Kartika Puranam - 18
ఆ అద్భుతపురుషుడు "మునీశ్వరా! నేను అనుగ్రహించబడితిని. నీదర్శనముయొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని.ఓ!మునివర్యా!నాకు నీవే తండ్రివి.నీవే సోదరుడవు.నీవే గురుడవు.నేను నీకు శిష్యుడను.దరిద్రుడనై మొద్దుగానున్న నాకిప్పుడు నీవుగాగ గతి ఎవ్వరు?పాపవంతుడైన నేనెక్కడ? ఇట్టి సద్గతి యెక్కడ? పాపములకు స్థానమైన నేనెక్కడ?పుణ్యమైన కార్తీకమాసమెక్కడ? ఈమునీశ్వరులెక్కడ? ఈ విష్ణుసన్నిధి ఎక్కడ/ ప్రారబ్ధ సుకృతమున్నయెడల తప్పక ఇట్లు ఫలించునుగదా?నాకేదో పూర్వపుణ్యమున్నది.దానిచే ఇది లభించెను. అయ్యా! నాయందు దయయుంచి బాగా తెలియజెప్పుము".
"మనుష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు? ఆకర్మలకు ఫలమెట్లు కలుగును? వాటి ఉపదేశమెట్లు, చేయుటకు ముఖ్యకాలమెద్ది? కర్మలెవ్వి? ఏమి కోరి చేయవలెను? ఈ విషయమంతయు వినగోరితిని గనుక చెప్పుము.నీ వాక్కు అను వజ్రాయుధముచేత నా పాపపర్వతములు కూలినవి?" అని అడుగగా అంగీరసుడు పల్కెను.
ఓయీ! నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది.లోకహితము కొరకు నీవడిగితివి గనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానమును చెప్పెదవినుము.అనిత్యమైన దేహమును ఆశ్రయించి ఇంద్రియకాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు. ఆత్మకెప్పుడును సుఖదుఃఖాది ద్వందములు లేవు.అవి దేహాది ధర్మములైనవి.కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మను చేయవలెను.దానితో చిత్తశుద్ధిగలిగి తద్వారా జ్ఞానమునుపొంది దానిచేత ఆత్మను యథార్ధముగా తెలిసికొనవలెను.దేహధారియయినవాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలనుభక్తితో విధిగా చేయవలెను.అట్టి వేదోక్త కర్మ చేసిన అదిఫలించి ఆత్మ ప్రకాశము కలుగజేయును.వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏకర్మ చెప్పబడినదో విచారించి తెలిసికొని తరువాత చేయవలెను. స్నానము చేయక చేయు కర్మ, ఏనుగు భక్షించిన వెలగపండువలె నిష్ఫలమగును.బ్రాహ్మణులకు ప్రాతఃస్నానము వేదోక్తమైయున్నది. నిరంతరము ప్రాతఃస్నానమాచరించ లేనివాడు తులా సంక్రాంతి యందు కార్తీకమాసమందును, మకరమాసమందును, (మేష) వైశాఖమందును స్నానము చేయవలెను. ఈమూడు మాసములందును ప్రాతఃకాలమందు స్నానము చేయు వాడు వైకుంఠమునకు పోవును మరియు వానికి ఉత్తమగతి గలుగును.చాతుర్మాస్యాది పుణ్యకాలములందును, చంద్రసూర్య గ్రహణములందును స్నానము ముఖ్యము. ఇందు గ్రహణములందు గ్రహణకాలమందే స్నానము ముఖ్యము.
బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది. ౧. స్నానము ౨. సంధ్యాజపము ౩. హోమము ౪. సూర్య నమస్కారము తప్పక చేయదగినవి. స్నానమాచరించనివాడు రౌరవనరకమందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మించును.కాబట్టి పుణ్యకాలము కార్తీకమాసము ఈ కార్తీకము ధర్మార్థకామ మోక్షములనిచ్చును.ఈ కార్తీకముతో సమానమైన మాసము లేదు ఇంతకంటే పుణ్యకాలము లేదు.వేదముతో సమానమైన శాస్త్రములేదు.గంగతో సమానమైన తీర్థము లేదు.బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదు.భార్యతో సమానమైన సుఖము లేదు.ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు. నేత్రముతో సమానమైన జ్యోతిస్సులేదు.కేశవునితో సమానమైన దేవుడు లేడు. కార్తీకమాసముతో సమానమయిన మాసము లేదు.కర్మ స్వరూపమును తెలిసికొని కార్తీకమాసమందు ధర్మములను చేయువాడు కోటి యజ్ఞముల ఫలమును పొంది వైకుంఠమందుండును, అని పలికెను.
అప్పుడు ఆ అద్భుతపురుషుడు,అయ్యా!చాతుర్మాస్య వ్రతమని పూర్వము చెప్పియున్నారు.అది పూర్వము ఎవనిచేత చేయబడినది?ఆ వ్రతవిధి ఎట్లు? ఆవ్రతమునకు ఫలమేమి? దానిని చేయువాడు పొందెడి ఫలమేమి?ఆచరించు మనుష్యుడు ఏలోకమునకు పోవును?ఈ విషయమంతయి సవిస్తారముగా చెప్పుము, అని అడిగాడు.
అంగీరసుడిట్లు పల్కెను. ఓయీ! నీవు ఈ మనుష్యులకు బంధువవు నీ ప్రశ్నలన్నియు లోకోపకారార్థములుగా ఉన్నవి.సమాధానమును చెప్పెదను. సావధానుడవై వినుము.విష్ణుమూర్తి లక్ష్మితో గూడా ఆషాఢ శుక్ల దశమిదినమున పాలసముద్రమందు నిద్రయను వంకతో శయనించును.తిరిగి కార్తీకశుక్ల ద్వాదశి రోజున లేచును.ఇది చాతుర్మాస్యము.అనగా నాలుగు మాసములు చేయువ్రతము. ఈనాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖము ఇచ్చునవి.అనగా, హరి ఎనిమిది మాసములు మెలకువతో నుండి నాలుగు మాసములు విశ్రాంతికై నిద్రించును.విష్ణువునకు నిద్ర సుఖమిచ్చునది గనుక ఇది పుణ్యకాలము. ఈపుణ్యకాలమందు హరి ధ్యానించువాడు విష్ణులోకమును పొందును.ఈ నాలుగు మాసములలోను చేసిన పుణ్యకార్యములు అనంతములగును.దీనికి కారణమును చెప్పెదను వినుము.ఈవిషయమందు నారదునకు హరి చెప్పిన ఒక కథ ఉన్నది.
పూర్వము కృతయుగమందు వైకుంఠలోకంబున హరి లక్ష్మితో గూడ
సింహాసనమందు కూర్చుండి సుర కిన్నర ఖేచరోరగగణములచేతను, స్వగణభృత్యుల చేతను సేవింపబడుచుండెను.హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠలోకమునకు నారదముని వచ్చి సింహాసనాసీనుడై నాలుగు భుజములు గలిగి పద్మపురేకుల వంటి నేత్రముల ప్రకాశించెడి విష్ణుమూర్తిని చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదులకు మ్రొక్కెను.హరియు నారదుని జూచి నవ్వుచు తెలియని వానివలె, 'ఓ నారదా! నీవు సంచరించు స్థలములందు సర్వత్ర కుశలమా? ఋషుల ధర్మములు బాగుగానున్నవా? ఉపద్రవములు లేకున్నవా? మనుష్యులు వారి వారి ధర్మములందున్నారా? ఈవిషయమంతయు ఈ సభలో జెప్పుమూ అని పల్కెను.
నారదుడు ఆ మాటను విని ఆనందించి నవ్వుచు హరితోనిట్లనియె.'ఓ స్వామీ! నేను భూమినంతయు తిరిగిచూచితిని.వేదత్రయమందు చెప్పబడిన కర్మమార్గము విడువబడినది. కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలురైరి.తమ తమ కర్మలను యావత్తు విడిచి యుండిరి. వారు దేనిచేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది. కొందరు తినగూడని వస్తువులను తినుచున్నారు.కొందరు వ్రతములను విడిచినారు. కొందరు ఆచారవంతులుగా ఉన్నారు.కొందరు అహంకార వర్జితులుగా నున్నారు. కొందరు మంచి మార్గవర్తనులుగానున్నారు.కొందరు నిందజేయువారుగా నున్నారు.కాబట్టి, ఓ దేవా! ఏదయినా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము.
నారదుని మాట విని భక్తవత్సలుడు, సమస్త లోక పాలకుడును అయిన హరి లక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకు వచ్చెను. విష్ణుమూర్తి వృద్ధబ్రాహ్మణ రూపధారియై వేల సంఖ్యగల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయా నాటకధారియై పుణ్యక్షేత్రములందును, తీర్థములందును, పర్వతములందును, అరణ్యములందును, ఆశ్రమములందును, సమస్త భూమియందును తిరుగుచుండెను. ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని జూచి కొందరు భక్తితో అతిథి సత్కారములను చేసిరి. కొందరు నవ్విరి.కొందరు నమస్కారము చేయరైరి. కొందరు అభిమానవంతులైరి. కొందరు గర్వముతో ఉండిరి.కొందరు కామాంధులై యుండిరి.కొందరు ఆయా క్రియాకలాపములను మానిరి. కొందరు ఏకవ్రతపరాయణులైయుండిరి.కొందరు నిషిద్ధ దినములందు అన్నమును దినువారుగా నుండిరి.కొందరు తినగూడని వస్తువులను దినుచుండిరి. కొందరాచారవంతులుగానుండిరి.కొందరు ఆత్మచింతన చేయుచుండిరి.
బ్రాహ్మణ రూపధారియైన భగవంతుడు అట్టివారిని మంచి మార్గమునకు తెచ్చు ఉపాయమును ఆలోచించుచు నైమిశారణ్యమందున్న ముని బృందముల సన్నిధికి వచ్చెను.వచ్చి, బ్రాహ్మణరూపమును వదలి పూర్వమువలె గరుడారూఢుడై కౌస్తుభ శంఖ చక్రమును ధరించి లక్ష్మితోను, స్వభక్తులతోను గూడి ప్రకాశించుచుండెను.
అచ్చటనుండు జ్ఞానసిద్ధులు మొదలయిన మునులు వైకుంఠమునుండి తమ ఆశ్రమమునకు వచ్చినట్టివాడును అవిసెపువ్వుతో సమానమైన కాంతి గలవాడును, మెరుపువంటి వస్త్రము గలవాడును, కోటి సూర్య ప్రభాభాసమానుడును, మకరకుండల విరాజితుడును, అనేక రత్నగ్రధిత కిరీట ప్రకాశమానుడును, అనేక సూర్య కాంతి వంతుడును, మనోవాచామగోచరుడును, దేవతాపతియును, స్వయంభువును, ప్రసన్నుడును, అధిపతియును, ఆద్యుడయిన విష్ణుమూర్తిని జూచి ఆశ్చర్యమొంది ఆనందించి శిష్యసుతాది పరివారముతో హరిసన్నిధికి వచ్చిరి. వచ్చి హరి పాదములము నమస్కారము చేసి నిలిచి అంజలిబద్ధులై హరిని స్తుతించిరి.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే అష్టాదశాధ్యాయసమాప్తః
No comments:
Post a Comment