ఒకమారు ఇంద్రాది దేవతలతో కలిసి శివదర్శనానికై నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ పరమశివుడు పరమభక్తితో ఎవరినో ధ్యానించడం చూసి ఆశ్చర్యపోయాను. ఆయన కనులు తెఱచి మమ్ము చూడగానే ప్రణామం చేసి 'హే సదాశివా! మీరు ఇంకొక దేవుని ధ్యానిస్తున్నట్లు మాకు అనిపించింది. మీ కంటె గొప్ప దేవుడు వేరొకరున్నారని మాకింత వరకూ ఎవరూ చెప్పలేదు. మీరే ధ్యానించదగ్గ పరమ దేవతా స్వరూపముంటే, మమ్ము కరుణించి ఆ పరమసారతత్త్వాన్ని మాకూ అనుగ్రహించండి' అని అడిగాను.
'బ్రహ్మాది దేవతలారా! నేను సర్వఫలదాయకుడూ, సర్వవ్యాపీ, సర్వరూపుడూ, సర్వప్రాణి హృదయనివాసి పరమాత్మా సర్వేవరుడూనగు విష్ణుభగవానుని సదా ధ్యానిస్తుంటాను. బ్రహ్మదేవా!ఆ స్వామి ఆరాధనలో భాగంగానే ఎల్లవేళలా భస్మాన్నీ, జటా జూటాన్నీ ధరించి నిరంతర వ్రతాచరణ నిరతుడనైవుంటాను. ఎవరైతే సర్వవ్యాపకుడూ, అద్వైతుడూ, జయశీలుడూ, నిరాకారుడూ, సాకారుడూ, పద్మనాభుడూ, నిర్మల విశుద్ధ పరమహంస స్వరూపుడూ అయి వుండి తాను వెలుగుతూ విశ్వాన్ని వెలిగిస్తూన్నాడో ఆ పరమపద పరమేశ్వర భగవానుడైన శ్రీహరిని నేను ధ్యానిస్తున్నాను. ఈ విష్ణు సారతత్త్వాన్ని ఆయన వద్దకే పోయి తెలుసుకోవాలి పదండి' అన్నాడు పరమేశ్వరుడు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు.
'సంపూర్ణ జగత్తంతా ఆయనలోనే ప్రళయ కాలంలో ప్రవేశిస్తుంది. అందుకే మీతో నాతో సహా అందరికీ శరణ్యుడాయనే. నేను ఆయన చింతనలోనే మగ్నుడనై వుంటాను కాబట్టి మీకు జ్ఞానిగా గోచరిస్తున్నాను. ఒకే సూత్రంలో గ్రుచ్చబడిన మణులలాగ మనమంతా సత్త్వరజస్తమోగుణములతో సహా ఆ సర్వేశ్వరుని యందే ఉన్నాము. సహస్రముఖుడు, సహస్రాధికభుజుడు, సూక్ష్మత కన్నా సూక్ష్ముడు, స్థూలత కన్నా స్థూలుడు, గురువులలో ఉత్తముడు, పూజ్యులలో పూజ్యతముడు, శ్రేష్ఠులకే శ్రేష్టుడు, సత్యాలలో పరమ సత్యము, సత్యకర్ముడు, పురాణాలలో స్తుతింపబడు పురాణపురుషుడు, ద్విజాతీయులలో బ్రాహ్మణోత్తముడు, ప్రళయ కాలంలో సంకర్షణునిగా కీర్తింపబడ్డ వాడునగు ఆ పరమ ఉపాస్యునే నేను ఉపాసిస్తున్నాను.
సత్ అసత్ రూపాలకు ఆవల, సత్య స్వరూపుడై, ఏకాక్షర (ఓంకారం) ప్రణవానికి మూలమై దేవ, యక్ష, రాక్షస, నాగ గణాలచే అర్చింపబడు విష్ణువునే నేనూ అర్చిస్తాను
No comments:
Post a Comment