Friday 26 January 2018

భీష్మ ఏకాదశి



శంతనమహారాజు చంద్ర వంశానికి చెందినవాడు. హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకనాడు శంతనమహారాజు గంగా నది వైపు వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఓ అమ్మాయి కనిపించింది. రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది. ‘నన్ను పెళ్ళి చేసుకుంటావా?’అని అడిగాడు. అందుకా అమ్మాయి నవ్వుతూ’నేనెవరో తెలుసా?’ అంది. “నువ్వెవరివైనా సరే, నన్ను వివాహమాడు. నా రాజ్యం,నా డబ్బు,నా ప్రాణం,సర్వస్వం నీ కిచ్చేస్తాను ” అని మ్రతిమాలాడు.
అప్పుడు ఆ అమ్మాయి,”మహారాజా! మీ ఇష్టప్రకారమే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను.కాని కొన్ని షరతులు కోరుతాను. వాటికి మీరు ఒప్పుకోవాలి ” అంది.
ఆవేశంలో “అలాగే!” అని మాట యిచ్చాడు శంతనుడు.
వెంటనే ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు – గంగాదేవి.
పెళ్ళి జరిగాకా గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టురాలైంది. వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు. అందరూ పచ్చగా, పనసపండ్లలా వున్నారు. అయితే పుట్టిన ప్రతీ బిడ్డనూ అమె గంగానదిలో వదిలేసేది. ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం, మరో వంక దుఃఖం వచ్చేవి. కాని ఏమీ అనడానికి వేల్లేదు. ఆవిడ పెట్టిన షరతుల్లో ” నువ్వెవరు? ఎక్కడనుండి వచ్చావు? ఇలా ఎందుకు చేస్తున్నావు? ” అని అడగడానికి వేల్లేదు. అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు.
ఏడుగురు కొడుకులు పుట్టారు.ఏడుగురూ ఏటిపాలయ్యారు.
చివరకు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో వదిలేయ బోతుంటే శంతనుడు సహించలేక ” నువ్వు తల్లివి కావు…ఎందుకింత పాపం చేస్తున్నావు? ” అని అడిగాడు.
వెంటనే ఆమె “మహారాజా! మీరు మరిచిపోయినట్టున్నారు. నన్ను గురించీ నేను చేసే పనుల గురించీ ఎప్పుడూ ఏమీ అడగనని మాటయిచ్చి వరించారు. ఇక నేను క్షణం కూడా ఇక్కడ వుండను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాణ్ణి నేను చంపను. నేనొవరో మీకు తెలీదు. మునులూ , మహర్షులు నిత్యం పూజించే గంగానదికి ఆధిదేవతను నేను.
” పూర్వం ఒకానొకప్పుడు అష్ట వసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకుని వశిష్ట మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్టులవారి పాడి ఆవు. అది చాలా అందంగా వుంది! అష్ట వసులు , వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒకామె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. ‘ఈ ఆవు వశిష్ట మహామునిది. మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావల్సి వస్తుంది. వద్దు’ అని చెప్పాడు భర్త.
ఆవిడ ససేమీరా వినలేదు. తనకు నందిని కావల్సిందేనని భర్తను బలవంత పెట్టింది. చివరకు ఎలాగైతేనేం అతను ‘సరే’ అన్నాడు. ఎనిమిది మంది వసువులూ కలసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు.
” వశిష్టుడికీ సంగతి తెలిసింది. పట్టరాని కోపంతో,’మీరంతా మానవులై పుట్టండి’ అని శపించాడు.
అష్ట వసువులు పరుగు పరుగున వచ్చి వశిష్టుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించమని ప్రార్ధించారు.
కానీ వశిష్ట మహర్షి , ‘నా శాపానికి తిరుగులేదు పొండి!’ అన్నాడు. వసువులు ప్రాధేయ పడ్డారు.’ నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహా వైభవంతో చాలాకాలం జీవిస్తాడు. తక్కిన ఏడుగురూ భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాపవిముక్తులౌతారు. ఇంతకంటే నేను చేయగలిగిందేదీ లేదు!’ అని చెప్పాడు. పోని కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్ట వసువులు తిరిగి వెళ్ళిపోయారు.
” ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి, ‘గంగాభవానీ! నువ్వే మాకు తల్లివి కావాలి. మా కోసం నువ్వు భులోకానికి వెళ్ళు, అక్కడ ఓ పునీతుడ్ని వరించు. మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాం. మాకు త్వరగా శాపవిమోచనం కలగాలి, మేం పుట్టిన వెంటనే గంగలో విడిచి పెట్టు తల్లీ!’ అని మొరపెట్టుకున్నారు.అందుకని నేను భులోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకన్నాను. అష్ట వసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను, అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది.
ఆ పిల్లవాడే దేవవ్రతుడు.
వశిష్ట మహాముని వద్ద వేద వేదంగాలు చదువుకున్నాడు.
శుక్రాచార్యుల వారి వద్ద శాస్రాలన్నీ నేర్చుకున్నాడు.
విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు.
ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు. ఆయన కౌరవ, పాండవ, వంశాలకు పితామహుడు.
పవిత్ర దినం బీష్మ ఏకాదశి
కురుక్షేత్ర సంగ్రామంలో తీవ్రంగా గాయపడి, తన ఇష్టానుసారం కురు పితామహుడు భీష్మాచార్యుడు గతించిన రోజు భీష్మ ఏకాదశి. తిథి నక్షత్రాలను, వార వర్జ్యాలను పాటించేవారు ఏకాదశిని మంచిరోజుగా భావిస్తుంటారు. భీష్మ ఏకాదశిని మరింత పవిత్రమైన రోజుగా భావిస్తారు. భీష్మ ఏకాదశికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ఉంది. భీష్ముడి గురించి తెలియని వారుండరు.
మహాభారతంలో భీష్ముడిది చాలా గొప్ప పాత్ర. మహాభారత గాథకు మూల స్తంభమైన భీష్ముడు పుట్టగానే గంగాదేవి వెళ్ళిపోతుంది. ఇతని మొదటి పేరు దేవపుత్రుడు. శంతనుడు దాసరాజు కుమార్తె సత్యవతిని ఇష్టపడతాడు. ఆమెతో తండ్రి వివాహం కోసం దేవపుత్రుడు రాజ్యాన్ని వదులుకుని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటినుంచి గాంగేయుడు ‘భీష్ముడు’ అయ్యాడు.
సత్యవతితో తన వివాహం కోసం సామ్రాజ్యాన్ని వైవాహిక జీవితాన్ని కుమారుడు భీష్ముడు త్యాగం చెయ్యడంతో శంతనుడు బాధపడతాడు. ఇంత త్యాగం చేసిన కుమారునికి స్వచ్చంద మరణాన్ని వరంగా ప్రసాదిస్తాడు. అనంతరం పాండవులు, కౌరవులకు కురుక్షేత్రంలో మహాసంగ్రామం జరుగుతుంది. ఆ యుద్దంలో పదిరోజులు తీవ్రంగా యుద్ధం చేసిన భీష్ముడు అర్జునుని ధనుర్భాణానికి నేలకొరిగి శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయిస్తాడు. దీన్ని తలపునకు తెచ్చేది ఏకాదశి వ్రతం.
కార్తీక శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయించిన భీష్ముడు మాఘశుద్ధ అష్టమి నాడు మరణించినట్టుగా పలు పురాణ గ్రంథాల్లో పేర్కొన్నారు. ఉత్తరాయణం మాఘశుద్ధ అష్టమి రోజు ప్రవేశించినట్టుగా ప్రమాణాలు ఉన్నాయి. నిర్ణయ సింధువులలోనూ, భీష్మ సింధువులలోనూ, ధర్మ సింధువులలోనూ మాఘ శుద్ధ అష్టమినాడు భీష్మునికి తిలాంజలి విడిచి పూజించాలని ఉంది.
భీష్మాష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధ కర్మలు చేసినవారికి సంతానాభివృద్ధి జరుగుతుందని, పుణ్యం ప్రాప్తిస్తుందని పలువురు అంటున్నారు. ఈ కారణంగా భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి పుణ్యదినాలయ్యాయి. పాండవుల అభిమాని అయిన భీష్ముడు అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూసే రోజుల్లో ధర్మరాజుకు ‘విష్ణు సహస్త్రనామాలు’ బోధించాడు. ఈ నామాలు గోప్యమయినవే కాదు గొప్పవి కూడా. ఈ నామాలకే ఆదిశంకరాచార్యులు భాష్యం చెప్పారు. ఈ నామాల సుస్వరాలాపనే ‘సత్యనారాయణ వ్రతం’. ఈ వ్రతాన్ని భీష్మ ఏకాదశి రోజున ఆచరిస్తే కోరుకున్నవి నెరవేరుతాయని పెద్దల నమ్మకం. అందుకే అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని భీష్మ ఏకాదశి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో దర్శిస్తారు. వ్రతాన్ని ఆచరిస్తారు.
భీష్మ పంచకం:
మాఘశుద్ధ సప్తమి మొదలు మాఘశుద్ధ ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకమంటారు. భీష్ముడు అంపశయ్యపై పరుండి ఈనాటి నుండి ఐదు రోజులలో రోజుకొక ప్రాణం చొప్పున తన పంచప్రాణాలను విడనాడాడని పురాణాలు చెపుతన్నాయి.

భీష్మాష్టమి మాఘశుద్ధ అష్టమి. పద్మపురాణంలోనూ హేమాద్రి వ్రత ఖండంలోనూ దీనిని గురించి చెప్పబడి వున్నది. భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి ఇచ్చేవారికి సంతాన ప్రాప్తి కలుగుతుది. దీనివల్ల భీష్ముడు ఈ రోజుననే మరణించినట్లు తెలుస్తూ వుంది. మహాభారతంలో కూడా ఈ రోజునే భీష్ముని నిర్యాణం రోజుగా చెప్పబడింది. భీష్మాష్టమి భీష్ముని నిర్యాణ దినం ఈ రోజున భీష్ములకు శ్రాద్ధ తర్పణం చేసిన వారికి సంవత్సరపాపం నశిస్తుందంటారు. పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం –ఈ మూడు కాంతిమార్గాలని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలిపారు. అటువంటి అమృత ఘఢియల్లో వచ్చేవరకు అంపశయ్యపై పరుండి భీష్మాష్టమినాడు ప్రాణాలు వదిలాడు. భీష్ముడు తన పంచ ప్రాణాల్లో ఒకదానిని సప్తమినాడున్నూ, రెండోదానిని అష్టమినాడు, మూడోదానిని నవమినాడు, నాలుగోదానిని దశమినాడు, ఐదోదానిని ఏకాదశినాడు వదిలాడని కొన్ని ప్రాంతాల వారు చెబుతారు. కాని పలు గ్రంథాలలో మాఘశుద్ధాష్టమి బీష్మనిర్యాణ రోజుగా చెప్ప బడింది.. భీష్మ పంచకానికి అది ఆఖరి రోజు. కాలనిర్ణయ చంద్రిక, నిర్ణయసింధు, ధర్మసింధు, కాలమాధవీయం మున్నగు గ్రంథాలన్నీ మాఘశుద్ధాష్టమి భీష్మ నిర్యాణ దినంగా చెబుతున్నాయి.
విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ “మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః” కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. ‘హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్శ్మ విషయాలను తెలుసుకుందురు రండి’ అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు.
భీష్ముడు సుమారు నెలన్నర నుండి భాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్చంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని భాదలు భరిస్తూ ఉండిపొయ్యాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించు కోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది.ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి “మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః” అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.
మరి అన్ని రోజులు అంపశయ్య పై ఎందుకు ఉండి పొయ్యాడు ?
ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేసాడాయన ? ద్రౌపతికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేక పోయాడు. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తు కూర్చుండి పోయాడు. ద్రౌపతికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వసిష్ఠులవారు చెప్పారట “మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః” హే ద్రౌపతి! ఇత్రులు ఎవ్వరు తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన అయిదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేక పోయారు. వారు కౌరవులకి బానిసలై పోయారు. కౌరవులను ఎదురించడానికి వీలులేకుండా పోయ్యింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు. ఆ దోషంతో పాండవులకూ అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకునాడో ఆ ద్రౌపతికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపతికి అవమానం చేసారో వారందరిని అప్పుడే తీసి పాడేసాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప, వారిని నేను ఎప్పుడో ఏరిపారేసాను, నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్దం చేయమని చెబుతున్న అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.
బీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే, ప్రక్కనే ఉన్న ద్రౌపతి నవ్వుతూ ‘తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమైయ్యాయీ ధర్మాలు’ అని అడిగిందట. అందుకు భీష్ముడు ‘అవును ద్రౌపతి! నా దేహం దుర్యోదనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేసాను కనక, ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాల్లూ అంపశయ్యపై పడి ఉన్నాను’అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ, పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. ‘ హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్దం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈ నాడు నేను ధర్మాలను చెప్పవచ్చును’ అని పాండవులకు ఎన్నో నీతులను భోదించాడు.
శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాదలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క చెబుతుంది, ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.
భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు.అదే నీటిని మెఘ వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు కలదు.

No comments:

Post a Comment