నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||
అక్షయతృతీయ విశిష్టత
నారదమహాముని అంబరీషునకు వైశాఖమహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నీవిధముగ పలికెను. మహారాజా! వైశాఖశుద్ధ తృతీయమని అందురు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన పాపము సర్వపాపహరము. శ్రీహరి పదమును కలిగించును. ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదుల నీయవలెను. ఈనాడు చేసినదానికి విశేషఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తినందుదురు. ఈనాడు చేసిన దానము అక్షయఫలము నిచ్చును. ఈ తిధి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిధికి యీ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము.
పూర్వము యింద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్దమయ్యెను. ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరెను. మార్గముననున్న ఉతధ్య మహాముని ఆశ్రమములోనికి వెళ్లెను. త్రిలోకసుందరియు గర్భవతియనగు వాని భార్యను జూచి మోహించెను. ఆమెను బలాత్కారముగా ననుభవించెను. ఆమె గర్భముననున్న పిండము యింద్రుని వీర్యమును లోనికి రానీయక పాదము నడ్డముగ నుంచెను. ఇంద్రుడు కోపించి వానిని గ్రుడ్డివాడివగుమని శపించెను. వాని శాపముననుసరించి మునిపత్ని గర్భమునుండి పుట్టిన బాలుడు దీర్ఘ తపుడనువాడు పుట్టు గ్రుడ్డియై జన్మించెను. గర్భస్థపిండముచే నవమానింపబడి శపించిన యింద్రుడు ముని పత్నిని బలవంతముగ ననుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలెనని పరుగెత్తెను. వానిని జూచిన మునిశిష్యులు పరిహసించిరి.
ఇంద్రుడును సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాగుకొనెను. ఇంద్రుదిట్లు మేరు గుహలో దాగినట్లు తెలిసికొని బలిమున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి. ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి యింద్రుని విషయము నడిగిరి. బృహస్పతియు దేవతలకు యింద్రుని పరిస్థితిని వివరించి యింద్రుడు శచీ సహితుడై మేరు పర్వతగుహలోనున్నాడని చెప్పెను. అప్పుడు వారందరును మేరు పర్వత గుహను చేరి యింద్రుని బహువిధములుగ స్తుతించిరి. బృహస్పతి మొదలగువారి స్తుతులను విని యింద్రుడు సిగ్గుపడుచు వచ్చినవారికి కనిపించెను. బలి మున్నగువారు స్వర్గము నాక్రమించిరని దేవతలు చెప్పిరి. పరస్త్రీ సంగదోషమున నేను అశక్తుడనై యున్నానని యింద్రుడు వారితో చెప్పెను.
ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు యేమి చేయవలయునాయని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో నిట్లనెను.
ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి యిష్టమగు వైశాఖమాసము గడచుచున్నది. ఈ మాసమున అన్ని తిధులును పుణ్యప్రదములు శక్తినంతములు. అందున శుక్లపక్షమునందలి తృతీయా తిధి చాల శక్తివంతమైనది. ఆనాడు చేసిన స్నానదానాదులు ఉత్తమ ఫలముల నిచ్చును. సర్వపాపములను పోగొట్టును. కావున ఆనాడు యింద్రుని వైశాఖ ధర్మముల నాచరింపచేసినచో యింద్రుని పాపము పోయి పూర్వపు బలము, శక్తి, యుక్తులు మరింతములై వచ్చునని చెప్పెను. అందరును కలిసి యింద్రునిచే అక్షయ తృతీయనాడు ప్రాతఃకాల స్నానము తర్పణాదులు శ్రీహరిపూజ కథా శ్రవణము మున్నగువానిని చేయించిరి. ఇంద్రుడును అక్షయ తృతీయా ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో గలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించెను. అప్పుడు దేవతలు యజ్ఞయాగాదులయందు తమ భాగములను మరల పొందిరి. మునులును రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగములను వేదాధ్యయనాదులను కొనసాగించిరి. పితృదేవతలును యధాపూర్వముగ తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యెను. ఈ విధముగ అక్షయ తృతీయ సర్వజీవులకును భుక్తిని, ముక్తిని యిచ్చి సార్ధక నామము కలిగియున్నది.
అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాస మహిమను వివరించుచు పలికెను.
వైశాఖ పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము
No comments:
Post a Comment