భారతదేశ సముద్ర ప్రాంతానికి, ఆగ్నేయ భాగం లో, ఇసుకతో కూడిన చిన్న ద్వీపం ‘రామేశ్వరం’. ఈ ప్రాంతము నుండే, శ్రీ రాముడు లంకకు వారధి ఏర్పరచుకుని, రావణ సంహారానికి తరలి వెళ్ళాడు. ఇక్కడ వెలసిన స్వయంభూ లింగమే ‘రామేశ్వరుడు’. ఈ ప్రాంతం లో సముద్రం …కేవలం నది లాగ, 3 cm కంటే తక్కువ ఎత్తులో అలలతో వుండటం విశేషం. రాముల వారు, లంకకు వారధి కట్టటం కోసం, సముద్రుడు తన ఉద్రుతాన్ని తగ్గించి, ఎప్పటికి అలాగే ఉండిపోవటమే, దీనికి కారణం అని పురాణాలు చెబుతున్నాయి.
ఈ వారధిని “సేతు బంధం” లేదా ‘రామ సేతు’ అని కూడా అంటారు. ఎక్కడా లేని వింత జరిగినప్పుడు, అది తప్పక నిజమే అయి ఉంటుందనేది, నమ్మదగిన సత్యం. ఈ ద్వీపం, విష్ణుమూర్తి ‘పాంచజన్యం’ ఆకారం లో వుండటం మరొక విశేషం.
కాశీ, రామేశ్వరము యాత్ర చేసినవారికి సకల పాపాలు హరించి, జన్మ చరితార్ధకమవుతుందని నానుడి. కాశీ నుంచి గంగ నీరు తీసుకువచ్చి ఇక్కడ స్వామీ వారికి అభిషేకించి, మరల ఇక్కడ నుండి ఇసుక తీసుకు వెళ్లి, కాశీ లో గంగ లో కలపటం, ఒక ఆచారంగా చాలా మంది భక్తులు, పాటిస్తున్నారు. ఇక్కడ దాదాపు 51 తీర్దాలు ఉన్నాయి. వాటిలో 22 ఆలయ ప్రాంగణం లో నే ఉంటాయి. అన్నిటికి లో కంటే, ‘అగ్ని తీర్థం’ లో స్నానమాచరించటం, ఇక్కడ చాలా విశేషం. మరికొన్ని విశిష్టత కలిగిన తీర్థాలు, రామ తీర్థం, సీతా కుండ్, జటా తీర్థం, లక్ష్మణ తీర్థం, కపి తీర్థం, పాండవ తీర్థం, కోదండరామ తీర్ధం, బ్రహ్మ తీర్థం..మొదలైనవి. దాదాపు 1000 స్తంభాలు, వాటి మీద అందమైన శిల్పకళా దృశ్యాలతో, అతి మనోహరంగా ఉండే, ఈ పుణ్యక్షేత్రం, చూడటం, ఒక సంప్రదాయ ధర్మం గా పెద్దలు పాటిస్తారు.
స్థల పురాణం:
శ్రీ రామచంద్రమూర్తి , రావణ సంహారం గావించాక, తిరిగి వచ్చు సమయం లో, ఈ ప్రాంతానికి వచ్చి, శివునికి అర్ఘ్యం ఇచ్చు వేళ అవటంతో, హనుమంతుల వారిని, కాశీ నుండి ఒక లింగం తెమ్మని ఆదేశిస్తాడు. కాని, హనుమంతుడు రావటం కొంత ఆలస్యం అవటంతో, సీతమ్మ వారు ఇసుకతో ఒక లింగాన్ని చేయగా, రాముడు ఆ లింగానికి షోడశోపచారాలు, సమర్పిస్తాడు. ఒక విధంగా, రావణ హత్యా పాతకం నుంచి కూడా శుద్ధి గావించుకొనుట కోసం కూడా రాముడు శివలింగాన్ని పూజించాడని, ఒక పురాణం. ఆ సమయం లో శివుడు ప్రత్యక్షమై, రాముని ఆశీర్వదించగా, లోక కళ్యాణార్ధం ఇక్కడే కొలువుండమని, రాముడు శివుడిని కోరుకుంటాడు. శివుడు, రాముని కోరిక ప్రకారం జ్యోతిర్లింగమై, సర్వజన సంక్షేమం కోసం కొలువున్నాడు.
అయితే, హనుమంతుల వారు లింగం తో తిరిగివచ్చి, అప్పటికే రాములవారు, శివ లింగం చేయటం చూసి, చాలా బాధ పడగా, ఆ లింగాన్ని కూడా అక్కడ ప్రతిష్టించి, ‘విశ్వనాధుని’ గా, ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ‘రామేశ్వరుని’ చూసే ముందు, ‘విశ్వనాథ’ లింగాన్ని దర్శించటం ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడ శివుని రామేశ్వరునిగా, మరియు పార్వతి దేవి ‘పర్వతవర్ధిని’ గా కొలుస్తారు.
ఇక్కడ కోదండరామాలయం, కూడా విశిష్టమైనది. విభీషణుడు, ఈ రామాలయం ఉన్న చోటనే, రాములవారిని కలిసి, భక్తితో పూజించినట్లు పురాణం.
‘రామేశ్వరం’ లో నాగప్రతిష్ట చేసినవారికి, సర్పదోషాలు, తొలగిపోతాయని ప్రతీతి.
ఉదయం 4 గం నుండి రాత్రి 10 గం, వరకు దేవాలయం భక్తుల దర్శనార్ధం తెరిచి వుంటుంది. రాత్రి చివరి దర్శనానంతరం, అయ్యవారు మరియు పార్వతి దేవి, ఉత్సవిగ్రహాలను, బంగారు ఉయ్యాలలో పవళింపు సేవ గావించటంతో ఆ రోజు స్వామివారి సేవలు ముగుస్తాయి.
ప్రతి మహాశివరాత్రి మరియు ఆషాడమాసం 15 వ రోజు, ఇక్కడ పెద్ద ఉత్సవాలు నిర్వహిస్తారు. భారతదేశ మరియు నేపాల్ ప్రజలు ఎక్కువగా ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.
ఈ ప్రాంతంలో నే ‘ధనుష్కోడి’ అనే చిన్న గ్రామం వుంది. రాముల వారు రావణ సంహారం అయ్యాక, తన బాణం తో…, వారధి ని ఒక వైపు తెగ్గొట్టటం వల్ల, ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. అంతే కాకుండా, వారధి నిర్మించేముందు, ఇక్కడ వారధి చివరి అంచు కోసం గుర్తుగా బాణం వేసినట్లు కూడా ఒక కధ. ఇక్కడి నుండి, లంకకు కేవలం చాల తక్కువ దూరం. (భారతదేశ మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం, ఈ ‘ధనుష్కోడి’ ప్రాంతం వారే).
ఇంకా చెప్పినకొద్దీ మహిమాన్విత విశేషాలతో కూడిన, ఈ ‘రామేశ్వరం’ భక్తి, ముక్తి ప్రదాయకం......
No comments:
Post a Comment