Saturday, 13 January 2018

భోగిపర్వం



సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీనికి భోగిపర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొండుతామో దానిని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం.
ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం. ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని. కానీ ఏది లభిస్తే మరి ఇంకేదీ కావాలని అనిపించదో, ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యం అవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు. అలాంటి దివ్య భోగం ఈరోజున అమ్మ గోదాదేవి ఆండాళ్ళమ్మ పొందినది.
అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి. రంగనాథుని చేపట్టినది. రంగనాథుని అనుగ్రహాన్ని పొందినది. రంగనాథుని సాంగత్యం అనబడేటటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందినది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయం పరంగా నిర్వచించేవారు చెబుతారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతున్నది. ఈ ధనుర్మాస వ్రతమంతా ఈరోజు పూర్తీ జరిగి దాని ఫలితంగా అమ్మవారు స్వామియొక్క అనుగ్రహాన్ని పొందినది.


భోగిమంటలు
వ్యామోహానికి నిప్పు
మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరు వినరు. భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. మన లోపల పాతుకుపోయిన పాతను వదిలించుకోవడానికి భోగిమంట ఉపకరిస్తుంది. ఒక పూలతోట మీదుగా గాలి వెళితే అది సుగంధభరితం అవుతుంది. అదే గాలి ఒక మురికికాలువ మీదుగా వెళితే దుర్గంధంగా మారిపోతుంది. మనిషి ప్రాణం కూడా అంతే! మనిషి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఆయువు గాల్లోకి కలిసిపోతుంది. ఆ స్థితిని బట్టే పునర్జన్మ దక్కుతుంది. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండమంటుంది భోగిమంట. ఇంట్లోని కుర్చీకి ఒక కాలు విరిగిపోయి కుంటుతున్నా సరే దాన్ని వదలం. “అది మా తాతగారిది. అదంటే నాకు సెంటిమెంటు” అని పట్టుకు వేళ్లాడతాం. పాడైపోయిన పాతవస్తువునే అంత సులువుగా వదులుకోకపోతే.. రేప్పొద్దున తుచ్ఛమైన ప్రాణాన్ని స్వేచ్ఛగా ఎలా వదలగలుగుతావు? అంతవరకు ప్రాణభయంతో నిశ్చింతగా ఉండగలవా? ఉండలేవు. అందుకే నీలోని పాతను భోగిమంటతోపాటు వదిలేయి.



భోగిపండ్లు
యోగిత్వం.. బదరీఫలం
సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం తగ్గింది కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగిపండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాధి నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు (పైబర్) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదన్నది దాని అర్థం. రేగుపండ్లు జఠరాగ్నిని ఉరకలెత్తిస్తాయి. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.
బదరీవనం (రేగుపండ్ల తోట)లో వేదవ్యాసుడు తపస్సు చేసేవాడన్న మరో ఐతిహ్యం కూడా ఉంది. కాబట్టే ఆయనకు బాదరాయణుడు అన్న పేరొచ్చింది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే – రేగుపండ్లు యోగిత్వానికి ప్రతీక. మరో విశేషమేమంటే రేగుపండ్లను జంతువులు తినవు. మనుషులే తింటారు. హిందూ సంస్కృతిలో రేగుపండ్లకున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి’ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ అవుతారన్నది ఒక విశ్వాసం.

No comments:

Post a Comment