Thursday, 3 November 2016

శివ పురాణం– 4


 శంభునామ ప్రాశస్త్యము


ఇదే పరమశివుని పక్కనే ‘శంభుః’ అని ఒక చిత్రమయిన నామంతో పిలుస్తారు. ‘శం’ అనగా నిరతిశయమయిన సుఖము. ‘భావయతి’ అనగా కల్పించేవాడు. ఒక వస్తువు మీచేత అనుభవించబడినప్పుడు ఆ వస్తువు సుఖానుభూతిని మీరు పొందగలరు. వస్తువు ఉండడానికి, అది మీ అనుభూతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది. ఈశక్తి మీయందు నిలబెట్టేవాడు ఈశ్వరుడు. ‘ద్రాపే అంధసస్పతే దరిద్రన్నీలలోహిత’ అంటుంది రుద్రాధ్యాయం. సుఖమునకు కావలసిన వస్తువు ఉండడం వేరు, సుఖంగా బ్రతకడం వేరు. ఒకడు కోటీశ్వరుడై ఉండి కూడా మిగిలిపోయిన చద్ది అన్నమును పులిసిపోయిన పెరుగుతో తింటాడు. కేవలం సుఖానుభావం కాదు.
లోకములు మూడు రకాలుగా ఉంటాయి. ఒక లోకము కేవలము సుఖములను అనుభవించడానికి ఉంటుంది. స్వర్గాది లోకములలో దుఃఖస్పర్శ ఉండదు. మరొక లోకం ఉన్నది అక్కడ సుఖమన్నది ఉండదు. అది నరక లోకం. ఈ రెండూ లోకములు కాక సుఖము, దుఃఖము రెండూ ఉన్న లోకం భూలోకం. ఇక్కడి నుండి మానవుడు పూర్ణ దుఃఖము కలిగిన లోకములోకయినా వెళ్ళవచ్చు, లేదా పూర్తీ సుఖము కలిగిన లోకములోకయినా వెళ్ళవచ్చు. లౌకికంగా కోరుకుంటే స్వర్గమును కోరుకోవచ్చు. అక్కడకు వెళ్ళాలంటే పాపము చేయకుండా ఉండాలి. ఇది శంభవ ఇతి – మంచిభావములను ఇచ్చుట. ఇది కలగడం అంత తేలికకాదు. శివ మహాపురాణం మీ జీవితమును సరిదిద్దుతుంది. మనం సాధారణంగా బ్రహ్మ మన లలాటం మీద రాసిన రాత ప్రకారం పనులు చేసేస్తూ ఉంటాము అని ఒక మాట అంటూంటాము. అది తప్పు శాస్త్రం అలా ఉండమని చెప్పలేదు. తిలకధారణం అనేమాట ఎందుకిచ్చారో తెలుసా? మీ ఆలోచనా సరళిని మార్చుకొని గత జన్మలుగా తరుముకు వస్తున్న వాసనలను జయించడానికి మీకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగడానికే మీరు విభూతి లలాటమునందు పెట్టుకొని, బొట్టు తీసుకొని ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటారు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు మీ లలాటమునందు వసించి ఉన్నారు.
లలాట లిఖితారేఖా పరిమార్తుం నాశక్యతే’ ఇది కదా సామాన్య సిద్ధాంతం. బ్రహ్మ రాసిన రాత మారదు. కానీ తిలకధారణ చేసి విభూతి పెట్టుకోగానే ఆలోచనా సరళియందు మార్పు వస్తుంది. సాత్త్విక ప్రవృత్తి ముఖలో కనపడిపోతుంది. ఆజ్ఞాచక్రం మీది బొట్టు అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీద ప్రసరించడం మొదలవగానే మీ బుద్ధియందు ఆలోచన మారుతుంది. తప్పుడు పనులను మానివేయాలనే భావన కలుగుతుంది. అందుకని మనస్సును జయించలేకపోతే ముందు శరీరమును అలంకృతం చేసి లోపల మనస్సును సంస్కరించడం దగ్గరకు వెళతారు. పెద్దలు ఇటువంటి ఆచారాలు ఏదో హాస్యాస్పదంగా పెట్టలేదు. కనుక తిలకధారణ చేసి భస్మం పెట్టుకుంటే మీరు దుఃఖమును స్వీకరించి దుఃఖమునుండి బయటపడతారు. మనస్సుకు రజోగుణ తమోగుణ ప్రవృత్తి ఉండడం వలన మీ మనస్సు పాపపు ఆలోచనల వైపు తిరుగుతోంది. ఈ త్రిగుణములు మనస్సును సుఖములను అనుభవించమని ప్రోత్సహిస్తూ ఉంటాయి. భగవత్సంబంధమయిన ప్రవచనములను వినడానికి వెళ్ళడానికి బదులు లౌకికమయిన కార్యక్రమములు మున్నగువాటిని చూడమని ప్రోత్సహిస్తూ ఉంటాయి. మీరు ఉన్నతిని పొందకుండా బాధిస్తూ ఉంటాయి. సంసారంలో ఉండి తరించడం చాలా కష్టం. త్రిగుణములనుండి బయటపడడానికే సంసారంలోనికి ప్రవేశించి సుఖములను అనుభవించి, ఈ సుఖములు సుఖములు కావు. నిజమయిన సుఖము ఈశ్వరుడే అనే లక్షనమును ఏర్పరచుకుని, వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడం దానివలన ఇంద్రియములు మనస్సు చలించని స్థితికి వెళతాడు. ఇంద్రియములను గెలవడం కాదు, మనస్సుకడాలని స్థితికి పూర్ణ వైరాగ్యం అని పేరు. పూర్ణ వైరాగ్యం పొందినవాడు జరిగేది అంతా ఈశ్వరలీల అంటాడు. అంత వైరాగ్యం రావడం కూడా ఈశ్వరానుగ్రహమే. ఈ వైరాగ్య సంపత్తి చేత శాశ్వత సుఖ స్థానమయిన ఈశ్వరుని యందు కలిసిపోతాడు. అప్పుడు వానికిక ఊర్ధ్వ అధో లోకములనేవి ఉండవు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్ష స్థితిని పొందుతాడు. ఇలా పొందడానికి ‘శంభు’ అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. శివుడి పాదములను మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే ఏమీ చేతకాకపోయినా శివనామములు చెప్పడం మొదలు పెట్టినట్లయితే మీకు తెలియకుండా ఒక రకమయిన మార్పు ప్రారంభం అయిపోతుంది. ఆ మార్పు మిమ్మల్ని మంచి ఆలోచనల వైపు తీసుకొని వెళ్ళగలదు.
ఇంతకుపూర్వం ద్వాపరయుగం వరకు ఒక లక్షణం ఉండేది. రాక్షసులు వారి గుణములను బట్టి తెలిసేవారు. కాబట్టి వారిని దూరంగా పెట్టడమో, పరమాత్మ వాడిని సంహారం చేయడమో జరిగేది. కానీ కలియుగంలో అలా కాదు. కలియుగంలో రాక్షసులు చిత్తవృత్తుల రూపంలో ఉంటాడు. పైకి దొరకరు. మోసం చేసేవాడే చాలా నమ్మించేటట్లుగా సాధుపురుషుడిలా ఉంటాడు. అవతల వాడిని నమ్మించి మోసం చెయ్యాలనుకునే వాడు మాట కలిపి చక్కగా మాట్లాడతాడు. ఇపుడు రాక్షసుడు వాని చిత్తవృత్తియందు ఉన్నాడు. త్రేతాయుగంలో రాక్షసులు ఈ చిత్తవృత్తుల రూపంలో ఉండి ఉంటే విశ్వామిత్రుడు యాగం చేయలేడు. రాముడు పలు రాక్షసులను చంపడానికి తానే అనుసంధానం చేసుకోవలసి వచ్చేది. కానీ వారు బయట రాక్షసులుగా ఉన్నారు. కాబట్టి అపుడు రాముడు వచ్చి బాణం వేసి రాక్షసులను కొట్టి చంపాడు. ఈ యుగంలో అలా కుదరదు. రాక్షసులు మన మనస్సులలోనే ఉన్నారు. వారు ఎప్పుడయినా తలెత్తి మిమ్మల్ని పడగొట్టేస్తారు. అలా పడగొట్టే రాక్షసులు ఇక్కడే చిత్తవృత్తుల రూపంలో ఉన్నారు. వీళ్ళని తొక్కి పట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఈతడే శంభుః’. అందుకే ‘ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం’ అంటాము. ప్రదోషవేళలో ప్రతిరోజూ శంభు నామములు చెప్పినట్లయితే ఆయన మీలోని రాక్షస ప్రవృత్తులను తొక్కిపెట్టి మీ భావములయందు మంచి ప్రవాహమును ఏర్పాటు చేస్తాడు. ఈ మంచి ప్రవాహము కలిగిన భావన చేత మీరు ఉన్నతిని పొందేస్తారు. శంభునామమును పట్టుకుని శంభుని అనుగ్రహమును పొందినవాని స్థితి ఎలా ఉంటుందో మనం రుద్రపశుపతి నాయనారు చరిత్ర చదివితే తెలుస్తుంది.
5. రుద్రపశుపతి నాయనారు
అరువది మంది నాయనార్లలో రుద్రపశుపతి నాయనారు ఒకరు. సన్యాసి కూడా రుద్రం చదవాలి. అభిషేకం చేయకపోయినా రుద్రం పారాయణ చేస్తే వెంటనే పాపములు పటాపంచలు అవుతాయి. రుద్రపశుపతి నాయనారుకి ఒక లక్షణం ఉండేది. ప్రతిరోజూ కూర్చుని రుద్రాధ్యాయం చదువుతూ ఉండేవారు. అలా చదువుతున్నప్పుడు ఒక అనుమానం వచ్చింది. అందులో ‘మేఘ్యాయచ విద్యుత్యాయచ వృక్షాయచ హరిత్యాయచ లోప్యాయచ లప్యాయచ ఈద్రియాయచ ప్రేత్యాయచ శిఖత్యాయచ – ఈ మాటలు ఉన్నాయి. ఇవన్నీ ఈశ్వరుడే అన్నాడు. అనగా నీరు, నీటిమీద నురుగు, చెట్టు, చెట్టు మీద పిట్ట చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు. నాయనారు తిరుమలయార్ ప్రాంతంలో ఉండేవారు. ఆయన ఈ రుద్రమును చదివి ఆకాశం ఈశ్వరుడు, మేఘం ఈశ్వరుడు, నీరు ఈశ్వరుడు, నురుగు ఈశ్వరుడు, చెట్టు ఈశ్వరుడు, పిట్ట ఈశ్వరుడు. కాబట్టి నేను ఇంట్లో కూర్చుని వీటన్నింటినీ చెప్తుంటే ఉపయోగం ఏమిటి? కాబట్టి నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వరానుభూతిని పొందుతాను’ అన్నాడు.
ఒకరోజున తెల్లవారు జామున ఎవ్వరికీ చెప్పకుండా ఊరిబయటకు వెళ్ళిపోయారు. అక్కడ గల కొండమీద నుంచి ఒక సెలయేరు జాలువారుతోంది. ఆ సెలయేట్లో నడుంలోతు నీళ్ళలో నిలబడ్డాడు. చల్లని నీటి స్పర్శకు ఈశ్వరుడు తనను కౌగలించుకున్న అనుభూతిని పొందారు. ఇవన్నీ ఈశ్వరుడు కదా. నేను ఈశ్వరుడిలో ఉన్నాను అని నమః ఫేన్యాయచ నమస్సికత్యాయచ ప్రవాహ్యాయచ’ అని పారాయణ చేసి బయటకి రాలేక రాలేక వచ్చేవాడు. ఒళ్ళు తుడిచేసుకుని పొడి బట్ట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. మరల మధ్యాహ్నం సంధ్యావందనం కోసం ఆ చెరువు దగ్గరకు వెళ్ళిపోయేవాడు. నీళ్ళలో నిలబడి శివుని ధ్యానం చేసేవాడు. చుట్టూ కనిపిస్తున్న ప్రతివస్తువులో శివరూపమును చూసేవాడు. సాయంత్రం కూడా అదేనీటిలో అదే పరిస్థితి. ఇలా కొన్నాళ్ళు జరిగింది. చివరకు రానురాను ఆయనకు ఎవరు కనపడినా ఈశ్వరుడే కనపదేవాడు. ఆఖరికి దొంగ కనపడితే “నమః చోరాయచ’ అనేవాడు. అలా అంతటా ఈశ్వర దర్శనం చేస్తూ ఉండేవాడు. అపుడు శంకరుడు ఇకనేను తప్ప ఇంకొకడు కనపడని నిన్ను నాలోకే తీసుకోవాలి అని నాయనారుని తనలోకి తీసుకున్నాడు. అపుడు నాయనారు శివునిలో ఏకమయి పోయి తాను శివుడు అయిపోయాడు. దీనిని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నాయనారు భావనచేత మోక్షమును పొందినట్లుగా మనం గమనిస్తాము.
శం – భావయతి – మీయందు మంచి భావములు ప్రవేశించి ఈశ్వరాభిముఖులై నిరతిశయ సుఖ స్వరూపమయిన శివునియందు కలిసి మీరే శివుడు అవుతారు. అటువంటి స్థితి మనకు కలగడం కోసమే మహానుభావుడయిన పరమాత్మ మనకీ ఉపకారం చేశాడు. ఇటువంటి జ్ఞానమును శంభు స్వరూపం మనకు కటాక్షిస్తుంది. అందుకే ‘శంభుః’ అన్న నామం అంత గొప్ప నామం అయింది. పరమశివుని రూపములలో ఆ శాంభవ స్వరూపం అంత గొప్పది అయింది. ఆ నామములు చెప్పుకుంటే చాలు మనం ఉద్ధరించబడతాము.
ఈశ్వరాత్ జ్ఞానమన్విచ్ఛేత్ జ్ఞానదాతా మహేశ్వరః’ ఈశ్వరుని అనుగ్రహం వలన మాత్రమే జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానమును ఇచ్చేవాడికి మహేశ్వరుడు అని పేరు. శంభునామమును మీరు గట్టిగా పట్టుకుని ఆ నామముతో పిలిస్తే, ఆయన మీ భావములను మా
ర్చి మిమ్మల్ని ఈశ్వరుని వైపు తిప్పుతాడు. మీకు సత్ప్రవర్తన కల్పిస్తాడు. మిమ్మల్ని చక్కటి వాడిగా రూపు దిద్దుతాడు. కనుక మనం ప్రతిరోజూ శంభు నామమును చెప్పుకుంటూ శంభు అనుగ్రహమును పొందాలి. ఇదియే ‘శం’ – ఈ లోకంలో సుఖము దగ్గర నుంచి నిరతిశయ సుఖం వరకు, ఊర్ధ్వలోక సుఖం వరకు ఎంత సుఖం ఉన్నదని మీరు అనుకుంటున్నారో అన్ని సుఖములను మీకు ఇవ్వడం. దీనినే కామకోటి అని పిలుస్తారు. కామకోటి అనగా ఇక్కడ కోర్కెలను ఇవ్వడంతో మొదలుపెట్టి కోర్కెలు లేకుండా చెయ్యడం వరకు తీసుకువెళ్ళి ఆ తరువాత పుణ్యమును ఇచ్చి పుణ్యము వలన ఊర్ధ్వలోక ప్రాప్తివరకు ఇచ్చి తరువాత మరల తిరిగి రానవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితి అనబడే మోక్ష స్థితి వరకు ఇవ్వగలిగిన అంచులన్నీ ఆవిడ చేత పరిపాలించబడుతున్నాయి. ఆవిడ యవనిక ఎత్తి ఈ కామకోటిలో నిలబెడుతుంది. ఈ కోటిలో ఏ మెట్టుమీద మీరు నిలబడతారో దానికి తగినట్లుగా మిమ్మల్ని నిలబెట్టదానికి ఈ నామములు ఈశ్వరానుగ్రహము మిమ్మల్ని రక్షిస్తాయి. రుద్రపశుపతి నాయనారు వృత్తాంతమే అందుకు ఉదాహరణ.


ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371





No comments:

Post a Comment