సృష్టికి లయకారుడైన పరమ శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం ఎన్నో విశిష్ఠతల సంగమం. అయితే గతంలో ఎన్నడూలేని ఓ ప్రత్యేకమైన సోమవారం ఈ సారి రాబోతోంది.
అదే కార్తీకమాసం సప్తమీ + శ్రవణ నక్షత్రం కలిపి వచ్చే రోజు. ఇది తిథి, నక్షత్రాలు సోమవారం రావడం మరీ మరీ అరుదు. అందుకే దీనిని కోటి సోమవారం అంటారు. ఆరోజు ఉపవాసం చేస్తే కోటి సోమవారాలు ఉపవాస దీక్ష చేసిన ఫలితం వస్తుంది.
అది ఇప్పుడు నవంబర్ 7వ తేదీ సోమవారం వచ్చింది.
పనుల ఒత్తిడి, ఇతర పరిస్థితుల కారణంగా ఐదు సోమవారాలు ఉపవాసం చేయలేని వారు ఈ ఒక్క కోటి సోమవారం ఆచరించినా సరిపోతుంది. అంతేకాదు చాలా పవిత్రమైన ఈ కోటి సోమవారం ఏ దైవకార్యం చేసినా ఎంతో పుణ్యం మూట కట్టుకోవచ్చు. ప్రత్యేకించి ఉపవాసానికి ఈ రోజు మిక్కిలి విశిష్టమైంది.
కోటి సోమవారం నాడు ఉపవాసం చేస్తే సదాశివుడు భక్తులకు మోక్షదామం ప్రసాదిస్తాడు. పునర్జన్మ లేకుండా స్వర్గలోక వాసం కల్పిస్తాడు అని పెద్దల ఉవాచ! కార్తీక మాసం లో ఉపవాస దీక్ష పాటించిన వారు ఎల్లప్పుడూ హరిహరుల రక్షణ లో వుంటారు. ఇక కార్తీక మాసంలో ఉపవాసాల్లో భక్తితో పాటుగా సైన్స్ కూడా ఉందండోయ్. అదేమంటే.. కార్తీక మాసం శీతా కాలంలో వస్తుంది. చలి తీవ్రత ఎక్కువగా వుండి, పగలు సమయం రాత్రి కన్నా తక్కువగా ఉంటుంది. అందుచేత శారీరక శ్రమ కూడా తక్కువగా వుండి, అరుగుదల కూడా తక్కువ స్థాయిలో ఉంటుంది. కనుక ఆహారం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. అందుకని ఉపవాసాల ద్వారా మన జీర్ణ వ్యవస్థను క్రమబద్దం చేసుకోవచ్చు. అందుకే కార్తీక మాసంలో వీలైనన్ని రోజులు ఉపవాస దీక్ష చేసి.. శివ కేశవులిరువురినీ ఆరాధించి, మనం తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు పరిహరించుకుని, ఎప్పటికీ తరగని పుణ్య సంపదనే కాకుండా చక్కటి ఆరోగ్యాన్ని కూడా మన స్వంతం చేసుకోవాలని ఆధ్యాత్మిక శాస్త్రం సూచిస్తోంది.
No comments:
Post a Comment