Sunday, 6 November 2016

శివాలయంలో ఎలా ప్రదక్షిణం చేయాలి?



శివాలయంలో ఎలా ప్రదక్షిణం చేయాలి:: ఏ గుడిలో ప్రదక్షిణం వలన అయినా సరే కలిగే ఆధ్యాత్మిక, శారీరక ప్రయోజనాలేమిటి??
శివాలయ ప్రదక్షిణా విధానం:: చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణం::
మిగిలిన దేవాలయాలలో వలే ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షీణ చేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. దీనిని చండీ ప్రదక్షిణమని, సోమసూత్ర ప్రదక్షిణమని కూడా అంటారు.
లింగ పురాణంలో ఈ విధానం గురించి స్పష్టంగా పేర్కొనబడింది!!
ప్రదక్షిణా విధానాన్ని వివరించే ఒక శ్లోకం!!
వృషంచండంవృషంచైవ సోమసూత్రం పునర్వృషం|
చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వృషం||
శివప్రదక్షిణేచైవ సోమసూత్రం నలంఘయేత్|
లంఘనాత్సోమసూత్రస్య నరకే పతనం ధృవం||
నందీశ్వరుని(ధ్వజస్థంభం) వద్ద ప్రారంభించి – ధ్వజస్థంభం దగ్గరనుండి చండీశ్వరుని దర్శించుకుని అక్కడనుండి మళ్లీ వెనుకకు తిరిగి ధ్వజస్థంభం దగ్గరకు వచ్చి….ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం (అభిషేకజలం బయటకు పోవుదారి) వరకు వెళ్ళీ వెనుకకు తిరిగి మరలా ధ్వజస్థంభం దగ్గర ఒక్కక్షణం ఆగి అదేవిధంగా సోమసూత్రం వరకు రావాలి. అక్కడినుండి తిరిగి ధ్వజస్థంభం దగ్గరకు వస్తే ఒక్క ప్రదక్షిణ పూర్తి అవుతుంది.. వెనుదిరిగి నందీశ్వరుని వద్దకు చేరుకుంటే ఒక “శివ ప్రదక్షిణ” పూర్తి చేసినట్లు. శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. (సోమసూత్రం దగ్గర ప్రమథ గణాలు కొలువై ఉంటాయంటారు.. అందుకే వారిని దాటితే తప్పు చేసినవారమవుతాం).కొద్దిగా సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు.
ఇలా చేసే ఒక ప్రదక్షిణం మనం సాధారణంగా చేసే పదివేల ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడినదట.. ఇలా మూడు సార్లు ప్రదక్షిణాలు చేయాలి!!
అయితే గుంటూరు పెద్దకాకాని శివాలయంలో ఈ విధమైన ప్రదక్షిణం గురించి చాలా ప్రముఖంగా పేర్కొనబడింది.. మొట్ట మొదటిసారిగా ఈ గుడిలో ఈ విధంగా ప్రదక్షిణం చేసాము..
ఈ రోజుల్లో ప్రదక్షిణం కంటే ఒక అరగంట ఎక్సరసైజ్ చేస్తే మంచిది కదా అనే జెనరేషన్ తయారయింది.. కానీ ప్రదక్షిణం చేసేటపుడు.. మనస్సు, తనువుఅన్నీ భగవంతునిపై లగ్నం చేయడం వలన ప్రదక్షిణం శరీరంలోని/మనస్సులోని బాధలను హరించివేస్తుంది.. అందువలన కేవలం శారీరకంగానే కాక ఆధ్యాత్మికంగా.. వ్యక్తిగతంగా ఉఛ్ఛస్థితికి చేరుకోవచ్చు… ప్రస్తుతం మనం చేసే నాన్-డూయింగ్ మెడిటేషన్ కంటే ఇది చాలా ఉత్తమం.. గుడిలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ మనలోని శక్తిని మెరుగుపరుస్తుంది..మనస్సును ఉల్లాస పరుస్తుంది.. అది ఏ ఆలయంలో ప్రదక్షిణ అయినా సరే..

No comments:

Post a Comment