Wednesday, 24 January 2018

మాఘ పురాణం – 1వ అధ్యాయము




శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||

ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు, గంగాదినదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైనవానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాడం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది అంటే యింత అని లెక్కకురానిది.
పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి ‘స్వామీ! స్నానానికీ, ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ, పావనమూ, సిద్దిప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షు లారా! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ, అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట, ఆ మహావిష్ణువు యోక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసమేర్పరచుకొన్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూవుండేవారు. అలగే రోమహర్షుణుడో, ఆయన కుమారుడు సూతమహర్షియో అందరిలా ఆయాగాన్ని చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిశారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులూ లేనప్పుడు పుణ్యకథాప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పేంపొందించేవి.
ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలలనుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూతమహర్షి వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనం పై కూర్చుండబెట్టి అతిధి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూతమహర్షి! మీ తండ్రిగారు రోమహర్షణులవారు పురాణప్రవచనంలో ధర్మవిషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు, రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు.
సూతమహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి, పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి, వ్యాసమహర్షుల వారి దయా విశేషం చేత, నాకు తెలిసిన విషయాన్ని, మీ అనుగ్రహం చేత స్పురింపజేసుకొని యధాశక్తి వినిపించి మీ ఆనందాశీస్సులనీ, భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను, మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా అడిగెను. అప్పుడు మునులు ‘సూతమహర్షి లోగడ వైశాఖమాసం, కార్తీకమాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన, వ్రతానుష్టాలని వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని’ కోరారు.
అప్పుడు సూతమహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రిగారిని గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరల నమస్కరించి యిలా ప్రారంభించాడు. మహర్షిసత్తములారా! మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకొన్నవారు కొద్దిమంది అయినా, యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది.పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే విషయాన్ని అడిగింది. గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు చెప్పెదను వినండి.

పార్వతీదేవి పరమేశ్వరునితో “విశ్వాత్మకా! సర్వలోకేశ్వరా! సర్వభూతదయానిధీ! ప్రాణేశ్వరా! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ మాస మహిమను వివరింప గోరుచున్నానని” ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు “కళ్యాణీ! జగన్మంగళా! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది. గంభీరమైనది నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమియందును? తప్పక చెప్పెదను, వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతఃకాలస్నానము చేసినవారు పాపవిముక్తులై ముక్తినందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వపాపములను పోగట్టును. రెండవస్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవస్నానం అతనికి శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీమహవిష్ణువే ఆలోచనలోపడును. ప్రయాగలో మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలోగాని సరస్సులో గాని స్నానం చేసినవారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నూయి, కాలువ మొదలైనవానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా, తెలిసికాని, తెలియకకాని, బలవంతంగాకాని మాఘ మాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నియును పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును.
మాఘస్నానమును మాని, విష్ణువునర్చింపక, దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లుపోవును? అతడు భయంకరమైన కుంభీపాకనరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు, నీచజన్మలను పలుమార్లుపొందును. చలికి భయపడి స్నానము చేయనివారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మలనందుదురు సుమా, దరిద్రులైనను, బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయనుపొందెదరు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.
ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను, మాఘమాస ప్రాతఃకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసినవానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకుగాని, భయముచే గాని, బలవంతముగాగాని, మాఘస్నానము చేసినవాడు పాపవిముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానముగాని కంబళదానముగాని చేసిన స్నానఫలమునంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని, చేయించిన వారికిని పుణ్యముకల్గును. ఈ స్నానమును అన్ని వర్ణములవారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను, నివారించినను మహాపాపములు కలుగును.
పార్వతీ! మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని, ఆచమనముచేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్నిమాసములలో మాఘమాసముత్తమము. శ్రీవారిదేవతలందరిలో ఉత్తముడు. అన్నిమాసములలో మాఘమాసముత్తమము. వృక్షములలో అశ్వత్తవృక్షముత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడుత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములుత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని, నిందించినను, నివారించినను మహాపాపములు కలుగును. నాలుగువర్ణముల వారిలో బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వతముత్తమము. కావున మాఘమాస స్నానమనంత పుణ్యప్రదము సుమా.
దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను.మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు ‘మహారాజా! పరమపవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండపోవుచున్నానేమి. మాఘమాసమున చేయు నదీస్నానముకాని, సరస్స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగువా? యని ప్రశ్నించెను. రాజు మాఘస్నానమహిమను చెప్పుడని కోరగానతడు. రాజా నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠమహర్షివలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.
దిలీపమహారాజు మాఘమాసస్నాన మహిమ తెలిసికొనవలయునని తమ కులగురువైన వశిష్టమహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాసస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్టమహర్షి దిలీపుని యాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా! నీకోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు యితర దినములలో చేసిన పుణ్యకార్యములకంటే ఎక్కువ పుణ్యము నిచ్చును.మాఘమాసమున ప్రాతఃకాలమునచేసిన స్నానమే సర్వపాపములను పోగట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. స్నానమేయింత అధికమైనపుణ్యము నిచ్చునో పూజ పురాణ శ్రవణాదులవలన నెంతటి ఫలముండునో యూహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలిసికొన యత్నింపుము.
పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము(వానలు లేకపోవుట పంటలు పండకపోవుట మొదలైన లక్షణముగల కరువు) వింధ్య-హిమాలయపర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్యజనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణుల మిక్కిలి బాధపడినవి, అట్టివారిలో భృగుమహర్షి యొకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టములేకున్నను కైలాస పర్వత ప్రాంతముకడకు చేరి తనకునచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించు కొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకు గంధర్వులు యక్షులు, కిన్నరులు మున్నగు దేవజాతులవారును వచ్చుచుండిరి అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి.
ఒకనాడు గంధర్వుడోకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమైవిచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులిమొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగానున్నను పులిమొగమువలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగుమహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా! నాకు భోగభాగ్యములన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరికదా! ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు, నేను గంధర్వుడను మానవులకంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగనున్నది. దీనిని పోగట్టు కొనుటయెట్లో తెలియరాకున్నది. ఈ వికారమువలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి నాకీ వికారరూపము పోవునుపాయమును చెప్పుడని ప్రార్థించెను.
భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలికలిగినది వానికి సాయపడవలయుననుకొన్నాడు. నాయనా పురాకృతకర్మము యెవనిని విడువడు. గతజన్మలో చేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికమూ ఇవి మూడును జీవినిబాధించును. ఇట్టి వానిని పోగట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము, పవిత్రక్షేత్రములందు దేవపూజ చేసినకొనవలయును.ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమునుపోగట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికముచేసినచో వచ్చుఫలితము, మాఘమాసములో నదిలోగాని, సముద్రములోగాని, కాలువలోగాని, సెలయేరులోగాని యే స్వల్పజల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘస్నానమును యేప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. నీ జాతివారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిది మాఘమాస ప్రారంభముకావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతఃకాలమున మాఘస్నానమును యిష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును, తీరమున యిష్టదేవతాపూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాసమహిమను కీర్తించును. కృతజ్ఞడై, మునికి భార్యతోబాటు నమస్కరించెను. అతని యాశీర్వాదమునంది తన భార్యలో బాటు తనలోకమున కరిగెను. దిలీపమహారాజా మాఘస్నాన మహిమను గమనించితివా? మరియోక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలనిట్లు పలికెను.
శౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట
సకల పురాణములకు ఆలవాలమైన నైమిశారణ్యమందు ఒకప్పుడు శౌనకాది మహాఋషులు లోక కళ్యాణార్థమై, ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ణము పరిసమాప్తమగుటకు ఒక పుష్కరకాలము అనగా పన్నెండు సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చిననూ, ఆ యజ్ఞమును పూర్తీ చేయవలయుననెడి దీక్షతో శౌనకాది మునులు తలపెట్టి, యజ్న స్థలముగా నైమిశారణ్యములో ప్రవహించు గోమతీ నదీతీరమును ఎన్నుకొని ఒక శుభ ముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూచి తరింపవలయుననెడి కోరికలతో, భరతఖండము నలుమూలలనుండీ తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసము లేర్పరచుకొనిరి.
అచటికేతెంచిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదములామూలాగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయన మొనర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి.
ఆవిధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోను, పరివారముల తోను, తండోపతండములుగా యజ్ఞస్థలానికి జేరుకొనిరి. వేలకొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము క్రిక్కిరిసి యుండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు, పుణ్యప్రదమైనదియు, 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమగుటవలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమములో పాల్గొనిరి.
దూర ప్రాంతాలనుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం నొందిరి. సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడిరి.
సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగ తెలిసియున్న మహానుభావుడు. వేదం, పురాణ ఇతిహాసాది సమస్త విషయములందూ వారికి తెలియనిది లేదు. అవి అన్నియు వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము, మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరం, వర్ణింప నలవికానిది. అటువంటి పుణ్య పురుషుడగు సూత మహాముని ఆగమనమునకు స్వాగతం పలికి, సాష్టాంగ దండ ప్రణామములాచరించి యజ్ఞం జరుగు ఆ పండ్రెండు సంవత్సరములలో యెన్నియో పురాణ గాధలు విని తరించవలెననెడి కోరికతో ముని పుంగవులందరూ వేచియుండిరి.
సూతుల వారు శౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్య కార్యములందు పురాణ పఠనం గావించి అశేష మునిసత్తములను తృప్తి పరచుట తన విద్యుక్తధర్మమని యెంచి వారి కోరికను మన్నించినారు.
ఒక శుభ ముహూర్తమున ఆశ్రమ వాసులందరూ సూతుల వారికి అర్ఘ్య పాద్యములొసంగి ఉచితాసనములపై ఆసీనులను జేసి “మునిశ్రేష్ఠా! మునికులతిలకా! ఇంతకుమున్ను ఎన్నియో పురాణ గాధలు తమరు తెలియజేయగా విని ఆనందించియున్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి, అందలి సారమును గ్రహించి యుంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతికథలు మాకు వినిపించుచునే యున్నారు. అయినను మీబోటి సిద్ధపురుషులు పదునాలుగు లోకములు సంచారము చేసి యున్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొనియున్నారు. గాన వినదగు విషయాలేమైనా యున్నయెడల విరామ కాలములో మాకు వినిపించవలయు”నని శౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన శౌనకాది మునులు తన వలన క్రొత్త సంగతులు తెలుసుకొనవలెననెడి కుతూహలం కనపరచినందున వారలను జూచి సూత మహాముని ఇటుల పలికిరి –
“ముని పుంగవులారా! మీ మనోవాంఛను గ్రహించితిని. మీరు వినదగిన కథను నాకు తెలిసియున్నంత వరకూ విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహా సమయమున పుణ్య కథలు చెప్పుట వలన నాకున్నూ, వినుట వలన మీకున్నూ పరమార్థము కల్గు’నని పలికెను.

శౌనకాది మునుల కోరిక
సూతమహామునిని అడిగినదే తడవుగా వారందులకు అంగీకరించగా “ధన్యులమైతి”మని మునులందరూ అమితానందం నొంది సూతులవారి పాదములను కండ్లకద్దుకొని

సూతమహామునితో –
“ఆర్యా! పద్మపురాణమందు లీనమైయున్న మాఘమాసం యొక్క మహాత్మ్యంను మరల మరల వినవలయుననెడి కుతూహలం కలుగుచున్నది. అదియునుగాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహాత్మ్యం, ఆచరించవలసిన విధానం, మాకు వివరించవలసిందిగా” కోరిరి.
ఆ విధంగా శౌనకాది మునులు ఇతర తపశ్శాలురు కోరుటవలన సూతమహర్షి మిక్కిలి సంతసించి యిట్లు పలికిరి.
“ముని పుంగవులారా! మీరందరూ అతిముఖ్యమైన విషయాన్నే అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోవుచున్నది. ఇటువంటి సమయంలో మాఘ పురాణం వినుటవలన కలిగే ఫలము అంతింత కాదు. అదియునుగాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయములో మాఘమాసం యొక్క మహాత్మ్యం మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందులకు నేను అదృష్టవంతుడనే. కాన సావధాన మనస్కులై ఆలకింపు”డని సూతమహర్షి ఇట్లు వివరించిరి –
“నేను ణా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అతడు మహా తపస్వి, జ్ఞాని. నాతండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణ్వంశ సంభూతుడగు వేదం వ్యాస మహర్షికి ప్రియ పాత్రుడను. వారి దయవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్ధ్యములు కలిగిన వాడనయితిని. నేను తెలియజేయుచున్న నీతిబోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినటులే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠమహాముని మాఘమాస మహాత్మ్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోవుచున్నాను.


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment