Wednesday 25 November 2020

క్షీరాబ్ధి ద్వాదశి

 


క్షీరసాగరమథనంలోని
ఆంతర్యం!
కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన
పర్వదినాలలో క్షీరాబ్ది ద్వాదశి ఒకటి.
దేవదానవులు ఈ రోజునే సాగరాన్ని
మథించడం మొదలుపెట్టారు కాబట్టి ఈ
రోజుని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు.
ఇంతే కాకుండా యోగీశ్వర ద్వాదశి అనీ,
మథన ద్వాదశి అని వివిధ పేర్లు కూడా
ఉన్నాయి.
కార్తీక శుద్ధ ఏకాదశినాడు,
క్షీరసముద్రం మీద శయనించిన
విష్ణుమూర్తి నిదురలేచి, బ్రహ్మాదిదేవతల సమేతంగా బృందావనం (తులసివనం)లోకి ప్రవేశిస్తారట.
అందుకని ఈ రోజున ఎవరైతే తులసి మొక్కను
పూజిస్తారో వారికి సకల శుభాలూ
కలుగుతాయంటారు. ఇక కార్తీక మాసంలో ఉసిరి
చెట్టుకి ఉన్న ప్రాధాన్యత కూడా సామాన్యం కాదు.
ఉసిరి చెట్టు నీడ పడిన నీటిలో స్నానం చేసినా, సాయంవేళ ఉసిరి చెట్టు కింద దీపాన్ని ఉంచినా విశేషఫలితం దక్కుతుందని పెద్దల మాట.
క్షీరాబ్ది ద్వాదశినాడు తులసికోటలో
విష్ణుమూర్తి రూపాన్నీ, ఉసిరికాయతో
కూడిన ఉసిరి కొమ్మనీ ఉంచి ` ఓం శ్రీం తులసీ ధాత్రి సహిత లక్ష్మీనారాయణస్వామినే నమః` అన్న
మంత్రాన్ని జోడిస్తూ దీపారాధన, సంకల్పం,
కలశపూజ, షోడశోపచార పూజ వంటి
పూజావిధినంతటినీ చేసి ధూపదీపనైవేద్యాలను సమర్పించి విష్ణుమూర్తిని కొలుచుకుంటారు భక్తులు.
ఈ రోజున దీపాన్ని వెలిగించినవారికి ఏడాదిపొడవునా దీపాన్ని వెలిగించిన ఫలితం
దక్కుతుందని చెబతారు.
ఇక ఈ రోజు దీపదానం
చేసిన వారికి జన్మజన్మాల పాపాలన్నీ
దహించుకుపోతాయని కార్తీక పురాణం
చెబుతోంది.
హైందవులు తులసికీ, ఉసిరికీ
ఎందుకంత ప్రాముఖ్యతని ఇచ్చారో చెప్పేందుకు ఆధ్మాత్మికమైన, ఆరోగ్యపరమైన కారణాలు అనేకం
కనిపిస్తాయి.
ఇక క్షీరసాగరమథనాన్ని పరిశీలిస్తే ఆధ్మాత్మిక రహస్యాలు అనేకం గోచరిస్తాయి. అమృతం కోసం దేవదానవులిద్దరూ క్షీరసాగరాన్ని మథించిన ఘట్టం
రామాయణ,భారతాల్లోనే కాకుండా పురాణాల్లో
కూడా ప్రస్తావనకు వస్తుంది.
అలా
సాగరమథనం ద్వారా వచ్చిన అమృతాన్ని
పంచుకోవలన్నది దేవదానవుల నియమం.
అందుకోసం నాగరాజైన వాసుకిని తాడుగానూ,
మందర పర్వతాన్ని కవ్వంగానూ
ఉపయోగించాలనుకున్నారు దేవదానవులు.
ఈనాటి బిహార్లోని భగల్పూర్ హైవేకి
దగ్గరలో ఉన్న ఎత్తైన గ్రానైటు కొండే
పురాణాల్లో పేర్కొన్న మందర పర్వతమని
కొందరి నమ్మకం. దానికి తగినట్లుగానే ఆ
కొండ శిఖరం కవ్వం ఆకారంలో ఉంటుంది.
ఇక
సాగరమథనం కోసం మందర పర్వతానికి
దన్నుగా కూర్మావతారం(తాబేలు) వెలసింది.
తాబేలుది ఒక చిత్రమైన ప్రవృత్తి.
తనకి ఏదైనా హాని జరుగుతుందని
తెలిసినప్పుడు, లోపలికి ముడుచుకుపోతుంది.
బాహ్య ప్రవృత్తిగా ఉన్న ఇంద్రియాలన్నింటినీ విరమించుకోగలగడం
ధ్యానికి ఉండే ఉన్నతమైన లక్షణం అని
యోగం చెబుతోంది.
సర్పమేమో (వాసుకి)
కుండలినిని సూచిస్తుంది. మనిషిలో ఉండే
మంచి చెడులే దేవదానవులు! మనిషి
అంతర్మఖుడై, తనలో నిద్రాణంగా ఉన్న
ఆధ్మాత్మిక శక్తులను మేల్కొల్పడానికి
నిత్యం చేసే ప్రయత్నమే సాగరమథనం.
మనిషి తన అంతర్మథనాన్ని మొదలుపెట్టగానే లభించేది సత్యమనే.గరళమే! దాన్ని అంగీకరించిన తరువాత అధికారం (ఐరావతం), సంపద (లక్ష్మీదేవి), ఆరోగ్యం (ధన్వంతరి), కీర్తి (చంద్రుడు)… అన్నీ లభిస్తాయి..వాటితో ఆగిపోకుండా, అన్నింటినీ దాటుకునిలవెళ్లిననాడు అమృతం దక్కుతుంది. ఇంత చేసినా చివరికి ప్రబలమైన బలహీనతలకు లొంగిపోతే… మోహినిని చూసి అమృతాన్ని జారవిడుచుకున్న దానవులలాగానే మనిషి కూడా దిగజారిపోతాడు. లేకపోతే మోక్షమనే అమృతాన్ని సాధిస్తాడు.
'క్షీరాబ్ది ద్వాదశి'
కార్తీక శుద్ధ ద్వాదశిని 'క్షీరాబ్ది ద్వాదశి' అని అంటారు. పూర్వం దేవతలు - దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించడం ఈ రోజునే ఆరంభించారు. ఈ కారణంగానే దీనికి క్షీరాబ్ధి ద్వాదశి అనే పేరు వచ్చింది. ఇక ఈ రోజున క్షీరసాగరం చిలకబడింది కనుక దీనిని 'చిలుకు ద్వాదశి'గా .. 'మథన ద్వాదశి'గా పిలుస్తుంటారు. ఇంతటి విశేషాన్ని సంతరించుకున్న ఈ రోజున తులసి పూజ చేసే ఆచారం వుంది కనుక ఈ రోజుని 'తులసి ద్వాదశి' అని కూడా అంటూ వుంటారు.
శ్రీ మహావిష్ణువు .. లక్ష్మీదేవితో కలిసి ఈ రోజున తులసి కోటలోకి ప్రవేశిస్తాడు. అందువల్లనే ఈ రోజున తులసిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని చెప్పబడింది. ఇక ఈ రోజు తెల్లవారు జామునే పుణ్యస్త్రీలు తలంటు స్నానం చేయాలి. తులసికోట దగ్గర దీపం పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత పూజా మందిరం చెంత యధావిధిగా నిత్య పూజను జరపాలి. మరలా సాయంత్రం తులసి పూజ అయ్యేంత వరకూ ఉపవాసం వుండాలి.
తులసి కోట లక్ష్మీ నారాయణుల నివాసంగా వుంటుంది కనుక, దానిని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించాలి. తులసికోట చుట్టూ దీపాలను వెలిగించాలి. తులసిని లక్ష్మీనారాయణుల స్వరూపంగా భావించి పూజించాలి. భక్తి శ్రద్ధలతో తులసిని పూజించి, దీపదానాలు చేయడం వలన సమస్త దోషాలు నశిస్తాయనీ, అపమృత్యు భయాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది.
క్షీరాబ్ది ద్వాదశి మహాత్మ్యం
బ్రహ్మదేవుడు చెప్పుచున్నాడు. ఎల్లప్పుడు క్షీర సముద్రంలో శయనించి యుండు విష్ణువు ద్వాదశి రోజు లక్ష్మీ బ్రహ్మ మొదలగు వారితో గూడి బృందావనమునకు వచ్చుచున్నాడు. కావున బృందావనము నందు ఎవరు శ్రద్ధా భక్తులతో విష్ణుపూజ చేయునో, వారికి దీర్ఘమైన ఆయువు, ఆరోగ్యమును, ఐశ్వర్యము మొదలగునవి కలుగుననుటకు సంశయము లేదు.
సాధకులు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడస్తమించిన తర్వాత స్నానముగానీ, దానముగానీ, పూజగానీ చేసినట్లయిన అధిక ఫలము జెందును.
క్షీర సముద్రము నుండి లక్ష్మీదేవితో గూడి, సమస్తమైన మునుల చేతను నమస్కృతుండై, పరమేశ్వరుడయిన నారాయణుడెచట వాసముచేయునో యిట్టి బృందావన క్షేత్రమందు పూజనీయుడైనట్టియు శ్రీ మన్నారాయణమూర్తిని బ్ర్హహ్మాది సమస్త దేవతలను శ్రద్ధాభక్తియుక్తులయి పూజచేయవలెను.
శ్రీ మహావిష్ణువు వశిష్ఠాది మహామునులచేత నానావిధస్తోత్రపూర్వకముగా తులసీవనమందు పూజింపబడినవాడై, ఈ కాలమునందు యీ కార్తీక శుద్ధ ద్వాదశినాడు తులసీవనము నందు నన్ను ఎవరు పూజచేయుదురో వారు సమస్త పాపములచేతను విడువబడి నా సాన్నిధ్యమును పొందురని ప్రతిజ్ఞ చేసెనట.
దేవతలేమి, యక్షులేమి, నారదుడు మొదలగు మునీశ్వరులేమి, వీరందరునూ, బృందావనములో సన్నిహితుడై యున్న శ్రీమహా విష్ణువును సమస్త పాపములు నశించుటకు గాను పూజ చేయుచున్నారు. పతితుడును గాని, శూద్రుడు గాని, మహాపాతకములు చేసిన వాడుగాని, ద్వాదశి రోజున విష్ణువును పూజించినట్లయిన వాని పాపములు అగ్నిహోత్రములో పడిన ప్రత్తిపోగువలె నశించిపోవును. తులసీ సహితుడయిన శ్రీ మహావిష్ణువు ఏ పురుషుడు పూజ చేయక వుండునో, అట్టి పురుషుండు పూర్వ పుణ్యంబుల నుండి విడువబడినటువంటివాడై రౌరంబును బొందను.
బృందావనము చాలా మహత్యము గలిగినది. అచ్చోట పూజించినట్లయితే విష్ణువు కత్యంత సంతోషకరమని, పూర్వము దేవతలు, గంధర్వులు, ఋషులు మొదలగు వారందరూ బృందావనమందు సన్నిహితుడైన నారాయణమూర్తిని పూజించిరి. కార్తీక శుద్ధ ద్వాదశిరోజున తులసీ సహితుడై నారాయణమూర్తిని పూజించని మనుజుడు కోటి జన్మములు పాపిగా చండాలునిగా పుట్టును. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావనమందు శ్రీమాహావిష్ణువును అనన్య శరణ్యుడై శ్రద్ధాభక్తులతో పూజ చేసినటులయితే బ్రహ్మ హత్య సురాపానము, సువర్ణస్తేయము మొదలగు మహా పాతకములుగాని, గురుతల్పము మొదలగు అతి పాతకములు గాని, ఉప పాతక కోటులయిననూ గాని యవన్నియూ తక్షణ మగ్నిహోత్రము నందు పడిన దూదివలె దగ్దమగును.
అట్టి మహాపుణ్యాంకమగు నట్టిదిగాన తులసీ బృందావన సన్నిధానము నందు, శ్రీ మహావిష్ణువును పూజించుట ప్రశస్తము.
సాదుడగు పురుషుడు స్నాన సంధ్యావందనాది నిత్యకర్మానుష్టానంబుల నలిపి, కల్పోక్త ప్రకారముగ నానావిధ వేద మంత్రములచేతగాని పురుష సూక్తము చేతగాని, శ్రద్ధా భక్తి యుక్తుండై పూజ చేయవలెను. ఏలాగునంటే, మొదట పంచామృత స్నానము గావించి, అటుపిమ్మట శుద్ధోదకములచే అభిషేక మొనర్చి, ఆ మహావిష్ణువును స్వర్ణ వస్త్రములచే నలంకరించి, నానావిధములగు పుష్పములచేతను ధూపదీపముల చే పూజించి, భక్తి పురస్కారముగ నైవేద్యమునిచ్చి, దక్షిణ తాంబూలములు సమర్పించి, ఆ పిదప కర్పూర నీరాజనము సమర్పించవలయును.
లోకమునందెవ్వడీ ప్రకారము పూజలు గావించుచుండునో నాతడు సకల పాపములచే విడువబడి సమస్త సంవత్సమృద్ధులు కలిగి మిగుల జయశాలియై యుండును. అచ్చోట నూడ్చి, గోమయము చేతనలికి పంచవన్నె ముగ్గులతో నలంకరించి, పద్మములను, శంఖమును, శార్గమును, చక్రమును, కౌమోదిని, గోపాదమును, వత్ససాదములను ఆ తిన్నె మీద నలంకరించి పూజించి తర్వాత గీతా వాద్యములతోను, వేద ఘోషలతోనూ, తులసీకథను వినవలయును. పూజ చేసి తర్వాత సంతుష్టుడుగాను, స్వచ్చమైన మనస్సు గావాడును కాగలడు.
పుణ్యము కోరెడువాడు ఎలాగైనా తులసీ వ్రతమాహత్యము వినవలయును. విష్ణుసాన్నిధ్యము కావలయునన్నట్లయితే బ్రాహ్మన సభలో తులసీ మహత్యము వినవలయును. విష్ణుదేవుని యే మాత్రమైన ప్రీతి జేయవలయునని యున్ననూ తులసీ మహత్యము భక్తితో వినవలయును.
ద్వాదశి రోజున తులసీ కథను విన్నట్లయితే పూర్వజన్మ కృతమైన దుఃఖములన్నియు వదలిపోవును. ఎవరు దానిని వినునో, చదువునో వారు విష్ణులోకమును పొందును. అపుడు పూజా కాలము నందు ధూపదీపములను చూచిన వాడు గంగాస్నాన ఫలమును పొందును. పాపముగల వాడెవ్వడైనను నీరాజనమును చూచినట్లయితే వాని పాప మంతయు నిప్పులలో పడిన ప్రత్తి పోగువలె మండిపోవును. ఎవడు నీరజనమును నేత్రములందును, శిరస్సు నందును యద్దుకొనునో వానికి విష్ణులోకము గలుగును. ఆ వెనుక టెంకాయలు, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెరకుగడలు, మొదలగువానిని నివేదనము చేయవలెను.
వీటిని తులసీ సమేతుడైన శ్రీమహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించి మోక్షార్ధియైన పురుషుడు ఈ ప్రసాద మంత్రాక్షతలను పుచ్చుకొని, శ్రద్ధా భక్తియుక్తుండై, గంధ పుష్పాదులతో బ్రాహ్మణులను పూజించి యధాశక్తి దక్షిణాదులనివ్వవలయును. ఈ ప్రకారముగ కోటి జన్మములయందు చేసిన పాపములను నశింపజేసెడి ఈ మహావ్రతమును ఎవరొనర్తురో వారికి ఈ లోకము నందు సమస్త భోగములును, ఆయుష్మికమున వుత్కృష్టమైన గతియును గలుగును.
ఈ ద్వాదశి రోజున బృందావన సన్నిధియందు అవశ్యము దీప ద్యానము చేయవలెను. ఏక దీప దానము చేసిన యెడల ఉపపాతకములు నశించును. పది దీపములు దానము చేసిన మహా పాతక నాశనమగును. నూరు దీపములు దానము చేసినవారికి శివసాన్నిధ్యము కలుగును. ఇంతట మీదట దీప దానముచేయుట వల్ల స్వర్ణాధిపత్యము పొందుదురు. అలాగే బ్రహ్మదులకు దీప దానమును ఎవడు చేయునో అతడు వైకుంఠములో సమస్తమైన భోగములనుభవించి విష్ణు సాన్నిధ్యమును పొందును.
ఆ దీపదర్శన మాత్రముచేతనే ఆయుర్ధాయము, బుద్ధి బలము, ధైర్యము, సంపత్తులు, పూర్వజన్మస్మరణ మొదలైన వన్నియు కలుగును. ఆ దీపమునకు ఆవు నెయ్యి ఉత్తమము, మంచి నూనె మధ్యము ఇప్పనూనె అధమము. ఆవునెయ్యితో దీపము వెలిగించి దానము చేసినటులైతే జ్ఞాన లాభమున్ను, మోక్షప్రాప్తియును కలుగును. మంచినూనెతో వెలిగించిన సంపత్తు, కీర్తిలభ్యమగును. విప్పనూనెతో దీపము పెట్టిన యిహభోగములనుభవించును. ఇతరములైన వన్యతైలములు కామ్యార్ధములు. ఆవాల నూనె కాని, అవిసె నూనెతో గాని దీపము పెట్టిన శత్రువులు నశింతురు. ఆముదముచే దీపముంచిన సంతత్తు, ఆయువు క్షీణమగును. గేదె నెయ్యితో దీపము వెలిగించినటులయితే పూర్వము చేసిన పుణ్యము కూడా నశించిపోవును. స్వలముగ ఆవునేతితో కలిపి పెట్టినట్లయితే మేమి దోషము లేదు.
ఈ దీప దాన మహత్యము ఎవరికీ చెప్పనలవికాదు. ఒక వత్తితో దీపము పెట్టి దానము చేసిన సమస్త పాపములచేత విడవబడినవాడై తేజస్విగాను, బుద్ధి మంతుడుగాను నగును. నాలుగు వత్తులతో దీపము పెట్టిన రాజగును. 10 వత్తులతో దీపదానము చేసిన చక్రవర్తియగును. ఏబది వత్తులతో దీపము వెలిగించిన దేవతలలో నొకడగును. నూరువత్తులతో దీపదానము చేసిన విష్ణురూపుడగును. ఈఫలము విష్ణుక్షేత్రమందు తులసీ సన్నిధియందు చేసినటులైన ద్విగుణముగాను, గంగాతీరమందు చేసిన మూడింతులను, కార్తీక ద్వాదశియందైన చతుర్గణము గానుయగును.
కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధియందు మహావిష్ణువును పూజించివారికి పరమోత్కృష్టమైన గతి గలుగును.
బృందావన సన్నిదానము నందు వేదిక మీద ప్రతిమ, పుష్పమాలిక, ఫలాదులు, దీపములు, మండపములు వీటిని ఎవరు చూచి ఆనందమందుదురో వారి పాపములన్నియు నశించును.
ఈ పకారముగ సాష్టాంగముగ శ్రద్ధాభక్తులతో ఎవరాచరింతురో, వారు విష్ణు సాయుజ్యమును పొందుదురు. పరిశుద్ధమైనటువంటిదాన్నే సమస్త పాపములు వారించునదియు అయిన ఈ మహాత్యమును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సమీపమున శ్రద్ధతో వినువారును చదువు వారును ఆయురారోగ్యైశ్వర్యములను పొంది అంత్యమున పరమపదము పొందుదురు.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment