Friday, 9 June 2017

ఏరువాక పున్నమి



జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి ని ఆంధ్రప్రదేశ్,తెలంగాణా రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారు.
తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలుపెడతారు.

 నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే హలపౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి. దాన్ని ఈ రోజునే ఎందుకు చేసుకుంటారు అంటే...

వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తరువాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటూ ఇటూ అయినా కూడా, జ్యేష్ఠ పౌర్ణమినాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున ఏరువాక అంటే ‘దుక్కిని ప్రారంభించడం’ అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం. ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారు తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి. సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలదీకరణం చెందేందుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు... ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయిక కేలెండర్‌ను ఏర్పరిచారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి. కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా, మరికొందరు బద్ధకించకుండా... ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.


ఈ రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రంచేసుకుంటారు రైతులు. వాటికి పసుపుకుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దుల సంగతైతే చెప్పనక్కర్లేదు. వాటికి శుభ్రంగా స్నానం చేయించి, వాటి కొమ్ములకు రంగులు పూస్తారు. కాళ్లకు గజ్జలు కట్టి, పసుపుకుంకుమలతో అలంకరించి హారతులిస్తారు. పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కలో కొందరు, తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి, కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఇక ఏరువాక సాగుతుండగా, అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకనే ఏరువాక పాటలు, నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.

జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశమంతటా ఉంటుంది. మన దేశంలోని దాదాపు 80 శాతం వర్షపాతం ఈ నైరుతి వల్లనే ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని దేశమంతటా జరుపుకోవడం గమనించవచ్చు. సంస్కృతంలో ఉద్వృషభ యజ్ఞమనీ, కన్నడలో కారుణిపబ్బ అనీ... ఇలా రకరకాల పేర్లతో ఈ పండుగను ఆచరిస్తారు. వేదకాలంలో సైతం ఈ పండుగ ప్రసక్తి కనిపిస్తుంది. కాకపోతే ఆ రోజుల్లో ఇంద్రుని ఆరాధన ఎక్కేవగా ఉండేది కాబట్టి, ఈ రోజున ఇంద్రపూజకు అధిక ప్రాధాన్యతను ఇచ్చేవారు. నమ్మకాలు మారుతున్న కొద్దీ ఇంద్రుడు పక్కకి జరిగినా... వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించక తప్పలేదు, తప్పదు!


No comments:

Post a Comment