వశిష్ఠుడిట్లనెను. ఓ జనకమహారాజా! కార్తీక మహాత్మ్యమును యింకా చెప్పదను సావధాన మనస్కుడవై వినుము. ఈమాసమందు ఎవడు పద్మములచేత పద్మములవంటి నేత్రములు గల హరిని పూజించునో వాని యింటిలో పద్మములందుండు లక్ష్మీదేవి నిత్యనివాసము చేయును. భక్తితో తులసీదళముతోను, జాజిపువ్వులతోను హరిని పూజించువాడు తిరిగి భూమియందు జన్మించడు. మారేడు దళములతో సర్వ వ్యాపకుడయిన హరిని పూజించినవాడు తిరిగి భూమియందు జన్మించడు. భక్తిో ఫలములను దానమిచ్చువాని పాపములు సూర్యోదయముకాగానే చీకట్లు ఎట్లునశించునో అట్లు నశించును. ఉసిరికాయలతో ఉసిరి చెట్టుక్రింద హరిని పూజించువానిని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు. కార్తీకమాసమందు తులసీదళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు బ్రాహ్మణులతో గూడా వనభోజనము ఆచరించువానియొక్క కోటానుకోట్ల పాపాలు నశించును. బ్రాహ్మణులతో గూడా ఉసిరి చెట్టు దగ్గర సాలగ్ామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండును. భక్తిచే హరియొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణమును గట్టువాడు పరమపదము పొందును. హరికి అరటి స్తంభములతోగాని, పుష్పములతోగాని, మంటపమును నిర్మించి పూజించువాడు చిరకాలము వైకుంఠమందుండును. ఒక్కమారయినను హరిముందు దండప్రణామమాచరించువారు పాపవిముక్తులై అశ్వమేధయాగఫలము పొందుదురు. హరిముందు జపము, హోమము, దేవతార్చనము చేయువారు తమ పితరుతో కూడా వైకుంఠమునకు బోవుదురు. స్నానముచేసి తడిబట్టతో ఉన్నవానికి చలితో వణుకువానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలమును పొందును. విష్ణువుయొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోపణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవునట్లు నశించును. నల్లనివిగాని, తెల్లనివిగాని అవిశపువ్వులతో హరిని పూజించిన యెడల పదివేల యజ్ఞములు చేసిన ఫలము గలుగును. బృందావనమునందు ఆవుపేడతో అలికి ఐదు రంగులతోను, శంఖపద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియురాలగును. విష్ణుసన్ిధిలో నందాదీపమును అర్పించిన పుణ్యముయొక్క గొప్పతనము జెప్పుట బ్రహ్మకు కూడ శక్యముగాదు. పర్వతిధులలో పెట్టిన దీపమునకు నందాదీపమని పేరు. ఈనందాదీపము నశించిన యెడల వ్రతభ్రష్టుడగును. తిలలతోను, ధాన్యముతోను, అవిశపువ్వులతోను, కలిపిన నందాదీపమును కార్తీకాసమందు హరికి క్సమర్పించవలయును. నందా అనగా ఏకాదశి పూర్ణిమ మున్నగు పర్వతిథులందు జేయునది. శివునికి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు చిరకాలము జీవించి తుదకు మోక్షము పొందుదురు. విష్ణ్వాలయమంటపమును భక్తితో అలంకరించువారు హరి మందిరమునకు వెళ్ళుదురు. హరిని మల్లెపువ్వులతో పూజించువాని పాపములు సూర్యోదయానంతరము చీకటి నశించునట్లు నశించును. కార్తీకమాసమందు తులసీ గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాపవిముక్తుడై విష్ణులోకమును బొందును. హరిసన్నిధిలో స్త్రీగాని పురుషుడుగాని నాట్యముజేసినయెడల పూర్వజన్మ సంచితమైన పాతకములు గూడ నశించును. ఇతరులకు హరిపూజకొరకు మనోవాక్కాయములచేత సహాయముచేయువాడు స్వర్గమునుబొందును. భక్తితో గంధపుష్ప ధూపదీపాదులచేత హరిని పూజించువాడు వైకుంఠమునుబొందును. ఈమాసమున హరిసన్నిధిలో జపమాచరించనివాడు భూమియందు ఏడు జన్మములందు నక్కగా జన్మించును. ఇందుకు సందేహము లేదు. సాయంకాలమందు హరిసన్నిధిని పురాణ కాలక్షేపమునుజేయువారు వైకుంఠమును జేరుదురు. సాయంకాలమున ఆలయములందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలముండి తరువాత ధ్రువలోకము చేరి సుఖించును.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే సప్తమోధ్యాయస్సమాప్తః
No comments:
Post a Comment