స్మరణాత్ అరుణాచలే అంటారు పెద్దలు జ్ఞానులు మాత్రమే చిదంబరాన్ని దర్శిస్తారు. తిరువారూరులో జన్మించినవారు, కాశీలో మరణించినవారు మోక్షానికి అర్హులవుతారు. అరుణాచలం అని ఊరుపేరు మాత్రం తలిచిన వారందరికీ... మోక్షం లభిస్తుంది. అరుణాచల శివ భక్తులు పున్నమి గిరిప్రదక్షిణ, కార్తిక దీపదర్శనాలు తప్పకుండా చేస్తుంటారు. అరుణాచలేశ్వరుని కార్తికోత్సవ వైభవాన్ని తిలకించడం కోటిజన్మల పుణ్యఫలం. ఈసారి అరుణాచలంలో కార్తిక బ్రహ్మోత్సవాలను కూడా కృత్తికతో కూడిన పౌర్ణమి తిథి వస్తున్న డిసెంబర్ 6వ తేదీన నిర్వహించబోతున్నారు. శాంతి ప్రదాయక జ్యోతిగా ప్రతి ఏడూ కార్తికమాసంలో కృత్తికా నక్షత్ర వేళ అరుణగిరిపై దర్శన మిస్తానని పరమేశ్వరుడు భక్తులకు వాగ్దానం చేశాడని పురాణ కథలున్నాయి. అటువంటి దీపాన్ని దర్శించడానికి లక్షలాది భక్తులు కొండకు చేరుకుంటారు. వారి దర్శనార్థం కొండపైన అతి పెద్ద ప్రమిదలో ఆవునేతి దీపాన్ని వెలిగిస్తారు. కొండదిగువన నిలబడి చూసేవారికి కూడా ఆ దీపం చక్కగా దర్శనమిస్తుంది. దానినే కార్తిగై దీపం లేదా కృత్తికా దీపం అని పిలుస్తారు. దీపదర్శనం చేసిన వారికి మోక్షం సిద్ధిస్తుందని చెబుతారు.
No comments:
Post a Comment