Thursday, 25 August 2016

శ్రీ కృష్ణ జయంతి

శ్రీ కృష్ణ జయంతి



శ్రీ కృష్ణ పరమాత్ముని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించుకొనే పండుగే కృష్ణాష్టమి. దీన్నే జన్మాష్టమి, గోకులాష్టమి, కృష్ణ జయంతి, శ్రీజయంతి అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ సందర్భంగా . కృష్ణ జయంతి వ్రతాలూ చేస్తుంటారు. ద్వాపర - కలియుగాల సంధి కాలాల్లో శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసం బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో అష్టమినాడు రెండు జాముల రాత్రి వేళ కారాగారంలో మేనమామ గండంతో శ్రీకృష్ణుడు జన్మించాడు. సాధారణంగా జయంతి అనేది జ్యోతిష శాస్త్ర పరిభాష. బ్రహ్మాండ పురాణంలో జయంతి అంటే రాత్రి అనే అర్ధంలో ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణ జయంతి జరిపే వారిలో కొందరు ఆయన జన్మించిన అష్టమి తిథికి ప్రాధాన్యం ఇస్తే మరికొందరు జన్మ సమయంలోని రోహిణి నక్షత్రానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ కారణం వల్ల ఒక రోజు ముందు, వెనుకా కృష్ణాష్టమి జరపటం కనిపిస్తుంది. 

కృష్ణ జయంతి వ్రతం విషయానికొస్తే కృష్ణ జయంతి పర్వదినాన ఉపవాసంతో కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు తొలగుతాయని స్కంద పురాణం చెబుతోంది. కృష్ణాష్టమి నాడు చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలని, బంగారం లేదా వెండితో తయారుచేసిన చంద్రబింబాన్ని వెండి లేదా బంగారు పాత్రలో ఉంచి పూజించి అర్ఘ్యమిస్తే కోరిన కోర్కెలు తీరుతాయంటారు పెద్దలు. అనంతరం శ్రీకృష్ణుడికి పూజ చేయాల్సి ఉంటుంది. కృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని దేశమంతటా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుతుంటారు. శ్రీకృష్ణుడు పరమయోగీశ్వరేశ్వరుడు. గొప్ప రాజనీతిజ్ఞుడు. అన్నిటినీ మించి గీతా ప్రవక్త. కృష్ణాష్టమి వ్రతాచరణ, ఇతరత్రా ఎక్కడా ఆయనకు సంబంధించిన ఈ విషయాలేవీ ప్రస్తావనకు రావు. కేవలం లీలామానుషధారుడైన ఆ బాలకృష్ణుడి బాల్య క్రీడలను మాత్రమే భక్తులు స్మరించుకొంటుంటారు. చిన్ననాడు కృష్ణుడు రేపల్లెలో ఉట్ల మీదికి ఎగబాకి పాలు, పెరుగు, వెన్నలను మెక్కిన ఘటనలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉట్లు కొట్టే ఉత్సవం ఈనాటికీ జరుగుతూనే ఉంది. కృష్ణ భక్తులు కృష్ణాష్టమి నాడు ముగ్గుతో చిన్నికృష్ణుడి పాదాల గుర్తులను తమ ఇంటి ముంగిట పెట్టి చిన్ని కృష్ణుడు తమ ఇంటికే నడిచి వచ్చాడన్న ఆనందానుభూతిని, భక్తి పారవశ్యాన్ని పొందుతుంటారు. ఈ రోజున స్వామికి సమర్పించే నైవేద్యంలో మినపపిండితో పంచదారను కలిపి చేసిన పదార్ధాన్ని పెడుతుంటారు. మరి కొంత మంది శొంఠి, బెల్లం పానకం, నెయ్యితో కలిపి చేసిన పదార్ధాన్ని నివేదిస్తారు.

No comments:

Post a Comment