Monday, 12 April 2021

2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర సింహ రాశి ఫలాలు

 




సింహ రాశి ఫలితములు
మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే)
పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ)
ఉత్తర 1వ పాదము (టే)
ఆదాయం -2 వ్యయం-14 రాజయోగం-2 అవమానం-2
🎉ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 5 నుండి సెప్టెంబరు 14 వరకు మరియు నవంబరు 20 నుండి సంవత్సరాంతం వరకు కుంభంలో (సప్తమం) సంచరించి మిగిలిన కాలము అంతయు మకరరాశి (షష్ఠం)లో సంచరించును. శని సంవత్సరం అంతయూ మకరంలో (షష్ఠం) సంచరించును. రాహువు వృషభంలో (దశమం) కేతువు వృశ్చికంలో (చతుర్థం) సంచరించెదరు. ఈ సంవత్సరం అధికకాలము శని రాహువు గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును.
🎉2021-2022లలో శని సంచారం బహు అద్భుతంగా ఉంటుంది. అనంతరం శని వలన అనుకూలం కాదు. ఈ నేపథ్యంలో దీర్ఘకాల సమస్యలు ఉన్నవారు క్షణం వృథా చేయ కుండా సమయం సానుకూలం చేసుకోవాలి. సమస్యలు తీర్చుకోవడం కోసం కొన్ని విషయాలలో మీరు మీ అభిప్రాయములను మార్చుకోమని సూచన. గృహనిర్మాణం వంటి ఆలోచనలు వున్న వారికి కోరికలు బాగా తీరతాయి. మీరు ఎవరినయితే మీ స్వంతవారు అని భావిస్తారో వారు మీ యొక్క నిజ అవసరాలకు సంబంధించిన సమయంలో సహకరించరు. మీరు ఎవరిమీదా ద్వేషపూరిత మనస్సును ప్రదర్శింపవద్దు.
🎉దైనందిన కార్యక్రమములు అన్నీ సక్రమంగా పూర్తి అవుతాయి. ప్రయత్నం ప్రారంభించిన కార్యములు అన్నింటికీ సానుకూలం చేసుకుంటారు. రోజురోజుకూ సక్సెస్ రేట్ పెరుగుతుండడంతో చాలా ఆనందంగా ఉంటారు. భోజన సౌకర్యం బాగుంటుంది. ప్రతి వ్యవహారమూ నడిపే ప్రయత్నంలో శరీరం మనస్సు బాగా సహకరిస్తాయి. కానీ ఆర్థిక వనరులు సరిగా సమకూరవు. యిక శని రాహు అనుకూలం దృష్ట్యా ధనంతో సంబంధం లేకుండానే ధైర్యంగా ముందుకు వెడుతుంటారు. ఆదాయం తక్కువ స్థాయిగాను ఖర్చులు అధిక స్థాయిలోను ఉంటాయి. అధికారులు బాగా సహకరిస్తారు. తద్వారా ఉద్యోగ వ్యాపార విషయాలలో అనుకూలస్థితి ఉంటుంది. అనుకున్న ఫలితాలు వృత్తి విషయంలో అందుకుంటారు. యితరులకు కూడా పూర్తిగా సహకరిస్తారు. సాంఘిక కార్యకలాపాల ద్వారా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధువైరం జ్ఞాతివైరం వంటి వాటికి పరిష్కారం లభిస్తుంది.
🎉సమస్యలకు భయపడకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. గురువు మకరంలో ఉండగా చోరభయం ఉంటుంది. కాని అది పెద్ద స్థాయి కాదు. గృహోపకరణాలు కొనుగోలు చేసుకుంటారు. వాహనములు నడిపేటప్పుడు ఆగష్టు సెప్టెంబరు నెలల్లో జాగ్రత్తలు పాటించాలి. శుభకార్య పుణ్యకార్య నిమిత్తంగా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ జన్మ స్థలంలోని విశేష దేవాలయములు సందర్శించే ప్రయత్నిస్తే అది అనుకూలం పెంచుతుంది. భవిష్యత్కు అనుకూల స్థాయి పెరుగుతుంది. విద్యావ్యాసంగంలో ఉన్నవారి విషయంలో విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు యిబ్బంది కలిగిస్తాయి.
🎉ఉద్యోగ విషయంగా విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. యిక కన్‌స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగంలో వారి విషయమై శని రాహువుల అనుకూల సంచారం లాభ ఫలితాలనే సూచిస్తోంది. ఫైనాన్స్ వ్యాపారులు ఎంతో జాగ్రత్తలు పాటించినా ఏదో ఒక రకంగా సమస్య వెంబడిస్తూనే ఉంటుంది. షేర్ వ్యాపారులు మరియు సరుకు నిల్వ చేసి వ్యాపారం చేయువారి విషయంలో చాలా చక్కగా వ్యవహరించి అంతటా లాభాలు అందుకొనే అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలు అందుకుంటారు. పుణ్యకార్యసక్తత ఉన్నవారు పుణ్యక్షేత్ర సందర్శన చేయు సంకల్పం వున్నవారు శని రాహువుల అనుకూలం దృష్ట్యా మంచి ఫలితాలు అందుతాయి. శుభ కార్య ప్రయత్నాలలో వున్నవారికి కూడా అన్ని అంశాలతోను మంచి ఫలితాలు అంది సుఖజీవనం చేయు అవకాశం ఉన్నది. సంపూర్ణ కార్యసిద్ధి.
🎉విద్యార్థులకు గురుబలం తక్కువగా ఉన్నది. అయితే శ్రమ చేసినవారికి సంతృప్తికర ఫలితం అందకపోయినా నష్టం ఉండదు. రైతులు శ్రమ ఎక్కువగా చేస్తారు. ఫలితం తక్కువ. ఆర్థిక యిబ్బందులు వుంటాయి. కోర్టు వ్యవహారములలో వున్న వారికి ప్రత్యక్షంగా శత్రువులతో లావాదేవీలు జరుగక మధ్యవర్తుల ద్వారా వ్యవహారం జరిగి కార్యలాభం చేకూరగలదు. అందు భాగంగా మీరు కొంత నష్టపడవలసి ఉంటుంది. స్థానచలన ప్రయత్నాలలో వున్నవారికి గురుబలం తక్కువ అయినా శ్రమతో ఫలితాలు సాను కూలం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో వున్నవారికి చాలా చిత్రమైన అంశాలు గోచరిస్తాయి. అయితే అదృష్టవశాత్తు పనులు వేగవంతం చేసుకోగలుగుతారు. గురుసంచారం ధనవ్యయం సూచిస్తోంది. ప్రమోషన్ ప్రయత్నాలు సరిగా సాగవు. ఏప్రిల్, మే, జూన్ నెలలో ఆటంకాలు కూడా ఉంటాయి. అధికారుల సహకారం ఉంటుంది.
🎉నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. నవంబర్, డిసెంబర్ లో శుభవార్తలు వినే అవకాశం ఉన్నది. నూతన వ్యాపార ప్రయత్నాలు చక్కగా జరుగుతాయి. అనుకూల స్థితి అందుతుంది. ధనవ్యయం అధికము. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా యిబ్బందులు ఉంటాయి. అయితే తెలివిగా ప్రవర్తించి సమస్యలు దాటవేయు విషయంలో సక్సెస్ అవుతారు. భార్యాపుత్రులలో కొంతకాలం అనగా గురువు మకరంలో వుండగా చికాకులు ఉన్నా గురువు కుంభంలో వుండగా అనుకూలస్థితి ఉంటుంది. పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు కుంభ గురువు సంచారం కాలం అంతా పొందుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది. బంధువుల ద్వారా యిబ్బందులు తగ్గుతాయి.
🎉ఋణ విషయంలో పాత ఋణములు వున్నవారికి జూన్, జూలై, ఆగస్టు మాసాలలో యిబ్బందికరం అవుతుంది. మరి కొత్త ఋణములు కూడా అవసరానికి అందుబాటు కాని స్థితి ఉంటుంది. మీరు యిచ్చిన ఋణములు తిరిగి తీసుకోవడం యిబ్బంది అవుతంది. ఆరోగ్య విషయంలో సాధారణ స్థాయిగానే ఎక్కువశాతం ఉంటుంది. జూన్, జూలై, ఆగస్టు మాసాలలో మాత్రం కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. శరీర రక్షణ మీద ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెడతారు. యిబ్బందికరమైన సంఘటనలు ముందుగా గుర్తించి వాటికి దూరంగా ఉండడం తద్వారా లాభం పొందుతారు. మార్కెటింగ్ ఉద్యోగులకు శని రాహువుల అనుకూలం దృష్ట్యా టార్గెట్లు తేలికగా పూర్తి అవుతాయి. అంతేకాకుండా కొత్త కొత్త వ్యాపారం చేయు విషయాల మీద దృష్టి సాగించి మంచి ఫలితాలు అందుకుంటారు.
🎉స్త్రీలకు ఈ సంవత్సరం భర్త నుండి, భర్త తరఫు బంధువుల నుండి ప్రోత్సాహం, సహకారం బాగా లభిస్తుంది. మీ యొక్క తోటి ఉద్యోగుల సహకారం దృష్ట్యా, ఉద్యోగ లాభం చేకూరుతుంది. వ్యాపారస్తులైన స్త్రీలు శ్రమతో కూడుకొని మంచి ఫలితాలు అందుకుంటారు. యిక తరచుగా ప్రయాణములు చేస్తారు. అభివృద్ధి పథంలో ఉంటారు. గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా ప్రవర్తించి తగు జాగ్రత్తలు పాటించి, సుఖప్రసవయోగం పొందుతారు.
🎉 మఘ నక్షత్రం వారికి విశేషములు ఏమనగా శుభకార్యాచరణ విశేష లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ఊహకు అందని రీతిగా సత్ఫలితాలు ఉంటాయి. తరచుగా వాహన ప్రమాదాలు తప్పుకుంటారు. లేబర్ ప్రాబ్లమ్స్ తో వ్యాపారులు యిబ్బందిపడతారు.
🎉 పుబ్బ నక్షత్రం వారికి విశేషములు ఏమనగా మంచి జీవనం చేస్తారు. కొద్దిరోజులు అనుకూల ఫలితాలు కొద్దిరోజులు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణ విఘ్నములు ప్రయాణములో వస్తు నష్టం ఉంటుంది. ప్రశాంతంగా వ్యవహరిస్తే లాభాలు అధికంగా ఉంటాయి.
🎉 ఉత్తరా నక్షత్రం వారికి విశేషములు ఏమనగా భార్య తరఫు బంధువుల ద్వారా కలహప్రాప్తి. అందరూ బాగా గౌరవిస్తారు. మంచి జీవనం చేయడం కోసం కొన్ని కొన్ని విషయాలలో అధిక శ్రమ చేయవలసి ఉంటుంది. ఉద్యోగం కొత్తగా ప్రయత్నించే వారికి లాభదాయకంగా ఉంటుంది.
🎉నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
"ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం - సకల భువననేత్రం నూత్న రత్నోపధేయమ్ - తిమిరకరి మృగేంద్రం
బోధకం పద్మినీనాం - సురవర ముభివన్ద్యం సుందరం విశ్వరూపమ్"
- ఈ శ్లోకం పగటికాలంలో అధికసార్లు పఠించుట వలన శుభాలు పెరుగుతాయి.
🎉శాంతి : దోషము చేయు గ్రహములు గురు కుజ నిమిత్తంగా జూన్ మాసములలో జపదాన హోమ శాంతి మీరు దగ్గర వుండి చేయించుకోండి. పంచముఖి రుద్రాక్ష ధారణ అధికంగా మానసిక ఒత్తిడిని నిరోధిస్తుంది. రోజూ సుబ్రహ్మణ్య త్రిశతి పారాయణ చేయండి. సంక్షిప్త రామాయణం, రామపట్టాభిషేకం ఘట్టం పారాయణ చేయండి. “శ్రీమాత్రే నమః” నామస్మరణ చేయండి.
🎉ఏప్రిల్ : పుణ్యకార్యములు చేస్తారు. కలహములు అనుకోకుండా వస్తాయి. మానసిక వ్యాకులత పెరుగుతుంది. వృత్తిరీత్యా తిరుగుడు ఎక్కువ అవుతుంది. అనవసరమైన వ్యవహారములలో కలుగజేసుకొని సమస్యలు కొనితెచ్చుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో ప్రశాంతంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. ఉద్యోగ, వ్యాపార విషయాలలో కూడా ప్రతిపనిని స్వయంగా చేసుకోవడం చాలా అవసరం. ఆర్థిక కార్యకలాపాలు ఆరోగ్య విషయాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి.
🎉మే : మాసారంభం కంటే ద్వితీయార్థం బాగా అనుకూల స్థితిని యిస్తుంది. ప్రతి అంశమును ఉత్సాహంగా పూర్తి చేయగలరు. మంచికాలమే. ప్రారంభంలో ఆరోగ్య విషయంలో కొన్ని చికాకులు వస్తాయి. క్రమేణా ఆరోగ్యం సరిచేసుకొని ఉద్యోగ వ్యాపార విష యాలను మరియు అన్ని వ్యవహారములను సకాలంలో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళతారు. అలాగే విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారములు ఉన్నవారు ఈ నెలలో బాగా జాగ్రత్తలు పాటించమని ప్రత్యేకంగా సూచిస్తున్నాము.
🎉జూన్ : ధనం వెసులుబాటు చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. అయితే ప్రణాళికా బద్ధంగా వ్యవహరించుటకు కూడా గ్రహానుగ్రహం లేదు. ఋణ సంబంధమైన వ్యవహారాలలో చాలా చికాకులు అనుభవిస్తారు. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళవద్దని ప్రత్యేక సూచన. అన్ని పనులు సానుకూలంగా అవుతున్నట్లు అనిపించినా, కుజసంచారం సరిగా లేని కారణంగా కలహములు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం సరిగా లేదేమో అనే భావన తరచుగా కలుగుతూ ఉంటుంది.
🎉జూలై: కుజ శుక్ర సంచారం సరిలేని కారణంగా యిబ్బందికర ఘటనలు ఎదురౌతాయి. జీవనోపాధి మార్గాలు సరిగా ఉండకపోవచ్చు. కుటుంబ విషయాలు అనుకూలము. ప్రతి కోణంలోనూ బహు జాగ్రత్తలు తీసుకోవడం, ప్రతి పనిని స్వయంగా చేసుకోవడం ఈ నెలలో మీకు చాలా అవసరం. ఆర్థిక ఆరోగ్య విషయాలలో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనపరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ నెలలో మితభాషణ చాలా అవసరమని ప్రత్యేకంగా సూచిస్తున్నాము. వృత్తి విషయాలలో అనుకూలం తక్కువ.
🎉ఆగష్టు: కుటుంబ విషయంలో అనుకూలం అవ్వడం ద్వారా అంతా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రతిరోజూ ఒక సుదినము అనే చెప్పాలి. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో సమయ పాలన బాగా పాటిస్తూ అన్ని కోణాలలోనూ సత్ఫలితాలు అందుకుంటారు. మీ యొక్క తోటి ఉద్యోగులు మీ పై అధికారులు మీకు అన్ని విషయాలలోనూ మంచి సూచనలు చేస్తారు. ఆర్థిక, ఆరోగ్య విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఋణ విషయాలలో కూడా మంచి ఫలితాలు అందుతాయి.
🎉సెప్టెంబర్ : కొత్త ప్రయోగాలు చేయువారికి మాత్రమే యిబ్బంది. మిగిలిన ఈ రాశివారికి శుభ పరిణామములే ఉంటాయి. మౌనం లాభదాయకము. దైనందిన కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. మానసిక ప్రశాంతత ఇచ్చే రీతిగా ఉన్న పనులు మాత్రమే చేసుకుంటూ ఇబ్బందికరమైన ముందుగానే గమనించి వాటిని దూరం చేస్తూ చక్కటి జీవితాన్ని గడుపుతారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ విషయాలు నడుపుకుంటూ శుభ కార్యములలో పాల్గొంటూ పుణ్యకార్యములు చేస్తూ కాలక్షేపం చేస్తారు.
🎉అక్టోబర్ : గౌరవ మర్యాదలు అందుతాయి. అన్ని వ్యవహారములు సానుకూలం చేసుకుంటారు. ఆర్థిక అసమానతలు ఉంటాయి. మీరు చేసే ప్రతిపనీ అందరికీ ఉపయోగపడడం, తద్వారా మీరు ఆనందించడం జరుగుతుంది. తరచుగా లాభదాయకమైన వార్తలు, శుభసంబంధమైన వార్తలు వింటారు. ఉద్యోగం, వ్యాపారం వాటిలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ సరిచేసుకుంటూ ముందుకు వెడతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం అవుతాయి.
🎉నవంబర్ : కొత్త ప్రణాళికలు, పాత వ్యవహారములు అన్నీ లాభదాయకం అవుతాయి. మీ బంధుగణం మీకు బాగా సహకరిస్తారు. వాహనాలు నడిపే విషయంలో బహు జాగ్రత్తలు పాటించండి. ఇతరుల ఆర్థిక వ్యవహారాలలో సలహాలు ఇవ్వకండి. తొందరపడి ఉద్యోగ, వ్యాపార విషయాలలో ఇతరుల సలహాలు పాటించవద్దు. అధికారుల వద్ద మితభాషణ చేయడం అవసరం. కుటుంబ వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం వలన నష్టాలు నివారింపబడతాయి.
🎉డిసెంబర్ : మీ వ్యవహారములు చాలా జాగ్రత్తగా గోప్యంగా నడవవలెను. అలాగే శుభకార్య పుణ్యకార్యములలో ఎక్కువగా పాల్గొంటారు. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. తరచుగా గురువులను, పూజ్యులను కలుసుకుంటారు. విజ్ఞాన, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల యొక్క కలయికలో మీరు చాలా మితభాషణ చేయటం భవిష్యత్తుకు మంచిది. మీ యొక్క భవిష్యత్తు కార్యాచరణ గురించి ఎక్కడా ప్రస్తావన చేయవద్దు.
🎉జనవరి : చాకచక్యంగా పనులు పూర్తి చేస్తారు. శుభకార్యములు పుణ్యకార్యములు చక్కగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. విజ్ఞాన వినోద కార్యములలో పాల్గొంటారు. సమస్యలు అన్ని అంశాలలోనూ వస్తూనే ఉంటాయి. అయితే తెలివిగా అన్నింటినీ సరిచేసుకుంటారు. ఎవరినీ నమ్మి ఏ పనులు చేయవద్దు. ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార విషయాలలో ముందు జాగ్రత్త చర్యగా మీరు చేసేటటువంటి పనులు మీకు శ్రీరామరక్ష అవుతాయి.
🎉ఫిబ్రవరి : ప్రతిరోజు శ్రమ ఎక్కువ తెలివి ఎక్కువ ప్రదర్శించి కార్యములు సానుకూలం చేసుకుంటారు. కుటుంబ విషయాలు సానుకూలంగా పూర్తి అవుతాయి. ఉద్యోగ విషయంలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ అధికారుల అండదండలతో అన్ని సమస్యలు దాటుతారు. ఆర్థిక సానుకూలత తక్కువ. ఋణ సంబంధమైన వ్యవహారాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటుగా ఏ విషయంలోనూ ముందుకు వెళ్ళకండి.
🎉మార్చి : ధైర్యయుక్తమైన బుద్ధితో పాటు ఓర్పు తెలివి ప్రదర్శించి ముందుకు వెళ్ళవలసిన కాలము. ఆర్థిక అసమానతలు ఆరోగ్య యిబ్బందులు ఉంటాయి. ప్రయాణాలు విరమించుకోవడం మంచిది. వాహనములు తరచుగా ఇబ్బందులు పెడుతుంటాయి. పనిముట్లు వాడకంలో గాయములు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి విషయంలో చిన్న చిన్న సమస్యలు తరచుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఋణ సంబంధమైన ప్రతిబంధకాలు కూడా ఉంటాయి.


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment