్రాయశ్చిత్తమని’ అంటారు.
ప్రతి మనిషీ ‘మనసా వాచా కర్మణా’ ఎప్పడూ ఏ తప్పులనూ చేయకుండా ఉండాలి. ఏ తప్పుకైనా ఆ పాపం ఊరికే పోదు. ఒకవేళ ఏవైనా పొరపాట్లు అనుకోకుండానో, పరధ్యానంలోనో చేసినా వాటికి పరిహారంగా ఆ పాప ప్రాయశ్చిత్తం చేస్తుండాలి. అప్పుడే, ఆ పాపం తొలగిపోతుంది.
‘కొన్ని సందర్భాల్లో అనుకోకుండా చేసిన పాపాన్ని మనసులో తలచుకొని సిగ్గుతో తలవంచుకొనికుంగిపోయినట్లయితే, ఆ పాపం పటాపంచలవుతుందని’ పురాణాలు చెపుతున్నాయి. దానినేమనఃప్రాయశ్చిత్త’మని అంటారు.
పిత్రోర్నిత్యం ప్రియం కుర్యాత్
ఆచార్యస్యచ సర్వదా
తేషుహి త్రిషు తృప్తేషు
తపస్సర్వం సమాప్యతే.```
‘తల్లి,తండ్రి మాటనుగానీ, గురువు మాటనుగానీ జవ దాటకుండా ఎప్పుడూ వారికి అనుకూలంగానడుచుకోవాలిఈ ముగ్గురూ తృప్తి పడినట్లయితే ఎన్నో తపస్సులు చేసిన ఫలితం సిధ్ధిస్తుంది.’
తల్లిదండ్రులను బాధ పెట్టడం వల్ల కలిగే పాపానికి మాత్రం నిష్కృతి లేదు. ఎప్పుడైనా గురువు మాటను ధిక్కరించి మాట్లాడితే, ఆ పాపం సదరు గురువును వినయ విధేయతలతో ఆహ్వానించి, ఉపాహారాన్ని సమర్పించుకొని సంతోష పెట్టడం ద్వారా తొలగింపజేసుకోవచ్చు. కొట్టివేయకూడని చెట్టును నరికి వేయడం, స్వేచ్ఛగా జీవించే పక్షులను స్వార్థబుద్ధితో వధించడం వంటివీ మహాపాప హేతువులే.
ఐతే, అనుకోకుండా చేసే పాపాలు ‘అన్నపానీయాలను వదిలిపెట్టి కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ నియమనిష్ఠలతో జీవితాన్ని గడపడం ద్వారా’ నశిస్తాయి.
దైవసన్నిధిలో ఇతరులు వెలిగించిన దీపాన్ని దొంగిలించిన పాపం వల్ల గుడ్డివాళ్లయి పోతారు.
గుడిపైనగానీ, రథంపైగానీ, పర్వతంపైగానీ మళ్ళీ దీపం వెలిగిస్తేనే దానికి పరిహారం లభిస్తుందని సనాతన ధర్మం ప్రబోధిస్తున్నది.
చేసిన పాపాలకు పరిహారంగా ఇలాంటి శిక్షలు ధర్మశాస్ర్తాలలో చెప్పడమనేది మనం అలాంటి పాపాలకు పాల్పడకూడదనే.
ఇతరులను బాధ పెట్టడమనేదే మహాపాపం. అలాంటి పాపాలకు ఏ మాత్రం తావివ్వకుండా ధర్మబద్ధంగా బతుక గలిగినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది.
🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
No comments:
Post a Comment