Friday, 22 December 2023

గీతా జయంతి శుభాకాంక్షలు

 


🌻. గీతామృత మహాత్మ్య  శ్లోకము 🌻

గీకారం త్యాగరూపం స్యాత్ తకారమ్ తత్వబోధకమ్

గీతా వాక్య మిదమ్ తత్వం జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:

సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|

పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం  - గీతామృతమ్మహత్||

🍀. గీతా మహాత్మ్యము 🍀

(వరాహ పురాణాంతర్గతం)

01. భూదేవి విష్ణుభగవానుని గూర్చి ఇట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధము అనుభవిం చే వానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు?

02. ఓ భూదేవీ! ప్రారబ్ధము అనుభవిస్తున్ననూ ఎవరు నిరంతరము గీతాభ్యాస మందు నిరతుడై ఉండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటబడక ఈ ప్రపంచము నందు సుఖముగా ఉండును.

03.  తామరాకును నీరంటనట్లు గీతాధ్యానము చేయు వానిని మహాపాపములు కూడా కొంచమైనను అంటవు.

04. ఎచ్చట గీతా గ్రంధము ఉండునో మరియు ఎచ్చట గీతా పారాయణము జరుగుచుండునో అచ్చట ప్రయాగ మొదలగు సమస్త తీర్ధములు ఉండును.

05. ఎచ్చట గీతాపారాయ ణము జరుగుచుండునో అచటికి దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపికలు, గోపాలురు భగవత్స్పర్శ్యా స్యాసక్తులగు నారద, ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగా సహాయమొనర్తురు.

06. ఓ భూదేవీ! ఎచట గీతను గూర్చి విచారణ, పఠనము, భోధన, శ్రవణము జరుగు చుండునో అచట నేను ఎల్లప్పుడు తప్పక నివసింతును.

07. నేను గీతనాశ్రయించి ఉన్నాను, గీతయే నాకు ఉత్తమగు నివాస మందిరము మరియు గీతాజ్ఞానమును ఆశ్రయించియే మూడు లోకాలను నేను పాలించుచున్నాను.

08. గీత నా యొక్క పరమ విద్య అది బ్రహ్మస్వరూపము దీనిలో సందేహము లేదు, మరియు అది ప్రణవములో నాలగవ పాదమగు అర్ధమాత్రా స్వరూపము, నిత్యమైనది, నాశరహితమైనది, అనిర్వచ నీయమైనది.

09. సచ్చిదానంద స్వరూపు డగు శ్రీ కృష్ణ పరమాత్మచే స్వయముగా అర్జుననుకు ఉపదేశింప బడినది. ఇది మూడు వేదముల సారము, పరమానందమయినది, తన్నాశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానాన్ని కలుగచేయును.

10. ఏ నరుడు నిత్యమూ గీతయందలి పద్దెనిమిది అధ్యాయములను పఠించునో అతడు జ్ఞానసిద్ధిని పొంది తద్వారా పరమ పదమును (మోక్షమును) పొందును.

11. గీతని మొత్తము పఠించలేని వారు అందులో సగమైనను పఠించవలెను దీనివలన అతడికి గోదాన ఫలము వలన కలుగు పుణ్యము లభించుననుటలో సందేహము లేదు.

12. గీతయొక్క మూడవ భాగము(ఆరుఅధ్యాయములు) పఠించినవానికి గంగా స్నాన ఫలము లభించును, ఆరవ భాగము (మూడు అధ్యాయములు)పఠించువారికి సోమయాగ ఫలము లభించును.

13. ఎవడు గీతయొక్క ఒక అధ్యాయము భక్తితో పఠించునో అతడు రుద్ర లోకమును పొంది రుద్ర గణములలో ఒకడుగా శాశ్వతముగా నివసించును.

14. ఓ భూదేవీ ఎవరు గీత నందలి ఒక అధ్యాయము నందలి నాల్గవ భాగమును నిత్యమూ పఠించునో అతడు ఉత్కృష్టమైన మానవ జన్మ ఒక మన్వంతర కాలము పొందును.

15. ఎవరు గీతనందలి పది శ్లోకములను కానీ, ఏడు శ్లోకములను కానీ, ఐదు శ్లోకములను కానీ, నాలుగు శ్లోకములను కానీ, మూడు శ్లోకములను కానీ, రెండు శ్లోకములను కానీ, ఒక శ్లోకమును కానీ, అర్ధ శ్లోకమును కానీ నిత్యము ఏవరు పటింతురో,

16. వారు చంద్రలోకములో పదివేల సంవత్సరములు సుఖముగా జీవించుననుటలో సందేహము లేదు మరియు గీతను పఠిస్తూ ఎవరు మరణిస్తారో అతడు ఉత్తమ మగు మానవ జన్మను పొందుట నిశ్చయము.

17. అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించి ఉత్తమమగు మోక్షమును పొందుననుటలో సంశయము లేదు. గీతా గీతా అనుచు ప్రాణమును వదలువాడు సత్గతిని పొందుననుటలో సందేహము లేదు.

18. మహా పాపాత్ముడైనను అతడు గీతార్ధమును తెలుసుకొనుటలో ఆసక్తుడై నచో అతడు విష్ణు లోకమును పొంది శ్రీమహా విష్ణు సన్నిధిలో ఆనందమును అనుభవించు చూ ఉండును.

19. ఎవడు గీతార్ధమును నిత్యము చింతన చేయుచుం డునో అతడు అనేక కర్మల నాచరించిననూ జీవన్ముక్తు డేనని చెప్పబడెను, మరియు దేహ పతనానంతరము పరమ పదమును (కైవల్యమును) పొందును.

20. ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాది రాజులు అనేకులు పాపరహితులై ముక్తిని పొందియున్నారు.

21. గీతని పఠించి పిదప మహత్యమును ఎవరు పఠించకుందురో అట్టి వారి గీతా పఠనము వ్యర్ధమే (నిష్ఫలమే). అట్టివారి గీతాపఠనము శ్రమ మాత్రమే నని చెప్ప బడినది.

22. గీతా మహత్యముతో గీతా పారాయణము చేయువారు పైన చెప్పబడిన ఫలములను పొంది, దుర్లభ మగు సద్గతిని పొందుతురు.

23. శౌనకాది ఋషులారా! ఈ ప్రకారముగా సనాతనమైన గీతా మహత్యమును మీకు తెలుపుచున్నాను. దీనిని గీతా పారాయణానంతరము ఎవరు పఠింతురో అతడు పైన చెప్పిన ఫలమును పొందును.

24. ఇట్లు వరాహ పురాణమునందలి గీతా మహత్యము సమాప్తము.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment