Friday 30 September 2016

తొమ్మిది అంకె విశిష్టత



నవ నాడులు, నవరంధ్రాలు, నవ చక్రాలూ వీటన్నిటికీ నవ రాత్రులతో ఆధ్యాత్మిక పరమైన సంబంధం ఉందని చెప్పుకోవచ్చు. తల్లి గర్భంలో శిశువు ఉండేది 9 నెలలు. కాశీ క్షేత్రంలో 9 నెలలు కానీ, 9 రోజులు కానీ, 9 గడియలు గానీ ఉంటే చాలట. పితృపాపాలన్నీ ఇట్టే తొలగిపోతాయట.
సాయిబాబా తన భక్తుడైన పాట్‌కర్‌కు నవ విధమైన భక్తి మార్గాల గురించి బోధించాడు కూడా. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవ, అర్చన, నమస్కారం, దాస్యం, సఖ్యత, ఆత్మ నివేదన - ఇవీ నవ విధ భక్తిమార్గాలు. భక్తిలేని సాధనలు దండగ.
ఐతే అన్నిటిలోనూ నవ అంటే 9 అంకెనే ఎందుకు చెప్పుకుంటున్నారనేది ప్రశ్న.
తొమ్మిది అంకె మార్పులకు లోను కాని బ్రహ్మ తత్వాన్ని సూచిస్తుంది. 9 విచిత్ర సంఖ్య. 9ని 1తో గుణిస్తే 9 వస్తుంది. అదే 9ని 2తో గుణిస్తే, 18 (అంటే తొమ్మిదే), 3తో గుణిస్తే 27 (అంటే మళ్లీ తొమ్మిదే) - ఇలా 9ని ఏ అంకెతో గుణించినా 9 మాత్రమే వస్తుంది. అంటే శక్తి నిశ్చలంగా ఉండటమే. ఇదే బ్రహ్మ తత్వ రహస్యం.
అదే 8 అనే అంకెను తీసుకోండి. అది మాయను సూచిస్తుంది. 8ని 1తో గుణిస్తే 8 వస్తుంది. 2తో గుణిస్తే 16 (అంటే 7,8 కన్నా 1 తక్కువ), 3తో గుణిస్తే 24 (అంటే 6,8 కన్నా 2 తక్కువ) - ఇలా మాయా శక్తి జీవుడిలో ఉండే శక్తిని హరించి వేస్తుంది.
అంటే సన్మార్గంలో ఉంటే మనకు అంతులేని శక్తిని (అంటే పాజిటివ్ ఎనర్జీ అన్నమాట) ఇస్తుంది. అంటే దుష్టబుద్ధి కలిగిన వాడికి మాయ కమ్మి (అది నెగెటివ్ ఎనర్జీ అన్నమాట) ఆ జీవుడి పాపం పండాక ఆ జీవునిలో ఉండే శక్తిని హరించి వేస్తుంది.
యజ్ఞాది కర్మల్లో సాధారణంగా 16, 116, 1116 - ఇలా దక్షిణలిస్తారు కదా. అవి అలా ఎందుకుంటాయో జాగ్రత్తగా గమనిస్తే, అవి 7,8,9 అనే అంకెలను సూచిస్తాయి.
కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, కళా, జీవమనే 9 వ్యూహాలే రూపంగా కలిగిన పరశంభుని దేహమే శ్రీమాత. ఆ భగవతి దేహమే పరానంద సంజ్ఞ కల శంభువు.
మన దేహంలోని 9 స్థానాలకూ, 9 చక్రాలకూ ఎలా సంబంధం ఉందో, అదే రీతిలో శ్రీ చక్రంలోని 9 చక్రాలతోనూ సంబంధం కలిగి ఉంది. అంటే, శ్రీవిద్యోపాసన అంటే, ఆత్మోపాసనే కానీ వేరే కాదు. దేవీ అర్చన అంటే, ఆత్మను అర్పించడమే కానీ వేరే ఏదో కాదు.

No comments:

Post a Comment