దత్తాత్రేయ శివం శాంత మింద్రనీల నిభం ప్రభుమ్ |
ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరమ్ ||
భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటం ధరం విభుమ్ |
చతుర్భాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్ ||
దత్తాత్రేయో హరిః కృష్ణ ఉన్న్మాదో నందదాయకః
ముని ర్దిగంబరో బాలః పిశాచో జ్ఞానసాగరః
ఏతాని దశనామాని సర్వకాలే సదా పఠేత్,
భూ తాపస్మారకోష్ఠార తాప జ్వర నివారణమ్
కదా యోగీ కదా భోగీ కదా నగ్న పిశాచవత్,
అనసూయా గర్భభూతో దత్తాత్రేయో మహామునిః||
శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ , విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు. దత్తా అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది , త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము దత్తం చేసుకున్నారు "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయింది.
ఒకసారి లోకకళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికిలోనైన లక్ష్మీ , సర్వస్వతి , పార్వతిమాతలు , మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుకున్నారు. నారద మహర్షి అనసూయ "పాతివ్రత్యాన్ని" (భర్త పట్ల భక్తిభావం) గురించి బ్రహ్మ - విష్ణు - శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు , ఈర్ష్య , అసూయ , ద్వేషమనే దుర్గుణలకు లోనయితే ! దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని స్వరులకు తెలియచెప్పడానికో , శ్రీదత్తుని అవతారానికి నాంది పలుకడానికో ! ఈ గుణాలూ వారి మనస్సునిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు భగ్గుమన్నాయి. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తూలు ఎంతవారించినా , పెడచెవిని పెట్టారు ససేమిరా ! అన్నారు. ఇక చేయునది లేక సన్యాస వేషములు ధరించి అత్రి అనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదంమోపారు.
వారి పాదస్పర్శకు భూదేవి పులకించింది , వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదలచెంత పుష్పాలు పండ్లు నేలకురాల్చాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది. లేడిపిల్లలు చెంగు చెంగున గంతులువేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. కుందేటి పిల్లలు వారి పాదాలు స్పృశించి పునీతమవ్వాలని అడుగడుగునా పాదాలకు అడ్డుపడుతున్నాయి. వన్యప్రాణుల కేరింతలతో అ ఆశ్రమ వాతవరణం అంతా ఆహ్లాదమవుతోంది. ఈ ఆకస్మిక పరిణామ మేమిటో ? అని వారిని చూచిన పక్షులు కిలకిలా రాగాలు చేయసాగాయి. ఇవికాక ఒక ప్రక్క పవిత్ర జలపాతాల సోయగాలు , మరోప్రక్క ఆశ్రమ బాలకుల వేదమంత్రోచ్చారణ కర్ణామృతంగా వినిపిస్తున్నాయి. ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఈ రమనీయ వాతావరణమందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో , మనం ముగ్గురం కూడ చిన్నారి బాలురవలె ఈ మునిబాలకులతో కలిసి ఆడుకుంటే ! ఎంతబాగుండునో ! అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు. అలా మైమరపిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మనం వచ్చిన మాటను మరచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాం , అని తలచి ఆశ్రమం ముంగిటవైపునకు పయనమయినారు.
మహా తపోబలసంపున్నుడైన కర్దమ మహర్షికి , దేవహూతికి జన్మించిన అనసూయాదేవిని , ముని శ్రేష్టుడైన అత్రిమహర్షికి ఇచ్చి వివాహంచేసారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రిమహర్షికి సేవలు చేస్తూ , అతిధి అభ్యాగతులను అదరిస్తూ తన "పతి సేవతత్ పరతచే" పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరస్తూ , పంచభూతాలు , అష్టదిక్పాలకులు సహితం అణకువుగా వుండేలా చేస్తున్న ఆ పతివ్రతా తల్లిని , దివ్యతపోతేజోమూర్తి అయిన అత్రిమహర్షిని చూసినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధుపుంగవుల ముగ్గురిని చూచిన ఆ పుణ్య దంపతులు , సాదరంగా ఆశ్రమంలోనికి అహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి , అనంతరం మీరు మువ్వురు బ్రహ్మ , విష్ణు , మహేస్వరులవలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు , భోజనాలు సిద్ధంచేశాను రండి అంటూ ! అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రిమహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్న అనసూయతో ఆమె దుస్తులు ధరించకుండా నగ్నరూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు. వారి పలుకులు అ పతివ్రతా తల్లికి శిరస్సున పిడుగు పడినట్లు అయింది.
ఒక్కసారి తన ప్రత్యక్షదైవమైన "భర్త" ను మనసారా నమస్కరించుకుంది. "పాతివ్రత్యజ్యోతి" వెలిగింది. ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంది. కపట సన్యాసరూపంలో ఉన్నత్రిమూర్తుల గుట్టు రట్టు అయింది. వారి అంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ! ఏమి నా భాగ్యము ! ముల్లోకాలను ఏలే సృష్టి , స్థితి , లయకారకులైన వీరు నాముంగిట ముందుకు యాచకులవలె వచ్చినారా ? వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింప చేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా , అని ఆలోచిస్తూ ! ఒక ప్రక్క పాతివ్రత్యం , మరోవైపు అతిథిసేవ. ఈ రెండు ధర్మాలను ఏకకాలంల్లో సాధించడమెలా ? అనుకుంటూ పతికి నమస్కరించి "ఓం శ్రీపతి దేవయనమః" అంటూ కమండలోదకమున ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే అ ముగ్గురు పసిబాలురయ్యారు ! వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది. కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషి కన్యలు , ౠషిబాలురు కలిసి మెత్తని పూల పానుపుతో ఊయలవేయగా ! వారిని జోలపాడుతూ నిదురపుచ్చింది.
"ఇంతటి మహద్భాగ్యం" సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి.... ! ఆ వింత దృశ్యాన్ని చూచిన అత్రి మహర్షి ఒకసారి త్రుళ్ళిపడి మరలా తేరుకుని , తన దివ్య దృష్టితో జరిగినది , జరగబోతున్నది గ్రహించుకున్నాడు. ఈ త్రిమూర్తులు ఈ ఆశ్రమ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికిన పలుకులే ! కార్యరూపం దాల్చడం బ్రహ్మవాక్కుగా తలచి ! ఆ చిన్నారులు బుడి బుడి నడకలతో , ఆడుతూ గెంతుతూ అ మునిబాలకులతో , కలిసి వారి కలలను పండించుకోసాగారు. మానవులకు బాల్య , కౌమార , యవ్వన , వార్ధక్యాలలో ఆనందముగా సాగేది ఈ బాల్యదశే కదా మధురాను భూతిని మిగిల్చిది అని మురిసిపోయారు. కనని తల్లి దండ్రులైన అత్రి అనసూయల పుత్ర వాత్సల్య బాంధవ్య అయౌనిజులైన వారికి చాలాకాలం కొనసాగుతుంది.
ఇలా ఉండగా ! లక్ష్మీ , సరస్వతి , పార్వతి మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. అంతలో దేవర్షి నారదునివల్ల అత్రిమహర్షి ఆశ్రమమందు జరిగిన వింత తెల్లుసుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన "ఈర్ష అసూయ - ద్వేషాలు" పటాపంచలు అయ్యాయి. వెంటనే వారి స్వస్వరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని ముని కన్యలు స్వాగతించారు. అ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చి , ఊయలలో పరుండబెట్టి జోలపాడుతూ ఉంది ! అంతలో ఆ ముగ్గురమ్మలను చూచి సాదరంగా ఆహ్వానించి , స్వాగత సత్కారములతో సుఖాసీనులను చేసింది.
పసిబాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూచుకొని పతిబిక్ష పెట్టమని కన్నీళ్ళతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే ! మీ మీ భర్తలను గుర్తించి ! తీసుకోని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతో , ఒకేరూపుతో , అమాయకంగా నోట్లో వేలువేసుకోని , నిద్రిస్తున్న అ జగన్నాటక సూత్రధారులను ఎవరు ? ఎవరో ? గుర్తించుకోలేక పోయారు. తల్లీ ! నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయ్యాలని "ఈర్ష్య , అసూయ , ద్వేషాలతో !" మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని ప్రాధేపడతారు. అంత ఆ అనసూయమాత తిరిగి పతిని తలచుకుని కమండలోదకము తీయు సమయాన !
త్రిమూర్తులు సాక్షాత్కరించి , ఈ ఆశ్రమవాస సమయమందు , మీరు కన్న తల్లి దండ్రులకంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏమి వరంకావాలో కోరుకోమన్నారు. నాయనలారా ! ఈ పుత్ర వాత్సల్యభాగ్యాన్ని మాకు ! మీరు మీరుగా ఇచ్చినారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ , విష్ణు , బ్రహ్మ అంశలతో దూర్వాసుడు , దత్తాత్రేయ మరియ వెన్నెల దేవుడు చంద్రుడుగా జన్మించవలసిందిగా వరమడిగింది. ఊయలలోని ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తరువాత ! బ్రహ్మ , శివుడు వారి వారి అంశలను "దత్తనారాయణు" నికి యిచ్చారు. అప్పటి నుండి ఆ స్వామివారు "శ్రీ దత్తాత్రేయ" స్వామిగా అవతార ఎత్తారు. ఆంద్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో కోరల పౌర్ణమి , కుక్కల పండగగా వ్యవహరిస్తారు . ఈ రోజు కుక్కలకు సజ్జ బూరెలు , తెప్పాల చెక్కలు ఆహారం పెట్టటం సాంప్రదాయం .
దత్త క్షేత్రములు..!!దత్తావతారాలు🥀
1. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి - పిఠాపురం
దత్తుని ప్రథమ దత్తావతారం శ్రీపాద శ్రీ వల్లభుడు జన్మించిన ప్రదేశం. ఆంద్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది..
2. కురువపురం
ప్రథమ దత్తావతారులైన శ్రీపాదవల్లభులు తపసు చేసిన స్థలం... ఇది హైదరాబాదు, కర్నూలు రూటులో దేవరకొండ స్టేషను నుండి బస్ లో వెళ్ళవచ్చు.
3. గోకర్ణము
ప్రథమ దత్తావతారులైన శ్రీపాదవల్లభులు తపసు చేసిన స్థలం ... ఇది కర్నాటక రాష్ట్రము హుబ్లి నుండి బస్ లో వెళ్ళవచ్చు.
దత్తావతారం..నృశింహ సరస్వతి.
4. కరంజా
రెండవ దత్త అవతారం, నృశింహ సరస్వతి (శ్రీ గురుడు) జన్మస్థలం...
ఇది మహరాష్ట్ర అమరావతి జిల్లాలో ఉన్నది
5. నర్సో బావాడిన
శ్రీ గురుడు 12 సం॥తపసుచేసిన స్థలం,... ఇది కొల్హా పూర్ మీరజ్ రూటులో ఉన్నది
6. గాణగా పూర్
శ్రీ గురుడు 23 సం నివసించినస్థలం, ఇది కర్నాటక గుల్బర్గ వద్ద కలదు. ఇచ్చట శ్రీగురుని నిజపాదుకలు కలవు,
చూడవలసి స్థలం, బీమా-అమరజా సంగమ స్నానం పరమ పవిత్రం
7. ఔదుంబర్
శ్రీ గురుడు చాతుర్మాసం చేసిన స్థలం. ఇది కూడ మహరాష్ట్రలో ఉన్నది.
8. మీరజ్.
ఇచట శ్రీ గురుడు తపసు చేసిన స్థలం. కొల్హాపూరు రూటులో జైసింగ్ పూరు వద్ద నుండి వెళ్ళవచ్చు.
9. శ్రీశైలం
శ్రీ గురుడు అంతర్దానమైన ప్రదేశం.
ఈ స్థల దర్శనం చాలా దుర్లభం అంటారు. దత్తాత్రేయ స్వామి అనుగ్రము ఉంటే చేరుకోగలరు
ఇది ఆంద్రప్రదేశ్ కర్నూలు జిల్లా లో ఉంది.
దత్తావతారం.. మాణిక్య ప్రభువులు.
మాణిక్య నగర్
మూడవ దత్తావతారం,
శ్రీమాణిక్య ప్రభువుల వారి సమాధి, ప్రభువుల వారి సంస్ధానం, కర్నాటక గుల్బర్గా - హైదరాబాదు రూటులో హుమ్నాబాదుకు దగ్గరలో ఉన్నది.
తప్పక చూడవలసిన క్షేత్రము.
దత్తావతారం - అక్కల కోటస్వామి.
10. అక్కల్ కోట
నాలుగవ దత్తావతారం,
స్వామిసమర్థ (అక్కల్ కోటస్వామి ) సమాదధి మందిరం ఇది చెన్నై - ముంబాయి రూటులో అక్కల్ కోట స్టేషనులో దిగి బస్ లేదా ఆటో పై వెళ్ళవచ్చు.
తప్పక చూడవలసిన దత్త క్షేత్రము.
11 సాకోరి
ఏక ముఖ దత్తుని ఆలయం కలదు. ఇక్కడ సాయి సేవ చేసుకున్న ఉపాసిని బాబావారి సమాది మందిరం దర్శించవచ్చు.
ఇది షిరిడికి దగ్గరలో ఉన్నది ఆటోలో వెళ్ళి రావచ్చు
12. నాశిక్..
ఇచట ఏకముఖ దత్త విగ్రహం ఉంది. ఇది కూడా షిరిడి నుండి వెళ్ళవచ్చు.
ప్రముఖ దత్త క్షేత్రములు.
13గిరి నార్
ఇచ్చట దత్తపాదుకలు కలవు.
ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది.
ఇది చాలా మహిమగల 10,000 మెట్లు కలిగిన కొండపై ఉన్నది,
ఈ కొండపై దత్తపాదుకలు దర్శిస్తే దత్త అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల నమ్మకం
14 షేగాం
ఇచ్చట మరో దత్త రూపుడు గజానన మహరాజ్ సమాధి మందిరం కలదు
ఇది నాగపూర్ పట్టణంనకు దగ్గరలో కలదు
ఇది కూడ చూడదగ్గ క్షేత్రం.
15ఖేడ్గావ్
సమర్దనారాయణమహరాజ్ వారి సమాధి కలదు.
ఇది పూనా వద్ద కలదు.
16 ఖాoడ్వా.
శ్రీ దున వాలా దాదా వారి సమాధిమందిరం ఉంది.
ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కలదు.
17మాణ్ గావ్.
శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి జన్మస్థలం, గురు చరిత్రను అందించిన మహనీయుడు. మహారాష్ట్రలో ఉంది
ఇది చూడదగ్గ క్షేత్రం.
18 గరుడేశ్వర్.
శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి సమాధి మందిరం కలదు
గుజరాత్ రాష్ట్రంలో బరోడా జిల్లాలో ఉంది.
ఇది తప్పక చూడవలసిన క్షేత్రం
19. మౌంటు అబూ
ఇచట దత్త శిఖరము కలదు.
రాజస్తాన్ రాష్ట్రములో కలదు...
🙏దిగంబరా దిగంబరా సద్గురు దత్తా దిగంబరా🙏
శ్రీ పాద శ్రీ వల్లభ సిద్ధ మంగళ స్తోత్రం
శ్రీ మదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహ రాజా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ || ౧ 1||
శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ || ౨ 2||
మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ || ౩ 3||
సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్య నుత శ్రీ చరణా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ || ౪ 4||
సవితృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ || ౫ 5 ||
దోచౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ || ౬ 6||
పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాతా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ || ౭ 7||
సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ || ౮ 8||
పీఠికాపుర నిత్యవిహారా మధుమతి దత్తా మంగళ రూపా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ || ౯ 9||
ఈ స్తోత్రంను ప్రతి రోజూ ఉదయం , సాయంత్రం ప్రదోష వేళలో
11 సార్లు పారాయణ చేస్తే మన గురించి అన్నీ ఆయనే స్వయంగా చూసుకుంటారు అని నమ్మిక.
శ్రీ దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు
No comments:
Post a Comment