Monday 12 April 2021

2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ధనూ రాశి ఫలాలు

 




ధనూరాశి ఫలితములు
మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ)
పూర్వా షాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢ)
ఉత్తరాషాఢ 1వ పాదము (బే)


ఆదాయం-11 వ్యయం-5 రాజయోగం-7 అవమానం-5


🎉ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 5 నుండి సెప్టెంబరు 14 వరకు మరియు నవంబరు 20 నుండి సంవత్సరాంతం వరకు కుంభంలో (తృతీయం) సంచరించి మిగిలినకాలము అంతయు మకరరాశి (ద్వితీయం)లో సంచరించును. శని సంవత్సరం అంతయు మకరంలో (ద్వితీయం) సంచరించును. రాహువు వృషభంలో (షష్ఠం) కేతువు వృశ్చికంలో (వ్యయం) సంచరించెదరు. ఈ సంవత్సరం అధిక కాలము రాహువు మకర గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును. ఏలినాటి శని మూడవభాగం నడుచుచున్నది. అయితే గురు రాహువు సంచారం అనుకూలం దృష్ట్యా మీకు ఎటువంటి యిబ్బందులు వుండవు.
🎉చాలా అభివృద్ధి పరంగానే ఉంటుంది. మీరు ఏదేని చిన్నచిన్న చికాకులు వచ్చి నప్పుడు గోచారం శోధిస్తే ఏలినాటి దోషంగా అగుపిస్తుంది కానీ ఏప్రియల్ 14 నుండి జూలై 20 వరకు అలాగే డిసెంబర్ 5 నుండి సంవత్సరాంతం వరకు కుజుడు సంచారం గా లేదు. అయితే యిక్కడ గురు రాహువుల ప్రభావం దృష్ట్యా డిసెంబర్ 5 నుండి సంవత్సరాంతం వరకు మాత్రమే యిబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. కానీ మిగిలినకాలము అంతా శుభప్రదముగా ఉంటుంది. ఒక విచిత్రమైన అనుభూతులు కలిగే అవకాశం ఉన్న కాలము. ఆరవ యింట వున్న రాహువు శత్రువుల మీద విజయం సాధించే అవకాశములు యిస్తుంటారు. అలాగే ప్రశాంతచిత్తంతో నడిచి విజయాలు సాధించే అవకాశం యిస్తారు. కొన్నిచోట్ల ధైర్యం ప్రదర్శిస్తారు. సందర్భానుసారంగా వ్యవహరిస్తారు.
🎉గురువు కుంభంలో ఉండగా శ్రమతో కూడి పనులు పూర్తి అవుతాయి. కానీ కార్య నష్టములకు అవకాశం లేదు. గురువు మకరంలో వుండగా ఫలితాలు పూర్తిగా అనుకూలమే. సుఖజీవనం చేస్తారు. యశోవృద్ది కలుగుతుంది. ధర్మ కార్యములు చేయడం తద్వారా చక్కగా ఆనందించడం జరుగుతుంది. ఏలినాటి శని దృష్ట్యా మీరు ప్రతిపనినీ స్వయంగా చేసుకోవడం ద్వారా ఉద్యోగ విషయంలో లాభదాయకం అవుతుంది. యితరుల మీద ఆధారపడిన ఎడల ప్రమాదకరం అవుతుంది. సహజంగా ఏలినాటి శని చివరికాలంలో ఆయన అనుకూలిస్తారు. శని జీవనోపాధి కారకుడు కదా! ఆయన వ్యాపార విషయంలో కూడా మంచి ఫలితాలు యిస్తారు. చేస్తున్న ఉద్యోగ వ్యాపార విషయాలు విడిచి కొత్త ప్రయత్నాలు చేయవద్దు అని ప్రత్యేక సూచన.
🎉ఆర్థిక కార్యకలాపాలు అనుకూల స్థితి ఉంటుంది. ఆదాయం వ్యయం అంతా కూడా అనుకూలంగా ఉంటాయి. “ధనం లేదు కాబట్టి కార్యం వాయిదా వేయాలి” అనే స్థితి ఈ సంవత్సరం రాదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు తేలికగా పూర్తి అవుతాయి. విద్యా విషయంగా వెళ్ళే వారికి కొంచెం అవరోధములు వచ్చిననూ ఉద్యోగ నిమిత్తంగా వెళ్ళేవారికి సానుకూలం ఎక్కువ. విదేశీ ప్రయాణం సక్సెస్ రేటు ఎక్కువ అనే చెప్పాలి. కన్స్ట్రక్షన్ రంగం, రియల్ ఎస్టేట్ విషయంలో ఊహకు అందనిరీతిగా మంచి వ్యాపారములు చేయు అవకాశం ఉన్నది.
🎉అదేరీతిగా ఫైనాన్స్ వ్యాపారులు కూడా సమయమునకు తగిన రీతిగా ప్రవర్తించి నష్టాలు నివారించి లాభాలు అందుకుంటారు. షేర్ వ్యాపారులు సరుకు నిల్వచేసి వ్యాపారం చేయువారి విషయంలో గ్రహస్థితి యిబ్బందికరం కాదు. లాభదాయకంగా వ్యాపారం చేస్తారు అనే చెప్పాలి. శుభకార్య ప్రయత్నాలలో వున్నవారికి పనులు వేగవంతం అవుతాయి అని చెప్పాలి. అదే రీతిగా పుణ్యక్షేత్ర సందర్శన పుణ్యకార్య విషయములలో ఎటువంటి అవరోధములు ఉండవు. విద్యార్థులకు మంచి బుద్ధి వికాసం కుదిరి విశేషంగా శ్రమించి మంచి ఫలితాలు అందుకుంటారు.
🎉శని ప్రభావం పెద్దగా విద్యకు అవరోధం కాదు. రైతులకు శ్రమ చేసిన కొద్దీ మంచి ఫలితాలు అందుతాయి అనే చెప్పాలి. కోర్టు వ్యవహారములలో వున్నవారికి మకరంలో గురువు ఉండగా కార్య లాభం ఉంటుంది. అయితే ధన విషయంగా జరిగే కోర్టు వ్యవహారముల యందు సానుకూల స్థితి తక్కువ. స్థానచలన ప్రయత్నాలలో వున్నవారికి ధైర్యయుక్తబుద్ధితో సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉన్నది.
🎉స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో వున్నవారికి బహు అనుకూల స్థితి ఉన్నది. ఏలినాటి శని వలన కూడా లాభ సూచకమే. అన్నివిధాలా లబ్దిపొంది స్థిరాస్తి ఏర్పరుచుకుంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు చేయువారికి మకరంలో గురువు వుండగా విశేషాలు అందుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. ధనవ్యయం కూడా చేయవలసి ఉంటుంది.
🎉నూతన వ్యాపార ప్రయత్నాలు సర్వదా లాభదాయకమే అయితే స్వబుద్ధి ప్రదర్శన లాభదాయకము. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా ముందు జాగ్రత్తలు పాటించి చాలా రక్షణతో ఉంటారు. పిల్లల విషయంలో కూడా యిబ్బందులు వుండవు. ప్రతిపనిలోను భార్యాపుత్రులు చాలా గొప్పగా అనుకూలం చేస్తారు. కుంభంలో గురువు సంచరించే కాలంలో బంధువైరం బాగా పెరుగుతుంది. ఆసందర్భంలో జాగ్రత్త అవసరం. కుటుంబసభ్యులు అందరు కలిసి తరచుగా విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఋణ విషయంలో పాత ఋణములు వున్నవారికి యిబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. కానీ ముందుగా జాగ్రత్తలు తీసుకున్న వారు మాత్రం యిబ్బందులు లేకుండా సుఖజీవనం చేస్తారు.
🎉ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు పాటించి యిబ్బందులు రాకుండా రక్షణ పొందుతారు. ఏదేని చిన్న చిన్న సీజనల్ యిబ్బందులు వచ్చినా వాటిని తక్కువ ప్రయత్నాలతోనే దాటవేస్తారు. గురువు కుంభంలో సంచరించే కాలంలో కొంత శరీర బాధలు రాగలవు. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త అవసరం. మార్కెటింగ్ ఉద్యోగులకు ధైర్యం, తెలివి, కలిసి ప్రణాళికా బద్ధంగా వ్యవహరించి అనుకూలం పొందుతారు. అన్ని అంశాలలో ఈ రాశివారికి గురువు మకరంలో వుండగా అనుకూల స్థితి. కుంభంలో వుండగా యిబ్బందికరము.
🎉స్త్రీలకు ఈ సంవత్సరం ఆరోగ్య విషయంగా జాగ్రత్తలు పాటించాలి. పనులు ఆలస్యం అవుతాయి. కానీ ఉద్యోగ విషయంగా కుటుంబ విషయంగా మీరు సమన్యాయం చేయలేక యిబ్బంది పడతారు. వ్యాపారం చేయువారు ఆర్థిక లావాదేవీలు సరిగా నడవక యిబ్బందులకు గురి అవుతారు. గర్భిణీ స్త్రీలు తెలివిగా ముందు జాగ్రత్తలు పాటించి సత్ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది.
🎉 మూలా నక్షత్రం వారికి విశేషముగా ఏమనగా ఏ పనీ సవ్యంగా సాగదు కానీ అన్ని పనులలోనూ విశేష లాభాలు ఉంటాయి. మీరు చేయని కొన్ని సత్కర్మలు మీకు కీర్తి ప్రతిష్ఠలు పెంచుతాయి. వాహనాలు పనిముట్లు వాడకంలో యిబ్బంది ఉంటుంది.
🎉 పూర్వాషాఢ నక్షత్రం వారికి విశేషములు ఏమనగా సాధ్యం కాని పనులు కూడా సాధించుకుంటారు. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. తల్లితరఫు బంధువులు మీకు చాలా అనుకూలమైన సేవలు అందిస్తారు. అందరితో సహకారం బాగుంటుంది.
🎉 ఉత్తరాషాఢ నక్షత్రం వారికి విశేషములు ఏమనగా వాహన ప్రమాదములు జరగకుండా జాగ్రత్తలు పడండి. తరచుగా ప్రభుత్వ సంబంధంగా యిబ్బందులు వస్తుంటాయి. కొత్త కొత్త పరిచయాలు అవుతాయి. అవి భవిష్యత్తుకు బాగా అనుకూలించేవిగా గోచరిస్తుంది.
🎉నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
1. అరుణారుణపంకజే నిషణ్ణః కమలాభీతి వరాన్కరైర్దధానః స్వరుచాహిత పంకజస్త్రి నేత్రో రవిరాకల్ప శతాకుతో వాహ్నః
2. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజమ్. ఈ శ్లోకపారాయణ మీకు శాంతినియిస్తుంది.
🎉శాంతి : దోషము చేయు గ్రహములు శని గురు నిమిత్తంగా జూన్ మాసములో జపదాన హోమ శాంతి మీరు దగ్గర వుండి చేయించుకోండి. నవముఖి రుద్రాక్ష ధారణ అధికంగా మానసిక ఒత్తిడిని నిరోధిస్తుంది. అవకాశం పురస్కరించుకొని రోజూ మారేడు, తులసి పత్రములతో శివకేశవులను అర్చించండి. సుందరకాండ పారాయణ చేయండి తద్వారా సమస్యలు తీరుతాయి.
🎉ఏప్రిల్ : ఏ పని అయినా తేలికగా పూర్తి అవుతుంది. అందరి నుండి సహాయ సహకారము బాగుంటుంది. మీ స్వంత ఆలోచనలు మీకు శుభఫలితాలను అందిస్తాయి. 14వ తేదీ తర్వాత కుజుడు సప్తమం లోకి వచ్చిన దగ్గరనుండి 3 మాసాలు పాటు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. పెద్ద స్థాయి సమస్యలు ఏమీ ఉండవు కానీ రోజువారీ సమస్యలన్నీ ఆటంకాలతో పూర్తవుతాయి. పుణ్యకార్యములు, శుభకార్యముల కోసం ప్రయాణాలు చేస్తారు. మీ కుటుంబ సంబంధమైనటువంటి పుణ్యకార్యములు చేయు నిమిత్తంగా ఖర్చు పెరుగుతుంది.
🎉మే :తెలివి స్నేహము బాగా ప్రదర్శించి పనులు వేగవంతంగా పూర్తి చేసుకుంటారు. తరచుగా ఉష్ణప్రకోపము, వాహన చికాకు, జ్వర బాధలకు గురి అవుతారు. తొందరపాటు ధోరణి విడనాడవలసిన అవసరం ఉంటుంది. మిమ్మల్ని తరచుగా కోపావేశాలకు లోను చేసే అంశాలు ఎక్కువ అవుతాయి. అయినప్పటికీ కూడా మీరు చాలా శాంత స్వభావముతో నడవకపోతే సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు వంటివి ఈ నెలలో విరమించుకోవడం మంచిది. దూరప్రాంత ప్రయాణాలు చేయవద్దని ప్రత్యేకంగా సూచిస్తున్నాము.
🎉జూన్ : బంధువులతో స్నేహితులతో సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆంతరంగిక విషయములు ఎవరితోనూ చర్చించవద్దు. అందరూ నమ్మించి మోసం చేసే కాలం ఈ నెలలో అధికంగా గోచరిస్తుంది. అందువలన ఉద్యోగ, వ్యాపార విషయాలలో ప్రతిపనిని స్వయంగా చేసుకోవడం చాలా అవసరం. ఆదాయం ఇబ్బందికరం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగే అవకాశం ఉండదు. మితభాషణ, ఓర్పు, నేర్పు అన్ని విషయాలలో ప్రదర్శింవలసిన అవసరం ఉంది.
🎉జూలై: రాబోవు నెల రోజులు ఒత్తిడితో నడుచును. ప్రతిపనికీ ధనపరంగా శారీరకంగా యిబ్బందులు ఉంటాయి. ఓర్పు సహనం చాలా అవసరం. ఆదాయం తక్కువగా అందడం, ఖర్చులు బాగా పెరగడం జరుగుతుంది. ఈ నెల చివరి రోజులలో ఆర్థిక విషయాలలో, ఋణ విషయాలలో ఉపశమనం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు, పుణ్యకార్య ప్రయత్నాలు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు ఈ నెలలో శ్రమయుక్తంగా సాగే అవకాశం ఉంటుంది.
🎉ఆగష్టు: రోజూ సానుకూల వాతావరణమును పెంచుకుంటారు. ప్రధానంగా వృత్తి సౌకర్యం అవుతుంది. తత్ప్రభావంగా అంతా శుభపరిణామములు ఉంటాయి. తెలివిగా ప్రవర్తించి అన్ని సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడంలో కృతకృత్యులు అవుతారు. దైనందిన కార్యక్రమాలు ఇబ్బంది లేకుండా సాగడం, కుటుంబ విషయాలలో సానుకూల మార్పులు రావడం మీకు భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య స్థితి అనుకూలం అవుతుంది. అలాగే పిల్లల యొక్క ప్రవర్తన వారి అభివృద్ధి వార్తలు మీకు ఆనందాన్ని ఇస్తాయి.
🎉సెప్టెంబర్ : అందరినీ నమ్మి మోసపోతారు. కుటుంబకార్యములు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయములు బహు అనుకూలము. ప్రతిపనీ స్వయంగా చూసుకోవలసిన అవసరం ఉంది. ఇతరుల వ్యవహారముల జోలికి పోవద్దని ప్రత్యేకంగా సూచన చేస్తున్నాము. మితభాషణ, ఓర్పు నేర్పుతో వృత్తి వ్యవహారాలు చేసుకొని అందరి దగ్గర మన్ననలను అందుకొని లాభం అందుకుంటారు. ఋణ సౌకర్యం కావలసిన విధంగా చేకూరుతుంది. అవసరానికి తగిన ఆదాయం చేకూరడం వలన కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు.
🎉అక్టోబర్ : చికాకులు వస్తుంటాయి దాటవేస్తారు. రోజువారీ అన్న వస్త్రాలు దైనందిన కార్యక్రమములు కూడా మీకు కావలసిన రీతిగా జరగవు. ఏ పనీ కూడా సమయపాలనతో పూర్తవ్వదు. సహకరించే వ్యక్తులు కూడా సహకరించకపోవడం కుటుంబ వ్యవహారాలను స్వయంగా చేసుకోవడం వలన మీరు ఏ పనిలోనూ సరిగా దృష్టి కేంద్రీకరణ చేయలేక ఇబ్బందులకు గురవుతారు. తరచుగా ఆగ్రహావేశాలకు లోనై కలహములు పెంచుకొనే అవకాశం ఉంటుంది.
🎉నవంబర్ : ప్రతిపనీ శుభసూచకమే అయితే యిబ్బందులు లేకుండా నడిచే అవకాశం లేదు. నమ్మకద్రోహం జరగకుండా జాగ్రత్త పడండి. అందువలన ప్రతిపనిని మీరు స్వయంగా చేసుకోవడానికి అలవాటు పడండి. ఉద్యోగ, వ్యాపార విషయాలలో ప్రతి పనిని స్వయంగా చేసుకోవడం చాలా అవసరం. ఆర్థిక కార్యకలాపాలు, ఋణ సౌకర్యాలు ఈ నెలలో చిన్న చిన్న చికాకులను కలుగజేస్తాయి అయితే ఓర్పుతో వ్యవహరించిన వారందరూ కూడా సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. అనుకోకుండా పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం ఉంటుంది.
🎉డిసెంబర్ : అంతా సానుకూలంగా ఉన్నట్లు ఉంటుంది. అయితే సమస్యలను తెలివిగా దాటవేయు అవకాశం ఉంటుంది. ఏ పనీ పూర్తిగా సానుకూలం అవ్వదు. అవరోధములు ప్రతిపనిలోనూ వస్తూనే ఉంటాయి. అయితే రవి, కుజుల సంచారం సరిగా లేని కారణంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన కాలం. మీ యొక్క మాటకు గౌరవం లేని స్థితి ఏర్పడుతుంది. రోజువారీ జీవనశైలిలో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది.
🎉జనవరి : ఒక రకంగా విచిత్రమైన కాలము. మీ ప్రయత్నాలు చాలా శ్రమయుక్తము అవుతాయి. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ చేసిన కొద్దీ లాభాలు బాగా అందే అవకాశం ఉంటుంది. చర్మ సంబంధమైన అనారోగ్యం ఉన్నవారు బాగా ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది. స్థాన చలన ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. కొన్ని సందర్భాలలో మీ ప్రయత్నాల వలన మీకు గౌరవమర్యాదలు బాగా పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలలో మీ వలన ఇతరులకు లాభం చేకూరుతుంది. ఇతరులు వలన కూడా మీ సహాయ సహకారములు బాగా అందుతాయి.
🎉ఫిబ్రవరి : మిశ్రమ ఫలితాలతో కాలం నడుచును. నిరంతరం శ్రమ చేయగా కార్యములు సానుకూలం అవుతాయి. విరోధములు తరచుగా అన్ని విషయాలలో రాగలవు. కుటుంబ వ్యవహారాలలో సమస్యలు బాగా పెరగడం, క్రమంగా తెలివిగా ప్రవర్తించి వాటిని సరిచేసుకోవడం జరుగుతుంది. పెద్దల యొక్క ఆరోగ్య వ్యవహారాలలో ఇబ్బందులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మీ మానసిక అనుకూల స్థితి తగ్గుతుంది. ఆర్థిక కార్యకలాపాలు, ఋణ వ్యవహారాలు ఇబ్బందికరం అవుతాయి.
🎉మార్చి : ఉద్రేకంగా ప్రవర్తించకండి. ఎవరినీ నమ్మి ఏ పనీ చేయవద్దు. మిత్రభాషణ చేయడం చాలా అవసరం. వాహన ప్రమాదాలు చాలా తరచుగా ఉంటాయి. ఉద్యోగ విషయంలో శ్రమ ఎక్కువ అవుతుంది. వ్యాపార విషయంలో కూడా అనుకున్న స్థాయి ఫలితాలు ఉండవు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ధనవ్యయం బాగా ఉంటుంది. స్థాన చలన ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది.



సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment