Wednesday, 3 August 2016

భారతీయులందరు శంకరాచార్యుల జీవితం గురించి, బోధనల గురించి తెలుస్కోవాలి.

భారతీయులందరు శంకరాచార్యుల జీవితం గురించి, బోధనల గురించి తెలుస్కోవాలి.

కైలాస వాసుని అవతారంగా భావించబడే శంకరుల కృప వలన మనకు ఈ రోజు హిందూ ధర్మంలో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలుకబడిన శక్తి వేదములుగా ప్రకాశిస్తున్నాయి. ఎవరో రచించి, మరెవరో పరిశీలనము, విమర్శ చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. విశ్వవ్యాప్తుని మనోకమలము నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందములు వేదములు. అంతటి వేదములకు కూడా వక్ర భాష్యము చెప్పి, భారతీయ సమాజంలో విభజన కలిగించి, మూఢ చాందస భావాలను ప్రేరేపించి అన్యమతముల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో ఆ పరిస్థితిని చక్క దిద్దటానికి శంకరులు కాలడిలో శివ గురు శక్తితో ఆర్యాంబ గర్బములో ఉత్తరాయణ పుణ్య కాలమున వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు. చిన్ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింప జేసే దక్షిణామూర్తి రూపమైన పరమ శివుడు ఈ దంపతులను ఆశీర్వదించగా శంకరులు ఉదయించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి, మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి.
మూడవ యేటనే తండ్రిని కోల్పోయిన శంకరులకు ఐదవ యేట ఉపనయన సంస్కారము జరిగింది. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మాధుకరం కోసం భిక్షాటనకు వెళ్లిన శంకరులకు ఒక పేద బ్రాహ్మణుని యింటి యిల్లాలు వద్ద ఉసిరికాయ తప్ప ఏమీ దొరకలేదు. ఆమె దుస్థితికి కరిగిన శంకరులు లక్ష్మీదేవిని కనకధారా స్తోత్ర రూపంలో ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఆ ఇంట బంగారు ఉసిరికలు కురిపించి వారి దారిద్ర్యాన్ని పోగొట్టిందిట. దిన దిన ప్రవర్థమాన మవుతున్న శంకరులకు మహర్షులు వచ్చిన దేశాన్ని ఉద్ధరించాలన్న కర్తవ్యాన్ని గుర్తు చేస్తారు. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి శంకరులు భారత దేశ యాత్ర మొదలు పెడుతారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నర్మదానదిని తన కమండలములో బంధించిన శంకరుని చూసి ముగ్ధులైన గురు గోవింద భగవత్పాదులు శంకరులను తన శిష్యునిగా స్వీకరిస్తారు. గోవింద భగవత్పాదులు శంకరులకు వేదవేదాంగాలు ఉపదేశిస్తారు. ఆత్మ, పరమాత్మ ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని కూడా శంకరులకు బోధిస్తారు. ఆ సందేశాన్ని ప్రపంచానికి చాటమని శంకరులను ఆశీర్వదించి పంపిస్తారు.
శంకరులు కాశీకి పయనమవుతారు. అక్కడికి చేరే సమయానికి ఆయనకు చాలా మంది శిష్యులు ఏర్పడుతారు. ఒకసారి ఒక శిష్యుడు నది ఈవలి ఒడ్డున గురువుల వస్త్రములు ఆరవేస్తుండగా శంకరులు అతనిని ఆవలి ఒడ్డు నుండి పిలుస్తారు. గురువుగారి పూర్తి ధ్యాసతో ఆ శిష్యుడు అడుగులు వేస్తూ నదిని దాటుకుంటూ వెళుతాడు. ఆ శిష్యుడు అడుగు వేసిన ప్రతిచోట ఒక పద్మము వెలసి ఆయనను నీట మునగ కుండా కాపాడుతుంది. అంతటి మహిమాన్వితమైన గురుకృపను పొందిన ఆ శిష్యుడు పద్మపాదునిగా పేరు పొందాడు.
ఒక రోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకుని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక నిమ్న జాతికి చెందిన వాడు ఎదురు పడతాడు. అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు వాడిని తప్పుకో, దారి విడువుము అని అంటాడు. అప్పుడా చండాలుడు నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా? నా ఆత్మనా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతాడు. ఆ సందర్భంలో చండాలుని రూపములో ఉన్న శివుడు శంకరుని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి రెండు శ్లోకములు, అటు తర్వాత శంకరుల నోట వెలువడిన శ్లోకాలు మనీషా పంచకంగా పేరొందాయి. అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మమొక్కటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడినది. తనలో ఉన్న ఆఖరి దుర్గుణమును ఈ సందర్భముగా శంకరులు దగ్ధము చేసుకునే అవకాశమును ఆ పరమ శివుడు చండాలుని రూపములో కలిగించాడు.
బ్రహ్మసూత్రాల కర్త అయిన వ్యాసుల వారి అనుగ్రహంతో వాటి భాష్యాలను అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయటానికి పయనమవుతారు శంకరులు. దేశాటన చేస్తూ కాంచీపురంలో కామకోటి పీఠం, శృంగేరి శారదా పీఠం వంటి ఎన్నో క్షేత్రాలను స్థాపించారు. ఎన్నో వేల దేవాలయాలను పునరిద్ధరించారు. తిరువైమరుదూరు, తిరుచ్చి, శ్రీశైలము మొదలైన ప్రదేశాలలో ఎన్నో అద్బుతమైన స్తోత్రాల ద్వారా అక్కడి పుణ్యక్షేత్రాలను పునరుత్థానం చేసారు. హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించే వారు. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించే వారు. ఆది శంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడిగాడుట. అందుకు శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. కాపాలికుడు శంకరుల తల నరుకబోగా విష్ణుమూర్తి నృసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరించాడు.
తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసియైన తాను ఆమెకు ఉత్తరక్రియలు చేయకూడదని తన కంటి నుండి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజిల్ల జేస్తారు. తన అనుపమానమైన శక్తితో మూకాంబిక, కోటచాద్రి, తిరుమల, పురీ, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా తీర్చిదిద్దుతారు శంకరులు.భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల, పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశ వ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు. పామరులనుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి, ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు.
తన యాత్రల చివరలో శంకరులు బదరీ క్షేత్రానికి వెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అలకనంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడు. శంకరులు అక్కడ బదరీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి ఆ పరమాత్మలో ఐక్యమవుతారు.ఆ శంకరుల కృప వలననే మనకు నేడు అష్టాదశ శక్తి పీఠములు, చార్ ధామ్ మొదలైన పుణ్య క్షేత్రాలు, వాటి వలన మనకు అత్యున్నతమైన హైందవ అద్వైత సిద్ధాంత సారమైన జీవనశైలి, సమాజము భాసిల్లుతున్నాయి.
శంకరుల రచనలు:
ఆయన చేసిన స్తోత్రాల్లో మనీషా పంచకము, సాధన పంచకము, భజగోవిందము, గోవిందాష్టకము, పాండురంగాష్టకము, శివ సువర్ణమాలా స్తోత్రము, అర్థనారీశ్వర స్తోత్రము, కాలభైరవాష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము, అన్నపూర్ణాష్టకము, అచ్యుతాష్టకము, మహిషాసుర మర్దిని స్తోత్రము, త్రిపురసుందరీ స్తోత్రము, భుజంగాష్టకాలు, భవాన్యష్టకము, దేవీనవరత్నమాలికా, విశ్వనాథాష్టకము, ఉమామహేశ్వర స్తోత్రము
ఇలా ఎన్నో సామాన్య జనులకు జీవన దిశానిర్దేశము చేసే స్తుతులను రచించారు. ఆధ్యాత్మికంగా ఇంకొక పై మెట్టులో సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి మొదలైనవి, ఇంకొక పై మెట్టుపై భాష్యాలు.
ఆదిశంకరుల రచనలు మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. మూడవది దేవతా స్తోత్రాలు.


No comments:

Post a Comment