మనలో చైతన్యం జాగృతమైనపుడు ఎల్లప్పుడూ ఆనందంగా, ఉల్లాసంగా ఉండగలం. స్వతఃసిద్ధమైన ఆనందం అప్పుడు ఎరుకలోనికి వస్తుంది. మనలో నిజమైన పవిత్రత ఉంటే విచారకరంగా ఉండలేం. భగవంతునికి అత్యంత సన్నిహితంగా మెలిగే వారు ఆనందంగా కాక మరెలా ఉంటారు. మనమందరమూ ఈ జీవనపోరాటంలో నిరాశా నిస్పృహలకు, వ్యాధులకు దూరంగా ఉండగల స్థితినే నిరంతరం కోరుకుంటూ ఉంటాము. అయితే ప్రాపంచిక విషయాలలో అసంపూర్ణత ఉండటంతో, ఏ కొరత లేని పరిపూర్ణ స్థితి ఏ విధంగా లభిస్తుందో మనం గ్రహించలేకుండా ఉన్నాం. అందువలన ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. అయితే ఈ పోరాటం శాంతిని ప్రసాదించలేదు. హృదయ విస్తారత, ప్రకాశం ఎక్కడ ఉంటాయో అక్కడే శాంతి కూడా ఉంటుంది. జీవుడిలో ఇవి ప్రస్ఫుటమైనపుడు తప్పక వారు దానిని గ్రహించడమే కాక ఇతరులకు కూడా అందిస్తారు, అందించకుండా ఉండలేరు.
అందుకై మనం భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి...```
శ్రీమన్నారాయణా!
ఆనందనిలయా! మా ఆత్మను అత్యున్నత ఆనందంతో నింపివేయి, శాశ్వతత్త్వం ముందు హానికరములైనవేవీ నిలువజాలవు, పరమానందం ముందు ఎటువంటి నిరాశకూ తావులేదు, మేము సదా మీ పరమానందపు ఉనికియందు జీవింతుము గాక, మీ అనుగ్రహమందు నిరవధిక ఆనందమును పొందుదుము గాక.
🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
No comments:
Post a Comment