Monday 12 April 2021

2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర వృషభ రాశి ఫలాలు




వృషభ రాశి ఫలితములు
కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ)
రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ)
మృగశిర 1,2 పాదములు (వే,వో)


ఆదాయం-2 వ్యయం-8 రాజయోగం-7 అవమానం-3


🎉 ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 5 నుండి సెప్టెంబరు 14 వరకు మరియు నవంబరు 20 నుండి సంవత్సరాంతం వరకు కుంభంలో (దశమం) సంచరించి మిగిలిన కాలము అంతయు మకరరాశి (భాగ్యం)లో సంచరించును. శని సంవత్సరం అంతయు మకరంలో (భాగ్యం) సంచరించును. రాహువు వృషభంలో (జన్మ) కేతువు వృశ్చికంలో (సప్తమం) సంచరించెదరు. ఈ సంవత్సరం అధికకాలము గురు కుజ గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును. గురువు భాగ్యంలో ఉండగా నీచరాశి అయినను యోగ సంచారమే. రాహువు కేతువు సంచారం ప్రతిబంధకములను సృష్టించును. శని వలన లాభము ఉండదు నష్టము ఉండదు.
🎉ఈ రాశివారికి మిగిలిన గ్రహముల ప్రభావంగా ఎన్నిరకములైన ఒత్తిడి వున్ననూ దైనందిన కార్యక్రమములలో అంతా శుభసూచకమే ఉంటుంది. ఏదో ఒక విధంగా పనులు రోజువారీ దినచర్యకు సంబంధించినవి సానుకూలం చేసుకుంటారు. రాహువు మానసిక అధైర్యము, అశాంతి ఒత్తిడి కలుగచేస్తారు. అందరినీ అనుమానించే లక్షణం కలిగిస్తారు. ప్రాకృత ధర్మానికి విరుద్ధమైన ఆలోచనలు యిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలకు యిబ్బంది సృష్టించే అవకాశం ఉన్నది. ఏదేని చెడుగా భావనలు కలిగినా, ఏదేని కార్యములకు శ్రీకారం పెట్టదలచినా మీరు ఒకసారి భగవధ్యానం చేసి ఓర్పుగా మనస్సును కూడదీసుకొని అప్పుడు కార్యములలో నిమగ్నులు అవ్వండి. ఎవరి వ్యవహారములలో కలుగ చేసుకోవద్దు. ఒక్కోసారి ఆర్థిక లావాదేవీలు బాగా జరిగి మీరు చాలా ఆనందంగా కాలం గడుపుతుంటారు. ఒక్కోసారి ఎందుకు దుఃఖభరితమైనటువంటినీ, ఏదో తెలియని భారంతో కూడిన మనస్సుతో సంచరిస్తూ ఉంటారు కారణం ఉండదు.
🎉ఆదాయం రావలసిన స్థాయికి తగిన రీతిగా అందుకుంటారు. ఒక్కోసారి గురువు మకరంలో ఉండగా అధిక ఆర్థిక లాభాలు అందుతాయి. మీ కుటుంబ ఆచార విషయములను నిర్వహించే రీతిగా ఏర్పాట్లు చేయు విషయమై ఖర్చులు అధికం అవుతాయి. రోజువారీ కార్యక్రమములు, భోజన, వస్త్ర విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది. అయినా అసంతృప్తి వెంబడిస్తుంది. ఉద్యోగ విషయంలో గురువు కుంభంలో వుండగా చికాకులతో కూడిన రీతిగా కాలం నడుచును. మకరంలో గురువు ఉండగా అంతా శుభమే. కుజుడు కూడా పెద్దగా యిబ్బందులు కలుగచేయు అవకాశములు లేవు కావున ఉద్యోగ నష్టములు ఉండవు. అలాగే వ్యాపారులకు కూడా సత్ఫలితాలు అందుతాయి అనే చెప్పాలి. సమస్యాకాలంలో ఆర్థిక వృత్తి విషయాలలో మీకు మీవర్కర్స్ లేదా మీతోటివారు సహకరిస్తారు. సంవత్సరం ద్వితీయ భాగం అన్ని పనులలో విఘ్నములు తప్పక ఏర్పడతాయి. కానీ ప్రతి సమస్యను తెలివిగా దాటవేయు అవకాశములు కూడా ఉంటూ ఉంటాయి.
🎉విద్యానిమిత్తంగా విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో వున్నవారికి ఫలితాలు బాగుంటాయి. చేస్తున్న ఉద్యోగం మానివేసి విదేశీ ఉద్యోగం వెదుకులాట శ్రేయోదాయకం కాదని సూచన. కన్స్ట్రక్షన్ రంగంలోను రియల్ ఎస్టేట్ రంగంలోను వున్నవారికి అధిక ఒత్తిడి ఉంటుంది. లాభం తక్కువ షేర్ వ్యాపారులు మరియు సరుకు నిల్వచేసి వ్యాపారం చేయువారు రాహు ప్రభావంగా మంచి లాభాలు అందుకోలేని స్థితి ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారులకు అప్పు ఎగవేతదారులు ఎక్కువగా ఉంటారు. శుభ కార్య ప్రయత్నాలలో వున్నవారికి తప్పుడు సూచనలు చేయువారు ఎక్కువగా సన్నిహితంగా ఉంటారు. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రీతిగానే పుణ్యకార్య విషయాలలో కూడా పరిస్థితి నెలకొని ఉంటుంది.
🎉విద్యార్థులు మనస్సు నిగ్రహించుకోవలసిన కాలము అలాగే ఫలితాలు సానుకూలంగా వచ్చే అవకాశం ఉన్నది. రైతులకు కూడా ఫలితాలు బాగుంటాయి. కానీ రాహు ప్రభావం ఉన్నది. జాగ్రత్తగా విజ్ఞులై నిర్ణయాలు చేయాలి. కోర్టు వ్యవహారములలో వున్నవారికి రాహు కేతువులు సరిగాలేని ఈ కాలంలో మీరు మంచి సూచనలు చేసినా వాటిని అమలు చేయలేని స్థితిలో ఉంటారు. మీరు సరియగు వ్యక్తుల ఆశ్రయంలో వ్యవహారములు చేయండి. స్థానచలన ప్రయత్నాలలో వున్నవారికి మీ ప్రమేయం లేకుండా అనుకూలం లేని ప్రాంతం వెళ్ళవలసి ఉంటుంది.
🎉స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో వున్నవారికి భాగ్య గురువు వలన పనులు చేతికి అందినట్లుగా గోచరించినా కార్యవైఫల్యాలకు రాహు ప్రభావం అధికం అనే చెప్పాలి. మకర గురువు వలన కార్యసిద్ధి. ప్రమోషన్ ప్రయత్నాలు ప్రత్యేకం చేసుకోవాలి. లేదంటే మీకు గుర్తింపుతో కూడి ప్రమోషన్ లిస్టులో వుండక నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవిధమైన అడ్డంకులు ఉండవు కానీ ఆలస్యంగా ఫలిస్తాయి.
🎉నూతన వ్యాపార ప్రయత్నాలు చేయువారికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోమని ఎవరి మీదా ఆధారంవద్దని సూచన. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా అన్ని కోణాలలోను జాగ్రత్తలు పాటిస్తుంటారు వాటి ప్రభావంగా చికాకులు తగ్గుతాయి. అయితే భార్యాపుత్రుల ద్వారా వారు నిర్వహించే కార్యముల ద్వారా మనస్తాపం కలుగుతుంటుంది. కుటుంబసభ్యుల అసంతృప్తి కలహములకు దారి తీస్తుంది. భార్య తరఫు బంధువుల ప్రమేయంతో మీ కుటుంబ కలహాలకు కారణం అవుతుంటుంది. మీ పనులు యందు ఎవరికీ ప్రమేయమునకు అవకాశం యివ్వవద్దు.
🎉ఋణ విషయంలో పాత ఋణములు వున్నవారికి మోసపూరిత వాతావరణం ఋణ అవమానము జరిగే అవకాశం ఉంది. కొత్తలోన్ల విషయంలో కూడా బహు జాగ్రత్తలు పాటించండి. సమస్యలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఏమిటి అనారోగ్యం అనేది నిర్ధారింపబడక “నాకు ఏదో ఆరోగ్య సమస్య వున్నది” అనే భావన కలిగి అధికంగా యిబ్బంది పడతారు. అసలు రోగం కంటే - రోగం వున్నది అనే భావన యిబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. తరచుగా శరీరం కృశించడం ఉంటుంది. మానసిక వ్యాధి థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలు వున్నవారికి యిబ్బంది తప్పదు. మార్కెటింగ్ ఉద్యోగులకు గౌరవం తగ్గుతుంది. టార్గెట్ పూర్తి చేయలేక జీవనోపాధి విషయంలో చికాకులు పొందుతారు. కొత్త కొత్త ప్రణాళికలు ఏమీ సరిగా సాగవు అనే చెప్పాలి.
🎉స్త్రీలకు ఈ సంవత్సరం ఉద్యోగ విషయంగా యిబ్బందులు లేని విధంగా కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ విషయంగా కూడా సమర్థంగా విధి నిర్వర్తిస్తారు. అయితే మీకు కోరికలకు తగిన విధంగా కాలక్షేపం జరగకపోవడం వస్తువులు అందకపోవడం మీకు చికాకులు యిస్తుంది. ప్రయాణ చికాకులు పొందుతారు. గర్భిణీ స్త్రీలు రాహుకేతు దోషం దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలి. తరచుగా ఒత్తిడికి లోనవుతారు.
🎉 కృత్తికా నక్షత్రం వారికి విశేషములు ఏమనగా అవ్వవు అనుకున్న పనులు కూడా సాధించుకుంటారు. ప్రతి విషయంలో ఉద్రేకంగా మాట్లాడి కలహాలు తెచ్చుకుంటారు. తల్లిదండ్రులకు - పిల్లలకు మానసిక కలయిక కుదరక యిబ్బందిపడతారు.
🎉 రోహిణీ నక్షత్రం వారికి విశేషములు ఏమనగా ఆగస్టు వరకు మానసిక ఒత్తిడి అధికము. ఆ తరువాత క్రమంగా ధైర్యయుక్తమైన బుద్ధి ప్రదర్శిస్తారు. చివరి మాసాలు అంతా అనుకూలము. ఋణ విషయాలలో సాంఘికంగా సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడవలెను.
🎉 మృగశిరా నక్షత్రం వారికి విశేషములు ఏమనగా విద్యా, విజ్ఞాన వినోద కార్యక్రమముల విషయంగా కాలక్షేపం చేస్తారు. అందరితోను సహాయ సహకారములు అందుకుంటారు. ప్రతిరోజూ ధనము వెసులుబాటు కాకుండా యిబ్బందికర విషయాలు ఎదురౌతాయి.
🎉నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
"సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే - శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే"
"అరుణాంకరుణా తరంగి తాక్షీం - ధృత పాశాంకుశ పుష్పబాణ చాపామ్"
"అణిమాదిభి రావృతాంమయూ భై: - అహమిత్యేవ విభావయే భవానీమ్"
- ఈశ్లోకములు పఠించుట ద్వారా మనశ్శాంతి కలుగును.
🎉శాంతి : దోషము చేయు గ్రహములు రాహు, కేతు నిమిత్తంగా ఏప్రిల్ / నవంబర్ మాసములలో జపదాన హోమశాంతి మీరు దగ్గర వుండి చేయించుకోండి. త్రిముఖ రుద్రాక్షధారణ అధికంగా మానసిక ఒత్తిడిని నిరోధిస్తుంది. గరిక, మారేడు, తెల్ల జిల్లేడు పత్రములుతో గణపతిని అర్చించి దుర్గా సహస్రం పఠించండి. మీకు శుభం కలుగును. గోవుకు నమస్కారం చేసి కార్యారంభం చేయండి.
🎉ఏప్రిల్ : రవి కుజ సంచారం దృష్ట్యా భార్యాపుత్ర బంధువైరం పెరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. వాహన చికాకులు జ్వర బాధలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా ఉద్యోగ విషయంలో అధికారులతోనూ, వ్యాపార విషయంలో మీ దగ్గర పనిచేసే పనివారితోనూ స్పర్ధ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైన ట్యాక్స్ వంటి విషయాలలో ఇబ్బందులు వస్తాయి. అన్ని పనులలోనూ ఒత్తిడి మానసిక అశాంతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
🎉మే : అన్ని అంశాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలలో అధికారుల ద్వారా ఒత్తిడి తప్పదు. తోటివారి నుండి సహాయం బాగుంటుంది. ఏ విషయంలోనైనా సరే అకాలం అనేది వెంబడిస్తూనే ఉంటుంది. అలాగే భోజనాదుల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచినవారికి ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. లేనియెడల ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నెలలో కుటుంబపరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.
🎉జూన్ : ప్రతిపనిలోనూ ఒత్తిడి ఉంటుంది. అయితే తెలివిగా వాటిని దాటవేయగలుగుతారు. ధనం అవసరానికి సర్దుబాటు అవ్వడం కష్టం అవుతుంది. ప్రతివిషయంలోనూ ఎవరి మీదా ఆధారపడకుండా అన్ని పనులూ మీరు స్వయంగా చేసుకుంటే చాలావరకు లాభ దాయకమైన ఫలితాలు అందుతాయి. ఉద్యోగ, వ్యాపార విషయాలలో కొత్త కొత్త విచిత్రమైనటువంటి సమస్యలు గోచరిస్తాయి. తెలివిగా వాటిని సరిచేసుకునే అవకాశం వస్తుంది.
🎉జూలై: ఆరంభం యిబ్బందికరమైనా క్రమేణా మంచి జీవనం దగ్గర అవుతుంది. ఈ నెల ఆర్థిక వెసులుబాటు అనుకూలంగా ఉంటుంది. ఓర్పు అవసరం. తరచుగా శుభవార్తలు వింటారు. ప్రతికోణంలోనూ మీ యొక్క శ్రేయోభిలాషులు, మీ యొక్క గురువులు గానీ మీకు మంచి సూచనలు చేసి మీకు లాభదాయకమైన ఫలితాలు అందేలాగా చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మీకు అన్ని విషయాలలో బాగా అందుతుంది. అనుకోని ప్రయాణాలు తరచుగా ఉంటాయి.
🎉ఆగష్టు: బుధ, శుక్ర సంచారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయం చాలా అనుకూలం. ఆర్థిక వనరులు అనుకూలము. ఋణ సంబంధమైన ప్రతిబంధకాలు తీర్చుకొనే ప్రయత్నంలో ఉన్నవారికి మంచి అనుకూలమైన సమయం అలాగే వైద్యపరంగా మంచి సూచనలు, సలహాలు అంది వాటిని అమలు చేసి సుఖపడే అవకాశం ఉంటుంది. ఇతరుల వ్యవహారాలలో కలుగజేసుకోవద్దని ప్రత్యేకమైన సూచన.
🎉సెప్టెంబర్ : రోజూ ఏదో ఒక సమస్య సృష్టింపబడి, సరిచేయబడి ఒకరోజు గడుచును. ఉద్యోగ వ్యాపార విషయాలలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైన చర్చలు, అనవసరమైనటు వంటి విషయాలలో కలుగచేసుకోవడం తద్వారా సమస్యలు కొనితెచ్చుకోవడం, వాటిని సరిచేసుకోవడంతో కాలక్షేపం జరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. విజ్ఞాన వినోద కార్యక్రమాలలో తరచుగా పాల్గొంటారు.
🎉అక్టోబర్ : కుటుంబంలోని పెద్దల ద్వారా యిబ్బందులు రాకుండా జాగ్రత్త వహించండి. వాహన చికాకులు, అలంకరణ వస్తు కొనుగోలు ఖర్చులు పెరుగుతాయి. పూజలు, నోములు వంటివాటితో ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ప్రతినిత్యం ఆనందంగా కాలక్షేపం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే అసంతృప్తి అన్ని విషయాలలోనూ వెంటాడుతూనే ఉంటుంది. వృధా చర్చలకు అవకాశం ఇవ్వవద్దు. పిల్లల అభివృద్ధి వార్తలు తరచుగా వింటారు. పెద్దల యొక్క ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి.
🎉నవంబర్ : కుటుంబ సమస్యలు పెరుగును. అయితే ఉద్యోగ వ్యాపార విషయాలలో సౌఖ్యం ఉంటుంది. ధైర్యంగా జీవనం చేస్తారు. ప్రమోషన్ ప్రయత్నాలలో ఉన్నవారికి స్థానచలన ప్రయత్నాలలో ఉన్నవారికి ఈ నెలలో పనులు వేగంగా పూర్తి అవుతాయి. నిరు ద్యోగులకు ప్రయత్న సానుకూల ఫలితాలు గోచరిస్తాయి. అందరి నుండి మంచి వార్తలు వింటారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం అవుతాయి.
🎉డిసెంబర్ : ఆరోగ్య విషయంగా బహుజాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ కుటుంబ ఆర్థిక వ్యవహారములు చికాకులు చూపుతాయి. ఎవరి విషయాలు కలుగ చేసుకోవద్దు. ఎవరినీ నమ్మి ఎటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవద్దు. మీ పరిధిలో లేని కార్యక్రమాలను మీరు వెంబడించవద్దు. వైద్య సంబంధమైన ఖర్చులు బాగా ఇబ్బందికరం అవుతాయి. తరచుగా మానసిక ఆందోళనలు, పిల్లల అభివృద్ధి సమస్యలు చికాకును కలిగిస్తాయి. మాసాంతంలో పుణ్యకార్యములు చేస్తారు.
🎉జనవరి : ఎవరి వ్యవహారములలో కలుగ చేసుకోవద్దు. కలహములు రాకుండా జాగ్రత్త పడండి. మీ ప్రతి విషయమును గోప్యంగా ఉంచండి. ప్రయాణములు అవకాశమును బట్టి ఆపుకోండి. ఉద్యోగం, వ్యాపారం సానుకూలంగా నడుస్తున్నప్పటికీ ఏదో తెలియని మానసిక అశాంతి, భయము వెంబడిస్తూనే ఉంటాయి. ఆదాయం దానికి సంబంధించిన ఖర్చులు ఒక పద్ధతిలో లేక వాటిని అదుపు చేయలేక ఒత్తిడికి గురవుతారు. వ్యాపార విషయంలో వర్కర్స్ బాగా అనుకూలిస్తారు.
🎉ఫిబ్రవరి : మంచి జీవనశైలి సాధించడం కోసం అధిక శ్రమ చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలలో అంతటా అవరోధములు ఉంటాయి. ప్రయాణ చికాకులు తప్పవు. మీ ప్రయత్నాలన్నీ కూడా ఆలస్యం అయినప్పటికీ సానుకూలం అవుతూ ఉంటాయి. ప్రత్యేకించి కొన్ని కొన్ని విశేషమైనటువంటి లాభదాయకమైన వార్తలు వింటారు. శ్రమ ఎక్కువ చేసి అయినా కార్యలాభం పొందాల్సిందే అనే ధోరణితో మీరు ప్రవర్తించి విజయ పరంపరతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ నెలంతా శుభమే.
🎉మార్చి : మంచి జాగ్రత్తలు పాటిస్తూ తెలివిగా ప్రవర్తిస్తూ సుఖ జీవనం సాగిస్తారు. అంతా శుభపరిణామమే. ప్రధానంగా వృత్తి విషయాలు సౌకర్యంగా వుంటాయి. ఉద్యోగ విషయంలో మీ అధికారులు మీకు బాగా సహకారం చేస్తారు. అదే రీతిగా వ్యాపారస్తులు కూడా తగు జాగ్రత్తతో ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతారు. ఆరోగ్య విషయంగా, ఆర్థిక విషయంగా ఎటువంటి సమస్యనైనా ముందుగానే తెలుసుకొని దానిని సరిచేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. లాభదాయకమైన జీవనం సాగుతుంది. పిల్లలు మీకు బాగా ప్రోత్సాహం ఇస్తారు.


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371








No comments:

Post a Comment