నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||
శునీ మోక్షప్రాప్తి
నారదుడు అంబరీషునితో వైశాఖమహిమనిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నిట్లు పలికెను.
మహారాజా! అన్ని తిధులలో వైశాఖమాసమున శ్లుక్లపక్షమున వచ్చు ద్వాదశీ తిధి సర్వపాపములను పోగొట్టును. ఇట్టి ద్వాదశినాడు శ్రీహరిని సేవింపనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, యాగములు చేయుట, చెరువు మున్నగువానిని త్రవ్వించుట అన్నియును వ్యర్థములే. ఈనాడు ప్రాతఃకాల స్నానము చేసినచో గ్రహణకాలమున గంగాతీరమున వేయిగోవుల నిచ్చిన పుణ్యము వచ్చును. ఈనాడు చేసిన అన్నదానము విశిష్టఫలము కలుగును. ఈనాడు యముని పితృదేవతలను, గురువులను, దేవతలను, విష్ణువును అర్చించి జలకలశమును దధ్యన్నమును యిచ్చిన వచ్చు ఫలము మాటలకందనిది. అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము. ఈనాడు సాలగ్రామదానము, శ్రీహరిని పాలతో అభిషేకించుట పంచామృతముతో నభిషేకించుట, పానకము నిచ్చుట, దోసపండ్ల రసమును, చెరకుగడను, మామిడిపండును, ద్రాక్షాఫలములను దానము చేయుట ప్రశస్తము. సర్వోత్తమ ఫలదాయకము. ఇట్టి ద్వాదశీ మహిమను వెల్లడించు కథను వినుము.
పూర్వము కాశ్మీరదేశమున దేవవ్రతుడను బ్రాహ్మణుడు కలడు. వానికి మాలినియను అందమైన కుమార్తె కలదు. అతడామెను సత్యశీలుడను వానికిచ్చి వివాహము చేసెను. సత్యశీలుడు తన భార్యయగు మాలినిని తన దేశమునకు గొనిపోయెను. అతడు మంచివాడే అయినను ఆమెయనిన పడదు. ఆమెకును అతడన్న పడదు. ఈ విధముగ వారి దాంపత్యము పరస్పరానుకూలత లేకుండెను. మాలిని భర్తను వశీకరణ చేసికొను ఉపాయములను చెప్పుడని భర్తృపరిత్యక్తలగు స్త్రీలను అడిగెను. వారును మేము మా భర్తలకు చేసినదానిని చెప్పినట్లు చేయుము. మాకు కలిగినట్లే నీకును ఫలితము కలుగునని మందు-మాకులను వశీకరణకై యిచ్చుయోగిని వివరములను చెప్పిరి. మాలినియు వారు చెప్పినట్లు ఆ యోగిని యొద్దకు పోయి ధనము నిచ్చి తన భర్త తనకు వశమగునట్లు చేయుమని అడిగెను. యోగినికి ధనమును తన చేతి యుంగరమునిచ్చెను. యోగినియు నామొకొక మంత్రము నుపదేశించెను. అన్ని ప్రాణులును స్వాధీనమయ్యెడి చూర్ణము నిచ్చుచున్నాను. దీనిని నీ భర్తచే తినిపింపుము. ఈ యంత్రమును నీవు ధరింపుము. ఇందువలన నీ భర్త చెప్పినట్లు వినును అని చూర్ణమును యంత్రమునిచ్చెను. మాలినియు సంతోషముతో ఇంటికి వచ్చెను. యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించెను. చూర్ణమును భర్తచే తినిపించెను. యంత్రమును తానుకట్టుకొనెను. ఆమె భర్తకు ఆ చూర్ణమును తినుటచే వ్యాధికలిగెను. మరికొన్ని దినములకు యేమియును అనలేనివాడు చేయలేనివాడును అయ్యెను. దురాచారురాలూగు ఆమె భర్తమరణించినచో తాను అలంకారములను విడువవలసి వచ్చునని బాధపడెను. మరల యోగి వద్దకు పోయెను. ఆమె యిచ్చినదానిని భర్తచే తినిపించెను. వాని యారోగ్యము బాగుపడెను. కాని ఆమె స్వేచ్చగా చరించుచు విటులతో కాలక్షేపము చేయుటచే నామెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించెను. యమలోకమును చేరి పెక్కు చిత్రవిచిత్రములగు హింసలననుభవించెను. పలుమార్లు కుక్కగా జన్మించెను. కుక్క రూపముననున్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు. సౌవీరదేశమున పద్మబంధువను బ్రాహ్మణుని యింట పనిచేయు దాసి గృహమందు కుక్కగానుండెను. ఇట్లు ముప్పది సంవత్సరములు గడచినవి.
ఒకప్పుడు వైశాఖమాసమున ద్వాదశినాడు పద్మబంధువు కుమారుడు నదీస్నానము చేసి తిరిగి వచ్చి తులసి యరుగు వద్దకు వచ్చి పాదములను కడుగుకొనెను. సూర్యోదయమునకు ముందే వచ్చిన దాసితో బాటు వచ్చిన కుక్క తులసి యరుగు క్రింద పండుకొనియున్నది. బ్రాహ్మణుడు పాదములు కడుగుకొన్న నీరు అరుగుపైనుండి జారి క్రిండపడుకొన్న కుక్కపై పడెను. ఆ పవిత్ర జలస్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతికల్గెను. తాను చేసిన పాపములకు మిగుల పశ్చాత్తపము కలిగెను. తాను చేసిన దోషములను అన్నిటిని చెప్పి విప్రోత్తమా! దీనురాలైన నాపై దయయుంచి వైశాఖ శుద్ద ద్వాదశినాడు చేసిన పుణ్యకార్యములను, పుణ్యఫలమును నాకు ధారపోసి రక్షింపుమని బహువిధములుగ వేడుకొనెను. కుక్క మాటలాడుటయేమని యాశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని, తాను ద్వాదశినాడు చేసిన ప్రాతఃకాల నదీస్నానము పూజ, కథశ్రవణము, జపము, తపము, హోమము, ఉపవాసము మున్నగు పుణ్యకార్యముల పుణ్యఫలము నిచ్చుటకు అంగీకరింపలేదు. కుక్క రూపమున నున్న మాలిని మరల పెక్కు విధములుగ దీనురాలై ప్రార్థించెను. బ్రాహ్మణుడంగీకరింపలేదు.
అప్పుడాకుక్క మిక్కిలి దీనముగా దయాశాలీ! పద్మబంధూ! నన్ను దయజూడుము గృహస్థు తను పోషింపదగినవారిని రక్షించుట ధర్మము. నీచులు, కాకులు, కుక్కలు ఆ యింటిలోని బలులను ఉచ్చిష్టములను తినుట చేత వానికి పోష్యములై రక్షింపదగియున్నవి. కావున నేను నీకు పోష్యరాలను. రక్షింపదగిన దానను. జగత్కర్తయగు యజమానియగు విష్ణువునకు మనము పోష్యులమై రక్షింపదగినవారమైనట్లుగ నేనును నీచే రక్షింపబడదగినదాననని బహువిధములుగ ప్రార్థించెను. పద్మబంధువు దాని మాటలను విని వెలుపలికి వచ్చి యేమని పుత్రుని యడిగెను. పుత్రుడు చెప్పిన వృత్తాంతమును కుక్కమాటలను విని యాశ్చర్యపడెను. పుత్రుని జూచి నాయనా! నీవిట్లు పలుకరాదు. సజ్జనులు యిట్లు మాటలాడరు. పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితులగుచున్నారు. సజ్జనులు పరోపకారము కొరకై పాటుపడుదురు. చంద్రుడు, సూర్యుడు, వాయువు, భూమి, అగ్ని, నీరు, చందనము, వృక్షములు, సజ్జనులు పరోపకారమునకై మాత్రమే యున్నారు. వారు చేయు పనులన్నియును పరోపకారములే. వారి కోరకై యేమియు నుండదు. గమనించితివా? రాక్షస సంహారమునకై దధీచిదేవతలకు దయతో తన వెన్నముకను దానము చేసెను. పావురమును రక్షించుటకై శిబిచక్రవర్తి ఆకలి గల డేగకు తన మాంసము నిచ్చెను. జీమూత వాహనుడను రాజు సర్పరక్షణకై తనను గౠడునకు అర్పించుకొనెను. కావున భూసురుడు భూమిపైనున్న దేవత బ్రాహ్మణుడు దయావంతుడై యుండవలయును. మనస్సు పరిశుద్దముగ నున్నప్పుడు దైవము వర్షించును. మనశ్శుద్దిలేనిచో దైవము వర్షింపదు. చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండ వెన్నెలనంతటను ప్రసరింపజేయుచున్నాడు కదా! కావున నేను దీనురాలై అడుగుచున్న యీ కుక్కను నా పుణ్యకార్యముల ఫలములనిచ్చి యుద్దరింతును అని పలికెను.
ఇట్లు పలికి ద్వాదశినాడు తాను చేసిన పుణ్యకార్యాల ఫలమును కుక్కకు ధారపోసి నీవు పాపములు లేని దానవై శ్రీహరి లోకమును పొమ్మని పలికెను. అతడిట్ళు పలుకుచుండగా నా కుక్క రూపమును విడిచి దివ్యభరణ భూషితురాలైన సుందరిగా నిలిచెను. బ్రాహ్మణునకు నమస్కరించి కృతజ్ఞతను దెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపజేయుచు దివ్యవిమానను నెక్కి పోయెను. స్వర్గమున పెక్కు భోగములననుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడగు దైవమునుండి పుట్టి యూర్వశిగా ప్రసిద్దినందెను. యోగులు మాత్రమే పొందునట్టి, అగ్నివలె ప్రకాశించునట్టి సర్వోత్తమమగునట్టి, యెట్టివారికైన మోహమును కలిగించునట్టి పరమార్థ స్వరూపమగు సౌందర్యమునందెను. త్రిలోకసుందరిగా ప్రసిద్ది చెందెను. పద్మబంధువు ఆ ద్వాదశీ తిధిని పుణ్యములను వృద్ది చెందించు విష్ణుప్రీతికరమైన పుణ్యతిధిగా లోకములలో ప్రసిద్దినొందించెను. ఆ ద్వాదశీ తిధి కొన్ని కోట్ల సూర్యచంద్ర గ్రహణముల కంటె సమస్త యజ్ఞయాగాదులకంటె అధికమైన పుణ్యరూపము కలదై త్రిలోక ప్రసిద్దమయ్యెను.
అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వైశాఖశుద్ద ద్వాదశీ మహిమను వివరించెనని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు చెప్పెను.
వైశాఖ పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము
No comments:
Post a Comment