విభూతి ధారణ అనేది శివపురాణాంతర్గతమైన విషయం. ఆరాధన చేసేటప్పుడు శౌచముతో పూజామందిర ప్రవేశం జరిగి మీ మనస్సు బాగా నిలబడుట కొరకు
వినా భస్మత్రిపుండేన వినా రుద్రాక్షమాలయా
బిల్వపత్రం వినానైవ పూజయేచ్ఛం కరం బుధః!!
సాధ్యమయినంతమటుకు ఈమూడూ లేకుండా పూజ జరుగకుండా చూసుకోవాలి. భస్మము అనగా తేలికగా చెప్పాలంటే బూడిద. దానిని మూడు గీతలుగా లలాటమునందు పెట్టుకోకుండా పూజ చేయవద్దు. శివలింగం మీద ఆజ్ఞాచక్రం మీద బొటనవేలితో బొట్టుపెట్టే అధికారం ఒక్క గురువుకు మాత్రమే ఉంటుంది. స్త్రీలయినా, పురుషులయినా లలాటమునందు విభూతిని మూడు గీతలుగా మాత్రమే పెట్టుకోవాలి. విభూతిని పెట్టుకోకుండా ఉండరాదు. రుద్రాక్షమాల వేసుకోకుండా పూజ చేయరాదు. బిల్వపత్రం లేకుండా పూజ చేయడం అంత మంచిది కాదు. బిల్వపత్రములను కొన్ని రోజులపాటు నిల్వచేసి పూజ చేసుకోవచ్చు. ఇలా ఈ మూడింటితో పూజ చేయాలని పండితులయిన వారు జ్ఞానమున్న వారు భక్తి కలిగిన వారు తాపత్రయపడుతూ ఉంటారు.
శాస్త్రమునందు శివనామము గంగ. విభూతి యమునా. రుద్రాక్ష సరస్వతి. గొప్ప శివభక్తుడు లలాటమునందు త్రిపుండ్రములను ధరించిన వాడై బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్షమాల వేసుకుని శివపూజ పూర్తిచేసి బయటకు వచ్చిన వ్యక్తిని పూజామందిరంలోంచి బయటకు రాగానే చూస్తే చూసిన వారికి త్రివేణీసంగమ స్నానాన్ని చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేస్తారు. ఈమూడింటిని శరీరం మీద వేసుకుని ఉండడం వలన అంత గొప్పతనం కలుగుతుంది.
నుదుటిమీద భస్మమును ఎలా బడితే అలా పెట్టుకోకూడదు. శాస్త్ర నియమం ప్రకారం మీరు నిద్రలేచిన తరువాత స్నానం అయేవరకు యథార్థమునకు పచ్చిగంగ త్రాగరాదు. అయితే ఇప్పుడు అవైదికం అయిపోయి రకరకాల పద్ధతులు వచ్చాయి. అయితే కొన్ని కారణముల చేత కొంతమంది స్నానం చేయకుండా నీటిని త్రాగవలసి రావచ్చు. అలా తీసుకుంటే ఆ పాపం గాయత్రి చేత సాధ్యమయినంత తొందరగా పోతుంది. గాయత్రికి అధికారం లేనివాడు తమ ఇష్టదేవతానామం చెప్పి పూజ చేసుకోవాలి. విభూతి ధారణా చేసేవారు స్నానం చేయకుండా ఎక్కడికో అత్యవసరంగా వెళ్ళవలసి వచ్చిన సందర్భంలో వారు పొడి విభూతిని తీసుకుని లలాటమునందు దరించవచ్చు. పొడి విభూతిని ధరించడం వెనుక ఒక రహస్యం ఉంది. స్నానం చెయ్యనంత వరకు శరీరమునకు అశౌచం ఉంటుంది. అశౌచంతో ఉన్న శరీరం తొందరగా వ్యగ్రత కలిగిన ప్రాణుల చేత ఆవహింపబడుతుంది. అలా కాకుండా ఉండాలంటే రక్షణహేతువు ఉండాలి. అందుకని విభూతి పెట్టుకోవాలి.
చాలామందికి విభూతి పెట్టుకున్నవాళ్ళందరూ శైవులు అని ఒక దురభిప్రాయం ఉంటుంది. అది సరికాదు. విభూతి వేదప్రోక్తంగా చెప్పబడిన విషయం. ఎవరయినా భస్మధారణ చేయవచ్చు. స్త్రీలు, పురుషులు ఎవరైనా అందరికీ భస్మధారణ చేసే అధికారం ఉంది. స్నానం చెయ్యకుండా వెళుతున్నా పొడి విభూతిని పెట్టుకుని వెళ్ళవచ్చు. తడి విభూతిని పెట్టుకోకూడదు. స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని పొడి చేసి ఎడమచేతిలో వేసుకుని దాంట్లో రెండు మూడు నీటి చుక్కలు వేసి ఎడమ చేతిలో వేసిన విభూతి మీద కుడిచేతిని మూత పెట్టాలి. అలా పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగే గొప్ప మహాత్మ్యమును గురించి శబ్దశక్తిచేత మీరు దానిని అనుసంధానం చేయాలి.
భూతిం భూతకరీ, పవిత్ర జననీ పాపౌఘ విధ్వంసినీ
సర్వోపద్రవనాశినీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ
భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణీ
తేజోరాజ్య విశేష మోక్షణకరీ భూతి స్సదా ధార్యతామ్!!
అని చెప్పాలి. ఇది సమస్త పాపములను పోగొడుతోంది. ఇది మీ శరీరమునకు అలది ఉండగా భూతప్రేతపిశాచరాక్షస గణములు మీ ఇంట ప్రవేశించలేవు. తేజస్సును ప్రసాదిస్తుంది. విశేషమయిన ఐశ్వర్యమును ఈయగలదు. మోక్షమును ఇవ్వగలదు. కనుక నేను ఈ విభూతిని ధరించుచున్నాను అని చెప్పి తీసుకోవాలి. బ్రహ్మచారి అయితే సాధ్యం అయినంత వరకు
“ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్” అన్న మంత్రం చెప్పి సజలవిభూతిని ధరించాలి. ఇవేమీ చేతకాకపోతే తేలికైన మార్గం ఒకటి ఉంది. కుడి చేతిని ఎడమ చేతి మీద వేసి
శ్రీకరంచ పవిత్రం చ శోకమోహ వినాశనం లొకవశ్యకరం చైవ భస్మం త్రైలోక్య పావనం”
అని చెప్పాలి. దీని ధారణ చేత ఐశ్వర్యం కలుగుతోంది. ఇది నన్ను పవిత్రుడిని చేస్తోంది. ఇది నాకు రోగములు రాకుండా దోషములు పట్టకుండా నివారణ చేస్తోంది. లోకము వశం అయ్యేటట్లుగా చేస్తోంది. ఇది నాకు పుణ్యమును ఇస్తోంది. ఇదేదో వశీకరణ విద్య లాంటిది అని అనుకోకూడదు. లోకము యథార్థ స్థితి మీకు భాసిస్తుంది. పరమ పావనమైన ఈ భస్మమును నేను ధరించుచున్నాను.
ఒకవేళ ఈ మంత్రం రాకపోతే కనీసంలో కనీసం ‘శివా శివా శివా’ అని మూడు మాట్లు అనాలి. ఆటే మంగళము, శోభనము, భద్రము క్షేమము, కళ్యాణము అన్నిటినీ మీరు అడిగినట్లు అవుతుంది. ఈ మాటలు చెప్పి విభూతిని మూడు వేళ్ళతో పెట్టుకుంటారు. అలా విభూతి ధారణ చేయరాదు. అది దోష భూయిష్టం. నీటియందు భస్మము తడిపి మృగముద్ర పట్టమని శాస్రం చెప్పింది. మృగముద్రను జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఏ లేడి/జింక కొమ్ములతో నిలబడ్డట్లుగా కనపడుతుంది. మూడువేళ్ళు కలుస్తాయి, రెండు వేళ్ళు నిలబడతాయి. ఇప్పుడు తడి భాస్మంలో ముందుగా మధ్య వేలును ఉంగరపు వేలును ముంచుతారు. తరువాత బొటన వేలును ముంచుటారు. తర్వాత కుడివైపు నుండి ఎడమ వైపుకి బొటనవేలు పట్టగలినంత దూరం విడిచిపెట్టి నుదుటిమీద ప్రయాణం చెయ్యాలి. అపుడు బొటన వెలికి సజల విభూతి ఉన్నది కదా – ఆ రెండు వేళ్ళు గీసిన విభూతి రేఖల మధ్యలోంచి విభూతితో కూడిన బొటనవేలును లలాటం మీద రాస్తూ వెనక్కి తీసుకురావాలి. దీనిని శాస్త్రోక్త విభూతి ధారణము అంటారు.
భస్మధారణము అనేది మనుష్యుని జీవితమును కొత్త దారికి తిప్పగలిగిన ఒక విశేషము. మనకి వాసనలు కొని జన్మల నుండి తరుముకు వస్తాయి. విభూతి ధారణ చేస్తే మీకు ఉన్న వాసనా బలమును గెలవగలిగిన శక్తిని ఈశ్వరుడు ఇస్తాడు. పాపక్షయం అంటే ఇదే. శాస్త్ర ప్రకారం ‘భ’ భస్మ ధారణము పాపములను తీయగలదు. మీ పాపములే ప్రతిబంధకములుగా వచ్చి ఈశ్వరుడిని చేరకుండా భోగముల వైపుకి తిప్పెస్తున్నాయి. అధర్మబద్ధమయిన భోగముల కోసం వెంపర్లాడుతుంటారు. అలా వెంపర్లాడకుండా చెయ్యగల్గినది ‘సమ’ భగవంతుడిని స్మరణలోకి తేగలిగినది. కాబట్టి దాని పేరు ‘భస్మ’. భస్మం రెండు రకములుగా తయారవుతుంది అని శాస్త్రం చెప్పింది. ఒకటి మహా ప్రళయమునందు ఏర్పడే భస్మం. ఆ భస్మం దరించడానికి మనం ఉండము. ఆ సమయంలో లోకములన్నీ ప్రళయంలో మునిగిపోతాయి. రెండవది లౌకికమయిన భస్మం. ఆవు పేడను పట్టి జాగ్రత్తగా కాల్చి దానిని విభూతిగా తయారుచేస్తే తేలిక అయిన భస్మం తయారు అవుతుంది. అది మనకి శ్రీశైల దేవస్థానం వారు పలకల పలకల ఉండలుగా చేసి అమ్ముతారు. ఆవుపేడను కాల్చినపుడు వచ్చిన భస్మం చాలా గొప్ప భస్మం. భస్మమును లలాటమునందే ఎందుకు ధరించాలి అంటే బ్రహ్మ నుదుటి మీద రాసిన రాత పోదు అని మనం నమ్ముతాము. కానీ ఆ రాతను పోగొట్టగల శక్తి భస్మానికి ఉన్నది. నుదుటిమీద పెట్టుకున్న భస్మ రేఖలను త్రిపుండ్రములు అని అంటారు. భస్మం పవిత్రమయినది సమస్త దోషములు పోయినపుడు మాత్రమే ఏదయినా పవిత్రం అవుతుంది. ఏదయినా వస్తువు అగ్నికి తగిలినట్లయితే అది శుద్ధమైపోతుంది. విభూతి అగ్నిసంపర్కం కలిగినది. దానిని ధరిస్తే మీయందు జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది.
శివలింగమునకు అభిషేకం ప్రారంభం చేసేముందు పంచ బ్రహ్మ మంత్రములతో పొడి విభూతిని శివలింగం మీద వేస్తారు. ఏ చెట్టునుండి ఎన్ని పువ్వులను కోయ్యాలో అన్ని పువ్వులను ఈ బ్రహ్మాండంలో ఉన్న సమస్త వృక్షముల యొక్క పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితం పొడి భస్మంతో అభిషేకం ప్రారంభించిన వాడి ఖాతాలో వేసేస్తారు. విభూతిని తడిపి ఆ విభూతితో శివలింగమునకు అభిషేకం చేస్తే తెల్లటి విభూతి ధారా శివలింగం మీదనుండి క్రిందపడగానే ఈయన పాదములన్నీ హరిస్తాయి. శివలింగం మీదినుండి జారిన ఆ విభూతిని గాని పెట్టుకుంటే అపారమయిన తేజస్సు ఉద్భవించి ఈశ్వరాభిముఖుడు అవుతాడు.
స్కాందపురాణం బ్రహ్మోత్తర ఖండంలో ఒక బ్రహ్మరాక్షసుడు విభూతి పెట్టుకున్న వ్యక్తిని వచ్చి పట్టుకున్నంత మాత్రం చేత ఆ రాక్షసునికి శాపవిమోచనం అయిపొయింది. ఆయన భస్మం అలా పెట్టుకున్నాడు. అంత ఉపాసనా బలంతో పెట్టుకున్నాడు. కాబట్టి భస్మం అంత గొప్పది.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment