Tuesday, 31 October 2023

ఆశ్వయజమాన కథ

 


శ్రీ సంకష్టహర గణపతయే నమః

పార్వతీదేవి "గణపతితో గణపతి ! ఆశ్వయుజ మాసమున శ్రీ సంకష్ట హర చతుర్థీ వ్రతమును, ఎట్లు ఆచరించవలెనో, ఎవరు ఆచరించి, ఎట్టి ఫలమును పొందిరో వివరింపుము అని కోరగా గణపతి వివరించెను.

అమ్మా ! పార్వతీదేవి ! శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు చెప్పిన విశేషములు నీకును వివరింతును. ఆశ్వయుజ కృష్ణచతుర్థినాడు గణపతిని గజాననుడుగా పూజించవలెను.

నిర్మలమైన మనస్సుతో నన్ను ధ్యానించి, దూర్వాయుగ్మములతో బిల్వదళములతో (గరిక, మారెడు) పూజించి ఫలములు, మోదకములు (కుడుములు) నివేదింపవలెను.

బాణాసురిని పుత్రిక ఉష నిద్రించుండ, స్వప్నమున అనిరుద్ధుని చూచి, అతని సౌందర్యమును మెచ్చి, అతనినే వివాహమాడవలెనని తలంచి, ఇదియెట్లు సాధ్యమగునా? యని వ్యాకుల మనస్కమయ్యెను.

పిదప తన చెలికత్తెను పిలిచి చెలీ నేను కలలో అనిరుద్ధుని వివాహమాడితిని. కనుక నీవు ఎట్లుయినను ప్రయత్నించి నా మనోనాథుని ఇచ్చటికి తీసికొనిరమ్ము లేనిచో నేను బ్రతుకను అని చెప్పగా చెలికత్తె చిత్రలేఖ, ఉష కోరికను నెరవేర్చుటకై సాయం సమయమునకు ద్వారకా నగరమును చేరి, గోధూళివేళ తన మాయాబలమున అనిరుద్దుని గైకొనివచ్చి, ఉషామందిరమున జేర్చెను.

రాత్రి యయినను ఇంటికి రాకున్న అనిరుద్దునికై ప్రద్యుమ్నుడు (తండ్రి) మిక్కిలి వగచి, ఈ వార్త తన తల్లిదండ్రులగు రుక్మిణి శ్రీకృష్ణునకు విన్నవించెను. వారును మనుమని అదృశ్యవార్త విని మిక్కిలి చింతింపసాగిరి.

రుక్మిణి దుఃఖమును భరింపలేక శ్రీకృష్ణునితో నాథా! నామనుమడుగు అనిరుద్దుని చూడకనే నొక్కక్షణమైన మనజాలను. అతడు నాకు ప్రాణములకన్నామిన్న. కనుక వెంటనే అనిరుద్దుని తెచ్చి నాముందుంచుము. అని విలపించెను.

అంతట సర్వజ్ఞుడు, లీలామానుష విగ్రహుడు, జగన్నాటకసుత్రధారియగు శ్రీకృష్ణుడు రుక్మిణి కోర్కెనెరవేర్చుటకై సభకేతెంచి అచ్చట నున్న లోమశ (రోమశ) మహర్షిని జూచి నమస్కరించి ఋషిశ్వరా ! నామనుమని అనిరుద్ధుని ఎవరు తీసికొనిపోయిరో, వారు ఇప్పుడు ఎక్కడనున్నాడో ? ఏమైనాడో! తెలియకున్నది, మీరు దివ్యదృష్టితో చూచి సర్వము వివరింపుడు అని ప్రార్థింపగా, లోమశ మహర్షి దేవా శ్రీకృష్ణా ! సర్వము తెలిసియు, నన్నిట్లు ప్రశింతువా?

ఏమి నీ లీలా ! నీ మనుమడుగు అనిరుద్ధుని బాణాసురుని కుమార్తె ఉషభర్తగా వరించి చెలికత్తె వలన మాయోపాయమును తెప్పించుకొని, తన అంతఃపురమున దాచియున్నది. ఈ విషయము నారదముని వలన తెలిసినది. మీరు శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించి గణపతిని పూజింతురేని, మీ మనమని పొందగలరు అని చెప్పెను.

అంతట శ్రీకృష్ణుడు మునులవలన ఈ వ్రతవిధానమును తెలిసికొని, కల్పోక్త ప్రకారముగ రుక్మిణీయుతడై ఈ వ్రతమును ఆచరించెను. తత్పలముగా బాణాసురునితో యుద్ధముచేసి వాని హస్తములను ఖండించి, విజయము నొంది, ఉషానిరుద్దులను స్వీక రించి ద్వారకా నగరము చేరి, పుత్రపౌత్రాదులతో సుఖముగా నుండెను. 

కనుక అమ్మా! వ్రతము గొప్ప ప్రభావముగలది. దీనిని ఆచరించుటచే సర్వవిఘ్నములు తొలగును. సర్వపుణ్యతీర్థములు సేవించిన ఫలము చేకూరును. అని చెప్పెను.

ఇది శ్రీకృష్ణ యుధిష్ఠిరసంవాదాత్మకమైన శ్రీసంకష్టహర చతుర్థీవ్రతమును ఆశ్వయుజ మాస కథ సమాప్తము.

మూకం కరోతి వాచాలం, పంగులం లంఘయతే గిరిమ్,

యత్కృపాత మహం వందే పరమానందమాధవమ్,

శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీ మహాగణపతి ప్రసాదసిద్ధిరస్తు

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు


వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment