ఒకనాడు ఒక రైతు భక్తుడు మహాస్వామిని, "నేను గాయత్రీ మంత్రం జపించవచ్చా?" అని అడిగాడు.
ఈ ప్రశ్న ఎంతటివారినైనా ధర్మసంకటంలో పడేస్తుంది. జపించవచ్చు అన్నా జపించకూడదు అన్నా చర్చనీయాంశం అవుతుంది. శ్రీమఠం యొక్క ప్రధాన కార్తవ్యం సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ, ఆచరింపచేస్తూ దాన్ని కాపాడటం. ఈ భరత భూమి వేల సంవత్సరములుగా ఎన్నిటినో చూసింది. ఈ దేశ ప్రజలు తమ సనాతన ధర్మం యొక్క ఉనికిని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూనే, దురాక్రమణలను అణచివేతలను ఎదుర్కొన్నారు.
ఈదురుగాలులకి వొంగిన పైరు గాలి ఉధృతి ఆగిపోగానే లేచి నిలబడినట్టు, మాహావృక్షం వంటి ఈ వేదభూమి కూడా ఎన్నో దాడులను తట్టుకుని అలాగే నిలబడింది.
కాని శ్రీమఠం ఎన్ని మార్పులకు సమన్వయం చూపగలదు? అందులో శ్రీమఠం యొక్క వాటా ఎంత? ఇవాల్టి ఆలోచన రేపటికి పాతది అయిపోతుంది. ఆ మరుసటి రోజుకి ఉనికినే కోల్పోతుంది. ఒక డ్యాం కూలిపొయినప్పుడు వచ్చే వరదని ఎవరూ నివారించలేకపొయినా, ఏదో ఒక రోజున వరద తగ్గిన తరువాత, ఆ ప్రవాహాన్ని ఒక నదిగా మార్చాలి కదా.
పరమాచార్య స్వామివారు ఏమి చెప్తారో ఎవరికి తెలియలేదు. కాని స్వామివారు ఏ క్లిష్ట సమస్యకైనా వారిదైన విశిష్ట శైలిలో పరిష్కారం చూపించగలరు.
ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా భక్తునితో, "నీకెంత మంది పిల్లలు?" అని అడిగారు.
అతను "మీ ఆశీర్వాదం వల్ల ముగ్గురు ఆడపిల్లల్లు పుట్టారు. మొదటి అమ్మయికి 5 యేళ్ళు. రెండో అమ్మాయికి 3 యేళ్ళు. అఖరి దానికి 6 నెలలు" అని చెప్పాడు.
స్వామి ఇలా చెప్పారు, "ఒకర్ని గాయత్రి అని, రెండో అమ్మాయిని సంధ్య అని, మూడో అమ్మాయికి సావిత్రి అని పేర్లు పెట్టి పిలువు. బేబి, లిల్లీ, బిల్లీ ఇలాంటి పేర్లతో పిలవద్దు. ఇలా నువ్వు రోజూ గాయత్రి, సంధ్య, సావిత్రి అని పిలుస్తూ ఉంటే నీకు గాయత్రి మంత్ర జప పుణ్య ఫలం దక్కుతుంది".
ఆ భక్తుని మొహం ఆనందంతో వెల్లివిరిసింది. సాంప్రదాయానికి వ్యతిరేకమైన పనిని చేబూనిన సమయంలో పరమాచార్య స్వామివారు అతనికి విషయ అవగాహన కలిగించి ఒక స్పష్టమైన సమాధానాన్ని అందించారు. మహాస్వామి వారి నుంచి ప్రసాదం తీసుకుని నిండైన ఆశీస్సులతో సంతోషంగా తన స్వస్థానానికి వెళ్ళాడు ఆ భక్తుడు.
[వర్ణ వ్యవస్థలో ఆరుగాలం శ్రమించే శూద్రులు గాయత్రి జపం చెయ్యవలసిన అవసరం లేదు. ఉదాయాన్నే తూర్పువైపుకు తిరిగి సూర్యునికి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేస్తే చాలు సహస్ర గాయత్రి చేసిన ఫలితం వారి ఖాతాలో వేస్తారు. అనుకూలం ఉన్నవారు భవిష్యోత్తర పురాణంలోని బ్రహ్మప్రోక్త సూర్య స్తుతిని చదువుకోవాలి]
🌹🌹🌹🌹🌹
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం .
No comments:
Post a Comment