ప్రశ్న అడిగినవారు: విక్రం, అలివెండు
ఈ లోకంలో ఎన్నడూ స్థిరంగా ఉండనివి కొన్ని ఉన్నాయి. ఏనుగు చెవులు, రావి ఆకులు, సముద్రపు అలలూ... అలాంటివే! వాటన్నింటినీ మించి అస్థిరమైనది- ధనం! డబ్బు అంతటి నిలకడ లేనిది మరొకటి లేదు. సంపదకు ప్రతీక 'లక్ష్మి'. లక్ష్మీదేవికి 'చంచల' అని పేరు. అది ఎక్కడ దాచినా దాగదు. దొంగలపాలు కావచ్చును. అగ్నికి ఆహుతి కావచ్చు, తుదకు రాజే ( ప్రభుత్వం) ప్రజోపయోగార్థం లాక్కోవచ్చును. 'న్యాయార్జిత విత్తం' కొబ్బరికాయలో నీరులా వచ్చి చేరుతుంది. అది ఆరోగ్యకరం, రుచికరం. అధర్మ సంపాదన కుండలో నీరు వంటిది. అది ఏనాటికైనా నేలపాలు కాక తప్పదు.
వామనావతార ఘట్టంలో బలి చక్రవర్తి ఏం చెప్పాడు? 'కారే రాజులు రాజ్యముల్ కలుగవే!... వాళ్లంతా సిరి మూటగట్టుకొని పోగలిగారా? ఈ భూమి మీద వాళ్ల పేరైనా మిగిలి ఉందా? కానీ మహా త్యాగమూర్తులైన శిబి చక్రవర్తి వంటి వారిని మాత్రం మరచిపోలేదు గదా' అని గురువుకే హితోపదేశం గావించాడు. 'నువ్వు తిన్నది నెలపాలు, ఇతరులకు పెట్టింది నీ పాలు' అని లోకోక్తి. 'లక్షాధికారైన లవణమన్నమే గాని, మెరుగు బంగారంబు మింగబోడు' అంటారు. ఒకరికి ఇవ్వకుండా, తాను అనుభవించకుండా ఉంటే అది తుదకు దొంగలపాలే లేదా పరులపాలు అవుతుంది.
పాత్రతనెరిగి దానం చేయాలి. అపాత్రదానం అపాయకరం. అసలు దానం పుచ్చుకోవడాన్నే తప్పుపడతాయి ధర్మశాస్త్రాలు. 'అపరిగ్రహణం' అనేది ఒక ఉత్తమ వ్రతం. ఎవరినీ యాచించి ధనం తీసుకోకపోవడమే ఈ వ్రత లక్షణం. ఒకవేళ తీసుకోవలసి వస్తే, ముందుగా దాత చేతిలో ఏదైనా పెట్టి, తరవాతే పుచ్చుకోవాలంటారు. భార్యామణి బలవంతంపై కుచేలుడు శ్రీకృష్ణుణ్ని అర్థించడానికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తరవాత నోరు పెగలలేదు. తీసుకెళ్ళిన అటుకుల్ని ఇస్తే కృష్ణుడు ఆప్యాయంగా భుజించాడు. కుచేలుడు తానుగా యాచించలేదు. పరమాత్మ దయ ప్రసరిస్తే ఎవరికి ఏ సమయంలో ఏది లభించాలో అది లభించకుండా ఉంటుందా! ఈ కాలంలో బతుకులు జీవన ప్రధానంగా సాగుతున్నాయి.
ఏదో ఒక విధంగా అధికంగా సంపాదించడమే ఎక్కువ మంది బుర్రల్లో సదా సాగే ఆలోచన. ప్రజలు జీవనానికి ఇస్తున్న ప్రాధాన్యం కర్తవ్యానికి ఇవ్వడంలేదు. మన సంప్రదాయంలో ఒక కథ ఉంది. ప్రజాపతి తన సంతానానికి మూడు సార్లు 'ద' అని బోధించాడు. దేవతలకు 'దమం', మనుషులకు దత్త, అసురులకు దయ... ఇవీ ప్రజాపతి సందేశాలు. దమం అంటే ఇంద్రియ నిగ్రహం, దేవతలకు అవసరమైనది. అసురులు క్రూరంగా ఉంటారు. అందువల్ల వాళ్లకు 'దయ'. ఇక ... మనుషులు సహజంగా లోభులు. వాళ్లకు 'దత్త' అని ప్రబోధించాడు ప్రజాపతి.
దురాశతో అధికంగా కూడబెట్టడంవల్ల మానవాళి కష్టాల పాలవుతుంది. అందుకే ప్రజాపతి దత్త 'దానం చేయండి' అని ప్రబోధించాడని చెబుతారు. దానం అయిదు రకాలంటారు - ధర్మం, అర్థం, భయం, కామం, కారుణ్యం. వీటివల్ల దాతకు ఇహలోకంలో కీర్తి, పరలోకంలో ఉత్తమగతీ కలుగుతాయి. అసూయ లేకుండా ఇస్తే అది ధర్మదానం. యాచకులు ప్రశంసిస్తూ ఉండగా ఇస్తే అర్థదానం. దానం ఇవ్వకపోతే ఏం చేస్తారో అనే భయంతో ఇచ్చేది భయదానం. ఇష్టమైన వ్యక్తికి ఇస్తే కామ దానం. పేదవాడికి జాలితో ఇచ్చేది కారుణ్య దానం. వీటిలో ఏ రకమైన దానమైనా అది పుణ్యాన్ని, కీర్తిని ప్రసాదించేదే! 'దానంతో, తపస్సుతో స్వర్గానికి వెళ్ళవచ్చు గదా! ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనది?' అని ధర్మరాజు భీష్ముణ్ని ప్రశ్నించాడు. దానికి భీష్ముడి జవాబు 'తపస్సు ప్రభావం వల్ల పవిత్ర హృదయులైన రాజులు ఉత్తమ గతులు పొందుతారు.
ధర్మపరాయణులైన రాజులు దాన పుణ్యాసక్తులై నిస్సందేహంగా ఉత్తమ లోకాలకు వెళ్తారు. దానం అనేది పేదవారికి ఇష్ట పూర్వకంగా దానం చేయాలి. గుళ్ళో హుండిలో వేస్తే వచ్చి పుణ్యం కంటే గుడి దగ్గర మెట్లపై ఉన్న యాచకులకు ( నిర్భాగ్యులకు) దానం చేయడం వలన విశేష పుణ్యఫలం దక్కుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏమనగా దానం చేసేది గుప్తంగా చేయాలి. అందరికి తెలియాలని ఆలోచించకూడదు. చేసిన దానం వెంటనే మర్చిపోవాలి. దానం చేసేప్పుడు మనకు నచ్చిన దేవునికి అర్పితమస్తూ " కృష్ణార్పితమస్తూ" అనుకోవాలి. ఇలా చేయడం వలన నేరుగా దైవానికి ఇచ్చిన పుణ్యఫలం దక్కుతుంది.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
No comments:
Post a Comment