అక్టోబర్ 31 మంగళవారం
విజయనగరంలో పైడితల్లి సిరిమానోత్సవం
విజయనగరం సిరిమానోత్సవం అతిపెద్ద వేడుక. విజయనగర రాజుల ఆధ్యాత్మిక వైభవం పైడితల్లి ఉత్సవాలకు తలమానికం సిరిమానోత్సవం అని అందరూ గుర్తిస్తారు.
ఇది రాష్ట్ర పండుగ. రెండున్నర శతాబ్దాలకు పైబడి నిరంతరాయంగా సిరిమానోత్సవం జరుగుతోంది.
ఏటికేడాది పైడితల్లిని దర్శంచువచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఎంతో అట్టహాసంగా జరిగే ఈ సిరిమానోత్సవాన్ని కొవిడ్ ఆంక్షల కారణంగా అనేక జాగ్రత్తల మధ్య ఈసారి నిర్వహిస్తున్నారు.
ఉత్తరాంధ్రుల కల్పవల్లి, విజయనగరం ప్రజల ఇలవేలుపు శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తలమానికం సిరిమానోత్సవం. విజయదశమి అనంతరం మంగళవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు.
పైడితల్లి ఉత్తరాంధ్రుల కల్పవల్లిగా పూసపాటి రాజుల ఇలవేల్పుగా భాసిల్లుతోంది. పైడితల్లి అమ్మవారి దేవాలయం విజయనగరం మూడు లాంతర్లు కూడలి వద్ద 1757లో నిర్మించారు.
1758లో ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాలు నేటివరకూ సుమారు మూడు శతాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. క్రీ.శ. 1757 ధాత నామ సంవత్సరం విజయదశమి వెళ్ళిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు.
ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ కుటుంబానికి చెందినవారే వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారు.
ప్రస్తుత పూజారి బంటుపల్లి వెంకటరావు ఏడో తరంవాడు. ఈ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహించి భక్తుల్ని ఆశీర్వదిస్తారు.
అమ్మవారుగా కొలవబడుతున్న పైడితల్లి విజయనగరం పూసపాటి రాజవంశీయులు పెద విజయరామరాజు చెల్లెలు. పసిప్రాయం నుండి అధ్యాత్మిక భావాలతో దేవీ ఉపాసన చేసేది. అన్న పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధ సన్నాహాలు చేయడం ఆమెను కలతపెట్టింది. బుస్సీ కుట్రకు లొంగిపోయిన విజయరామరాజు చెల్లెలి యుద్ధ నివారణ ప్రయత్నాల్ని లెక్కచేయలేదు.
1757లో బొబ్బిలిపై యుద్ధం ప్రకటించారు. వెలమ వీరులు తమ పౌరుష ప్రతాపాల్ని పణంగా పెట్టి విజయమో వీర స్వర్గమో అన్నట్లు పోరాడారు. కానీ విజయం విజయరామరాజునే వరించింది. ఆ రోజు రాత్రి దేవి కలలో కనిపించి అన్న ప్రాణాలకు వచ్చే ప్రమాదాన్ని ముందే హెచ్చరించింది.
ఉపవాసదీక్షలో ఉన్న ఆమె పతివాడ అప్పలనాయుడు, మరికొందరు అనుచరుల్ని వెంటబెట్టుకొని బొబ్బిలి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళగానే ఆమె అపస్మారక స్థితిలోకి జారుకున్నది. తన ప్రతిమ పెద్దచెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని, దాన్ని ప్రతిష్ఠించి, నిత్యం పూజలు, ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమయింది. అప్పటినుండి ఆమెను అమ్మవారిగా కొలుస్తూ ప్రతి ఏటా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు.
సిరిమాను ఉత్సవంలో అమ్మవారిని దర్శించిన వారికి కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.🙏
No comments:
Post a Comment