Friday, 12 August 2016

సౌందర్యలహరి











సౌందర్యలహరి


ఆది శంకరాచార్యులు జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంథము సౌందర్యలహరి. ఇది స్తోత్రము (భక్తితో భగవంతుని కీర్తిస్తూ ఆరాధించే గాన పాఠము), మంత్రము (గురువు అనుగ్రహం పొంది నిష్టతో జపించుట వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అక్షర సముదాయము), తంత్రము (నియమంతో శాస్త్రయుక్తంగా సాధన చేస్తే ప్రత్యేక సిద్ధులు లభించే యోగవిధానము), కావ్యము (అక్షర రమ్యతతో కూడిన ఛందో బద్ధమైన, ఇతివృత్తాత్మక రచన) కూడాను. దీనిని ఆనందలహరి మరియు సౌందర్యలహరి యని రెండు భాగములుగా విభజించియున్నారు. మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు సౌందర్యలహరి అని చెప్పుదురు. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు గలవు. మొదటి శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్టపరచుచున్నవి. సౌందర్యలహరి అను పేరునందు సౌ, లహ, హ్రీం అను మంత్ర బీజములు ద్యోతకమగుచున్నవి.
స్తోత్ర పరిచయం
శంకరాచార్యుని అనేక స్తోత్రాలలో శినస్తోత్రంగా శివానందలహరి, దేవీస్తోత్రంగా "సౌందర్యలహరి" చాలా ప్రసిద్ధాలు. త్రిపుర సుందరి అమ్మవారిని స్తుతించే స్తోత్రం గనుక ఇది సౌందర్యలహరి అనబడింది. ఈ స్తోత్రం "శిఖరిణీవృత్తం" అనే ఛందస్సులో ఉంది. సౌందర్య లహరిలో నాలుగు ప్రధానమైన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
ఇది అసామాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యం.
ఇది ఒక దివ్య మహిమాన్విత స్తోత్రం
ఉపాసకులు దేవిని ఆరాధించడానికి ఉపయోగకరమైన అనేక మంత్రాలు నిక్షిప్తమైన మంత్రమాల. ఈ మంత్రాలకు ఫలసిద్ధులను వ్యాఖ్యాతలు తెలియబరచారు.
ఆగమ తంత్రాలను విశదీకరించే, శ్రీవిద్యను వివరించే తంత్ర గ్రంధం. ఇందులో మొదటి 41 శ్లోకాలు శ్రీవిద్యను వివరిస్తాయి.
స్తోత్రంలో మొదటి 41 శ్లోకాలు "ఆనంద లహరి" అని, తరువాతవి దేవీ సౌందర్యాన్ని కీర్తించే "సౌందర్య లహరి" అని అంటారు కాని ఈ విభజనను కొందరు వ్యాఖ్యాతలు అంగీకరించరు. భారత దేశంలో సౌందర్య లహరికి ఇంచుమించు 50 వ్యాఖ్యానాలున్నాయని తెలుస్తున్నది. లక్ష్మీధరుడు, భాస్కరరరాయుడు, కామేశ్వర సూరి, అచ్యుతానందుడు మొదలైనవారు ముఖ్య భాష్యకర్తలు. "Serpent Power" ("కుండలినీ శక్తి") అనే పేరు మీద "ఆనందలహరి" అనబడే భాగానికి మాత్రం "ఆర్థర్ ఎవలాన్" అనే ఆంగ్లేయుడు వ్యాఖ్యను వ్రాశాడు. "శ్రీరామ కవి" అనే పండితుడు "డిండిమ భాష్యము" అనే భాష్యాన్ని వ్రాశాడు. శ్రీ నరసింహ స్వామి అనే పండితుడు "గోపాల సుందరీయము" అనే వ్యాఖ్యలో ప్రతి శ్లోకాన్ని శక్తిపరంగాను, విష్ణుపరంగాను కూడా వ్యాఖ్యానించాడు. తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు "శ్రీచక్ర విలసనము" అనే వ్యాఖ్యను వ్రాశాడు.
అన్ని మంత్ర స్తోత్రాలలాగానే ఈ స్తోత్రాన్ని కూడా జపించడానికి ముందుగా గురువును స్మరించాలి. తరువాత ఋష్యాదులను (స్తోత్రము, ఋషి, ఛందస్సు, దేవత, బీజము, శక్తి, కీలకము, అర్ధము, వినియోగము) స్మరించాలి. పిదప అంగన్యాసము, కరన్యాసము, ధ్యానము, పంచోపచారాదులు చేయాలి. తరువాత శ్రద్ధతో, భక్తితో, నిర్మల నిశ్చల హృదయంతో స్తోత్రాన్ని పఠించాలి (జపించాలి). ఈ "సౌందర్య లహరి" స్తోత్రానికి
ఋషి - గోవిందః
ఛందస్సు - అనుష్టుప్
దేవత - శ్రీ మహాత్రిపుర సుందరి
బీజం - "శివః శక్త్యా యుక్తః"
శక్తి - "సుధా సింధోర్మధ్యే"
కీలకం - "జపో జల్పః శిల్పం"
అర్ధము - భగవత్యారాధన
వినియోగము - శ్రీ లలితా మహా త్రిపురసుందరీ ప్రసాద సిద్ధి కోసము
స్తోత్ర సారాంశం
సౌందర్య లహరిలోని స్తోత్రాల విషయ సారాంశం ఇక్కడ సంక్షిప్తంగా ఇవ్వబడింది.
భగవతీ! ఈశ్వరుడు కూడా శక్తితో కూడినప్పుడే జగములను సృష్టించగలడు. శివ కేశవ చతుర్ముఖాదులచేత కూడా పరిచర్యలు పొదే నిన్ను నావంటి పుణ్యహీనుడు స్తుతించడం ఎలా సాధ్యమౌతుంది?
దేవి పాదరేణువు మహిమ గురించి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దేవి పాదపరాగాన్ని గ్రహించి శక్తిమంతులౌతున్నారు
దేవి అజ్ఞానులకు జ్ఞానాన్ని, చైతన్య రహితులకు చైతన్యాన్ని, దరిద్రులకు సకలైశ్వర్యాలను, సంసారమగ్నులకు ఉద్ధరణను ప్రసాదించునది.
తక్కిన దేవతలు వరదాభయముద్రలతో దర్శనమిస్తున్నారు. లోకరక్షకురాలైన శ్రీమాత పాదములే సకలాభీష్ట ప్రదాయములు, భయాపహములు, లోకరక్షకములు.
త్రైలోక్యమోహినియు, శ్రీచక్ర రూపిణియు అయిన శ్రీ త్రిపురసుందరీదేవిని పూజించి విష్ణువు మోహినీ రూపమును ధరించగలిగెను. మన్మధుడు లోకములను మోహింపజేయగలుగుచున్నాడు.
పార్వతి కటాక్షవీక్షణం వలన మన్మధుడు ఒంటరివాడైనను, శరీరహీనుడైనను, అల్పాయుధధారియైనను లోకములను వశీకరించుకొంటున్నాడు.
శ్రీదేవీ స్వరూప ధ్యానం: క్వణత్కాంచీధామా - మ్రోయుచున్న చిరుగంటల మొలనూలు కలది; కుంభస్తననతా - స్తన భారముచే కొంచెము వంగినది; పరిక్షీణామధ్య - కృశించిన నడుము కలది; పరిణత శరచ్చంద్రవదన - నిండు చందమామ వంటి మోము; ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః - ధనుస్సును, పుష్పబాణములను, పాశమును, అంకుశమును చేతులలో ధరించినది; త్రిపురాంతకుని అహంకారరూపియైన దేవి.
"సుధా సింధోర్మధ్యే" - దేవియొక్క ఆవాసం వర్ణన - అమృత సముద్రమున, కల్పవృక్షముల తోటలలో మణిద్వీపం గురించి.
వేదాంతయోగసారము - శరీరంలోని షట్చక్రాల గురించి వర్ణన - కుండలినీ యోగ విధానము (ఆరోహణ)- సహస్రార చక్రంలో సదాశివునితో కలిసి దేవి విహరించుచున్నది.
కుండలినీ యోగం (అవరోహణ) గురించి తెలిపే రెండ శ్లోకం - శరీరంలో నాడీ ప్రపంచం గురించి, అమృత ధారా స్రావ మార్గం గురించి.
శ్రీచక్రం వర్ణన - నవ చక్రాకృతమై, 44 అంచులు కలిగి శివశక్త్యుభయరూపముగా వెలయుచున్నది.
శ్రీలలితామహాభట్టారికామాత అనంత సౌందర్య స్తుతి, శివ సాయుజ్య ప్రసక్తి
దేవి కటాక్షమహిమా వైభవం వలన ఎంతటి వికారరూపుడైన ముదుసలి కూడా సుందరాంగులను మోహింపజేయగలడు.
షట్చక్రాలలోని సహస్రారములో ఉండు దేవి పాదప్రకాశ వైభవం.
సాత్విక ధ్యాన విధానం - శరత్కాలపు వెన్నెలను బోలు దేవికి నమస్కరించిన సజ్జనులకు అమృత రస తరంగిణులైన వాక్ప్రభావము లభించును.
రాజస ధ్యాన విధానం - అరుణాదేవిని ధ్యానించువారు సరస్వతీ సమానులగుదురు.
జ్ఞాన శక్తి రూపముననున్న, వశిన్యాది శక్తులతో కూడ దేవిని ధ్యానించువాడు మహాకావ్యములను వ్రాయగలడు.
ఇచ్ఛాశక్తి రూపమున కామరాజకూటమును అధిష్టించిన దేవిని ధ్యానించినయెడల వానికి అప్సరసలు కూడ వశులగుదురు.
అతి గోప్యము, గురువు ద్వారా గ్రహింపనగునది అయిన కామకలారూపము. ఇచ్ఛాజ్ఞానక్రియా శక్తి ధ్యానము.
విష హరము, జ్వర హరము అగు ధ్యానము - దేవిని హృదయమున నిలుపుకొనువాడు అమృతతుల్యమగు తన చూపుచే, సర్పములను గరుత్మంతుడు శమింపజేసినట్లుగా, ఎట్టి జ్వరపీడితుల సంతాపమునైన పోగొట్టగలడు.
యోగ ధ్యాన విశేషము - సహస్రారంలోని చంద్రకళను ధ్యానించిన వారికి పరమానందము లభించును.
భక్తి మహిమ - తనను భక్తితో కోర్కెలు కోరెడి దాసుల వాక్యము పూర్తి కాకుండానే దేవి వారికి దుర్లభ సాయుజ్యమును ప్రసాదించును.
శివశక్తుల సంపూర్ణైక్యత
బ్రహ్మాండము యొక్క సృష్టిలయములు దేవి కనుసన్నల ఆజ్ఞల ప్రకారమే జరుగుచున్నవి.
సత్వరజస్తమోగుణముల వలన ఉద్భవించిన త్రిమూర్తులకు శివాణి పాదపూజయే నిజమైన పూజ.
మహాప్రళయంలో సర్వమూ లయమైనాగాని సతీదేవి మాంగల్య మహిమవలన శివుడు మాత్రము విహరించుచున్నాడు.
జ్ఞానయోగాభ్యాసనా సారము - ఆత్మార్పణమే దేవికి సముచితమైన అర్చన- ఏది చేసినా అంతా భగవతి పూజయే అని కవి విన్నవించుకొంటున్నాడు - "నా మాటలే మంత్రాలు, చేసే పనులన్నీ ఆవాహనాది ఉపచారాలు. నా నడకే ప్రదక్షిణం. నేను తినడమే నైవేద్యము. నిద్రించుటయే ప్రణామము. నా సమస్త కార్యములు నీకు పూజగా అవుగాక."
దేవియొక్క తాటంకములు (కర్ణ భూషణములు) అత్యంత మహిమాన్వితమైనవి. వాని సన్నిధిలో కాల ప్రభావము కూడ నిరోధింప బడును.
శివుడు ఇంటికి వచ్చు సమయములో ధేవి ఎదురేగబోగా ఆమె కాలికి మ్రొక్కుచున్న బ్రహ్మ, విష్ణు, మహేంద్రాదుల కిరీటములు అడ్డముగానున్నవని చెలులు హెచ్చరించుచున్నారు.
దేవిని నిరంతరము ధ్యానించు భక్తునకు ఎట్టి సంపదలు అవుసరము లేదు. వానికి ప్రళయాగ్నియే ఆరతివలె అగును.
దేవి నిర్బంధము కారణముగా 64 తంత్రములను శివుడు భూతలమునకు తెచ్చెను.
దేవీ మంత్రరాజము అయిన పంచదశాక్షరి సకలపురషార్ధ సాధకము. ఈ శ్లోకములో పంచదశాక్షరి సంకేతములతో చెప్పబడినది. (షోడశాక్షరి మంత్రము గుహ్యము. గురువు ద్వారా మాత్రమే శిష్యుడు గ్రహించవలెను. కనుక ఈ శ్లోకములో 15 అక్షరములే చెప్పబడినవి.)
కౌలులు బాహ్య విధానములో చేయు దేవి అర్చన వర్ణన. ఈ శ్లోకము బీజాక్షరములున్నవి. ఇది అధికారము, ఐశ్వర్యము, మోక్షము అవంటి ప్రయోజనములను కలిగించును.
శివశక్తుల ఐక్యత గురించి. నవ వ్యూహాత్మకమైన భైరవస్వరూపము ఇందు వర్ణితము. శివుడు ఆనంద భైరవుడు. పరాశక్తియే మహాభైరవి. వారు వేరు వేరు కాదు.
షట్చక్రములందున్న పృధివ్యాధి తత్వములు దేవియే. అన్ని రూపములు ఆమెయే.
ఆజ్ఞా చక్రమునందున్న పరమ శివునికి నమస్కారము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - పరశంభునాధుడు, పరచిదంబ.
విశుద్ధి చక్రము నందలి దేవీ తత్వము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - వ్యోమేశ్వరుడు, వ్యోమేశ్వరి.
అనాహత చక్రము నందలి హంస ద్వంద్వమునకు వందనము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - హంసేశ్వరుడు, హంసేశ్వరి
స్వాధిష్ఠాన చక్రము నందలి సంవర్తాగ్నికి (అగ్ని తత్వము గలది) స్తుతి. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - సంవర్తేశ్వరుడు, సమయాంబ
మణిపూరక చక్రము నందుండి ముల్లోకములను తడుపు నీలమేఘమునకు ధ్యానము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - మేఘేశ్వరుడు, సౌదామిని
మూలాధార చక్రము నందు నటన చేయు ఆనందభైరవునికి వందనము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - ఆదినటుడు, లాస్యేశ్వరి (ఆనంద భైరవుడు, సమయ)
మొదటి 41 శ్లోకములు "ఆనంద లహరి"యనబడును.
42వ శ్లోకమునుండి "సౌందర్య లహరి"గా భావింపబడుచున్నది.
ద్వాదశాదిత్యులనే మణులతో కూర్చబడిన దేవి కిరీటం వర్ణన.
దేవి కురులు అజ్ఞానమును నశింపజేయునని వర్ణన.
దేవి పాపట నడుమనున్న సిందూరము ఉదయించుచున్న సూర్యునివలెనున్నది.
ముంగురులచే కమ్ముకొనిన దేవి ముఖము పద్మమును పరిహసించుచున్నది. ఆమె చిరునగవు శివుని మోహింపజేయుచున్నది.
లావణ్యకాంతితో నిర్మలమైన దేవి ఫాలము రెండవ చంద్రఖండమువలెనున్నది. మొదటి చంద్రఖండమును దేవి తలయందు ధరించినది.
దేవి కనుబొమలు ధనుస్సువలెనున్నవి. ఆమె సకల భువనముల భయమును పోగొట్టెడు ఉమాదేవి.
దేవి కుడికన్ను సూర్యునివలె పగటిని, ఎడమకన్ను చంద్రునివలె రాత్రిని చేయుచున్నవి. మూడవ నేత్రము సంధ్యాకాలమును కలిగించుచున్నది.
దేవి చూపు విపులమై, మంగళకరమై, దుర్జయమై, దయారసపూరితమై, అవ్యక్త మధురమై, పరిపూర్ణ భోగవతియై, భక్తులను రక్షించునదై అనేక నగరముల బహుముఖవిజయము కలదై యున్నది.
దేవి నేత్రద్వయము ఆకర్ణాంతము విస్తరించి నల్లని తుమ్మెదలవలె నున్నవి. కావ్యరస మాధుర్యభరితమైన చెవులనెడు పుష్పములనుండి మకరందమునాస్వాదించుచున్నవి. వాటిని చూచి అసూయచే మూడవ కన్ను కొంచెము ఎరుపెక్కినది.
శ్రీ అమ్మవారి చూపు శివునియందు శృంగారము గలది. అన్యులయందు భీభత్సము గలది. గంగ (సవతి) యందు కోపము గలది. శివుని చరిత్రయందు అద్భుతము గలది. శివుడు ధరించిన సర్పములవలన భయమొందినది. పద్మమును మించిన సౌందర్యము గలది. చెలులయందు చిఱునగవులు గలది. నాయందు (ఆది శంకరాచార్యుని యందు లేదా భక్తునియందు) దయ గలది.
దేవి కన్నులు ఆమె చెవులవరకు లాగబడిన, రెప్పల వెండ్రుకలనెడు ఈకలు కలిగిన మన్మధ బాణములవలెనున్నవి. ఈశ్వరుని చిత్తమును కలచివేయుటయే ఆ బాణముల లక్ష్యము.
దేవి మూడు కన్నులందును కాటుక ధరించియన్నందున ఎరుపు, తెలుపు, నలుపు వర్ణములు మిళితములైయున్నవి. మహాప్రళయమునందు పరమాత్మలో లీనమైన బ్రహ్మ, విష్ణు, రుద్రులను భవానిదేవి శివునితోగూడి మరల సృజించుటకై ధరించిన సత్వ రజస్ తమో గుణములవలె ప్రకాశించుచున్నవి.
దేవి కన్నులలోని ఎరుపు, తెలుపు, నలుపు రంగులు ఎఱ్ఱని శోణానది, తెల్లని గంగానది, నల్లని యమునానది అనెడు తీర్ధముల పాపహరమైన సంగమము వలె యున్నవి.
జగన్మాత కనులు మూయుటవలన లోక సంహారము, తెరచుట వలన సృష్టి జరుగునందురు. సకల జగములను రక్షించుటకొరకై ఆమె రెప్పలు మూయకుండ ఉండునని కవి తలపు.
అపర్ణాదేవి కన్నులు మీనములవలెనున్నవని వర్ణన.
శివాణీ! నీ చల్లని చూపును నాపై ప్రసరింపజేయుమని ప్రార్థన.
పర్వతరాజపుత్రి కనుల అంచులు ధనుస్సులవలెనున్నవి. ఆ దేవి కడగంటి చూపులు బాణములను ఎక్కుపెట్టుచున్నవా అన్నట్లు ఆ కనుల అంచులను దాటి చెవులవరకు పోవుచున్నట్లు భ్రమను కలుగజేయుచున్నవి. (ఆ విశాలాక్షి కన్నులు చెవులవరకు వ్యాపించియున్నవని భావము)
దేవి చెక్కిళ్ళలో ప్రతిబింబించుచున్న ఆమె తాటంకముల కారణముగ ఆమె ముఖము నాలుగు చక్రములు కలిగిన మన్మధుని రధమువలె నున్నది. అట్టి సుందర ముఖము నాశ్రయించి మన్మధుడు శివునితో తలపడుటకు సంసిద్ధుడయ్యెను.
సరస్వతీదేవి అమృత సూక్తులను వినుచు శర్వాణి తలయూపుచున్నది. ఆమె కుండలముల ఝణంఝణ నాదములు సరస్వతి పలుకులను ప్రశంసించుచున్నవనిపించునట్లున్నవి.
హిమద్వంశ కీర్తిపతాకయైన దేవి నాసిక నుండి వెలువడు చల్లని నిశ్వాసము మాకు అభీష్టఫలములను ప్రసాదించును గాక.
దేవి ఎఱ్ఱని పెదవికి పోలిక చెప్పవలెనంటే పండిన పగడపు తీగనే సామ్యముగా చెప్పవలెను. దొండపండుతో పోల్చడం సరి కాదు.
చకోర పక్షులు దేవి చిఱునగవులనే వెన్నెలను గ్రోలుచున్నవి. అవి అతి మధురములైనందున అందుకు విరుగుడుగా అమృతమును పుల్లని కడుగునీళ్ళగా భావించి త్రాగుచున్నవి.
జగజ్జనని నాలుక ఎల్లపుడు శివుని గుణగణముల వర్ణనలు చేయుచు వెలయుచుండును. ఆమె నోటి ఎరుపు ప్రతిఫలించిన కారణముగా తెల్లని చాయ గలిగిన సరస్వతి మేను కూడ ఎరుపుగా అగుపించుచున్నది.
యుద్ధమునందు దైత్యులను జయించి తిరిగి వచ్చుచున్న కుమార స్వామి (విశాఖుడు), ఇంద్రుడు, విష్ణువులు చండాంశము (చండుడు అను శివభక్తుని భాగము) అయిన శివనిర్మాల్యమును తీసికొననిచ్చగించలేదు. వారు దేవి పాదములచెంత చేరి, తమ శిరస్త్రాణములను తొలగించి, మ్రొక్కుచు ఆమె యొసగిన కర్పూర సహిత తాంబూల శకలములను ఆతురతతో స్వీకరించుచున్నారు.
సరస్వతీ దేవి శివుని గాధలను ఆలపించుచుండగా వినుచు జగన్మాత ఆనందముతో తలయూపుచున్నది. దేవి ప్రశంసావాక్యములలోని వాఙ్మాధుర్యమునకు సరస్వతి వీణాతంత్రుల సవ్వడి సరికాకున్నది.
గిరిసుత చుబుకము తండ్రిచే ప్రేమగా పుణకబడినది. శివునికి దేవి ముఖము అద్దము కాగా ఆ అద్దమునకు పిడివంటిది ఆమె చుబుకము. దానిని పోల్చుటకు మరేదియును సాటిరాదు.
శివుని కౌగిలిచే రోమాంచకమైన దేవి గళము ఆమె ముఖమనెడు పద్మమునకు కాడవలెనున్నది. ఆ క్రింద అగురు బురద అలముకొనియున్న ముత్యాల కంఠహారము బురదలో కూరుకొనిపోయిన తామరతూడువలెనున్నది.
సంగీత రసజ్ఞురాలవగు ఓ తల్లీ! వివాహ సమయమున మంగళసూత్రము కట్టిన పిదప కట్టెడు మూడుదారములయొక్క గుర్తులా యనబడునట్లుగా నీ కంఠమునందలి మూడు రేఖలు నానావిధమనోహరములైన మూడురాగములకు హద్దులవలె భాసించుచున్నవి.
దేవి నాలుగు చేతుల స్తుతి - (పూర్వము బ్రహ్మకు ఐదు తలలుండెడివని, అందొక తలను రుద్రుడు తన గోటితో చిదిమివేసెనని ఇతిహాసము). శివుని గోళ్ళకు భయపడిన బ్రహ్మ తన నాలుగు తలలను రక్షించుకొనుటకై నాలుగు ముఖాలతోను ఒకేమారు శ్రీమాత యొక్క సుకుమారమైన, తామరతూండ్లవంటి బాహువులను స్తుతించుచున్నాడు.
దేవి చేతి గోళ్ళ ప్రశంస - ఉమాదేవియొక్క చేతిగోళ్ళ సహజమైన అరుణవర్ణము పద్మముల రంగును పరిహసించుచున్నది. వాటి అందమును దేనితో పోల్చవచ్చును? లక్ష్మీదేవి విహరించునపుడు ఆమె పాదతలములందలి లాక్షారసము అంటి ఎఱ్ఱనైన కమలదళాలతో కొంతవరకు సామ్యము చెప్పవచ్చును.
దేవి స్తనయుగము వర్ణన - కుమారస్వామి చేతను, గజముఖునిచేతను ఒక్కసారే పాలు త్రాగబడి పాలు గారుచున్న దేవి స్తనయుగము మా కష్టములను పోగొట్టును గాక. ఆ స్తనద్వయమును చూచి గజాననుడు తన కుంభస్థలమును తల్లి అపహరించెనేమోయని కలతచెందుచున్నాడు.
పార్వతీదేవి వక్షోజములు కెంపులచే చేయబడిన అమృత కలశములు. కనుకనే ఆమె స్తన్యము గ్రోలిన గజాననుడు, కుమారస్వామి బాలురవలెనే యున్నారు. (వృద్ధులు అగుట లేదు)
అంబ కుచ ప్రదేశమునందున్న హారము గజాసురుని కుంభములందలి ముత్యములచే కూర్చబడినది. అట్టి తెల్లని స్వచ్ఛమైన హారము దేవి అధరకాంతులచే లోపల కొంచెము ఎర్రనై, ఈశ్వరుని కీర్తి, ప్రతాపము మిళితమైనట్లుగా భాసించుచున్నది.
దేవి స్తన్యము యొక్క మహిమ - పర్వతపుత్రి స్తన్యము ఆమె హృదయమునందలి పాలకడలినుండి పుట్టిన వాఙ్మయము. కనుకనే దయతో దేవి యొసగిన స్తన్యమును గ్రోలిన ద్రవిడశిశువు ప్రౌఢకవుల మధ్య కమనీయకనియయ్యెను.
దేవి నాభి వర్ణన - హరుని కోపాగ్నిచే దహింపబడుచున్న మన్మధుడు ప్రాణరక్షణకొరకు పార్వతి నాభి అను సరస్సులో దూకెను. వాని శరీరమునుండి వెడలి తీగవలె సాగిన పొగనే పామర జనము ఆమె నూగారని అనుచున్నారు.
దేవి నూగారు వర్ణన - శివాణి సన్నని నడుమునందు యమునానది సూక్ష్మతరంగములవలె (అతి చిన్నవైన) రోమావళి యున్నది. ఆమె కుచకుంభముల ఒరిపిడివలన వాని మధ్యనున్న ఆకాశము(స్థలము)నకు చోటు చాలలేదు. కనుక ఆ యాకాశము క్రిందికి జారి ఆమె నాభి రంధ్రమున చోటుచేసుకొనెనా యన్నట్లుగా అవియనిపించుచున్నవి.
గిరిపుత్రీ! నీ నాభి నిశ్చలమైన గంగ సుడి. స్తనములు అను పూమొగ్గలకు ఆధారమైన రోమరాజి యనెడు తీగకు పాదు. మన్మధుని పరాక్రమాగ్నికి హోమగుండము. రతీ దేవికి విహార గృహము. ఈశ్వరుని కనుల సిద్ధికి గుహాముఖము. అయి విరాజిల్లుచున్నది.
శైల తనయ నడుము వర్ణన : సహజముగానే కృశించినది. స్తన భారముచే వంగినది. నాభియు, వళులు (మడతలు)ను ఉన్న చోట విఱిగిపోవునో యన్నట్లున్నది. ఒడ్డు విఱిగిన నదీ తీరమున ఉన్న చెట్టువలె ఊగుచున్నది.
దేవి వళుల వర్ణన : మన్మధ నిర్మితములై కనక కలశములవంటి దేవి స్తనములు ఈశ్వర స్మరణచేత సారెకు ప్రక్కలయందు చెమర్చుచు రవికను పిగుల్చుచున్నవి. చంకలను ఒరయుచున్నవి. ఆ కుచ భారమునకు నడుము విరిగిపోకుండా కాపాడుటకై దేవి వళులు (నడుముపైని మూడు ముడుతలు) లవలీలతచే కట్టబడిన మూడు కట్లవలెనున్నవి.
దేవి నితంబము వర్ణన: పార్వతీ! నీ తండ్రి యగు క్షితిధరపతి భూమినుండి విస్తారమును తీసి నీకు అరణముగా నిచ్చెను. అందున నీ నితంబము (పిఱుదులు) విస్తారమై వసుమతి (భూమి)ని కప్పివైచుచు తేలిక చేయుచున్నవి.
భవతి తొడలు, మోకాళ్ళ వర్ణన : పార్వతీదేవి తొడలు గజరాజు తుండములను, బంగారపు అరటి కంబములను జయించునవి. భర్తకు సదా మ్రొక్కుచుండుటచే ఆమె మోకాళ్ళు గట్టిపడినవి.
83 నుండి 91వ శ్లోకము వరకు దేవి పాదములు, గోళ్ళ వర్ణన యున్నది.
గిరిసుతా! ఈశ్వరుని గెలుచుట కొఱకు మన్మధుడు నీ పిక్కలను పదేసి బాణములున్న అమ్ముల పొదులుగా చేసికొనెను. (ఎందుకంటే మన్మధుని దగ్గర ఉన్న ఐదే బాణాలు చాలవని). వాని చివరల నీ గోటికొనలనెడు బాణాగ్రములు (ములుకులు) కనుపించుచున్నవి. ఆ బాణాగ్రములు (అమ్మవారి పాదములకు మ్రొక్కుచున్న) దేవతల కిరీటములచే పదునుపెట్టబడియున్నవి.
మాతా! నీ పాదములు వేదములకు శిరోభూషణములు. నీ పాద్య జలమే శివుని జటాజూటముననున్న గంగ. విష్ణువు తలపైనున్న చూడామణి కాంతియే నీ శ్రీ పాదముల లత్తుక శోభ. తల్లీ నీ పాదములను దయతో నా శిరసుపైనుంచుమమ్మా.
దేవీ! తడి లత్తుకతో కాంతులీనెడు నీ పాదద్వయమునకు మ్రొక్కెదను. నీ పాదముల తాకిడిని పొందుచున్న ప్రమదావనమునందలి అశోకవృక్షమును చూచి శివుడు అసూయ చెందుచున్నాడు.
ప్రణయ కలహ సమయమున దేవి తన కాలితో శివుని లలాటమున తన్నినది. అప్పుడు ఆమె అందెల మోత యెట్లున్నది? తన శత్రువైన శివునికి పరాభవము కలిగినందుకు మన్మధుడు కిలకిల నవ్వినట్లున్నది.
జననీ! శ్రీకరములు, సదా శోభాయమానములు అయిన నీపాదములను పద్మములతో ఎట్లు పోల్చనగును? పద్మములు రాత్రులు ముకుళించుకొనిపోవును. మంచు తగిలిన వడలి పోవును. అవి కొంచెము మాత్రమే లక్ష్మి అనుగ్రహమునకు పాత్రములు.
దేవీ! నీ పాదములు యశస్సును కలిగించునవి, విపత్తులను హరించునవి. పురారియైన శివుడు దయామయుడై వివాహ సమయమున నీ సుకుమార పాదములను తన చేతబట్టి మృదువుగా సన్నెకల్లును త్రొక్కించెను. అట్టి పాదాగ్రములను పూజ్యులైన పూర్వకవులు కఠినమైన తాబేటి పెంకుతో ఎట్లు పోల్చిరో తెలియరాదు.
చండీమాత పాదములు బీదలకు భద్రమైన సకలైశ్వర్యములను ప్రసాదించును. చండీమాత పాదములకు దేవతలు చేతులు జోడించి అంజలి ఘటించుచున్నారు. మాత కాలిగోళ్ళనెడు చంద్రుల కాంతికి ఆదేవతాస్త్రీల కర పద్మముల ముకుళించుచున్నట్లుగా అనిపించుచున్నది. ఆ చంద్రులు స్వర్గములో (దేవతలకు సంపదలనిచ్చెడు) కల్పవృక్షములను పరిహసించుచున్నట్లున్నది.

తల్లీ! నీ పాదములు ఎల్లప్పుడు కోరిన సంపదలనిచ్చునవి. సౌందర్యమనెడు మకరందమును వెదజల్లెడు కల్పవృక్షపు పుష్పగుచ్ఛములు. ఆఱు ఇంద్రియములతో (మనసు + జ్ఞానేంద్రియములు) గూడిన నా జీవము ఆఱు కాళ్ళ తుమ్మెదవలె నీపాదములను ఆశ్రయించును గాక.
మాతా! సుందర గమనా! నీ భవనములోని పెంపుడు హంసలు నీ నడకల తీరును నేర్చుకొన గోరి, నీ వెంటనే తిరుగుచున్నవి. నీ పాదముల మణిమంజీరములు (అందెలు) ఆ హంసలకు పదన్యాసమునందు శిక్షణ నిచ్చుచున్నట్లుగా ఉన్నది.



42వ శ్లోకము నుండి 91వ శ్లోకము వరకు శంకరాచార్యుడు శ్రీమాత కిరీటము నుండి పాదములవరకు స్తుతించాడు. ఇప్పుడు దేవి సంపూర్ణ స్వరూపము వర్ణింపబడుచున్నది.
దేవీ! బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, రుద్రులు నీకు సమీప సేవను పొందుటకై నీ మంచమునకు కోళ్ళుగా ఉన్నారు. శివుడు తెల్లని కాంతి అను మిషతో నీకు పైని కప్పుకొనుటకు దుప్పటియైనాడు. అట్టి సదాశివుడు నీ యెఱ్ఱని దేహకాంతులు ప్రతిఫలించిన కారణమున తానును ఎఱ్ఱబారి మూర్తీభవించిన శృంగార రసము వలెనుండి నీ కనులకు వినోదము గొలుపుచున్నాడు. (శివుని శరీర వర్ణం తెలుపు. దేవి శరీర వర్ణం ఎఱుపు.)
కామేశ్వరి సంపూర్ణ సౌందర్య స్తుతి - శివాణి కేశములు వక్రమైనవి. సహజ మందహాసము సరళమైనది. దేహము శిరీష పుష్పము వలె మృదువైనది. కుచ ప్రాంతము కఠినమైనది. నడుము లతవలె సన్ననైనది. నితంబములు విశాలమైనవి. సదాశివుని కరుణా శక్తి మూర్తీభవించిన రూపమే ఆ సౌందర్యమూర్తి. అట్టి అరుణాదేవి లోకములను రక్షించుటకు జయమొందుగాక.
సూర్యుడు దేవి పాదములవద్ద సేవ చేయుచున్నాడు. తన కిరణ తీవ్రతను ఉపశమించి, అద్దమువలె ధగధగలాడుచున్నాడు. ఆ అద్దములో దేవి ముఖపద్మము కనుపించుచున్నది. (సూర్యుని హృదయ ఫలకములో దేవి ముఖము ప్రతిబింబించుచున్నది). ఆ పద్మము సదా వికసించియున్నందున చంద్రుని బాధ లేదు (రాత్రి కాదు కనుక సూర్యుని సేవకు అంతరాయము లేదు).
చంద్రబింబమును దేవి అలంకరణ సామగ్రి పెట్టెగా చెప్పుట - దేవీ! చంద్రబింబము జలమయమైన మరకత మణితో చేయబడిన పెట్టె. అది కళలు అనే కర్పూరముతో నిండియున్నది. నీవు వాడుకొనే కస్తూరియే అందులో కనుపించే మచ్చ. ప్రతిదినము దీనిలోని వస్తువులను (కస్తూరిని, కర్పూర శకలాలను) నీవు వాడుకొనుచుండుట చేత ఆ పెట్టె తగ్గిపోతున్నది. (దానిలోని రంధ్రము పెద్దగా అగుచున్నది.) దానిని బ్రహ్మ మరల పూరిస్తూ ఉన్నాడు. (చంద్రునిలోని హెచ్చుతగ్గులు - కృష్ణ పక్షము, శుక్ల పక్షము).
దేవీ! నీవు త్రిపురారి అంతఃపురాధిదేవతవు. (శివుని పట్టపురాణివి). నీ పాదసేవ దుర్లభము. కనుక ఇంద్రాది దేవతలు నీ ద్వారముచెంత కావలిగానున్న అణిమాది సిద్ధుల ప్రసాదములతో అతులమైన ఇష్టసిద్ధులను పొంది తృప్తులగుచున్నారు.
సతీదేవీ! గొప్పకవులను సరస్వతీవల్లభులంటారు. గొప్ప సంపన్నులను లక్ష్మీపతులంటారు. కాని నీ కౌగిలింత మాత్రము ఈశ్వరునకు మాత్రమే లభించును. గోరింట చెట్టుకు కూడ లభించదు.
గిరిజా దేవీ! వేదవిదులు నిన్ను సరస్వతి యనియు, లక్ష్మి యనియు, పార్వతి యనియు చెబుతారు. కాని నీవు ఈ మువ్వురికంటె వేరైన మహామాయవు. పరబ్రహ్మయగు సదాశివుని దేవియగు చంద్ర కళగా ఆరాధింపబడు శ్రీవిద్యవు. దేశకాల పరిమితులకు అతీతమైన మహిమ గల దానవు. మహామాయవై విశ్వమును భ్రమింపజేయుచున్నావు.
ఉమా దేవీ! సముద్భూత స్థూల స్తనభరమైన వక్షోభాగము,మనోహరమైన దరహాసము, కడగంటి చూపులందు మన్మధులు, కదంబమువంటి ప్రభ కలిగిన తనువు - ఈ గుణములన్నియు శివుని మనస్సునందు నీవేయను భ్రాంతి కలిగించును. నిర్మలమైన మనస్సుతో దేవిని ధ్యానించు భక్తులకు ఈ గుణములు కలుగుటయే వారి భక్తికి పరమావధి.
తల్లీ! నేను జ్ఞానార్ధిని. నీ పాదములు కడిగినపుడు లత్తుక రసముతో ఎఱ్ఱనైన నీ పాదోదకమును త్రాగే భాగ్యము నాకెప్పుడు లభిస్తుందో? అది మూగవారిని కూడ కవులుగా చేయునది. ఆ జలమునకు సరస్వతీ దేవి ముఖ తాంబూల రస గుణము కలిగనది.
(ఈ శ్లోకములో షట్‌-కమల భేదనము, సహస్రార కమలమును చేరుకొనుట సూచింపబడినవి) దేవీ! సాదాఖ్య చంద్రకళ యగు నిన్ను భజించువాడు విద్యను, ఐశ్వర్యమును పొంది (సరస్వతిని, లక్ష్మిని వశము చేసుకొని) బ్రహ్మకును, విష్ణువునకును విరోధిగా వెలుగుచున్నాడు. రమ్యమైన రూపము పొంది రతీదేవి పాతివ్రత్యమును శిధిలము చేయగలడు. చిరంజీవియై జీవుని అవిద్యను జయించి బ్రహ్మానంద రసమును ఆస్వాదించును. (సాదాఖ్య కళను ఉపాసించు వానికి ఐహికాముష్మిక ఫలములు రెండును సిద్ధించును)
సర్వ జ్ఞానములకు, సకలైశ్వర్యములకు నిధియైన శ్రీదేవీ! నిత్య మందహాస వదనా! నిరవధిక గుణ నిధానమా! నీతి నిపుణా! నిరాటంక జ్ఞానా! నియమ వశమైన చిత్తములందు నివశించుదానా! నియమ విధులకు కట్టుబడని దానా! నిఖిల నిగమాంత స్తుత పదా! ఆపదలు, ఆటంకములు సమీపించని దానా! నిత్యా! నా స్తుతిని కూడ స్వీకరించు తల్లీ! (చండిక స్తోత్రము చేతను, భాస్కరుడు నమస్కారము చేతను, విష్ణువు అలంకారము చేతను, శంకరుడు అభిషేకము చేతను సంతుష్టులగుదురు.)
సర్వ వాక్కులకు జననీ! ఈ విశ్వములోని వాక్కులన్నయును నీవే! కనుక నా స్తోత్రములోని వాక్కులు కూడా నీవే! అట్టి నీ వాక్కులచేతనే నిన్ను స్తుతించుచుంటిని. దీప కాంతులతో సూర్యునికి నీరాజనమిచ్చినట్లుగాను, చంద్రకాంత శిలా జలముచే చంద్రునికి అర్ఘ్యమిచ్చినట్లుగాను, జలములతో సముద్రుని తృప్తి పరచినట్లుగాను నేను నీ వాక్కులచేత నిన్ను స్తుతించి నీకు ప్రీతి కలిగింపనెంచితిని.శిశువు పలుకులు నిరర్ధకమైనవైనను తల్లికి ఆనందమే కలిగించును కదా! అట్లే ఈ భక్తుని స్తుతి సకల లోకమాతవగు నీకు ఆనందము కలిగించును గాక.
శ్రీవిద్యా రహస్యాలు, మంత్ర శాస్త్రం
శాక్తేయ సంప్రదాయంలో శ్రీవిద్య చాలా ముఖ్యమైనది. శ్రీవిద్య అంటే వివిధ రకాలుగా నిర్వచిస్తారు. త్రిపుర సుందరిని ప్రసన్నురాలిని చేసుకొనుటకు మూడు విధాలుగా ఆరాధనాదీక్షను ఆచరిస్తారు (1) దేవీ ధ్యానము (2) శ్రీచక్ర పూజ (3) శాక్త సిద్ధాంత అధ్యయనము. ఈ మూడింటినీ కలిపి శ్రీవిద్య అంటారు.వీటిలో శ్రీచక్రపూజ చాలా ముఖ్యంగా భావిస్తారు. దీనినే మరొక విధంగా లలితా సహస్రనామ స్తోత్రము పారాయణము, శ్రీచక్రార్చన, షోడశాక్షరీ మంత్రము అనుష్ఠానము కలిపి "శ్రీవిద్య" అని చెబుతారు. శ్రీవిద్యలో "వామాచారము", "సమయాచారము" అనె రెండు విధాలున్నాయి. సౌందర్య లహరిలో శ్రీచక్రం గురించి 11వ శ్లోకంలో చెప్పబడింది.
మిగిలిన అనేక శ్లోకాలలోఅనేక శ్రీవిద్యా రస్యాలున్నాయి అని చెబుతారు. ఉదాహరణకు "శివః శక్త్యా యుక్తో యది భవతి" అని ప్రాంభమయ్యే మొదటి శ్లోకంలోనే శ్రీవిద్యాసారమంతా నిక్షిప్తమయ్యి ఉన్నదని దర్శన సాహిత్య కర్తల అభిప్రాయము. కామేశ్వర సూరి ఈ శ్లోకాన్ని శ్రీవిద్యలోని 14 అంశాల పరంగా వ్యాఖ్యానించాడు. అవి (1) వేదాంతము (2) సాంఖ్యము (3) శ్రీవిద్య యొక్క ముఖ్య దేవత (4) సార్ధకములైన శబ్దములు (5) వాని అర్ధము (6) శబ్దముల సృష్టి (7) యంత్రము (8) ప్రణవము (9) మాతృక (సంస్కృతాక్షరమాల) (10) కాది విద్య (11) హాదివిద్య (!2) పంచాక్షరి (13) దీక్షనిచ్చు గురువు (14) చంద్రకళ . ఒక్కొక్క శ్లోకంలోను ఒక్కొక్క మంత్రం లేదా బీజాక్షరాలు నిక్షిప్తమై ఉన్నాయంటారు.
ఇంకా సౌందర్య లహరిలో అనేక మంత్రాలు నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయంటారు. ఒక్కో మంత్రానికి లేదా శ్లోకానికి ఒకోపారాయణాఫలం చెప్పబడింది. శాక్తేయులలో రెండు శాఖలవారున్నారు - కౌలాచారులు, సమయాచారులు. కౌలులు శ్రీచక్రం, ఇతర సంకేతాలలో శ్రీమాతను పూజిస్తారు మరియు బాహ్యపూజకు ప్రాధాన్యత ఇస్తారు. సమయాచారులు అంతఃపూజ ద్వారా మూలాధార చక్రంనుండి సహస్రదళకమలం వరకు కుండలినీశక్తిని జాగృతం చేయడాని దీక్ష సాగిస్తారు.

గాధలు
సౌందర్య లహరి స్తోత్రావిర్భావం గురించి ఒక గాధ ప్రచారంలో ఉంది. ఆదిశంకరుడు ఒకమారు స్వయంగా కైలాసం వెళ్ళాడట. అక్కడ వ్రాసి ఉన్న ఈ శ్లోకాన్ని చదువుతుండగా వినాయకుడు దానిని క్రిందినుండి చెరిపేశాడట. ఎందుకంటే అది మానవులకు అందరాని అత్యంతగుహ్య విద్య గనుక. అలా శంకరుడు మొదటి 40 శ్లోకాలు మాత్ర,మే చదివాడు. వాటికి తోడు మరొక 60 శ్లోకాలు శంకరాచార్యుడు రచించాడు. ఆ వంద శ్లోకాలు కలిపి సౌందర్య లహరిగా ప్రసిద్ధమయ్యాయి. ఈ కథకు వివిధ రూపాంతరాలున్నాయి. ఏమయినా మొదటి 40 శ్లోకాలు యంత్ర తంత్ర విధాన రహస్యాలు తెలుపుతుండగా తరువాతివి శ్రీమాత యొక్క సౌందర్యాన్ని కీర్తిస్తున్నాయి.

విశేషాలు
సౌందర్యలహరిలోని శ్లోకాలు మంత్రాలుగా కూడా భావింపబడుతాయి. ఒక్కొక్క శ్లోకం నియమానుసారం ఉపాసిస్తే ఒక్కో ప్రయోజనం లేదా సిద్ధి లభిస్తుందని విశ్వాసం. ఉదాహరణకు -
మొదటి శ్లోకము - దినమునకు 100సార్లు చొప్పున 12 దినాలు జపించి త్రిమధురము (బెల్లము+నేయి+కొబ్బరి) లేదా మధురమైన అపూపము నైవేధ్యంగా పెడితే ఇష్ట సిద్ధి, అభ్యుదయము, సకల విఘ్ననివారణ కలుగుతాయి.
11వ శ్లోకము - దినమునకు 100సార్లు చొప్పున 8 దినాలు జపించి బెల్లపు పానకము, వెన్న, గారెలు మహానైవేద్యం పెట్ఠాలి. ఈ శ్లోకాన్ని రాగిరేకుపై వ్రాసి మొలతాడులో తాయెత్తుగా కట్టుకొనాలి. అప్పుడు వంధ్యత్వం నశిస్తుంది.
20వ శ్లోకం- విభూతిలో గాని, నీటిలో గాని వ్రాసి 1000 సార్లు జపిస్తే విషం విరుగిపోతుంది. దినమునకు 2000 సార్లు చొప్పున 45 దినములు జపిస్తే సర్పవశీకరణ లభిస్తుంది.
43వ శ్లోకం- దినమునకు 3000 సార్లు చొప్పున 40 దినములు జపించి తేనెను నైవేద్యంగా పెట్టి ఉంగరముగా తాయెత్తు ధరిస్తే అందరిని ఆకర్షించే శక్తి లభిస్తుంది.
91వ శ్లోకం- దినమునకు 1000 సార్లు చొప్పున 45 దినములు పాయసమును నైవేద్యంగా పెడితే భూమి, ధనము సిద్ధిస్తాయి.
103వ శ్లోకం- 45 దినాలలో మొత్తం లక్ష సార్లు జపించి, పండ్లు కొబ్బరికాయ నైవేద్యం సమర్పించాలి. సకల వాంఛాసిద్ధి యగును.




ఆనందలహరీ

శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి .
అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి .. ౧..
తనీయాంసం పాంసుం తవ చరణపంకేరుహభవం
విరించిస్సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ .
బహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలనవిధిమ్ .. ౨..
అవిద్యానామంత-స్తిమిర-మిహిరద్వీపనగరీ
జడానాం చైతన్య-స్తబక-మకరంద-స్రుతిఝరీ .
దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు-వరాహస్య భవతీ .. ౩..
త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా .
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంచాసమధికం
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ .. ౪..
హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ .
స్మరోऽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా
మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ .. ౫..
ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః
వసంతః సామంతో మలయమరుదాయోధనరథః .
తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగాత్తే లబ్ధ్వా జగదిద-మనంగో విజయతే .. ౬..
క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా
పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చంద్రవదనా .
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తాదాస్తాం నః పురమథితురాహోపురుషికా .. ౭..
సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే .
శివాకారే మంచే పరమశివపర్యంకనిలయాం
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ .. ౮..
మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి .
మనోऽపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే .. ౯..
సుధాధారాసారైశ్చరణయుగలాంతర్విగలితైః
ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయమహసః .
అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం
స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుణ్డే కుహరిణి .. ౧౦..
చతుర్భిః శ్రీకణ్ఠైః శివయువతిభిః పంచభిరపి
ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః .
చతుశ్చత్వారింశద్వసుదలకలాశ్రత్రివలయ
త్రిరేఖాభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః .. ౧౧..
త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం
కవీంద్రాః కల్పంతే కథమపి విరించిప్రభృతయః .
యదాలోకౌత్సుక్యాదమరలలనా యాంతి మనసా
తపోభిర్దుష్ప్రాపామపి గిరిశసాయుజ్యపదవీమ్ .. ౧౨..
నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం
తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః .
గలద్వేణీబంధాః కుచకలశవిస్రస్తసిచయా
హఠాత్ త్రుట్యత్కాంచ్యో విగలితదుకూలా యువతయః .. ౧౩..
క్షితౌ షట్పంచాశద్ ద్విసమధికపంచాశదుదకే
హుతాశే ద్వాషష్టిశ్చతురధికపంచాశదనిలే .
దివి ద్విష్షట్త్రింశన్మనసి చ చతుష్షష్టిరితి యే
మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగమ్ .. ౧౪..
శరజ్జ్యోత్స్నాశుద్ధాం శశియుతజటాజూటముకుటాం
వరత్రాసత్రాణస్ఫటికఘుటికాపుస్తకకరామ్ .
సకృన్నత్వాం నత్వా కథమివ సతాం సంన్నిదధతే
మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః కణితయః .. ౧౫..
కవీంద్రాణాం చేతఃకమలవనబాలాతపరుచిం
భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీమ్ .
విరించిప్రేయస్యాస్తరుణతరశృంగారలహరీ
గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాంరంజనమమీ .. ౧౬..
సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః
వశిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః .
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః
వచోభిర్వాగ్దేవీవదనకమలామోదమధురైః .. ౧౭..
తనుచ్చాయాభిస్తే తరుణతరణిశ్రీసరణిభిః
దివం సర్వాముర్వీమరుణిమనిమగ్నాం స్మరతి యః .
భవంత్యస్య త్రస్యద్వనహరిణశాలీననయనాః
సహోర్వశ్యా వశ్యాః కతి కతి న గీర్వాణగణికాః .. ౧౮..
ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో
హరార్ధం ధ్యాయేద్యోహరమహిషి తే మన్మథకలామ్ .
స సద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతిలఘు
త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగామ్ .. ౧౯..
కిరంతీమంగేభ్యః కిరణనికురంబామృతరసం
హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః .
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాసారసిరయా .. ౨౦..
తటిల్లేఖాతన్వీం తపనశశివైశ్వానరమయీం
నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్ .
మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా
మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీమ్ .. ౨౧..
భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా
మితి స్తోతుం వాంచన్ కథయతి భవాని త్వమితి యః .
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం
ముకుందబ్రహ్మేంద్రస్ఫుటముకుటనీరాజితపదామ్ .. ౨౨..
త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభోరపరమపి శంకే హృతమభూత్ .
యదేతత్త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిలశశిచూడాలముకుటమ్ .. ౨౩..
జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశస్తిరయతి .
సదాపూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివ
స్తవాజ్ఞామాలంబ్య క్షనచలితయోర్భ్రూలతికయోః .. ౨౪..
త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాంతవ శివే
భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా .
తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్వన్ ముకులితకరోత్తంసమకుటాః .. ౨౫..
విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ .
వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సంమీలతి దృశాం
మహాసంహారేऽస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ .. ౨౬..
జపో జల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా
గతిః ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాహుతివిధిః .
ప్రణామస్సంవేశస్సుఖమఖిలమాత్మార్పణదృశా
సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితమ్ .. ౨౭..
సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం
విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః .
కరాళం యత్క్ష్వేళం కబలితవతః కాలకలనా
న శంభోస్తన్మూలం తవ జనని తాటంకమహిమా .. ౨౮..
కిరీటం వైరించం పరిహర పురః కైటభభిదః
కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారిముకుటమ్ .
ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం
భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే .. ౨౯..
స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణ్మాద్యాభిరభితో
నిషేవ్యే నిత్యే త్వాంఇతి సదా భావయతి యః .
కిమాశ్చర్యం తస్య త్రినయనసమృద్ధిం తృణయతో
మహాసంవర్తాగ్నిర్విరచయతి నిరాజనవిధిం .. ౩౦..
చతుష్షష్ట్యా తంత్రైః సకలమతిసంధాయ భువనం
స్థితస్ తత్తత్సిద్ధిప్రసవపరతంత్రైః పశుపతిః .
పునస్త్వన్నిర్బంధాదఖిలపురుషార్థైకఘటనా
స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదమ్ .. ౩౧..
శివః శక్తిః కామః క్షితిరథ రవిః శీతకిరణః
స్మరో హంసః శక్రస్తదను చ పరామారహరయః .
అమీ హృల్లేఖాభిస్తిసృభిరవసానేషు ఘటితా
భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ .. ౩౨..
స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనో
ర్నిధాయైకే నిత్యే నిరవధిమహాభోగరసికాః .
భజంతి త్వాం చింతామణిగుననిబద్ధాక్షవలయాః
శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతిశతైః .. ౩౩..
శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం
తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘమ్ .
అతశ్శేషశ్శేషీఇత్యయముభయసాధారణతయా
స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః .. ౩౪..
మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథిరసి
త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం న హి పరమ్ .
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా
చిదానందాకారం శివయువతి భావేన బిభృషే .. ౩౫..
తవాజ్ఞాచక్రస్థం తపనశశికోటిద్యుతిధరం
పరం శంభుం వందే పరిమిలితపార్శ్వం పరచితా .
యమారాధ్యన్ భక్త్యా రవిశశిశుచీనామవిషయే
నిరాలోకేऽలోకే నివసతి హి భాలోకభవనే .. ౩౬..
విశుద్ధౌ తే శుద్ధస్ఫటికవిశదం వ్యోమజనకం
శివం సేవే దేవీమపి శివసమానవ్యవసితామ్ .
యయోః కాంత్యా యాంత్యా శశికిరణసారూప్యసరణిం
విధూతాంతర్ధ్వాంతావిలసతి చకోరీవ జగతీ .. ౩౭..
సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం
భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరమ్ .
యదాలాపాదష్టాదశగుణితవిద్యాపరిణతి
ర్యద్ ఆదత్తే దోషాద్ గుణమఖిలమద్భ్యః పయ ఇవ .. ౩౮..
తవ స్వాధిష్ఠానే హుతవహమధిష్ఠాయ నిరతం
తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయామ్ .
యదాలోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే
దయార్ద్రా యద్దృష్టిః శిశిరముపచారం రచయతి .. ౩౯..
తటిత్త్వంతం శక్త్యా తిమిరపరిపంథిఫురణయా
స్ఫురన్నానారత్నాభరణపరిణద్ధేంద్రధనుషమ్ .
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం
నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనమ్ .. ౪౦..
తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే నవరసమహాతాణ్డవనటమ్ .
ఉభాభ్యామేతాభ్యాముదయవిధిముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జజ్ఞే జనకజననీమజ్జగదిదమ్ .. ౪౧..
సౌందర్యలహరీ
గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం
కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః .
స నీడేయచ్చాయాచ్చురణశబలం చంద్రశకలం
ధనుః శౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణామ్ .. ౪౨..
ధునోతు ధ్వాంతం నస్తులితదలితేందీవరవనం
ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికురనికురంబం తవ శివే .
యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో
వసంత్యస్మిన్ మన్యే వలమథనవాటీవిటపినామ్ .. ౪౩..
తనోతు క్షేమం నస్తవ వదనసౌందర్యలహరీ
పరీవాహస్రోతఃసరణిరివ సీమంతసరణిః .
వహంతీ సుందూరం ప్రబలకబరీభారతిమిర
ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణమ్ .. ౪౪..
అరాలైః స్వాభావ్యాదలికలభసశ్రీభిరలకైః
పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిమ్ .
దరస్మేరే యస్మిన్ దశనరుచికింజల్కరుచిరే
సుగంధౌ మాద్యంతి స్మరదహనచక్షుర్మధులిహః .. ౪౫..
లలాటం లావణ్యద్యుతివిమలమాభాతి తవ య
ద్ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ .
విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథః
సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః .. ౪౬..
భ్రువౌ భుగ్నే కించిద్భువనభయభంగవ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం మధుకరరుచిభ్యాం ధృతగుణమ్ .
ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతేః
ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే .. ౪౭..
అహః సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా .
తృతీయా తే దృష్తిర్దరదలితహేమాంబుజరుచిః
సమాధత్తే సంధ్యాం దివసనిశయోరంతరచరీమ్ .. ౪౮..
విశాలా కల్యాణీ స్ఫుటరుచిరయోధ్యా కువలయైః
కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా .
అవంతీ దృష్టిస్తే బహునగరవిస్తారవిజయా
ధ్రువం తత్తన్నామవ్యవహరణయోగ్యా విజయతే .. ౪౯..
కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం
కటక్షవ్యాక్షేపభ్రమరకలభౌ కర్ణయుగలమ్ .
అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరలా
వసూయాసంసర్గాదలికనయనం కించిదరుణమ్ .. ౫౦..
శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా
సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ .
హరాహిభ్యో భీతా సరసిరుహసౌభాగ్యజయినీ
సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిః సకరుణా .. ౫౧..
గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతీ
పురాం భేత్తుశ్చిత్తప్రశమరసవిద్రావణఫలే .
ఇమే నేత్రే గోత్రాధరపతికులోత్తంసకలికే
తవాకర్ణాకృష్టస్మరశరవిలాసం కలయతః .. ౫౨..
విభక్తత్రైవర్ణ్యం వ్యతికరితలీలాంజనతయా
విభాతి త్వన్నేత్రత్రితయమిదమీశానదయితే .
పునః స్రష్టుం దేవాన్ ద్రుహిణహరిరుద్రానుపరతాన్
రజః సత్త్వం బిభ్రత్ తమ ఇతి గుణానాం త్రయమివ .. ౫౩..
పవిత్రీకర్తుం నః పశుపతిపరాధీనహృదయే
దయామిత్రైర్నేత్రైరరుణధవలశ్యామరుచిభిః .
నదః శోణో గంగా తపనతనయేతి ధ్రువమముం
త్రయాణాం తీర్థానాముపనయసి సంభేదమనఘమ్ .. ౫౪..
నిమేషోన్మేషాభ్యాం ప్రలయముదయం యాతి జగతీ
తవేత్యాహుః సంతో ధరణిధరరాజన్యతనయే .
త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రలయతః
పరిత్రాతుం శంకే పరిహృతనిమేషాస్తవ దృశః .. ౫౫..
తవాపర్ణే కర్ణేజపనయనపైశున్యచకితా
నిలీయంతే తోయే నియతమనిమేషాః శఫరికాః .
ఇయం చ శ్రీర్బద్ధచ్చదపుటకవాటం కువలయమ్
జహాతి ప్రత్యూషే నిశి చ విఘటయ్య ప్రవిశతి .. ౫౬..
దృశా ద్రాఘీయస్యా దరదలితనీలోత్పలరుచా
దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే .
అనేనాయం ధన్యో భవతి న చ తే హానిరియతా
వనే వా హర్మ్యే వా సమకరనిపాతో హిమకరః .. ౫౭..
అరాలం తే పాలీయుగలమగరాజన్యతనయే
న కేషామాధత్తే కుసుమశరకోదణ్డకుతుకమ్ .
తిరశ్చీనో యత్ర శ్రవణపథముల్లఙ్ఘ్య విలస
న్నపాంగవ్యాసంగో దిశతి శరసంధానధిషణామ్ .. ౫౮..
స్ఫురద్గణ్డాభోగప్రతిఫలితతాటంకయుగలం
చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథమ్ .
యమారుహ్య ద్రుహ్యత్యవనిరథమ్ అర్కేందుచరణం
మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే .. ౫౯..
సరస్వత్యాః సూక్తీరమృతలహరీకౌశలహరీః
పిబంత్యాః శర్వాణి శ్రవణచులుకాభ్యామవిరలమ్ .
చమత్కారశ్లాఘాచలితశిరసః కుణ్డలగణో
ఝణత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవ తే .. ౬౦..
అసౌ నాసావంశస్తుహినగిరివంశధ్వజపటి
త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాకముచితమ్ .
వహన్నంతర్ముక్తాః శిశిరతరనిశ్వాసగలితం
సమృద్ధ్యా యస్తాసాం బహిరపి చ ముక్తామణిధరః .. ౬౧..
ప్రకృత్యారక్తాయాస్తవ సుదతి దంతచ్చదరుచేః
ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా .
న బింబం త్వద్బింబప్రతిఫలనరాగాద్ అరుణితం
తులామధ్యారోఢుం కథమివ న లజ్జేత కలయా .. ౬౨..
స్మితజ్యోత్స్నాజాలం తవ వదనచంద్రస్య పిబతాం
చకోరాణామాసీదతిరసతయా చంచుజడిమా .
అతస్తే శీతాంశోరమృతలహరీమమ్లరుచయః
పిబంతి స్వచ్చందం నిశి నిశి భృశం కాంజికధియా .. ౬౩..
అవిశ్రాంతం పత్యుర్గుణగణకథామ్రేడనజపా
జపాపుష్పచ్చాయా తవ జనని జిహ్వా జయతి సా .
యదగ్రాసీనాయాః స్ఫటికదృషదచ్చచ్చవిమయీ
సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా .. ౬౪..
రణే జిత్వా దైత్యానపహృతశిరస్త్రైః కవచిభిర్
నివృత్తైశ్చణ్డాంశత్రిపురహరనిర్మాల్యవిముఖైః .
విశాఖేంద్రోపేంద్రైః శశివిశదకర్పూరశకలా
విలీయంతే మాతస్తవ వదనతాంబూలకబలాః .. ౬౫..
విపంచ్యా గాయంతీ వివిధమపదానం పశుపతేః
త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే .
తదీయైర్మాధుర్యైరపలపితతంత్రీకలరవాం
నిజాం వీణాం వాణీ నిచులయతి చోలేన నిభృతమ్ .. ౬౬..
కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా
గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా .
కరగ్రాహ్యం శంభోర్ముఖముకురవృంతం గిరిసుతే
కథంకారం బ్రూమస్తవ చిబుకమౌపమ్యరహితమ్ .. ౬౭..
భుజాశ్లేషాన్ నిత్యం పురదమయితుః కణ్టకవతీ
తవ గ్రీవా ధత్తే ముఖకమలనాలశ్రియమియమ్ .
స్వతః శ్వేతా కాలాగరుబహులజంబాలమలినా
మృణాలీలాలిత్యమ్ వహతి యదధో హారలతికా .. ౬౮..
గలే రేఖాస్తిస్రో గతిగమకగీతైకనిపుణే
వివాహవ్యానద్ధప్రగుణగుణసంఖ్యాప్రతిభువః .
విరాజంతే నానావిధమధురరాగాకరభువాం
త్రయాణాం గ్రామాణాం స్థితినియమసీమాన ఇవ తే .. ౬౯..
మృణాలీమృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం
చతుర్భిః సౌందర్యం సరసిజభవః స్తౌతి వదనైః .
నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపో
శ్చతుర్ణాం శీర్షాణాం సమమభయహస్తార్పణధియా .. ౭౦..
నఖానాముద్ద్యోతైర్నవనలినరాగం విహసతాం
కరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే .
కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం
యది క్రీడల్లక్ష్మీచరణతలలాక్షారుణదలమ్ .. ౭౧..
సమం దేవి స్కందద్విపవదనపీతం స్తనయుగం
తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుతముఖమ్ .
యదాలోక్యాశంకాకులితహృదయో హాసజనకః
స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి .. ౭౨..
అమూ తే వక్షోజావమృతరసమాణిక్యకుతుపౌ
న సందేహస్పందో నగపతిపతాకే మనసి నః .
పిబంతౌ తౌ యస్మాదవిదితవధూసంగరసికౌ
కుమారావద్యాపి ద్విరదవదనక్రౌంచదలనౌ .. ౭౩..
వహత్యంబ స్తంబేరమదనుజకుంభప్రకృతిభిః
సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికామ్ .
కుచాభోగో బింబాధరరుచిభిరంతః శబలితాం
ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివ తే .. ౭౪..
తవ స్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః
పయఃపారావారః పరివహతి సారస్వత ఇవ .
దయావత్యా దత్తం ద్రవిడశిశురాస్వాద్య తవ యత్
కవీనాం ప్రౌఢానామజని కమనియః కవయితా .. ౭౫..
హరక్రోధజ్వాలవలిభిరవలీఢేన వపుషా
గభీరే తే నాభీసరసి కృతసంగో మనసిజః .
సముత్తస్థౌ తస్మాదచలతనయే ధూమలతికా
జనస్తాం జానీతే తవ జనని రోమావలిరితి .. ౭౬..
యదేతత్ కాలిందీతనుతరతరంగాకృతి శివే
కృశే మధ్యే కించిజ్జనని తవ తద్భాతి సుధియామ్ .
విమర్దాదన్యోऽన్యం కుచకలశయోరంతరగతం
తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీమ్ .. ౭౭..
స్థిరో గంగావర్తః స్తనముకులరోమావలిలతా
నిజావాలం కుణ్డం కుసుమశరతేజోహుతభుజః .
రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే
బిలద్వారం సిద్ధేర్గిరిశనయనానాం విజయతే .. ౭౮..
నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో
నమన్మూర్తేర్నారీతిలక శనైస్త్రుట్యత ఇవ .
చిరం తే మధ్యస్య త్రుటితతటినీతీరతరుణా
సమావస్థాస్థేమ్నో భవతు కుశలం శైలతనయే .. ౭౯..
కుచౌ సద్యఃస్విద్యత్తటఘటితకూర్పాసభిదురౌ
కషంతౌ దోర్మూలే కనకకలశాభౌ కలయతా .
తవ త్రాతుం భంగాదలమితి వలగ్నం తనుభువా
త్రిధా నద్ధం దేవి త్రివలి లవలీవల్లిభిరివ .. ౮౦..
గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజా
న్నితంబాదాచ్చిద్య త్వయి హరణరూపేణ నిదధే .
అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం
నితంబప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ .. ౮౧..
కరీంద్రాణాం శుణ్డాః కనకకదలీకాణ్డపటలీమ్
ఉభాభ్యామూరుభ్యాముభయమపి నిర్జిత్య భవతీ .
సువృత్తాభ్యాం పత్యుః ప్రణతికఠినాభ్యాం గిరిసుతే
విజిగ్యే జానుభ్యాం విబుధకరికుంభద్వయమసి .. ౮౨..
పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే
నిషంగౌ జఙ్ఘే తే విషమవిశిఖో బాఢమకృత .
యదగ్రే దృశ్యంతే దశ శరఫలాః పాదయుగలీ
నఖాగ్రచ్చద్మానః సురముకుటశాణైకనిశితాః .. ౮౩..
శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా
మమాప్యేతౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ .
యయోః పాద్యం పాథః పశుపతిజటాజూటతటినీ
యయోర్లాక్షాలక్ష్మీరరుణహరిచూడామణిరుచిః .. ౮౪..
నమోవాకం బ్రూమో నయనరమణీయాయ పదయో
స్తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే .
అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే
పశూనామీశానః ప్రమదవనకంకేలితరవే .. ౮౫..
మృషా కృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితం
లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే .
చిరాదంతఃశల్యం దహనకృతమున్మూలితవతా
తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపుణా .. ౮౬..
హిమానీహంతవ్యం హిమగిరినివాసైకచతురౌ
నిశాయాం నిద్రాణాం నిశి చ పరభాగే చ విశదౌ .
పరం లక్ష్మీపాత్రం శ్రియమతిసృజంతౌ సమయినాం
సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిమ్ .. ౮౭..
పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం
కథం నీతం సద్భిః కఠినకమఠీకర్పరతులామ్ .
కథం వా బాహుభ్యాముపయమనకాలే పురభిదా
యదాదాయ న్యస్తం దృషది దయమానేన మనసా .. ౮౮..
నఖైర్నాకస్త్రీణాం కరకమలసంకోచశశిభి
స్తరూణాం దివ్యానాం హసత ఇవ తే చణ్డి చరణౌ .
ఫలాని స్వఃస్థేభ్యః కిసలయకరాగ్రేణ దదతాం
దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ .. ౮౯..
దదానే దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీ
మమందం సౌందర్యప్రకరమకరందమ్ వికిరతి .
తవాస్మిన్ మందారస్తబకసుభగే యాతు చరణే
మినజ్జన్ మజ్జీవః కరణచరణః షట్చరణతామ్ .. ౯౦..
పదన్యాసక్రీడాపరిచయమివారబ్ధుమనసః
స్ఖలంతస్తే ఖేలం భవనకలహంసా న జహతి .
స్వవిక్షేపే శిక్షాం సుభగమణిమంజీరరణిత
చ్చలాదాచక్షాణం చరణకమలం చారుచరితే .. ౯౧..
గతాస్తే మంచత్వం ద్రుహిణహరిరుద్రేశ్వరభృతః
శివః స్వచ్చచ్చాయాఘటితకపటప్రచ్చదపటః .
త్వదీయానాం భాసాం ప్రతిఫలనరాగారుణతయా
శరీరీ శ్ర్ంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్ .. ౯౨..
అరాలా కేశేషు ప్రకృతిసరలా మందహసితే
శిరీషాభా చిత్తే దృషదుపలశోభా కుచతటే .
భృశం తన్వీ మధ్యే పృథురసిజారోహవిషయే
జగత్త్రాతుం శంభోర్జయతి కరుణా కాచిదరుణా .. ౯౩..
కలంకః కస్తూరీ రజనికరబింబం జలమయం
కలాభిః కర్పూరైర్మరకతకరణ్డం నిబిడితమ్ .
అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం
విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే .. ౯౪..
పురారాతేరంతఃపురమసి తతస్త్వచ్చరణయోః
సపర్యామర్యాదా తరలకరణానామసులభా .
తథా హ్యేతే నీతాః శతమఖముఖాః సిద్ధిమతులాం
తవ ద్వారోపాంతస్థితిభిరణిమాద్యాభిరమరాః .. ౯౫..
కలత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః
శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః .
మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే
కుచాభ్యామాసంగః కురవకతరోరప్యసులభః .. ౯౬..
గిరామాహుర్దేవీం ద్రుహిణగృహిణీమాగమవిదో
హరేః పత్నీం పద్మాం హరసహచారీమద్రితనయామ్ .
తురీయా కాపి త్వం దురధిగమనిఃసీమమహిమా
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి .. ౯౭..
కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం
పిబేయం విద్యార్థీ తవ చరణనిర్ణేజనజలమ్ .
ప్రకృత్యా మూకానామపి చ కవితాకారణతయా
యదాధత్తే వాణీముఖకమలతాంబూలరసతామ్ .. ౯౮..
సరస్వత్యా లక్ష్మ్యా విధిహరిసపత్నో విహరతే
రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా .
చిరం జీవన్నేవ క్షపితపశుపాశవ్యతికరః
పరానందాభిఖ్యమ్ రసయతి రసం త్వద్భజనవాన్ .. ౯౯..
ప్రదీపజ్వాలాభిర్దివసకరనీరాజనవిధిః
సుధాసూతేశ్చంద్రోపలజలలవైరర్ఘ్యరచనా .
స్వకీయైరంభోభిః సలిలనిధిసౌహిత్యకరణం
త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియమ్ .. ౧౦౦..
సమానీతః పద్భ్యాం మణిముకురతామంబరమణి
ర్భయాదంతఃస్తిమితకిరణశ్రేణిమసృణః .
దధాతి త్వద్వక్త్రంప్రతిఫలనమశ్రాంతవికచం
నిరాతంకం చంద్రాన్నిజహృదయపంకేరుహమివ .. ౧౦౧..
సముద్భూతస్థూలస్తనభరమురశ్చారు హసితం
కటాక్షే కందర్పః కతిచన కదంబద్యుతి వపుః .
హరస్య త్వద్భ్రాంతిం మనసి జనయామ్ స్మ విమలా
భవత్యా యే భక్తాః పరిణతిరమీషామియముమే .. ౧౦౨..
నిధే నిత్యస్మేరే నిరవధిగుణే నీతినిపుణే
నిరాఘాతజ్ఞానే నియమపరచిత్తైకనిలయే .
నియత్యా నిర్ముక్తే నిఖిలనిగమాంతస్తుతిఅపదే
నిరాతంకే నిత్యే నిగమయ మమాపి స్తుతిమిమామ్ .. ౧౦౩..
ఇతి శ్రీమత్శంకరాచార్యవిరచితం ఆనన్దలహరీ దేవీ స్తోత్ర సంపూర్ణమ్ ..
ఓం తత్సత్ ..

No comments:

Post a Comment