ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం. కనుక 'కార్తిక దామోదర' అనే నామంతో స్మరణ చేయాలి. సూర్యాస్తమయానికి ముందుగా 'ఆకాశదీపం' పెట్టే సంప్రదాయం ఉంది. హృదయాకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశదీపం ద్యోతకమవుతుంది. దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు. ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది.
ఏక భక్తం (ఒంటిపూట భోజనం) ఈ మాసంలో చేయాలి. ప్రతిరోజూ ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి శివదర్శనం చేయడం శ్రేష్ఠం. శివాలయంలో, విష్ణ్వాలయంలో దీపాన్ని వెలిగించడం మంచిది.
ఇంట్లో కూడా ప్రతిరోజూ సంధ్యాదీపం వెలిగించాలి. కార్తికమాసమంతా కార్తిక పురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభకరం.
శివుడు 'ఆశుతోషుడు' - వెంటనే సంతోషించే స్వామి.
అభిషేక ప్రియః శివః - అన్నారు కనుక ఈ మాసంలో శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి, సకల శుభాలను ప్రసాదిస్తుంది.
కార్తికమాసం బృందావన యాత్ర, బృందావన పూజ విశిష్టం. బృందావనంలో శ్రీకృష్ణుని ఈ కార్తిక మాసాన ఆరాధించితే బహుశ్రేష్ఠం. దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో తులసి కోటను ఆరాధించే విధానాన్ని ఏర్పరచారు.
నెలరోజులూ తులసి సన్నిధిలో దీపాన్ని వెలిగించి, విష్ణు పూజ చేయడం మంచిది.పాడ్యమి నాడు గోవర్ధన పూజ చేయాలి. బృందావనం వెళ్లి గోవర్ధన పూజ చేయలేని వారు - ఇంట్లో ఆవుపేడను ముద్దగా పెట్టి గోవర్ధన గిరిగా భావించి పూజించాలి. కార్తిక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు.
ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యమును సంపాదించుకుంటారు.
కార్తిక బహుళ త్రయోదశి మొదలు అమావాస్య వరకు గల మూడు రోజులు గోపూజ చేస్తే ఇహమందు ఐశ్వర్యమును అనుభవించి అంత్యమున విష్ణు సాన్నిధ్యమునుపొందుతారు.
కార్తిక శుద్ధ అష్టమి నాడు గోపూజ చేసిన వారు సమస్త వ్రతములు చేసిన ఫలమును పొందుతారు.
No comments:
Post a Comment