Monday, 13 November 2023

విష్ణుమూర్తి అవతారములు- గ్రహములు, గుణములు.

 



విశ్వంలో జీవాంశ  మరియు పరమాత్మ అంశ  అని రెండు ముఖ్యసారాంశాలు కలగలసి ఉంటాయి. మామూలు మానవుని దృష్టికి కనిపించేదంతా జీవాంశ అవుతే కంటికి కనబడని ఖచ్చితమైన పరమ శ్రేష్టమైనది పరమాత్మఅంశ. ఈ రెండింటి సారాంశాన్ని మనకు గ్రహములు స్పష్టంగా తేటతెల్లంగా అందిస్తూ ఉంటాయి..

నవగ్రహాలని అనుసంధానిస్తూ విష్ణుమూర్తి అవతారాలు మనకి అందుబాటులో ఉండి ఈ అతి ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవడానికి సహకరిస్తున్నాయి.

కేతు గ్రహానికి సంబంధించి వివరణను మీన లేదా మత్స్య అవతారం సూచిస్తుంది .

శని గ్రహానికి సంబంధించి ఓర్పును, ఒరిమిని సూచించేది కానీ, నెమ్మదిగా అయినా ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేది అయిన శని గ్రహమునకు సంబంధించిన గుణాలను చూపించే అవతారం కూర్మావతారం.

రాహు గుణాలు సూచించే అవతారం వరాహ అవతారం.

కుజుని ప్రభావాన్ని చూపించే అవతారం నృసింహ అవతారం.

జ్ఞానము కలిగిన వామనమూర్తి గురుని అవతారమే.

అసుర గురువు శుక్రాచార్యుల గుణములు  కలిగిన  వారు పరశురాములు.

రామో విగ్రహాన్ ధర్మః అని  మనం కొలిచే, నడిచే దేవుడు  రఘుకుల తిలకం శ్రీరాముడు సూర్యుని అవతారం.

అందరినీ చల్లగా ఆకర్షించి మనోవికాసాన్ని బోధించిన గీతాచార్యుడు మనోహరుడు  కృష్ణుడు చంద్ర స్వరూపుడే.

తెలివి తేటలు కలిగిన బుధుడు బోధి వృక్షం క్రింద జ్ఞానం పొందిన బౌద్ధ స్వరూపమే అని పెద్ద వాళ్ళ నమ్మకం.

పరమాత్మ తన అంశను మన జీవాంశ తో అనుసంధానం చేసి వెలసిన ఈ అవతారాలన్నీ కూడా మనకు ఆదర్శమైన పాత్రలే.

ఎక్కువగా పరమాత్మ అంశ కలిగినవి రాముడు ,కృష్ణుడు, నరసింహుడు మరియు వరాహ అవతారములు.

మిగిలిన అవతారములు ఎక్కువగా జీవాంశ  శాతం  కలిగి పరమాత్మ అంశ ప్రభావం శాతం తక్కువగా ఉన్న గ్రహము ల నుండి ఏర్పడినవే.

మానవుని జీవితంలో జరిగే పరిస్థితులను ప్రభావితం చేస్తూ  రాశులు ఉంటాయి. ఈ 12 రాసులలో ఉండే నవగ్రహాలు మనిషి జీవితాన్ని తమ అదుపులోకి తీసుకు ప్రయత్నిస్తుంటాయి.

 కనుకనే ,ఈ రాశి చక్రాన్ని విష్ణుమూర్తి తోటి పోలుస్తారు.కాలపురుష చక్రం గా పిలుస్తారు . రాశులు విష్ణుమూర్తి అవయవాలనీ, గ్రహములను విష్ణుమూర్తి అవతారాలు అని అంటారు.

ఆత్మని నియంత్రించేది సూర్యుడు అవుతే, మనసును తన అదుపులో పెట్టుకునేది చంద్రుడు. కుజుని నియంత్రణలో శక్తి ఉంటుంది.వాక్కు బుధ  ఆధిపత్యంలో ఉంటుంది. జ్ఞానము, సంతోషమునకు కారణము గురుడు..అవుతే, శుక్రుడు ఇతరులను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటాడు . శని బాధలన్నిటినీ  నియంత్రిస్తూ ఉంటాడు.

రవి చంద్రులను  రాజులతో పోల్చారు.

రాజకుమారుడు లేదా యువరాజు బుధుడు అవుతే, గురుడు మరియు శుక్రుడు మంత్రులుగా  ఉంటారు.

కుజుడు సైన్యాధిపతి అవుతే రాహుకేతువులు సేనలు తయారు చేసే వారు అవుతారు. శని సేవకుడిలా గా పనిచేస్తాడు.

విద్యలకు అధిపతులుగా జ్ఞానము కలిగిన వారుగా బ్రాహ్మణులుగా గురుశుక్రులు గౌరవించబడతారు.

 పోరాట యోధులైన క్షత్రియులుగా రవి కుజులు గుర్తించబడ్డారు.

ఎదుటివారి మనసును గెలిచి తెలివితేటలు కలిగిన వర్తక వ్యాపారస్తులైన వైశ్యులుగా చంద్ర బుధులు,

 పనిచేసే కార్మికుడు , కర్మాధిపతి శూద్రునిగా శని పిలవబడతారు.

జ్ఞాన సముపార్జనే ధ్యేయం జ్ఞానం కలిగిన తరగతికి, 

ధైర్యమే ధ్యేయముగా పోరాటయోధులకు, ఇతరుల మనోభావాలు తెలుసుకొనడం, వారి సంక్షేమాన్ని ఆశించడం వ్యాపారస్తులకు, కష్టపడి పనిచేయడం కార్మికులకు కావలసిన ముఖ్యమైన విషయములు మరియు గుణములు.

వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.కుల వ్యవస్థ లే.దు ఈ విధముగా వర్ణములు ఒక వ్యక్తి గుణములను నిర్ణయిస్తూ ఉంటాయి.దీనిని తప్పుగా అర్థం చేసుకో కూడదు. ఈ విధమైన వర్ణ భేదము ప్రతి కుటుంబంలోనూ ఉంటుంది. అనుభవజ్ఞులైన తల్లిదండ్రులను రాజు , మంత్రులతో పోల్చి, సంపాదన పరులైన వారిని వైశ్యుల తో పోల్చి, ఇంటిపనిని చక్క పెట్టేవారని కార్మికులతో పోల్చడమే వర్ణ వ్యవస్థ గా చెప్పు కొనగలము.

చంద్రుని రాజు మరియు వైశ్యుని లాగా కూడా గుర్తిస్తూ ఉంటారు .అలాగే సూర్యుని కూడా రాజు  మరియు పోరాట యోధుడైన క్షత్రియుని లా కూడా గుర్తించారు. తన రక్షించుకునే వాడు, ఇతరులను రక్షించే ధైర్యవంతుడైన రాజుగా సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. అందరినీ అనుసంధానం చేసుకుంటూ కలుపుకుపోయే రాజు లా చంద్రుడు ఉంటాడు.

రవి చంద్ర గురులు సాత్విక గుణాలు కలిగిన గ్రహములు. శుక్ర,బుధులు రాజసిక గుణములు కలిగిన గ్రహములు. కుజ శనులు తామసిక ప్రవృత్తి కలిగిన గ్రహములు.

సాత్విక గుణము అనగా ఎవరినీ నొప్పించని వారు అనే ఒక అపోహ ఉంది. అలాగే అవసరం లేకపోయినా అందరినీ మూర్ఖంగా ఎదిరించే వాడు అని రాజస ప్రవృత్తికి అర్థం చేసుకుంటున్నారు.

 నిజానికి సత్వము అనగా నిజాయితీగా ఉండటం అని చెప్తారు.అంతేకాని ,ఎదుటి వారిని మెప్పించడం కోసం లేని మంచితనాన్ని చూపించడం సత్వగుణం కాబోదు.అదేవిధంగా ఎదుటి వారి తప్పులు ఎత్తి చూపి శిక్షించడం రజోగుణం కాదు.శక్తివంతంగా ఎదుటివారిని ఎదుర్కోవడమే రజోగుణ ముఖ్యోద్దేశము.

ఎదుటివారిలో మంచిని కోరుతూ ఎదుటివారిని మంచి దారి మళ్ళించడం చిన్న శిక్ష ద్వారా వారిలో పరివర్తన తీసుకురావడం సాత్విక గుణం కింద చెప్పబడుతుంది..గాని, రజోగుణము కాదు. శ్రీరాముడు మరియు సూర్యుడు , వీరిని ఈ విధమైన సత్వగుణానికి ఉదాహరణగా చెప్పు కొనగలము.

సూర్యుడు పోరాట యోధుడైన రాజు కింద గుర్తించబడినప్పటికీ సాత్విక గుణములు కలిగినవాడు  అలాగే శ్రీరాముడు పరమాత్మ అంశతో జన్మించి, రావణుని వధించినా కూడా ,స్వచ్ఛమైన మనసు కలిగి, ఆలోచన ఎదుటి వారికి ఉపయోగపడే లాగా ,ఆనందాన్ని ఇచ్చే లాగా ఉంటారు..గనుక సత్వగుణానికి చెందిన ధర్మమూర్తి అయ్యారు .

రజోగుణము కొంత కోరికతో కూడినశక్తిని కలిగి పోరాట పటిమ కలిగి ఉంటుంది.

 ఆలోచనలన్నీ సంకుచితంగా చేసే పనులన్నీ ఎదుటివారినీ బాధపెట్టే లాగా ఉండే గుణమే తామస గుణం.

ఈ విధంగా సత్వ రజో తమో గుణములు గ్రహముల వర్ణబేధము అనుసరించి, రాశుల భావములను ప్రకారం నిర్ణయించబడి నక్షత్రాలతో జత కూడి జాతకుని మీద ప్రభావం చూపిస్తాయి..


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment