పూర్వం శివుడు, 'గొప్ప జ్ఞానఫలం 'నీవే' అని సుబ్రహ్మణ్యస్వామితో అన్నాడు. తమిళంలోని 'ఫలం నీ' అనే పేరు కాలక్రమంలో పలనిగా మారింది. అదే పళని క్షేత్రం. ఒకసారి నారదుడు అమూల్యమైన జ్ఞానఫలాన్ని తీసుకుని కైలాసానికి వెళ్లాడు. దానిని ముక్కలు చేయకుండా తినమని కోరాడు. పార్వతి ఆ ఫలాన్ని కుమారులకు ఇవ్వాలనుకుంది. "ఎవరైతే ముందుగా ఈ భూప్రదక్షిణం చేసివస్తారో వారికే ఈ ఫలం యిస్తాను' అని పార్వతీదేవి పలుకడంతోనే సుబ్రహ్మణ్యస్వామి తన వాహనమైన నెమలిని అధిరోహించి బయలుదేరాడు. వేగంగా ప్రయాణించలేని వినాయకుడు ఆలోచించి, తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి భూప్రదక్షిణ ఫలాన్ని, నారదుడిచ్చిన జ్ఞానఫలాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. దాంతో అలిగిన సుబ్రహ్మణ్యస్వామి కైలాసం వదలి, ప్రస్తుతం పళని వున్న కొండపైకి వచ్చి కొలువుదీరినట్లు స్థలపురాణం చెబుతోంది.
పళనిలో ఆలయం ఉన్న శివగిరి కొండ సుమారు 485 అడుగుల ఎత్తు. 695 మెట్లమార్గం ద్వారా, రోప్ వే లేదా రైలు మార్గాల్లో కొండ మీదికి చేరుకోవచ్చు. విశాలమైన ప్రాంగణంలో వివిధ మండపాలు కలిగిన ఈ ఆలయ ప్రధాన గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నిలుచుని ద్విభుజాలతో కటిహస్తుడై మరో చేతిలో దండం ధరించి కౌపీనధారిగా దర్శనం ఇస్తాడు. స్వామివారిని మురగన్, దండాయుధపాణి అని భక్తలు పిలుస్తారు. నవపాషాణం అనే విశిష్టమైన శిలతో తయారుచేసిన స్వామి విగ్రహం నుంచి ధూప, దీప సమర్పణ సమయంలో మూలికా పదార్థాలు వెలువడుతాయని, వాటిని పీల్చడం వల్ల వ్యాధులు నశిస్తాయని చెబుతారు. ఈ స్వామి కావడి ప్రియుడు. పూలు, పాల కావళ్ళను భక్తులు స్వామి వారికి సమర్పిస్తారు
No comments:
Post a Comment