Wednesday, 24 January 2018

మాఘ పురాణం – 2వ అధ్యాయము

 


శివుడు పార్వతీ దేవికి మాఘమాస మహిమ చెప్పుట
వశిష్ఠులవారు మార్కండేయ వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత, యింకనూ వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరల యిట్లు ప్రశ్నించెను.” మహాముని! ఈ మాఘమాస మహత్యమును యింకను వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది గాన సెలవిం” డని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచూ, నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందారవృక్ష సమీపమున యేకాంతముగ కూర్చునివున్న సమయమున లోకజననియగు పార్వతీదేవివచ్చి భర్తపాదములకు నమస్కరించి, ‘స్వామీ మీవలన ననేక పుణ్య విషయములను తెలిసికొంటిని, కానీ, ప్రయాగక్షేత్ర మహత్యమును, మాఘమాస మహత్యమును వినవలెననడి కోరికవున్నది. కాన, ఈ యేకాంత సమయమందా క్షేత్రమహిమలను వివరింప ప్రార్థించుచున్నదాననని’ వేడుకొనగా, పార్వతీపతి యగు శంకరుడు మందహాసముతో నిట్లు వివరించెను, దేవి! నీ యిష్టమును తప్పక తీర్చెదను శ్రద్దగా వినుము.
సూర్యుడు మకరరాశియందువుండగా మాఘమాసమందు ప్రాతఃకాలమున ఈ మనుజుడు నదిలో స్నానము చేయునో ఆతడు సకలపాతకములనుండి విముక్తుడగుటయే కాక, జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకరరాశి యందుండగా, ప్రయాగ క్షేత్రమునందే నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠప్రాప్తి కలుగును. అంతియేకాదు జీవనది వున్నను, లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్నచోటకాని, తటాకమందుకాని మాఘమాసములో చేసిన ప్రాతకాలస్నానము గొప్పఫలము నిచ్చుటయేగాక సమస్తపాపములను విడిపోవును. రెండవరోజు స్నానముజేసిన విష్ణులోకమునకు పోవును. మూడవనాటి స్నానమువలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మ అనునది వుండదు. దేవీ! మాఘమాస స్నానఫలం యింతింతయని చెప్పజాలను మాఘమాసమునందు భాస్కరుడు మకరరాశి యందుండగ యేది అందుబాటులో వున్న అనగా నదికాని, చెరువు కాని, నుయ్యి కాని, కాలువకాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతఃకాలమున స్నానమాచరించి, సూర్యభగవానునకు నమస్కరించి, తనకు తోచిన దానధర్మములుచేసి శివాలయమునగాని విష్ణ్వాలయమునగాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము యింతింతగాదు.
ఏ మానవుడైననూ తన శరీరములో శక్తిలేక, కడకు బావియందైననూ స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ ఆ కష్టములు మేఘములవలె విడిపోయి విముక్తుడగును. ఎవరైననూ తెలిసిగాని తెలియకగాని మాఘమాసములో సూర్యుడు మకరరాశియందుండగా నదీస్నానమాచరించిన యెడల అతనికి అశ్వమేధయాగము చేసినంతఫలము దక్కును. అదియునుగాక, మాఘమాస మంతయు ప్రాతఃకాలమున నదిలోస్నానముచేసి, శ్రీమన్నారాయణుని పూజించి, సాయంకాల సమయంబున మాఘపురాణము చదివి, విష్ణు అందిరమునగాని, శివాలయమున గాని దీపము వెలిగించి, ప్రసాదము సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోకప్రాప్తి కలుగుటయేకాక, పునర్జన్మ యెన్నటికిని కలుగదు. ఇటుల ఒక్క పురుషులే గాక, స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తరువాత మరల ఘోరపాపములుచేసి మరణారంతరమున రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటె, తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీస్నానము చేసి, దానధర్మాది పుణ్యముల నాచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరముగదా! ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతీ! యే మానవుడు మాఘమాసమును తృణీ కరించునో అట్టివాడు అనుభవించు నరకబాధల గురించి వివరించెదను సావదానముగా ఆలకింపుము.
నేను తెలియజేసిన విధయముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున నదీస్నానముగాని, జపముగాని, విష్ణుపూజగాని, యధాశక్తి దానాది పుణ్యకర్మములు గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరకబాధలను అనుభవించుచు కుంభీనసమను నరకమున పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును, ఱంపములచేత, ఖడ్గములచేత నరకబడును. సలసలకాగు తైలములో పడవేయబడును. భయంకరులగు యమ కింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి, కాలకృత్యములను తీర్చుకొని, నదికిపోయి స్నానము చేసి, సూర్యనమస్కారము విష్ణుపూజా చేసి తన భర్త పాదములకు నమస్కరించి, అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ అయిదవతనముతో వర్ధిల్లి యిహమందు పరమందున సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు యేస్త్రీ అటులచేయదో, అట్టి స్త్రీముఖము చూచినంతనే సకలదోషములూ కలుగుటయేగాక ఆమె పంది, కుక్క జన్మలనెత్తి హీనస్థితినొందురు. మాఘమాసస్నానమునకు వయఃపరిమితిలేదు, బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీయైనను, బాలికయైననూ, జవ్వనియైననూ, ఈ కులమువారైననూ కూడా మాఘస్నాన మాచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో వుండిన కోటియజ్ఞములు చేసినంత పుణ్యముకలుగును. యిది అందరికిని శ్రేయోదాయకమైనది.
పార్వతీ! దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణమును దొంగలించినవారు, గురు భార్యతో సుఖించినవారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసచేయువారు మాఘమాసములో నదీస్నానము చేసి విష్ణువును పూజించినయెడల వారి సమస్తపాపములు నశించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టుడైనవాడును కించిత్ మాత్రమైననూ దానధర్మములు చేయనివాడునూ, యితరులనువంచించించె వారివద్ద ధనమును హరించినవాడును అసత్యమాడి ప్రొద్ధుగడుపువాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదావ్యభిచార గృహములలో తిరిగి, తాళిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను యెగతాళిచేయువాడును, గర్వముకలవాడై తానే గొప్పవాడనని అహంభావముతో దైవకార్యములనూ ధర్మకార్యములనూ చెడగొట్టుచూ దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును, ఇండ్లను తగలబెట్టువాడును, చెడుపనులకు ప్రేరేపించువాడను యీ విధమైన పాపకర్మలు చేయువారలు సైతము యెట్టి ప్రాయశ్చిత్తములూ జరుపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు. దేవీ! ఇంకనూ దీని మహత్యమును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు, క్రూరకర్మములు ఆచరించువారు, సిగ్గువిడిచి తిరుగువాడు, బ్రాహ్మణదూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతఃకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును. యే మానవుడు భక్తిశ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతమూ స్నానములు చేసెదనని సంకల్పించునో, అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి, యెటువంటి దోషములూలేక పరిశుద్ధుడగును, అతడు పరమపదము జేరుటకు అర్హుడగును. శాంభవీ! పండ్రెండు మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకలదేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడధికుడు, అన్ని పర్వతములలో మేరుపర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములో మాఘమాసము శ్రేష్ఠమైనదగుటచేత ఆ మాసమంతా ఆచరించెడి యే స్వల్పకార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలగజేయును. చలిగానున్నదని స్నానముచేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వౄద్ధులు, జబ్బుగానున్న వారు చలిలో చన్నీళ్ళ్లోలోస్నానము చేయలేరు. కాన, అట్టివారికి యెండుకట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలికాగనిచ్చి తరువాత స్నానము చేయించినయెడల ఆ స్నానఫలమును పొందగలరు. చలి కాగినవారు స్నానము చేసి శ్రీవారినిదర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘ మాసములో శుచియైన ఒక బీదబ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన యెడల శుభఫలితము కలుగును.
ఈ విధముగా ఆచరించెడి వారినిజూచి, యే మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహా పాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులగు తండ్రిని, తల్లిని, భార్యను లేక కుటుంబసభ్యులందరినీ మాఘమాస స్నానమాచరించునటుల యే మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కాని, వైశ్యునికికాని, క్షత్రియునికి కాని, శూద్రునికికాని మాఘమాసస్నానమును చేయుమని చెప్పినయెడలవారు పుణ్యలోకమునకు పోవుటకుయే అడ్డంకులునూ ఉండవు. మాఘమాసస్నానములు చేసినవారిని గాని, చేయలేని వారినికాని, ప్రోత్సహించువారలనుకాని జూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగటయేగాక, ఆయుఃక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడచుటకు ఓపికలేనివారు మాఘమాసములో కాళ్ళుచేతులు, ముఖము కడుగుకొని, తలపై నీళ్ళుజల్లుకొని, సూర్యనమస్కారములు చేసి, మాఘపురాణమును చదువుటగాని, వినిటగాని చేసిన యేడవ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పోందుదురు. పాపము, దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానముకన్న మరొక పుణ్యకార్య మేదియును లేదు. మాఘమాసము వలన కలుగు ఫలిత మెటువంటిదనగా, వంద అశ్వ మేధయాగములుచేసి, బ్రాహ్మణులకు యెక్కువ దక్షిణలిచ్చిన యెంతటి పుణ్య ఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్య ఫలము కలుగ్ను. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంత యును కడు నిష్ఠతోనున్న యెడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతీ! మాఘమాస స్నానము వలన యెట్టి ఫలితము కలుగునో వివరించితిని గాన, నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికినీ శుభప్రదము.

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment