గరుడ పురాణమును ఇంట్లో నిరభ్యంతరంగా ఉంచవచ్చు. పితృకర్మలు జరుపు దినాలలో గరుడ పురాణ శ్రవణము చాలా ప్రశస్తము. ఇంట్లో ఆ గ్రంథముండకూడదని మాత్రము కాదు....
ఎందుకంటే ఒక్క తెలుగువారి ఇళ్ళల్లోనే గరుడ పురాణం చదవకూడదని, ఇంట్లో ఉంచుకోకూడదని పెద్దలు అంటున్నారు. ఈ అప్రకటిత నిషేధానికి ప్రమాణం లేదు. తండ్రులు, తాతలు, ముత్తాతలు అన్నారని అనేసుకోవడమే. ఇలా ఎందుకు జరిగింది? వ్యాస మహర్షి పట్ల అసూయ వల్లనో కోపం వల్లనో ఆయన కూర్చిన గ్రంథాన్ని అప్రతిష్టపాలు చేశారనుకోలేము కదా! ఎందుకంటే ఆయన మనకు దైవసమానుడే. మన మత గ్రంథాలలో సింహభాగం ఆయన ప్రసాదాలే.
ప్రేతఖండం వుంది కాబట్టి 'ఆ' పన్నెండు రోజుల్లో తప్ప ఇంకెప్పుడూ ఈ పురాణాన్ని చదవకూడదు అని చెప్పే పెద్దలు గరుడ పురాణంలో పొందుపరపబడిన మిగతా విషయాలను పట్టించుకోరేమి? మొత్తం పురాణంలో 320 అధ్యాయాలుంటే ఈ 'అందరినీ భయపెట్టిన' ప్రేతఖండం లేదా ప్రేతకాండ 50 అధ్యాయాలలోనే వుంది కదా! మరి మిగతా 270 అధ్యాయాలలో నున్న మహా విషయాన్నెందుకు చదవకూడదు? అసలు ఆ అధ్యాయాలలో ఏముంది?
సర్గవర్ణనం, దేవార్చనం, తీర్థమాహాత్మ్యం, భువన వృత్తాంతము, మన్వంతరం, వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, దానధర్మం, రాజధర్మం, వ్యవహారం, వంశానుచరితం, వ్రతం, నిదానపూర్వక అష్టాంగ ఆయుర్వేదం, సంస్కృత వ్యాకరణం, ప్రళయం, ధర్మం, కర్మం, కామం, అర్థం, ఉత్తమ జ్ఞానం, విష్ణుదేవుని మాయామయ, సహజ లీలల విస్తార వర్ణనం ఇవన్నీ ఈ పురాణంలో వున్నాయి. వీటిని తెలుగువారికి దూరం చేసి గరుడపురాణమంటే ప్రేతఖండమొక్కటే అనే అపపప్రథను ప్రజల హృదయాలలో ముద్రించారు.
శివ, విష్ణు, సరస్వత్యాది రహస్య పూజలున్నాయి. ముఖ్యంగా 'ఖం ఠం ఫం షం గదాయై నమః' వంటి అరుదైన బీజ యుక్త గుప్తమంత్రాలున్నాయి. (1-7) 'హ్రా గుణింతంలో షడంగన్యాసముంది. విశేషమేమిటంటే గరుడపురాణంలోని సాధనలకు కులగురువు లేదా పురోహితుడు మున్నగువారి అవసరమున్నట్లు చెప్పబడలేదు. (ఇది రచయిత యొక్క అభిప్రాయం)
న్యాసానికీ, సంధ్యావందనానికి అవసరమైన అన్ని మంత్రాలూ బీజక్షరాలతో సహా వున్నాయి. అజ్ఞానాన్నీ, అనైశ్వర్యాన్నీ కూడా పూజించగలిగే సంస్కారమిందులో వుంది.
No comments:
Post a Comment