మకర
సంక్రాంతికి సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. ఏడు గుర్రాల రథములో
మొదలయిన ఆయన ప్రయాణం మాఘ మాసం, శుక్ల పక్షం లో ఏడవ తిథి అయిన సప్తమినాడు ఉత్తరాభిముఖమై సూర్య రథ చక్రాలు ఈశాన్య పరంగా తిరుగుతాయి. ఈ దినాన సూర్యుడు కశ్యప మహర్షి-అత్రిల పుత్రుడుగా జన్మించాడు. అందువలన ఈ రోజే సూర్య జయంతి. దీనినే రథసప్తమి అని అంటారు.
ఈ రోజు ప్రాతః కాలాన్నే సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి ఆ సూర్యదేవుని పూజిస్తారు. ఆంద్ర ప్రదేశ్ లో శ్రీకాకుళం సమీపాన గల అరసవిల్లి (హర్షవిల్లి) సూర్యనారాయణ దేవాలయంలో
ఈ రోజు ఎంతో ఉత్సాహంతో భక్తులు సూర్యదేవుని కొలుస్తారు. ఈ దేవాలయం
విశిష్టత ఏమిటంటే సంవత్సరంలో రెండు మార్లు, ఆరు మాసాల వ్యవధిలో సూర్య
కిరణాలు నేరుగా స్వామివారి పాదాలపైన కొద్ది క్షణాలు మాత్రమె పడతాయి. ఈ అద్భుతం చూడటానికి పలు ప్రాంతాల నుండి భక్తులు వేల సంఖ్యలో వస్తారు.
సూర్య
దేవుని స్మరిస్తూ నవగ్రహ స్తోత్రంలోని ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తే మనకు
మేలు కలుగుతుందని, ఆయురారోగ్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.
సూర్య శ్లోకం
జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం
ప్రతి పదార్ధం: జపాకుసుమం = మందార పువ్వు; సంకాశం = ఒప్పియుండు, వలె నుండు; కాశ్యపేయం = కశ్యపుని తనయుడు; మహా = మిక్కిలి; ద్యుతిం = కాంతి వంతమైన; తమోరిం = తమః + అరిం; తమః = చీకటి, తమస్సు; అరిం = శత్రువును; సర్వ = అన్ని; పాపఘ్నం = పాపములను దహించువాడు; ప్రణతోస్మి = నమస్కారము, ప్రణామము; దివాకరం = సూర్యునికి.
తాత్పర్యం:
మందార పువ్వు వంటి ఎర్రని రంగు గలవాడు, కశ్యప ప్రజాపతి పుత్రుడు, మిక్కిలి
కాంతివంతమైన వాడు, చీకటికి శత్రువు, సమస్త పాపములను దహింప జేయువాడు అయిన
సూర్యునకు నమస్కారం.
No comments:
Post a Comment