Tuesday, 9 August 2016

ఆగష్టు 12న వరలక్ష్మి వ్రతం నిరభ్యంతరంగా ఆచరించవచ్చు

ఆగష్టు 12న వరలక్ష్మి వ్రతం నిరభ్యంతరంగా ఆచరించవచ్చు



చరిత్రలోనే తొలిసారిగా కృష్ణా పుష్కర ప్రారంభపు రోజైన 12 ఆగష్టు 2016 న వరలక్ష్మి వ్రతం రావటం విశేషం. ఈరోజున వరలక్ష్మి వ్రతం ఆచరించకూడదని మరొక రోజున ఆచరించాలని అనేకమంది చెబుతున్నారు. పుష్కర ప్రారంభ రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించకూడదనే శాస్త్ర నియమం ఎక్కడా లేనే లేదు.

సహజంగా పితృకార్యము ఉన్న రోజున ఓ పర్వదినం వస్తే... పితృ కార్యానికే (ఆబ్దికం లేక శ్రాద్ధము లేక తద్దినము ) తొలి ప్రాధాన్యత ఇవ్వటమనేది సంప్రదాయం. ఈ సంవత్సరం శ్రావణ శుక్ల నవమి రోజున వరలక్ష్మి వ్రతం వచ్చినది. ఒకవేళ ఎవరైనా శ్రావణ శుక్ల నవమి నాడు మరణించి ఉంటే, వారి సంతానం ఆ ఆబ్దికాన్ని ప్రతి సంవత్సరం వచ్చే ఆ శ్రావణ శుక్ల నవమి నాడు ఆచరిస్తారు. కనుక అట్టి తిధి నాడు మరణించి, ప్రస్తుతం ఈ సంవత్సరం ఆ తిధినాడు ఆబ్దికం నిర్వహించుకొనే వారు మాత్రమే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించకూడదు. మిగిలిన వారందరూ నిరభ్యంతరంగా వ్రతాన్ని ఆచరించవచ్చును.

తమ తమ పితరులకు తర్పణ, పిండ ప్రదానాదులు పుష్కరాలు జరిగే 12 రోజులలో ఆచరించవచ్చును. శ్రావణ శుక్ల నవమి నాడు ఉన్న పితృ కార్యాలు మాత్రం ఆగస్టు 12నే నిర్వహించుకోవాలి. పండితులు లేకుండా పుష్కర 12 రోజులలో తర్పణ, పిండ ప్రదానాదులు ఆచరించలేరు. కనుక వారి హాజరు తప్పనిసరి. అందువల్ల  ఈ వినికిడి వచ్చి ఉండవచ్చును. కానీ ప్రస్తుత రోజులలో వరలక్ష్మి వ్రతాన్ని పండితులు లేకుండానే ఎవరికీ వారే వారి వారి గృహాలలో చక్కగా ఆచరించుకుంటున్నారు. ఒకవేళ అలా నిర్వహించుకోలేని వారు తోటి స్త్రీల సహాయ సహకారములతోనైనా వ్రతాన్ని ఆచరించుకోవటానికి ప్రయత్నించండి. 


చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రకృతి రాశి అయినా కన్యా రాశిలోకి దేవ గురువైన బృహస్పతి రాక రోజునే వరలక్ష్మి వ్రతం వచ్చింది కనుక... ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని, పండితులు లభ్యం కాలేదనే కారణంతో వాయిదా వేసుకోవద్దు. కాబట్టి ఇట్టి అరుదైన విశేష పర్వదినాన్ని భక్తి విశ్వాసాలతో ఆచరించండి. ఆగష్టు 12 చేయకూడదు అన్న వార్త విని మానుకోవాలనుకున్న వారందరికీ ఈ విషయాన్ని తెలియచేయండి.

శుభమస్తు.





No comments:

Post a Comment