Sunday 13 November 2016

జ్వాలాతోరణం



కార్తికమాసంలో పున్నమినాడు శివాలయాలలో జ్వాలా తోరణోత్సవాన్ని నిర్వహించడం ఆచారం. ఇలా మండుతున్న జ్వాలాతోరణం కింది నుంచి భక్తులు ఆనందోత్సాహాలతో పరుగు పెడతారు. ఇలా చేయడం వల్ల సకల పాపాలూ నివారణ అవుతాయని విశ్వాసం.

జ్వాలాతోరణం ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకుందాం. క్షీరసాగరమథన సమయంలో ముందుగా హాలాహలం వెలువడుతుంది. లోకాలనన్నింటినీ కబళించేలా ఆ హాలాహలం శరవేగంతో దూసుకుపోతుండడంతో దానిని ఉండగా చేసుకుని శివుడు మింగబోతాడు. అయితే దాన్ని తాను మింగితే ఉదరంలో ఉన్న లోకాలన్నీ నశిస్తాయి కాబట్టి కంఠంలోనే ఉంచుకుంటాడు. అందుకే ఆయన నీలకంఠుడు, గరళకంఠుడు అయ్యాడు. అయితే పతి ఎంత శక్తిమంతుడైనప్పటికీ, సతికి తన భర్తకు ఏమైనా హాని కలుగుతుందేమోననే బాధే కాబట్టి పార్వతీ దేవి ఆ విషం తాలూకు వేడిబాధలను చల్లార్చమని అగ్నిదేవుణ్ణి ఆరాధించింది. తన జ్వాలలు పరమేశ్వరుడికి ఏ మాత్రం బాధ కలిగించకుండా అగ్నిదేవుడు చల్లారిపోయాడు. అందుకు ప్రతీకగా పార్వతీదేవి అగ్ని స్వభావం గల కృత్తికా నక్షత్రానికి సంకేతమైన కార్తిక మాసంలో పౌర్ణమినాడు జ్వాలాతోరణం ఏర్పాటు చేసి, దాన్ని భర్తతో కలిసి తాను దాటింది. ఆ మంటల నుంచి ఉపశమనం కలిగించడానికే శివుణ్ణి మనం నీటితోనూ, పంచామృతాలతోనూ అభిషేకిస్తుంటాం.

మరో కథనం మేరకు శివుడి రేతస్సును అగ్నిదేవుడు భరించలేక, గంగానదిలో పడవేస్తాడు. దాన్ని గంగ కూడా భరించలేక, ఒడ్డున ఉన్న రెల్లు గడ్డిలో వదిలింది. ఆ రేతస్సు నుంచి కుమారస్వామి జన్మించి, శరవణ భవుడయ్యాడు. శివుడికి పుట్టిన కుమారుడి చేతిలో తప్ప ఇతరులెవరి చేతిలోనూ మరణం సంభవించకుండా వరం పొందిన తారకాసురుడు ఇది తెలుసుకుని, ముందు జాగ్రత్తగా ఆ రెల్లు వనాన్ని అంతా తగులబెట్టించాడు. అయితే కుమారస్వామికి ఏ హానీ జరగలేదు. కారణజన్ముడైన కుమారస్వామిని అగ్ని ఏమీ చేయకుండా సురక్షితంగా ఉంచాడు. దానికి గుర్తుగా శివాలయాలలో కుమారస్వామి జన్మనక్షత్రమైన కృత్తికా నక్షత్రం వస్తుంది కాబట్టి కార్తిక పున్నమినాడు జ్వాలాతోరణం జరుపుతారు. జ్వాలాతోరణం నుంచి మూడుసార్లు వెళితే మహాపాపాలు హరిస్తాయనీ, గ్రహాల అననుకూలతలు తొలగి, భగవంతుని అనుగ్రహం లభిస్తుందనీ భక్తుల విశ్వాసం. గౌరీశంకరుల పల్లకి జ్వాలా తోరణం కింది నుంచి మూడుసార్లు వెళ్లిన తరువాత ఆ తోరణానికి మిగిలిన ఎండుగడ్డిని, సగం కాలిన గడ్డిని కూడా రైతులు గడ్డివాములలో కలుపుతారు. ఆ వాములలోని గడ్డిని మేసిన పశుసంతతి బాగా అభివృద్ధి చెందుతుందనీ, ధాన్యానికి లోటుండదనీ నమ్మకం

No comments:

Post a Comment