Monday, 9 October 2023

ఇందిర ఏకాదశి

 




ఏకాదశీ వ్రత మహిమ

అక్టోబర్ 10 మంగళవారం ఇందిర_ఏకాదశి సందర్భంగా...

ఇందిర ఏకాదశీమహిమ శ్రీకృష్ణధర్మరాజుల సంవాదరూపంలో బ్రహ్మవైవర్తపురాణంలో వర్ణించబడింది.

ఒకసారి ధర్మరాజు దేవదేవునితో "ఓ కృష్ణా! మధుసూదనా! భాద్రపదమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశీపాలనకు ఉన్నట్టి నియమనిబంధనలు ఏమిటి? ఆ వ్రతపాలన వలన కలిగే లాభమేమిటి?” అని ప్రశ్నించాడు.

ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. "ఈ ఏకాదశి పేరు ఇందిర ఏకాదశి. దీనిని పాటించడం ద్వారా మనుజుడు తన పితృదేవతలను ఉద్దరించగలుగుతాడు, అంతే కాకుండ అతని సమస్త పాపాలు నశిస్తాయి”.

"రాజా! కృతయుగంలో ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు. తన శత్రువులను అణచడంలో నేర్పరియైన ఆ రాజు మాహిష్మతీపురాన్ని చక్కగా పాలించేవాడు. పుత్రపౌత్రులతో గూడి అతడు ఎంతో సుఖంగా జీవించాడు. అతడు సర్వదా విష్ణుభక్తిరతుడై ఉండేవాడు. ఆధ్యాత్మికజ్ఞానంలో నిరంతరం లగ్నమై యుండెడి భక్తుడైన కారణంగా ఆ రాజు ముక్తి నొసగెడి గోవిందుని నామస్మరణలోనే తన కాలాన్ని గడిపేవాడు".

ఒకనాడు ఆ రాజు తన రాజ్యసింహాసంపై కూర్చొని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు. నారదమునిని చూడగానే ఆ రాజు లేచి నిలబడి, చేతులు జోడ్చి వినమ్రంగా వందనం కావించాడు. తరువాత షోడశోపచార పూజ కావించి మునిని సుఖాసీనుని కావింపజేశాడు. అపుడు నారదుడు ఇంద్రసేనునితో "రాజా! నీ రాజ్యంలో అందరూ సుఖసమృద్ధులతో ఉన్నారా? నీ మనస్సు ధర్మపాలనలో లగ్నమై ఉన్నదా? నీవు విష్ణుభక్తిలో నెలకొని ఉన్నావా?" అని ప్రశ్నించాడు.

దానికి ప్రత్యుత్తరంగా ఇంద్రసేనుడు నారదునితో "ఓ మునివర్యా! మీ దయ వలన అంతా బాగానే ఉంది, మంగళమయంగానే ఉన్నది. నేడు మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది, నాకు యజ్ఞఫలం లభించింది. ఓ దేవర్షీ! మీ రాకకు కారణమేమిటో చెప్పవలసినది" అని అన్నాడు.

రాజు మాటలను వినిన తరువాత నారదుడు అతనితో ఇలా అన్నాడు.

ఓ రాజశార్దూలమా! నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటనను చెబుతాను విను. ఓ రాజేంద్రా! నేనొకసారి బ్రహ్మలోకం నుడి యమలోకానికి వెళ్ళాను. యమరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్చించాడు. నేను కూడ అతనిని స్తుతించాను. అక్కడ యమలోకంలో మహాపుణ్యభాగుడైన నీ తండ్రిని నేను చూశాను. వ్రతోల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడకు వెళ్ళవలసి వచ్చింది. రాజా! అతడు ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని నీకు తెలపమని అర్థించాడు. అతడు నాతో ఇలా అన్నాడు - "మాహిష్మతీపురాధీశుడైన ఇంద్రసేనుడు నా పుత్రుడు. పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వల్ల నేనిపుడు యమలోకంలో ఉన్నాను. కనుక నా పుత్రుడు ఇందిర ఏకాదశీ వ్రతాన్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వాలి. అపుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలను”.

"కనుక ఓ రాజా! నీ తండ్రిని ఆధ్యాత్మికలోకానికి పంపడానికై నీవు ఇందిర ఏకాదశీ వ్రతాన్ని చేపట్టు" అని నారదుడు తాను తెచ్చిన సందేశాన్ని చెప్పాడు. అపుడు ఇంద్రసేనుడు ఇందిర ఏకాదశీ వ్రతాన్ని చేసే పద్ధతిని గురించి తెలుపవలసిందిగా నారదుని ప్రార్థించాడు.

వ్రతవిధానాన్ని శ్రీనారదుడు ఇలా వివరించాడు. "ఏకాదశి ముందు రోజు మనుజుడు తెల్లవారుజామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ రోజు అతడు ఒక్క పూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి. మర్నాడు ఏకాదశిరోజు మళ్ళీ తెల్లవారుజామునే మేల్కొని దంతధావనం, హస్తముఖ ప్రక్షాళనం చేసికొని చక్కగా స్నానం చేయాలి. తరువాత ఎటువంటి భౌతికభోగంలో పాల్గొననని వ్రతనియమం చేపట్టి రోజంతా ఉపవసించాలి. ఓ పద్మనేత్రుడా! నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను" అని పలికి భగవంతుని స్తుతించాలి.

తరువాత మధ్యాహ్నవేళ సాలగ్రామశిల ఎదురుగా విధిపూర్వకంగా పితృతర్పణాలు చేయాలి. తదనంతరం బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తి పరచాలి. పితృతర్పణ కార్యంలో మిగిలిన పదార్థాలను గోవులకు పెట్టాలి. ఆ రోజు అతడు చందన పుష్ప ధూపదీప నైవేద్యాలతో హృషీకేశుని అర్చించాలి. శ్రీకృష్ణుని నామరూపగుణ లీలాదుల శ్రవణకీర్తనలతో, స్మరణంతో అతడు ఆ రాత్రి జాగరణ చేయాలి. మర్నాడు అతడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. తదనంతరం అతడు సోదరులు, పుత్రపౌత్రులు, బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రతపారణం చేస్తూ భోజనం చేయాలి. రాజా! ఈ విధంగా నీవు ఈ ఏకాదశీ వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణులోకానికి వెళతాడు”.

నారదుడు ఈ విధంగా ఉపదేశించి అంతర్ధానమయ్యాడు. తరువాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారమే సంతానం, బంధువులు, మిత్రులతో గూడి నిష్ఠగా ఇందిర ఏకాదశిని పాటించాడు. ఆ వ్రతమహిమ కారణంగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. ఇంద్రసేనుని తండ్రి గరుడవాహనారూఢుడై విష్ణుపదాన్ని చేరుకున్నాడు. తరువాత రాజర్షియైన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్యపాలనం చేసి, చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. ఇందిర ఏకాదశీ మహిమే ఇటువంటిది.

ఈ ఇందిర ఏకాదశీ మహిమను చదివేవాడు, వినేవాడు సమస్త పాపముక్తుడై చివరకు విష్ణుపదాన్ని చేరుకుంటాడు.🙏


సర్వే జనా సుఖినో భవంతు,


శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment