మామూలు రోజులకన్నా పున్నమి చంద్రుడు.. పున్నమి చంద్రుడితో పోలిస్తే సూపర్‌మూన్.. ప్రకాశవంతంగా మెరిసిపోతుంటాడు. అలాంటి సూపర్‌మూన్‌లలోనే అతిపెద్ద సూపర్‌మూన్ ఈ నెలలో కనువిందు చేయనుంది. సాధారణ రోజులతో పోలిస్తే చంద్రుడు 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపించనున్నాడు.
NOV 14- ఈ నెల 14న ఈ భారీ సూపర్‌మూన్ భూలోక వాసులను ఆశ్చర్యపరచ నున్నాడు. ఇదొక్కటే కాదు.. ఆ మాటకొస్తే ఈ నెలంతా ప్రత్యేకమేనని పరిశోధకులు చెబుతున్నారు. భూమికి అత్యంత సమీపంలోకి రానున్న చంద్రుడు.. ఉల్కాపాతం.. సూర్యాస్తమయం కాగానే ఆకాశంలో గురుగ్రహాన్ని చూడవచ్చట!
NOV 23 -23న పక్కపక్కనే ఉన్న శని, బుధగ్రహాలను టెలీస్కోప్ సాయంతో చూడొచ్చు..
NOV 25-25న చంద్రుడి పక్కకుచేరిన గురుగ్రహాన్ని వీక్షించవచ్చు..
NOV 11, 17- 11, 17 తేదీల్లో ఉల్కాపాతం చోటుచేసుకుంటుందని పరిశోధకులు వివరించారు.
నిర్ణీత కక్ష్యలో తిరుగుతున్న చంద్రుడు భూమికి సమీపంలోకి వచ్చినపుడు సాధారణంకన్నా పెద్దగా కనిపిస్తాడు. దీనినే సూపర్‌మూన్‌గా వ్యవహరిస్తారు. సూపర్‌మూన్‌లు కొత్తేమీకాదు. ఏడాదికి నాలుగు నుంచి ఆరుసార్లు చూడొచ్చు. ఈ రోజుల్లో చంద్రుడు మాములు సైజుకన్నా పది శాతం పెద్దగా కనిపిస్తాడు. ఈ నెల 14న చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి (గతంలోకన్నా) రానున్నాడు. ఈ సూపర్‌మూన్ 14శాతం పెద్దగా, 30శాతం ఎక్కువ ప్రకాశంతో కనిపిస్తాడు. ఈ శతాబ్దంలో ఇదే భారీ సూపర్‌మూన్. మళ్లీ ఇలాంటి సూపర్‌మూన్‌ను చూడాలంటే 2034 వరకు వేచిచూడాలట!
- 1979లో రిచర్డ్ నోలే తొలిసారిగా సూపర్‌మూన్‌ను నిర్వచించాడు.
- భూమికి 363711 కి.మీ. దూరంలోకి చంద్రుడు వస్తే సూపర్‌మూన్‌గా వ్యవహరిస్తారు. (భూమికి చంద్రుడికి మధ్యదూరం 3,84,400 కి.మి.).
- 2017లో ఒక్క సూపర్‌మూన్ కూడా ఉండదు.
- శీతాకాల సూపర్‌మూన్ పెద్దగా, ప్రకాశవంతంగా ఉంటుంది. డిసెంబరులో భూమి సూర్యుడికి సమీపంగా జరగడం, అదే చంద్రుడు భూమికి చేరువగా రావడమే దీనికి కారణం.
- భవిష్యత్తులో సూపర్‌మూన్‌ల సైజు తగ్గుతూ పోతుందట! ఏటా చంద్రుడు భూమికి దూరంగా జరగుతున్నాడు. కక్ష్యలో 3.8 సెం.మీ. మేర చంద్రుడు దూరమవుతున్నాడు.
- సూర్యాస్తమయం కాగానే గురుగ్రహాన్ని చూడవచ్చు. వజ్రంలా మెరుస్తూ వీనస్ కూడా కనిపిస్తుంది. ఆదివారం రాత్రి చంద్రుడి పక్కన మార్స్‌ను కూడా బైనాక్యులర్ల సాయంతో చూడవచ్చని చెబుతున్నారు.
ఈ నెల 11, 17 తేదీల్లో ఉల్కాపాతాన్ని గమనించవచ్చని ఖగోళ పరిశోధకులు తెలిపారు. చిన్న చిన్న ఉల్కలు రాలతాయని, ప్రమాదమేమీ లేదని చెప్పారు. భూమి వైపు వస్తూ చిన్న ఉల్కలు మధ్యలోనే మండిపోతాయి. భారీ సైజులోని ఉల్కలు పడితేనే భారీ స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉటుందని, ప్రస్తుతం ఆ ముప్పు లేదన్నారు.
No comments:
Post a Comment