ఆ విధంగా పరంలో ముక్తిని సాధించటం కోసం మాత్రమే మనిషి బ్రతకాలి. అలాంటి అరుదైన మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి, జీవితంలో ఏది సాధించాలన్నా కూడా ఉత్తమ మార్గం ధర్మాచరణ ఒక్కటే. అట్టి ధర్మాన్ని ఆచరించ టానికి ఒక సాధనం కావాలి ఆ ప్రధాన సాధనమే ఈ మానవ శరీరము. అందుకే "శరీర మాద్యం ఖలు ధర్మసాధనం " అని ఋషులు మనకు తెలియజేశారు. కానీ అత్యుత్తమ మైన మానవ జన్మను అజ్ణానంతో నిరర్థకం చేసుకుంటూ, మనిషిగా పుట్టినందుకు సుఖాలను, భోగాలను అనుభవించాలి అనే భ్రమలో జీవిస్తూ, మానవుడు సఖ భోగాలకు 'ఇంధనమైన ధనాన్ని' సంపాదించుటకు అనేక రకాల తప్పుడు మార్గాలలో పయనిస్తూ, తప్పుడు పనులు చేస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతూ, మానవత్వాన్ని కూడా మంట గలిపి నికృష్ట మైన పనులను చేస్తూ, జీవితాన్ని నరకప్రాయం చేసుకొని, చివరకు అవమానాల పాలౌతూ, చివరికి పాపాలను మూటగట్టుకొని నరక లోకానికి చేరుకొంటున్నారు. మనిషి జీవితంలో ఏది సాధించాలన్నా అందుకు తగినట్లుగా సహకరించే ఒక శరీరం కావాలి. కాబట్టి ధర్మ కార్యాలను ఆచరించాలి అనుకొనే ధార్మికుని ప్రథమ కర్తవ్యం అటువంటి ధర్మ కార్యాలకు సాధనమైన మన శరీరాన్ని రక్షించుకొనడమే మానవుని ప్రధమ కర్తవ్యం.. అందుకే అన్నారు "జంతూనాం నరజన్మ దుర్లభం" అని. ఏదైనా సాధించాలంటే సాధనం మంచిదై ఉండి, బాగా పని చేయగలగాలి. యుద్ధంలో విజయం సాధించాలంటే తుప్పు పట్టిన కత్తితో యుద్ధం చేయలేడు. కాబట్టి యుద్ధానికి వెళ్ళేవాడు యుద్ధం చేయడానికి అనువైన విధంగా కత్తికి పదును పెట్టుకోవాలి. ఒక ప్రయాణానికి సాధనం వాహనం. ప్రయాణం చేయదల్చుకొన్నవాడు తాను ప్రయాణించ బోయే వాహనాన్ని అన్ని విధాలుగా బావుందా లేదా అని సరిచూసుకోవాలి.
ఒకవేళ బాగా లేకపోతే అందుకు సంబంధించిన నిపుణులైన వారి చేత బాగుచేయించు కోవాలి. లేదంటే నీవు చేసే ఆ ప్రయాణంలో నీ గమ్యాన్ని చేరుకోలేవు. అలాగే ధర్మకార్యాలు చేయాలన్నా, ముక్తిని మోక్షాన్ని పొందాలన్నా ప్రధానమైన సాధనం మన శరీరం. అందుకు అనుగుణంగానే మనం మన శరీరాన్ని అనుకూలంగా సిద్ధం చేసుకోవాలి. ఆ లక్ష్యంతో మనకు మహర్షులు అందించిన మార్గమే యోగ సాధన, సదాచారం. యోగ సాధన వల్ల ఆరోగ్యకరమైన శరీరాన్ని, సదాచారం వలన మంచి మనసును పొంద గలుగుతాము. మంచి మనసుతో మంచి బుద్ధిని పొందుతాము, ఆ మంచి బుద్ధిని అనుసరించి నడువ గలిగే విధంగా యోగ సాధన ద్వారా మన శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి.
అందుకే ప్రతిరోజూ యోగ శిక్షణ ద్వారా మన శరీరాన్ని తీర్చి దిద్ధుకోవాలి. అలాగే మంచి మనసు, మంచి బుద్ధి కోసం ఒక గురువును ఆశ్రయించి, గురు బోధనల ద్వారా సాధన చేసి మనసును మన ఆధీనంలో ఉంచుకోవాలి. ప్రపంచ విఖ్యాతి గాంచిన గొప్ప పండితుడైన 'మాక్సుముల్లర్ ' గారు తన అంతిమ దశలో భగవంతుని ప్రార్థిస్తూ తాను మరలా మనిషిగా పుట్టగలిగితే అది భారతదేశంలోనే పుట్టించమని ఆ భగవంతుడిని కోరుకున్నాడట. కానీ ఇక్కడ పుట్టిన వారికి మాత్రం మన భారతీయ పుణ్యభూమి యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు తెలియక అజ్ణానంతో ఈ పుణ్యభూమినే నిందిస్తున్నారు. ఆ పండితుడు అలా అనుకోవడానికి ప్రధాన కారణం ఇక్కడి మన సంస్కృతి సాంప్రదాయాలతో, క్రమశిక్షణతో కూడుకున్న ఉత్తమ మైన సదాచార పూర్వకమైన జీవన విధానమే.
మన భారతీయుల జీవితంలోని ప్రధాన జీవం సదాచారమే అనే సత్యాన్ని గ్రహించిన నాడు ఆ వ్యక్తులకు గాని, ఈ సమాజానికి గాని ధన్యత చేకూరి తీరుతుంది. కాబట్టి మిత్రులారా ! ఇంతకు ముందు మీరు ఎలా జీవించారో నాకు తెలియదు, ఇంతా తెలుసుకొన్న తర్వాత నైనా గురువును ఆశ్రయించి సాధన చేసి సదాచారాలుగా జీవించి ఉత్తమ కర్మలను ఆచరించి, సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలను నిర్మూలించుకొని కర్మరాహిత్యాన్ని పొంది ఈ జన్మలోనే మరొక జన్మలేని జన్మరాహిత్యాన్ని పొంది ఆ భగవంతుడిలో ఐక్యమై ముక్తిని, మోక్షాన్ని పొందుతారని, ఆ భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
No comments:
Post a Comment