సోమవార వ్రత మహిమ
కుక్క కైలాసానికి వెళ్లుట
☘☘☘☘☘☘
వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు ”జనకా ! ఇంతవరకు నీకు కార్తీక మాసములో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే… కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని , దాని మహత్యాన్ని గురించి చెబతాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.
”కార్తిక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని , పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతా ఉపవాసముండాలి. నదీస్నానం చేసి , తమ శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి , సాయంత్రం నక్షత్రదర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉంటూ… ఆ రాత్రంతా జాగరణ చేసి , పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీస్నానమాచరించాలి.*నువ్వులను దానం చేయాలి (తిలాదానం). తమ శక్తికొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత , తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి , సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాదికాలు నిర్వహించలేనివారు సైతం కనీసం ఉపవాసం ఉంటే… కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసముంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.
🌹కుక్క కైలాసానికి వెళ్లుట🌹
”పూర్వ కాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్టురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్హణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు , శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని ‘అపర బ్రహ్మ’ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో , కన్నుమిన్నుగానక పెద్దలను దూషించేది. అత్తమామలను , భర్తను తిట్టడం , కొట్టడం , రక్కడం చేసేది. పురుషసాంగత్యంతో వ్యభిచారిణియై… తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు , బట్టలు , పువ్వులు , ధరించి దుష్టురాలై తిరుగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా… ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కలవారంతా ఆమెను గయ్యాళి అని ఏవగించుకుంటూ… కర్కశ అని పేరుపెట్టి ఎగతాళి చేసేవారు.
ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా… ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతిరహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పడేసి, పైన చెత్తచెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురులేదని , అడ్డూఅదుపు ఉండదనే అహంకారం పెరిగి… ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడుచేసి , నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణసంకరురాలైంది. అంతటితో ఆగకుండా… కన్యలు , పెళ్లైన మహిళలకు దుర్బుద్దులు నేర్పి , పాడుచేసి , విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది.
ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడసాగింది. చేసినపాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము , రక్తం కారుతూ , క్రమంగా కుష్టువ్యాధిబారిన పడింది. రోజురోజుకూ ఆమె శరీర పటుత్వం కృశించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమెకోసం వంతులవారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడామెవైపు కన్నెత్తికూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి , పురుగులు పడి చనిపోయింది.
బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరవు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని , విటులతో సుఖించినందుకు ఇనుపస్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనపగదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణిలుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేచారు. తల్లిదండ్రులు , అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో , చెవిలో పోశారు. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంబీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒకత్తే కాకుండా , ఇటు ఏడు తరాలు , అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచజన్మలు ఎత్తుతూ , క్రిమికీటకాలుగా పుట్టి.. చివరకు పదిహేనో జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది.
కుక్కజన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికీ తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే.. తిట్టేవాడు తిడుతున్నారు. పిల్లలు తరుముతున్నారు. అయితే… ఒక బ్రాహ్మడు కార్తీక సోమవార వ్రతమాచరించి , ఉపవాసము ఉండి , సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి , ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి , కాళ్లూచేతులు కడుక్కునేందుకు వెళ్లాడు. అయితే… ఆ కుక్క గబగబా వెళ్లి ఆ ఆహారాన్ని భుజించింది.
వ్రత నిష్ఠ గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపెంచిన బలియన్నం కావడం… కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసము ఉండడము , శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క ‘విప్రోత్తమా… నన్ను కాపాడుము’ అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి. ‘రక్షించు… రక్షించు…’ అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు ‘ఎవరు నీవు ? నీ వృత్తాతమేమిటి ?’ అని ప్రశ్నించాడు. అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. పదిహేను జన్మల క్రింద సద్భ్రాహ్మణుడి భార్యయైన తాను వ్యభిచారం చేసిన తీరు , భర్తను చంపడం , వృద్ధాప్యంలో కుష్టువ్యాధితో దినదినగండంగా బతికి , చనిపోయిన తీరును , నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ‘ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి , ఇక్కడ పెట్టిన బలిఅన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా…! నాకు మహోపకరాంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి , నాకు మోక్షం కలిగించు’ అని ప్రార్థించింది. దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు. అలాచేసిన వెంటనే… ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క జన్మను చాలించి , సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివసాన్నిథ్యాన్ని చేరుకుంది.”
*ఇతి శ్రీ సాంద పురాణేతర్గత , వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే ద్వితీయ అధ్యాయం సమాప్తం.🌼
🪻🥀🪻🥀🪻🥀🪻
🏵️*కార్తీక శుద్ధ విదియనాడు మాత్రం వివాహం అయిన సోదరి ఇంటిలో సోదరుడు భుజించాలని శాస్త్రం నిర్ణయించింది* 🔶
భగినీ హస్త భోజనం
🌸భగిని అంటే...చెల్లెలైనా కావచ్చు., అక్క అయినా కావచ్చు. ‘హస్తభోజనం’ అంటే... చేతి భోజనము అని అర్ధం. అంటే.. సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట.
🌸సాధారణంగా వివాహమైన చెల్లలు, అక్క ఇంటిలో తల్లిదండ్రులుగానీ, అన్నదమ్ములుగానీ భోజనం చేయడానికి ఇష్టపడరు. కారణం తినకూడదని కాదు. ఆడపిల్ల ఋణం ఉంచుకోవడం పుట్టింటివారికి ఇష్గం ఉండదు. శుభసందర్భాలలో, శుభకార్యాలలో వచ్చి భుజించినా తప్పులేదు కానీ, ఊరికే వచ్చి తినడం మర్యాద కాదని మన సాంప్రదాయం.
🌸కానీ కార్తీక శుద్ధ విదియనాడు మాత్రం వివాహం అయిన సోదరి ఇంటిలో సోదరుడు భుజించితీరాలని శాస్త్రం నిర్ణయించింది.
కథ
🌸సూర్యభగవానునకు సంధ్యాదేవి వలన కలిగిన సంతానంలో యముడు మరియు యమున ఒకరు. ‘యమునకు’ అన్నయ్య ‘యముడు’ అంటే ఎంతో ఇష్టం. యమునకు కూడా అంతే. యముడు తన చెల్లెలును ప్రేమగా ‘యమీ’ అని పిలిచేవాడు. యమునకు వివాహం జరిగింది.
🌸అత్తవారింటికి కాపురానికి వెళ్లింది. ఒకరోజు యమునకు తన అన్నను చూడాలని కోరిక కలిగింది. తన ఇంటికి విందుకు రమ్మని యమధర్మరాజుకు వర్తమానం పంపింది. విందుకు వస్తానని యమధర్మరాజు యమునుకు మాట ఇచ్చాడు. అ రోజు ఆన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ చేసి అన్నయ్య రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుంది యమున. ఎంతసేపయినా అన్నయ్య రాలేదు.
🌸ఈ రోజు పని వత్తిడి వల్ల రాలేకపోతున్నానని, మన్నించమని, ‘కార్తీక శుధ్ద విదియ’ నాడు తప్పకుండా విందుకు వప్తానని చెల్లెలికి వర్తమానం పంపాడు యమధర్మరాజు. యమున సంతోషించి ఆ రోజున కూడా తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ తయారుచేసింది.
🌸అన్నమాట ప్రకారం యమధర్మరాజు చెల్లెలు ఇంటికి విందుకు వచ్చాడు. యమున తన అన్నయ్య నుదుట పవిత్ర తిలకం దిద్ది, పూలమాల వేసి తను చేసిన పదార్థాలన్నీ అన్నకు కొసరి కొసరి వడ్డించి ప్రేమగా తినిపించింది.
🌸చెల్లెలు అనురాగానికి ముగ్ధుడైన యమధర్మరాజు ఏ వరం కావాలో కోరుకో’ అని అడిగాడు. ‘ ప్రతి యేడు ఇదే కార్తీక శుద్ధ విదియనాడు తన ఇంటికి విందుకు రావాలనీ., అలాగే ప్రతి సోదరుడు ఈ రోజున తన సోదరి చేతి భోజనం భుజించాలనీ’ వరం కోరుకుంది యమున.
🌸యమధర్మరాజు ఆ వరాన్ని యమునకు అనుగ్రహించాడు. అందుకే ఈ రోజున ప్రతి సోదరుడు వివాహం అయిన తన సోదరి చేతి భోజనం చేయాలని శాస్త్రం నియమం విధించింది.☸️
No comments:
Post a Comment