బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!!
ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది.
గర్భగుడి, విమానం, విగ్రహం (మూలమూర్తి), బలిపీఠం ఇవి నాలుగూ ఉంటేనే దాన్ని దేవాలయం అంటారు.
కనుక ఆలయంలో బలిపీఠం ప్రముఖమైనది. ఆలయంలోని మూలమూర్తికి, ఇతర పరివార దేవతలకు నైవేద్యం సమర్పించాక చివరగా అష్టదిక్పాలకులకు బలిపీఠంపై బలి సమర్పిస్తారు.
గర్భగుడిలో ఆంతరంగికంగా శాంతి మంత్రాలతో జరిగేది నైవేద్యం. ఆరుబయట బహిరంగంగా ఆవరణ దేవతలకు సమర్పించేది బలి.
బలిప్రదానం వలన దేవతలకు పుష్టి కలుగుతుంది. ప్రాచీన దేవాలయాలలోని బలిపీఠాలు ఇంత కళాత్మకంగా ఉండవు. మొరటు రాతిస్తంభం వలె ఉండేవి.
శిల్పరత్నం మట్టితో, కొయ్యతో కూడా బలిపీఠాలు నిర్మించవచ్చని చెప్పింది.
విష్ణుతిలక సంహిత, మానసార శిల్పశాస్త్రం గ్రంథాలు గోపురం బయట, లేక మొదటి ప్రాకారానికి బయట బలిపీఠాన్ని నిర్మించాలని చెప్పాయి.
తిరుమల, దారాసురం వంటి ఆలయాలలో బలిపీఠం ప్రాకారానికి బయటే ఉంటుంది.గర్భగుడిపై ఉన్న విమానం, గుడికి ముందు ఉన్న బలిపీఠం రెండూ ఒకటే అని నారాయణ సంహిత చెప్పింది.
విమానం ముకుళితపద్మం (ముడుచుకుని ఉన్న తామర) వలె ఉంటే బలిపీఠం వికసితపద్మం (విరిసిన కమలం) వలె ఉంటుంది.
దేవాలయంలో కేంద్రీకృతమైన శక్తి చైతన్యం విమానం ద్వారా పైకి ప్రవహిస్తే, బలిపీఠం ద్వారా అడ్డంగా ప్రవహిస్తుంది.
ఆలయపురుషుని నాభి ప్రదేశంలో బలిపీఠం ఉంటుంది. కనుక ఆలయానికి ఇది కేంద్రస్థానం అని భావించాలి.
ఆలయానికి ముందు తూర్పున పెద్దగా ఉండే బలిపీఠాన్ని ప్రధాన బలిపీఠం అంటారు.
ఇవి కాక ఆలయం చుట్టూ ఎనిమిది దిక్కులలోనూ చిన్న చిన్న బలిపీఠాలను ఏర్పరచి ఇంద్రాది దేవతలకు బలివేస్తారు.
తిరుమల ఆలయం చుట్టూ వీటిని మనం చూడవచ్చు. శివాలయంలో బలిపీఠాన్ని భద్రలింగంగా పిలుస్తారు.
ఇందులో శివుడు సదా ఉంటాడని, బలిపీఠాన్ని దర్శించినా శివదర్శనం అయినట్లే అని శైవాగమాలు చెబుతున్నాయి.
ముఖమండపం చేరే ముందు భక్తులు బలిపీఠానికి ప్రదక్షిణ చేసుకుని సాష్టాంగ నమస్కారం చేసి తనలోని అహంకారాన్ని బలిగా అక్కడ విడిచి బలిపీఠం నుండి వచ్చే దైవీకశక్తిని తనలో నింపుకుని దైవదర్శనానికి వెళ్లాలి.
బలిపీఠానికి ప్రదక్షిణ చేసే వీలు లేకపోయినా తాకి నమస్కరించవచ్చు. బలి వేసిన అన్నం ఆయా దేవతలకు మాత్రమే.
మానవులు దాన్ని భుజించకూడదు.బలిపీఠ దర్శనంతో మానవులలోని సమస్త దుర్గుణాలు తొలగిపోతాయి.
No comments:
Post a Comment