Tuesday, 20 April 2021

వాల్మీకి రామాయణం - 8వ దినము, అయోధ్యకాండ

 



8వ దినము, అయోధ్యకాండ

దశరథుడి కుమారుల పెళ్ళికి, భరతుడి మేనమామ అయిన యుధాజిత్ కూడా వచ్చాడు. అసలు ఆయన భరతుడిని కొన్ని రోజుల కోసం తన ఇంటికి తీసుకువెళదామని వచ్చాడు. కాని అప్పటికే భరతుడు మిథిలకి బయలుదేరాడని తెలుసుకొని ఆయన కూడా మిథిలకి పయనమయ్యాడు. రామలక్ష్మణ భరతశత్రుఘ్నుల వివాహాన్ని కన్నులార చూసి, వాళ్ళతోపాటే అయోధ్యకి వచ్చాడు. కొంతకాలం అయ్యాక యుధాజిత్ భరతుడిని తన ఇంటికి తీసుకెళ్ళాడు, భరతుడు తనతో పాటు శత్రుఘ్నుడిని కూడా తీసుకు వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఎన్ని భోగాలని అనుభవించినా ఎల్లప్పుడూ తమ తండ్రి అయిన దశరథ మహారాజుని తలుచుకునేవారు.

దశరథ మహారాజుకి తన నలుగురు కుమారులు నాలుగు చేతులవంటివారు, ఆయనకి ఒక కొడుకు మీద ప్రేమ ఎక్కువ, మరొక కొడుకు మీద ప్రేమ తక్కువ అనేది లేదు. నలుగురిని సమానమైన దృష్టితో చేసేవారు. కాని ఆయనకి రాముడంటే అమితమైన ప్రీతి, ఎందుకంటే.....

తేషామపి మహాతేజా రామో రతికరః పితుః |
స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః ||

రాముడికి ఉన్న గుణముల చేత, దశరథుడికి రాముడంటే కొంచెం ప్రేమ ఎక్కువ. రాముడికి ఉన్న గొప్ప గుణాలు ఏంటంటే, ఎప్పుడూ ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటాడు( ప్రాణుల్లో కొన్నిటికి పుట్టుకతో చెవి వినపడక పోవచ్చు, కన్ను చూడలేక పోవచ్చు, నోటితో మాట్లాడలేక పోవచ్చు, కాలు-చెయ్యి పని చేయకపోవచ్చు, కాని పుట్టుకతో చెడ్డ మనస్సుతో ఎవడూ పుట్టడు, మన మనసుని మనం మార్చుకోగలము, అలా మార్చుకోలేకపోతే అది మన తప్పే, అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటె అందరూ ప్రశాంత చిత్తంగా ఉండగలము), ఎప్పుడూ మృదువుగా, మధురంగా మాట్లాడతాడు, అవతలివాడు వెర్రికేకలు వేస్తే, ఉద్రేకంగా మాట్లాడితే రాముడు మాత్రం మౌనంగానే ఉండేవాడు, వాదనలు చేసేవాడు కాదు, అవతలివాడు తనకి వంద అపకారాలు చెసినవాడైన కాని, తనకి ఒకసారి అనుకోకుండా ఉపకారం చేస్తే మాత్రం, రాముడు అతను చేసిన ఉపకారాన్ని గుర్తుకుతెచ్చుకొని ఆనందపడతాడు(అవతలి వ్యక్తిలో తప్పులు వెతికేవాడు కాదు), బుద్ధిమంతుడు, ముందు తనే పలకరించేవాడు, అలా కాకుండా ఎవరన్నా తనని ముందుగా పలకరిస్తే, అయ్యో! నేను వాళ్ళని పలకరించలేకపోయానే అని బెంగ పడేవాడు, అందుకని అందరినీ ముందు తనే ప్రేమగా పలకరించేవాడు, ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడు అయినప్పటికీ నేను ఇంతటివాడిని అని ఎప్పుడూ అనుకోడు, తనకన్నా పెద్దవాళ్ళని ఎల్లప్పుడూ గౌరవించేవాడు, ఎప్పుడూ ధర్మ విరుద్ధమైన మాట మాట్లాడేవాడుకాదు, శ్రేయస్కరము కాని పని చేసేవాడు కాదు(మనం ఏదన్నా పని చేసేముందు, మన లోపలి బుద్ధి మనం చేస్తున్న పని మంచిదో కాదో చెప్తుంది, కాని మన మనసు ఆ మాట వినదు, అది ఈ పని చెయ్యద్దు అని అనదు, అదేమంటుందంటే, అందరు చేస్తున్నారు, మడి కట్టుకుని కూర్చుంటే ఎందుకూ పనికిరాము, ఈ మాత్రానికే ఏమి కొంపలు మునిగిపోవు, ఆ పని చేసింది నేనే అని నేను స్వయంగా చెప్పేదాకా ఎవడికి తెలీదు అని పలురకాలుగా మభ్యపెట్టి, ఇంద్రియాలకి లొంగి, శ్రేయస్కరము కాని పని చేయిస్తుంది. కాని రాముడు మనసుకి లొంగి శ్రేయస్కరము కాని పనిని ఎన్నడూ చేసేవాడు కాదు), అలాగే......

ధర్మకామార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ |
లౌకికే సమయాచారే కృతకల్పో విశారదః ||

గురువులు చెప్పిన విషయాలని అవసరమైనప్పుడు స్మరించగలిగే నేర్పు ఉందట, సమయస్పూర్తితో మాట్లాడగలిగే నేర్పు ఉందట, ఆచారాలని పెద్దలు ఎలా పాటించేవారో అలా పాటించేవాడు. ప్రాజ్ఞులైనవారిని, సత్పురుషులని ఎలా రక్షించాలో తెలిసున్నవాడు, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా నియమించాలో, ఎలా ఆర్జించాలో, ఎలా ఖర్చుపెట్టాలో తెలిసున్నవాడు. సంగీత, శిల్ప, నృత్యములందు ఆరితేరినవాడు. అలాగే లొంగనటువంటి గుర్రాలని, ఏనుగుల్ని లొంగతీసుకుని వాటిమీద స్వారి చెయ్యగలిగే శక్తి ఉన్నవాడు, ప్రపంచంలో ఉన్న అతికొద్దిమంది అతిరథులలో శ్రేష్టుడైనవాడు, ఎన్ని అస్త్ర-శస్త్రాలు తెలిసినా నిష్కారణంగా బాణ ప్రయోగం చెయ్యనివాడు.

ఇన్ని గుణములతో అందరినీ సంతోషింప చెయ్యగలిగేవాడు కనుక రాముడంటె దశరథుడికి అంత ప్రీతి.

ఒకనాడు దశరథుడు,..........నాకు అంతరిక్షంలో మరియు భూమి మీద ఉత్పాతములు(తోకచుక్కలు, గులకరాళ్ళవర్షం మొదలైనవి) కనిపిస్తున్నాయి. నాకు వృద్ధాప్యం వస్తోంది, ఇంక నేను ఎంతోకాలం బ్రతకను. అందుకని నాకు ప్రియాతిప్రియమైన, సకలగుణాభిరాముడికి తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చేసేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని ఆలోచించి దశరథ మహారాజు తన మంత్రులని, ఇతర రాజులని, ప్రభుత్వ ఉద్యోగులని, జానపదులని, అయోధ్యా పట్టణవాసులని మొదలైనవారందరిని పిలిచి పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. రాముడికి తొందర తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనే తొందరలో కైకేయ రాజుకి, జనక మహారాజుకి కబురు పంపలేదు. దశరథ మహారాజు కూర్చున్నాక, అందరూ తమకి ఏర్పాటు చేసిన స్థానాలలో కూర్చున్నారు. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు..........

ఇదం శరీరం కృత్స్నస్య లోకస్య చరతా హితం |
పాణ్దురస్యాతపత్రస్య చ్ఛాయాయాం జరితం మయా ||

ఈ తెల్లటి గొడుగు కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి కూర్చున్నాను. ఈ తెల్లటి గొడుగు కింద కూర్చుని ఉండగానే నా శరీరానికి వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడు నా శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది, అందుకని మూడులోకాలని శాసించగలిగే శక్తివంతుడైన నా పెద్ద కుమారుడు రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను, కాని నా అంతట నేను తీసుకున్న నిర్ణయం కచ్చితంగా ఉండకపోవచ్చు. రాముడు నా పెద్ద కుమారుడన్న పక్షపాత బుద్ధితో నేను ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. నేను న్యాయాన్యాయ విచారణ చేసి ఉండకపోవచ్చు. ఈ సింహాసనం మీద కూర్చునేవాడు ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలి, ప్రజలని తన బిడ్డలుగా చూసుకోవాలి, రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని నేను అనుకుంటున్నాను, కాని రాముడు అలాంటివాడో కాదో మీరు విచారించండి, నిస్పక్షపాతంగా రాగద్వేషాలు లేకుండా ఆలోచించి నిర్ణయించండి, మీరందరూ కూడా రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని అనుకుంటే పట్టాభిషేకం చేస్తాను, మీరందరూ బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అన్నాడు.

అక్కడున్నవాళ్ళందరూ ఒకేసారి సంతోషంతో గట్టిగా " దశరథ మహారాజా! మీరు చెప్పిన ప్రతిపాదనకి మేము అంగీకరిస్తున్నాము. వెంటనే రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేసేయి. రాముడు పట్టాభిషేకం చేయించుకొని, ఏనుగు మీద ఎక్కి, తెల్లటి గొడుగు కింద ఊరేగుతుంటే ఎప్పుడూ చూస్తామా అని మా మనసులు తల్లడిల్లిపోతున్నాయి." అని వారందరూ అరిచిన అరుపుకి అక్కడున్న అంతఃపుర ప్రకారం కదిలిపోయిందా అన్నటుగా ఉంది.

ఈ మాటలు విన్న దశరథుడు సంతోషించి, వాళ్ళని ఒక మాట అడిగాడు. అదేంటంటే.........." కొన్ని వేల సంవత్సరాలుగా మీ అందరినీ కన్నబిడ్డలుగా చుసుకుంటూ, ధర్మం తప్పకుండా పరిపాలన చేశాను. ఇవ్వాళ నేను రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే, మీలో ఒక్కరు కూడా.......దశరథా! ఇప్పుడు మీ వల్ల వచ్చిన లోటు ఏమిటి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ధర్మం తప్పకుండా మమ్మల్ని తండ్రిలా చుసుకున్నావు అని ఒక్కడు అనలేదు. నా కొడుకుకి యువరాజ్య పట్టాభిషేకం చేస్తే చూడాలని ఉందన్నారు. నేను అన్నానని మీరు అన్నారా, నా పాలనలో లోపాలు కనబడ్డాయ, నాకన్నా గొప్ప గుణాలు రాముడిలో కనబడ్డాయ, రాముడు మీకు యువరాజుగా ఎందుకు కావాలో చెప్పండి " అని అన్నాడు.

అప్పుడు వాళ్ళందరూ...............
రామః సత్పురుషో లోకే సత్యధర్మపరాయణః |
సాక్ష్హాద్రామాద్వినిర్వృత్తో ధర్మశ్చాపి శ్రియా సహ ||

" ఈ సమస్త లోకంలో రాముడు సత్పురుషుడు, ఆయనకి సత్యము-ధర్మము కావాలి, అన్నిటికీమించి ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచడం రాముడికి తెలుసు " అన్నారు.

అలాగే, రాముడిని చూస్తే పౌర్ణమి నాటి చంద్రుడిని చూసినంత ఆహ్లాదంగా ఉంటుంది, భూమికి ఎంత ఓర్పు ఉందో రాముడికి అంత ఓర్పు ఉంది, బృహస్పతికి ఎంత బుద్ధి ఉందో రాముడికి అంత బుద్ధి ఉంది, ఇంద్రుడికి ఎంత శక్తి ఉందో రాముడికి అంత శక్తి ఉంది. ఇన్ని గుణాలు ఉన్నాయి కనుక మేము రాముడిని రాజుగా కోరుకుంటున్నాము.

అలాగే, " రాముడు లక్ష్మణుడితో కలిసి యుద్ధానికి వెళితే విజయం చేపట్టకుండా రాముడు రాడు. రాముడు చాలా కాలం యుద్ధం చేసి అయోధ్యకి తిరిగొస్తే, లోపలికి వెళ్ళి సంతోషంగా ఆనందాలలో కాలం గడపడు, ఆయన స్నానం చేసి వెంటనే ఎనుగో, రథమో ఎక్కి అయోధ్యలో ప్రతి వాళ్ళ దెగ్గరికి వచ్చి, ముందు ఆయనే పలకరించి, కుశల ప్రశ్నలు వేస్తాడు. ప్రతి ఇంటిముందు నుంచి వెళుతూ, కనపడ్డ వాళ్ళందరిని ముందు తాను పిలిచి ప్రశ్నిస్తాడు. ఎవరయ్యా ఇలా ప్రశ్నించే రాజు. అటువంటి గుణం నీ కుమారుడిలో ఉంది, అందుకని ఆయన మాకు యువరాజుగా కావాలి " అని అన్నారు.


అలాగే, " ప్రజలు సుఖంగా ఉంటె, తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు. మమ్మల్ని తండ్రిలా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు (ప్రేమ అంటె = తాను అనుభవించక పోయినా, తనవారు అనుభవిస్తుంటే, వారు అనుభవించిన ఆనందాన్ని చూసి తాను ఆనందపడడం). ప్రజలకి ఏదన్నా కష్టం వచ్చి పోయినా కాని, రాముడు మాత్రం ఆ కష్టాన్ని తలుచుకుని బాధపడుతూనే ఉంటాడు. అసలు ఏమితెలియనటువంటి జానపదులు, స్త్రీలు, పిల్లలు, రాముడికి ఏమికానటువంటి వాళ్ళు రోజూ గుడిలో రాముడు ఆరోగ్యంగా ఉండాలని, ఆయన మమ్మల్ని చక్కగా చూడాలి, ఆయన సంతోషంగా ఉండాలని ప్రార్ధిస్తుంటారు. అందుకని రాముడు మాకు రాజుగా కావాలి దశరథ " అన్నారు వాళ్ళందరూ.


వాళ్ళ మాటలు విన్న దశరథుడు ఎంతో సంతోషించాడు. ఈ చైత్ర మాసంలో పుష్యమి నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు. తరువాత సుమంత్రుడిని పిలిచి రాముడిని తీసుకురమ్మన్నాడు, వశిష్ఠుడిని పిలిచి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చెయ్యమన్నాడు. అప్పుడు వశిష్ఠుడు అక్కడున్న వాళ్ళని పిలిచి..........
" మీరు రత్నాలని సిద్ధం చెయ్యండి, అలాగే తెల్లటి వస్త్రాలని, పేలాలని, చతురంగ బలాలని, ఒక మంచి ఏనుగుని, తెల్లటి గొడుగుని, చామరాన్ని, నూరు కుంభాలని, బంగారు కొమ్ములున్న ఎద్దుని, పూర్తిగా ఉన్నటువంటి పులి చర్మాన్ని సిద్ధం చేసి, వీటన్నిటిని దశరథ మహారాజుగారి అగ్ని గృహంలో పెట్టండి. ద్వారాలన్నీ తోరణాలతో అలంకారం చెయ్యండి, గంధం కలిపిన నీళ్ళతో గడపలని కడగండి, ధూపం వెయ్యండి, పాలు పెరుగుతొ కలిపి ఉన్న అన్నాన్ని బ్రాహ్మణులకి పెట్టండి, ప్రతి ఇంటి మీద పతాకాలు ఎగురవెయ్యండి, నాటకాలు వేసేవాళ్ళని, పాటలు పాడేవాళ్ళని సిద్ధంచెయ్యండి, వేశ్యలు అలంకరించుకొని రావాలి, వాళ్ళు అంతఃపురంలో రెండవ కక్ష వరకే వచ్చి అక్కడ నిరీక్షించాలి, అన్ని దేవాలయాల్లో  ప్రత్యేక పూజలు చేయించండి, అభిషేకాలు చేయించండి, పొడువైన కత్తులు పెట్టుకున్న వీరుల్ని సిద్ధం చెయ్యండి " అని అన్నాడు.

సుమంత్రుడు రామచంద్రమూర్తిని ఆ సభకి తీసుకువచ్చాడు. అప్పుడు రాముడు నేను రామవర్మని వచ్చాను అని చెప్పి చెవులు పట్టుకుని తన శిరస్సు దశరథుడి పాదాలకి తగిలేటట్టు నమస్కారం చేశాడు. రాముడికి ఉన్న గుణములని చూసిన దశరథుడికి అద్దంలో తనని తాను చుసుకున్నట్టు ఉంది.


అప్పుడు దశరథుడు......." రామ! నా యొక్క శీలమును తెలుసుకున్న, గొప్ప ధర్మము కలిగిన, నిరంతరమూ నన్ను అనువర్తించేది అయిన నా పెద్ద భార్య కౌసల్య కుమారుడివి కనుక, అలాగే నీకు గొప్ప గుణములు ఉన్నాయి కనుక నీకు పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. నీకు తెలియనివి కావు ఈ విషయాలు, అయినా ఒకసారి విను......నువ్వు రాజువయ్యాక రెండు వ్యసనాలు వస్తాయి, అవి మనన్ని నాశనం చేస్తాయి, కావున వాటిని దెగ్గరకు రానీకుండా చూసుకో, ఆ రెండు వ్యసనాలే కామము మరియు క్రోధము. (కామము వలన నిష్కారణంగా వేటాడాలన్న బుద్ధి పుడుతుంది, జూదమాడదామన్న బుద్ధి పుడుతుంది, పగటి పూట నిద్రపోవాలన్న అలవాటు వస్తుంది, పరదూషణములని వేరొకరి దెగ్గర కూర్చుని వినాలనిపిస్తుంది, పగటి పూట అని చూడకుండా స్త్రీతో సంభోగిద్దామనిపిస్తుంది, మద్యం తాగాలనిపిస్తుంది, పగటి పూట నృత్యము చూడాలనిపిస్తుంది, గీతములను విందామనిపిస్తుంది. అలాగే క్రోధము వలన చాడీలు చెప్పాలనిపిస్తుంది, సత్పురుషులని నిర్బంధించాలనిపిస్తుంది, కపటముగా వేరొకరిని చంపాలనిపిస్తుంది, ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేనితనం వస్తుంది, ఇతరులలోని గుణాలని దోషాలుగా చెప్పాలనిపిస్తుంది, ఇతరుల ధనాన్ని అపహరించాలనిపిస్తుంది, అవతలివారి మనస్సు బాధ పడేటట్టు మాట్లాడాలనిపిస్తుంది, చేతిలో ఒక ఆయుధం పట్టుకొని అవతలవాడిని నిష్కారణంగా శిక్షించాలనిపిస్తుంది.) రామ నీకు పుష్యమి నక్షత్రంలో పట్టాభిషేకం చేస్తాను, కావున ఈ రోజుకి వెళ్ళి ఉపవాసం చెయ్యి అన్నాడు దశరథుడు.


అందరూ వెళ్ళిపోయాక దశరథుడు కూడా వెళ్ళిపోయాడు. అంతఃపురానికి వెళ్ళాక దశరథుడు సుమంత్రుడిని పిలిచి రాముడిని మళ్ళి తీసుకురమ్మన్నాడు. రాముడు వచ్చాక దశరథుడు ఇలా అన్నాడు " నేను జీవితంలో అనుభవించని సుఖం లేదు, ఈ శరీరానికి వృద్ధాప్యం వచ్చింది, ఎన్నో యజ్ఞాలు చేశాను, పితృ ఋణందేవతా ఋణంఋషి ఋణం ఇలా అన్ని ఋణాలు తీర్చుకున్నాను, నేను చెయ్యవలసిన పని ఏదన్నా ఉంటె అది నీ పట్టాభిషేకమె, మీరు ఎందుకింత తొందర పడుతున్నారు అని అడుగుతావేమో. నాకు పీడకలలు వస్తున్నాయి, ఉల్కలు పడుతున్నాయి, ఈ శరీరం పడిపోతుందని నేను బెంగపడడంలేదు, ప్రజలు దిక్కులేనివారు కాకూడదు, అందుకని నీకు తొందరగా పట్టాభిషేకం చేసేస్తాను. నీకు పట్టాభిషేకం చెయ్యాలని ఒక ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన మారిపోకముందే చేసేయ్యని. భరతుడు చాల మంచివాడు, ఇప్పుడు తన మేనమామ అయినా యుధాజిత్ దెగ్గర ఉన్నాడు, భరతుడు రాక ముందే నీకు పట్టాభిషేకం చేసేస్తాను. ఒక మంచి పని మొదలుపెట్టగానే విఘ్నాలు వస్తాయి, నీ స్నేహితులందరినీ అప్రమత్తంగా ఉండమను, సీతమ్మతో కలిసి దేవతలని ప్రార్ధించి, దర్భల(గడ్డి) మీద పడుకో " అని చెప్పి పంపించాడు.

దశరథుడు సుమిత్రని చేసుకున్నా పిల్లలు పుట్టలేదు కాబట్టి, యవ్వనంలో ఉన్న, సౌందర్యరాశి, అన్ని విద్యలు తెలిసిన కైకేయని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో కైకేయ రాజు, నా కూతురికి నీకు పిల్లలు పుడితే వాళ్ళకే పట్టాభిషేకం చెయ్యాలని అడిగాడు. దశరథుడు అప్పుడు మాట ఇచ్చాడు. అందుకని ఇప్పుడు కైకేయ రాజుని పిలవకుండానే రాముడికి తొందరగా పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాడు.


రాముడు అంతఃపురానికి వెళ్ళి తన తల్లి అయిన కౌసల్యా దేవితో తన పట్టాభిషేకం గురించి చెప్పగా, ఆవిడ చాలా సంతోషపడింది, సీతమ్మ, లక్ష్మణుడు ఎంతో ఆనందపడ్డారు. తన మిత్రులకి కూడా చెప్పాడు. తరువాత రాముడు దేవతలకి హవిస్సులు ఇచ్చి, మిగిలిన హవిస్సుని తిన్నాడు( ఉపవాసం అంటె, కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి, కన్ను పడిపోనంత సాధ్విక ఆహరం, శరీరం నిలబడడానికి కావలసినంత తిని, ఆ ఓపికతో భగవతారాధన చెయ్యడం ఉపవాసం, అన్నం తినడం మానెయ్యడం ఉపవాసం కాదు).

అయోధ్యా నగరమంతా చాలా సంతోషంగా ఉన్నది.

జై శ్రీ రాం

...........
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
facebook group :
(20+) Vidhatha Astro Numerology | Facebook
YouTube
Printerest
Twitter
Instagram
Blog
whatsapp group
Follow this link to join my WhatsApp group:
టెలిగ్రామ్
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
.....












No comments:

Post a Comment